Previous Page Next Page 
రాగోదయం పేజి 19


    "ఇదిగో భార్గవీ! నేనేనా అంత దుర్మార్గుడిని. నువ్వు సోమన్నని చూసి జాలిపడి వెయ్యిరూపాయలు యిచ్చేస్తూ వుంటే నేను కర్కోటకుడిలా బాండు రాసినరోజునుంచి యీ రోజుదాకా అయిన వడ్డీ మూడొందల యాభయ్యారుకి ఆశ పడతానా? నెలకి నూటికి వడ్డీ పది రూపాయలు నా మామూలు. అయినా పూర్తి మొత్తం తీరుస్తున్నారు కాబట్టి నేనూ నీలాగే దయ చూపిస్తా. వడ్డీ వద్దులే. అసలిస్తే చాలు. ఈ పదేళ్ళలో ఈ ఏడొందలకి ఎంతిచ్చారో ఏమో పాపం" అన్నాడు.
    ఆ మాటలు వినగానే అందరూ ఆశ్చర్యపోయారు. చౌదరి వడ్డీ రేటు విని విస్తుపోయాడు జయన్న, సోము వాళ్ళ రక్తం కుతకుతలాడింది. నిస్సహాయత నీరుగామారి పోయింది.
    "వద్దులే, వడ్డీ కూడా తీసుకో" కఠినంగా అన్నాడు సోము.
    "నువ్వు నోర్మూసుకోరా వెధవా! పెద్దవాళ్ళం మేం మాట్లాడతావుంటే నీకెందుకు? ఎక్కడా యిట్లాంటి అవకతవక పనులే చేస్తావు. ఇదే నన్ను అడిగుంటే కాదందునా? నేనేం అంత పాషండపు ముండాకొడుకునా? నాకూ దయా, జాలీ ఉన్నాయి. భార్గవీ, ఇదిగో నోటు వీడిమాటలకేంలే. అసలివ్వు చాలు" అన్నాడు.
    సోముకి ఆ దయ ఆ సానుభూతికూడా భరింపరానిదిగా వుంది, ఏదో అనబోయాడు.
    అంతలో భార్గవి మెల్లగా "చిదానందం! ఇదిగో వేయి రూపాయలు. ఇచ్చి ఆ నోటుమీద చెల్లు వేయించి తీసుకోదేనికయినా వ్యవహారం వ్యవహారమే. సోము నువ్వూరుకో పెద్దవాళ్ళు చెప్పినపుడు కాదనకూడదు." అంది.
    చిదానందం వెళ్ళి డబ్బు తీసుకుని వచ్చి, చౌదరి చేతికిచ్చాడు.
    నీరసపడిపోయాడు చౌదరి. అతను రెండువిధాల ఆలోచనలతో వచ్చాడు. అతని దగ్గర ప్రతి నోటుకీ ఫోర్జరీ నోటు వుంటుంది. ఆ నోట్లన్నీ కరణం శేషయ్య తయారు చేస్తాడు ఊరు మీద ఊరు పడినా కరణం మీద కాకివాలదన్నట్టుగా శేషయ్య తన చేతికి మసి కానివ్వడు. ఆ రహస్యం యిద్దరి మధ్యనే ఉంటుంది. రెడ్డికిగానీ నాయుడికిగానీ తెలియనివ్వకు. ఏదో ఇలాంటి పరిస్థితి వస్తే తిరిగి వాళ్ళమీద ఉచ్చులు బిగిస్తాడు చౌదరి. అయితే యింతవరకూ ఆ పరిస్థితీ, ఆ అవసరమూ రానే లేదు. తీసుకున్న అప్పు తీర్చినవాడే లేడు.
    ఇదో ఇన్నేళ్ళకి వూరికంతా మొనగాడు పుట్టుకొచ్చాడన్నట్టుగా వీడు తీర్చేందుకు వచ్చాడు. అదీ ఏడ్చి వాడిస్వంతమా ఆ పిచ్చిముండ భార్గవి దయతలచి యిస్తోంది. పిచ్చివాడు వెంట్రుకలు జాస్తి అన్నట్టుగా యీ వెర్రిముండకి ఐశ్వర్యం దాఖలు చేసి చనిపోయాడు వాడు.
    దానిముందు దయాదాక్షిణ్యాలు ప్రదర్శించి అవసరం తీర్చేందుకు డబ్బిచ్చి కూలీ చేయించుకోవటం గొప్పకాదు. వడ్డీని వదిలెయ్యటంగొప్ప అని రుజువు చెయ్యాలనివచ్చాడు. ప్రాణం వదలటం సులభం వడ్డీ వదలటం సులభమా మరి? అయితే యింత ప్లాను భార్గవి ఒక్క మాటలో తలక్రిందులు చేసింది. వ్యవహారంలో కరణాన్ని మించిపోతోంది అనుకున్నాడు చౌదరి.
    ఇంత వూహ లిప్తలో చేశాడు చౌదరి.
    అయితే అదంతా వెలికి రానివ్వకుండా చిరునవ్వుతో నోటు మీద చెల్లువేసి చిదానందం చేతికిచ్చాడు. ఆ నోటు యిస్తుంటే అందులోంచి జానయ్య ప్రాణాలు తన గుప్పిట నుండి జారిపోతున్నట్టుగా విలవిల్లాడాడు చౌదరి.
    నోట్లు చేతులు మారాయి, చౌదరి జేబులోకి వెళ్ళేయి.
    భార్గవి లోపలికి వెళ్ళింది.
    వచ్చిన పని అయిపోయినట్టుగా చౌదరి లేచాడు.
    సోము జయన్న కృతజ్ఞతలు చెప్పి నోటు తీసుకుని యింటికి మళ్లేరు.
    
                                   *    *    *    
    
    చంద్రమ్మకి ఎంతో ఆనందంగా వుంది. స్త్రీకి తన భర్త సాధించలేనిది తన కుమారుడు సాధిస్తే ఎంతో గర్వంగా వుంటుంది కాబోలు.
    ఆ పూట జయన్నని కూడా భోజనానికి పిలిచింది. తిండి తినటంలో లేదు ఆనందం కలిసి భుజించటంలో వుంటుంది. రకరకాల పిండివంటలు తినటంలో లేదు తృప్తి ఆ సన్నివేశంలో వుంటుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS