Previous Page Next Page 
వారుణి పేజి 18


    చప్పున ఆమెకి తొలిరోజు తోడికోడలు సావిత్రి తనతో మాటాడిన విషయం గుర్తుకొచ్చింది.


                                               7


    భోజనాల వేళ.
    సారధీ తనూ కలసే కదలి వెళ్ళేరు.
    ఫణి, నారాయణ యిద్దరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నారు. ఇద్దరి ముఖాలూ గాంభీర్యంతో నిండి వున్నాయి. అందాకా దేన్ని గురించో సీరియస్ గా చర్చించినట్టుగా వున్నారు. సుబ్బరత్నమ్మ తనూ వాళ్ళతో పాటే భోజనాలకి కూర్చోవాలా వద్దా అన్నట్టుగా తటపటాయిస్తోంది.
    సారధి వెళ్ళి కూర్చున్నాడు. అతను కూర్చోగానే తనూ వెళ్ళి అతని పక్కనే అతనితో పాటే కూర్చుంది.
    అది గమనించింది సావిత్రి. ఆమెకి చాచి కాలితో గుండెలపై తన్నినట్టయింది. అత్తగారి వైపు అదోలా చూసింది. ఆ చూపులో చూశారా మీ కోడలి ఘనం, గొప్పదనం, ఠీవి, గర్వం అన్న భావాలు ప్రతిఫలించాయి కానీ సుబ్బరత్నమ్మ ఏమీ అనలేదు. కుంపటి గుండెల్లో దాచుకున్నట్టుగా అనిపించింది.
    సారధికి కూడా వాతావరణం ఎబ్బెట్టుగా వున్నదనిపించింది. అయినా ముఖం ప్రసన్నంగా చేసుకుని అన్నయ్యని, వదిన్ని పరిచయం చేశాడు. ఇద్దరికీ నమస్కరించింది వారుణి.
    సావిత్రి బదులుగా నమస్కారం చేయనేలేదు. ఆమె మనస్సులో అవమానం భారంగా పెరుగుతోంది.
    "రండి! భోంచేద్దాం" నవ్వుతూ సావిత్రిని ఆహ్వానించింది వారుణి. తాను కొత్త కోడలు, ఎవరినీ చెడ్డ చేసుకోకూడదు అనుకుందామె.
    అంతలో పద్మ వచ్చింది. సావిత్రి సమాధానం యివ్వలేదు. ఊరకే వుండిపోయింది.
    "నమస్తే చిన్నొదినా! నేను పద్మని. చిన్నన్నయ్య తన పెళ్ళికి నన్నయినా పిలుచుకు వెళ్ళలేదు. మేం పెళ్ళికి వస్తే నిన్ను ఆటపట్టిస్తానని అన్నయ్య భయం! అయినా చిన్నొదినా నువ్వెంత అందంగా వున్నావ్! నేనో మాట చెప్పనా? బ్రహ్మదేవుడు ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ బుగ్గలు అచ్చం నీ కోసమే సృష్టించాడు. నిన్ను మా అన్నయ్య కోసం సృష్టించేందుకు ఎంతో జాగ్రత్త, శ్రద్ధ, శ్రమ తీసుకున్నాడు. నిజం వదినా! నువ్వు చాలా అందంగా వున్నావు. నీదొక ప్రత్యేక సృష్టి. అందమంతా రూపం దిద్దుకున్నట్టుగా వుంటావు" కళ్ళు మిలమిలలాడుతూ వుండగా అంది పద్మ. ఆమె ముఖంలో ఒక అద్భుత స్త్రీ మూర్తిని చూసిన ఆరాధనా భావం కన్పించింది.
    నిజం చిన్నొదినా! ఇంత అందం, ఇంత వివేకం, చదువు అరుదుగా ఇముడ్తాయి. యు ఆర్ మార్వెలస్" అంది మళ్ళీ.
    ఆ మాటలు వారుణి మనస్సుని గిలిగింతలు పెట్టాయి. "నిజమే! తననీ తన అందాన్నీ ఎందరెందరో పొగుడుతూ వుంటారు. కానీ యిలా ప్రత్యేకంగా ముఖాన్నే ఎవరూ అనలేదు. అందునా ఒక స్త్రీ-ఒక పెళ్ళికాని అమ్మాయి నోటంట ఆ మాటలు-ఓహ్."
    "థాంక్యూ పద్మా!" అంది క్లుప్తంగా.
    పద్మ కూడా వదిన పక్కన వచ్చి కూర్చుంది. అంత అద్భుత సౌందర్యరాసి ప్రక్కన కూర్చోగల్గటం ఒక అదృష్టయోగంగా భావించిందామె.
    "నువ్వూ రామ్మా!" అన్నాడు ఫణి.
    "కూర్చో రత్నం!" అన్నాడు నారాయణ. ఆయనకి అప్పుడప్పుడూ భార్యని గౌరవించాలనిపిస్తుంది. ఎంతయినా యీ యింటి యిల్లాలు. గృహ సామ్రాజ్యానికి అధికారిణి. పెద్దరికం పుచ్చుకున్న గృహిణి అనుకుంటారాయన. అలాగే ఒక్కోసారి భార్యని ఎద్దేవా కూడా చేస్తుంటారు. మనస్సుని గిలిగింతలు పెట్టేలాగా అంటారాయన.
    ఇక తప్పదన్నట్టుగా వచ్చి భర్త ప్రక్కనే కూర్చుంది సుబ్బరత్నం. కనులెత్తి సావిత్రి వైపు చూసిందామె.
    తానో వంటగత్తె అయినట్టుగా భావించుకుంది సావిత్రి. ఆమె ముఖం నల్లగా మాడిపోయినట్టుగా అయిపోయింది. ఏమీ అనలేని పరిస్థితిలో అందరికీ వడ్డించింది.
    నిజానికి యీ దేశంలో ఏ స్త్రీ అయినా వండటంలోనూ, ఇతర్లకి ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించటంలోనూ "అన్నపూర్ణ" అయిపోయినట్టుగా భావించి, ఎంతో గర్వంగా తృప్తిగా ఫీలవుతుంది. సాక్షాత్తు మాతృమూర్తి అవుతుంది స్త్రీ ఆ క్షణంలో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS