Previous Page Next Page 
రాగోదయం పేజి 20


    "ఇదిప్పటికి యీ బతుకునుంచి బయట పడినాము జయన్నా! ఇదంతా నీ సలవ!"
    జానయ్య భార్య మాటలకి నవ్వుకున్నాడు.
    జయన్న సమాధానం యివ్వలేదు.
    "భార్గవమ్మ ఎంత గుట్టుగా వుంటుంది. ఆమెలో ఆ ఉదారత్వం ఉంటుందనుకోలేదు. అయినా సదాశివయ్య భార్య కదా! ఆ గుణం యాడికి పోద్ది? మళ్ళీ చంద్రమ్మే అంది.
    "నీతో కష్టం సుగమొచ్చినా కష్టమొచ్చినా తట్టుకోలేవు! నవ్వుతూ అన్నాడు జానయ్య.
    ఆ మాటలకి సోము, జయాన్న కూడా నవ్వేరు.
    "ఎవరో సాములోరు వచ్చిండంటనే!" అడిగింది చంద్రమ్మ.
    "అవును! ఊరి శివాలయం కాంపౌండ్ బయట చెట్టు క్రింహ కూర్చున్నాడట! ఎవరు పలకరించినా పలకలేదు. సాయంకాలానికి రెడ్డి, నాయుడు కరణం, చౌదరికి తెలిసి వెళ్ళి పిలిచినారట." అన్నాడు జానయ్య.
    "మగిమలు చూసినాడంటనే?"
    "అవును, ఊరికేదో అరిష్టం అన్నాడంట. నలుగురు మేమున్నాం గదా అన్నారట!"
    "అరిష్టమంతా వీళ్ళతోటే!"
    జయన్న మాటలకి నవ్వేడు సోము.
    "ఏం జేసినాడంట?"
    చంద్రమ్మ అడిగిందానికి నవ్వుతూ "నోట్లోంచి శివలింగం తీసి యిచ్చినాడంట కరణానికి. ఆయన అది తీసి సర్పంచి కిచ్చినాడంట! ఊరికి మేలు జరగాలన్నాడట! అన్నాడు జయన్న.
    "ఇంకా-"
    ఆమె కుతూహలంగా అడిగిందానికి "ఇంటవా?" అన్నాడు జానయ్య.
    "నువ్వేం జెబుతావ్? నువ్వేం జేస్తావ్?" అన్నట్లుగా చూసిందామె.
    "పిన్నీ! సాయినాధబాబా నాయుడింట్లో మకాం పెట్టినాడు. రోజూ పాలూ, పండ్లూ, పూలూ, కూరగాయలు లెక్కలేకుండా ఖర్చయిపోతున్నాయట! పిల్లికి బిచ్చం పెట్టని నా కొడుకులు యిట్లా సాములోళ్ళొస్తే వేలు వేలు ఖర్చు పెడతారు ఏం మనుషులు?"
    "పాపం పోవద్దా?"
    "ఇట్లా పోద్దా"
    "అనుకుంటున్నారు వాళ్ళు!"
    "పిచ్చిలోకం!"
    చేయి కడుక్కుని లేచాడు జానయ్య. భోజనాలు ముగించారు అందరికీ తృప్తిగా వుంది, ఆ తృప్తి వెనుక హస్తం భార్గవి అన్న విషయం అందరికీ బాగా గుర్తుంది.
    
                                         8
    
    "స్వామీజీ!"
    విసనకర్రతో విసురుతోన్నాడు చౌదరి. బాదంపాలు తాగి విశ్రాంతిగా వున్నాడు బాబా! అప్పుడు పిలిచాడు ధర్మారెడ్డి.
    అలవోకగా కళ్ళెత్తాడు బాబా!
    "మా వూరు మా చేయి దాటి పోకుండా చూడాలి మీరు. దేవుడు దైవం గురువు చిన్న పెద్ద తర తమ భావాలు మెల మెల్లగా నశించిపోతున్నాయి. అంతా పెత్తందార్లు కావాలనుకుంటున్నారు. ఒకడు పెద్ద వాడైనాడని బాధే కానీ ఆ బాధపోయే మార్గం చూసుకోరు. అసలు ఒకడు పెద్దవాడు కావాలంటే దాని వెనుక పడ్డ కష్టం గుర్తించడెవ్వరు అసూయ ఎక్కువై పోతోంది బాబాజీ"
    చిద్విలాసంగా నవ్వారు బాబాజీ అదే సమాధానం అన్నట్టుగా.
    "మీ మహిమలతో అందర్నీ ఓ ఊపు వూపాలి!"
    తలూపేరు బాబాజీ
    తరించి పోయామన్నట్టుగా చేతులు జోడించాడు చౌదరి.
    "యువకులతోటి చిక్కు వస్తోంది బాబాజీ"
    "పెద్ద వాళ్ళ కట్టుదిట్టం లేదా?" మృదువుగా ప్రశ్నించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS