Previous Page Next Page 
రాగోదయం పేజి 18


    వీళ్ళని చూసి ముఖం తిప్పుకున్నాడు చౌదరి.
    "నమస్కారాలండి."
    "ఊఁ"
    "డబ్బు యిచ్చేస్తాం, లెక్క చూడండి."
    "లెక్క చూస్తే డబ్బిస్తారా? ఇప్పుడేనా?" అని అడిగాడు. అతని కంఠంలో అనుమానం.
    "అవునండీ"
    "ఎప్పుడిస్తారు?"
    "మీరు చెబితే ఓ గంటలో తెస్తాం."
    "ఎలా తెస్తార్రా? ఎవరయినా యిస్తామన్నారా? లేకపోతే ఎడ్లజత అమ్ముకుంటున్నారా? పొలం బేరం పెట్టినారా? అదీ యిది కాకపోతే వీనికి ఎవరయినా పిల్లనిస్తామన్నారా?"
    చౌదరి సౌమ్యంగానే అడిగాడు ఊరికి దార్లెన్నో అతనికి తెలుసు. ఆకాశంనుంచి దిగబళ్ళేరు కదా ఎవరయినా అని అతని ధైర్యం.
    ఇది ఊరు. అడివి కాదు. ఈ జనారణ్యంలో అన్నీ మేకలే వుండవు. మనుషులూ వుంటారు. అని చెప్పాలనిపించింది సోముకి. అందుకే చప్పున అన్నాడు "అయన్నీ ఏమీ జరగలేదయ్యా. సదాశివయ్యగారి భార్య మా యిబ్బంది విని యిస్తానన్నది."
    చౌదరి ఆశ్చర్యపోయాడు. భార్గవిలో యింత వితరణా? యింత దయా? అనుకున్నాడు. "మళ్ళీ ఎలా తీర్చమందిరా భార్గవి?" అడిగాడు.
    "మళ్ళీ ఏరువాక దాకా వాళ్ళ పనులు చూస్తే చాలు అంది అయ్యగారు. ధర్మాత్ములు ఉంటారనిపించింది." అన్నాడు జయన్న, అతడికి విషయం చెప్పి చౌదరిని తగ్గు చేయాలనిపించింది.
    చౌదరి మనసులో ఏదో ఊహ తళుక్కుమంది. అతని బుద్ది పాదరసంలా పనిచేసింది. గబగబా అన్నాడు. "ఒరే జయన్నా! సోంగాడిది అంతా తొందరపాటు తత్త్వంరా, అదే మాట నాకు చెప్పి ఏరోక దాకా పని చేస్తానంటే నేను అప్పుడే బాండు యియ్యకపోతినా! పోన్లే యిప్పుడేమయింది! యీ వెయ్యి ఇంకో కుటుంబానికి సాయం జేయొచ్చు. పద! పద! మీవెంట నేను సదాశివం యింటికి వస్తా తమ్ముడు పోయినాక పెద్దమ్మని చూడలేదు. మీరుబోయి లెక్క చెప్పితే సరి. ఆడనే డబ్బు తీసుకోవచ్చు."
    పై మీది కండువా విదిలించి వేసుకుని చేత్తో జుత్తు సవరించుకుని లేచి వెళ్ళి అల్మరాలో వున్న బాండు తీసుకుని కదిలాడు.
    చౌదరి మాటతీరు, ప్రవర్తనా చూసిన యిద్దరికీ మాట పోయినట్లయింది. అతనంత సౌమ్యంగా వ్యవహరిస్తాడనుకోలేదు వాళ్ళిద్దరూ. అందుకే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని చౌదరి వెంట వెళ్ళేరు.
    ముందు చౌదరి, తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నాలుగిళ్ళ వతల వున్న సదాశివం యింటికి వెళ్ళేరు. గేటు దాటి లోపలికి అడుగు పెట్టగానే వ్రమలో కూచున్న మీనాక్షమ్మని చూసి "పెద్దమ్మా! బావున్నావా?" అంటూ పలకరించాడు చౌదరి. దగ్గరగా వెళ్ళి చాపమీద కూర్చున్నాడు అతని గొంతు విని లోపలెక్కడో వున్న చిదానందం కూడా బయటకి వచ్చాడు.
    జయన్న, సోము అరుగు క్రింద నుంచున్నారు.
    "ఏం బాగులే చౌదరీ! చెట్టంత కొడుకుపోతే మొండి మానులా నిలబడ్డాను. ఆ కాస్తంత నలుసే లేకపోతే  ఆ యిదవరాలి ముగమే అడ్డం రాకపోతే నూతిలో దూకి చచ్చేదాన్ని." ఆ మాటలకే ఆమె గొంతు రుద్దమైంది.
    "అంతమాటనకు పెద్దమ్మా! ఆళ్ళకి దిక్కెవ్వరు?"
    అంతలో అందెల చప్పుడయింది. దాని వెంట గాజు గలగలా వినిపించింది.
    చౌదరి పసిగట్టాడు భార్గవి రాకను. దొంగతిండి కోసం పొంచివుండే కుక్కలా ఆమె కోసం ఎదురుచూడసాగాడు అయితే భార్గవి బయటికి రాలేదు. కర్టెన్ చాటునే నుంచుంది.
    జయన్న ఆమె పాదాలని చూసి "దండాలమ్మా వెళ్ళి లెక్క చూడమంటే ఆయనే యిక్కడికి బాండు తీసికొచ్చినాడు" అన్నాడు.
    "ఊఁ లెక్క చూడమను. చిదానందం! మొత్తమెంతో కనుక్కుని నువ్వు లోపలికి రా!" కోకిల గొంతు విప్పినట్టుగా అంది భార్గవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS