తన ప్రయత్నం పాడవుతున్నందుకు కృష్ణమూర్తి బాధపడినా ఆ కారుని వెంబడించడం మాత్రం మానుకోలేదు.
ఆ విధంగా కారూ, స్కూటరూ ఒక్కదానివెనక మరొకటి నడుస్తూనే వున్నాయి.
చిట్ట చివరికి---
సత్యంగారి కారు రవీంద్రభారతి ఆవరణలోకి వెళ్ళడం చూసి కృష్ణమూర్తి ఆశ్చర్యపోయేడు.
రవీంద్రభారతిలో ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం కద్దు. తనకు తెలిసినంతవరకు తండ్రిగారికి ఆ కార్యక్రమాల పట్ల అమోఘమైన ఆసక్తి లేదు.
శ్రీకృష్ణరాయబారం, గయోపాఖ్యానం లాంటి పద్యాల నాటకాలంటే తండ్రిగారికి గొప్ప యిష్టం. పద్యాల నాటకాలమీద ఎంత ఇష్టమో సాంఘిక నాటకాలంటే అంత వళ్ళు మంట.
పైగా ఆరోజు రవీంద్రభారతిలో పద్యాల నాటకం కాదుగదా కనీసం సాంఘిక నాటకం కూడా లేదు.
కేవలం డాన్స్ ప్రోగ్రాం!
డాన్స్ ల పట్ల సత్యానికి అభిమానమెక్కువని అనుకోడానికి వీల్లేదు. తనకు తెలిసినంతవరకు పనిగట్టుకుని ఆయన ఎన్నడూ ఏ డాన్సు ప్రోగ్రాంకీ వెళ్ళలేదు. డాన్సంటే నాకిష్టమని మాట ,మాత్రంగానైనా చెప్పలేదు.
అల్లాంటిది... ప్రత్యేకించి ఈ డాన్స్ కెందు కొచ్చినట్టు? ఈ డాన్స్ తో తండ్రికున్న లింకేమిటి?
ఆలోచనలు కట్టిపెట్టి రవీంద్రభారతి దగ్గిర స్కూటరాపేడు కృష్ణమూర్తి, పద్మ స్కూటరు దిగింది.
తమ జంటని తండ్రి చూడాలనే ఉద్దేశంతో-దానికో పధకం తయారుజేసి-రోడ్డు ప్రమాదాలను కూడా లెక్కచేయకుండా ఆయన కారుని వెంబడిస్తే ప్రయోజనం పెద్ద జీరో అయినందుకు కృష్ణమూర్తి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
కన్నీరు పెట్టుకున్నట్టు తెలీగానే కసి పెరిగిపోయింది. తానేమి చేస్తున్నాడో కూడా మరిచిపోయే స్థితికి ఎదిగిపోయేడు.
పద్మ చేతిని పట్టుకుని రవీంద్రభారతిలోకి అడుగు పెట్టేడు.
ఆహ్వాన పత్రికలు లేనిదే అనుమతించే సాంప్రదాయం సాధారణంగా వుండదు. అల్లాంటిది గేటు దగ్గిర మనిషి ఆ జంటను ఏమీ ప్రశ్నించకుండానే తలుపుతీసి లోపలికి పంపించాడు. విడ్డూరమే మరి! పద్మతోపాటు లోపలికి అడుగుపెట్టేడు కృష్ణమూర్తి. హాలు నిండినది.
వేదిక మీద నాగినీ నృత్యం జరుగుతోంది. ఆ పిల్లెవరోగాని పాములాగానే మెలికలు తిరిగిపోతోంది. బహుశా ఆమె వంట్లో ఎముకలు లేవేమో.
పద్మ తనకేం పట్టనట్టు కృష్ణమూర్తి పక్కనే నిలబడింది. కృష్ణమూర్తి తండ్రికోసం గాలిస్తున్నాడు.
మొదటి వరస మధ్యలో తండ్రి కనిపించాడు. గొప్ప సీరియస్ గా డాన్స్ చూస్తున్నాడు. పిడుగుపడినా, బాంబు పేలినా చూపు మార్చే స్థితిలో లేడు. అలాంటప్పుడు తెగించి "నాన్నోయ్" అని పిలిచినా చూస్తాడనే నమ్మకం బొత్తిగా లేదు.
కృష్ణమూర్తి ఎంతో అసహనంగా వున్నాడు. ఇంతదూరం వచ్చేక కథ అక్కడ్తో ఆగిపోకూడదనుకున్నాడు. ఏదో విధంగా తండ్రి తమను చూసే ప్రయత్నం చేయాలి సత్యాన్నీ, తన పక్కనున్న పద్మనీ క్షణంపాటు మార్చి మార్చి చూసేడు. ఆ క్షణంలోనే కృష్ణమూర్తికి ఫ్లాష్ లాగా ఒక అయిడియా తట్టింది.
---ఎవరో ఆర్గనైజింగ్ మెంబరు కాబోలు బ్యాడ్జీ పెట్టుకుని హడావిడిగా తిరుగుతున్నాడు. అతన్ని పట్టుకున్నాడు కృష్ణమూర్తి.
"చూడండీ! ఆ పక్కనే సీట్లు ఖాళీగా వున్నాయి. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళగలరా?" అని ఇంగ్లీషులో అడిగేడు.
ఇంగ్లీషు భాషని ఎవడు కనిపెట్టేడో గాని గొప్ప దూరదృష్టివున్న మనిషై వుండాలి. కష్టకాలంలో ఇంగ్లీషుభాష బాగా పనిచేస్తుంది. తెలుగులో అడుక్కుంటే అయిదు పైసలు రాలకపోవచ్చు. అదే ఇంగ్లీషులో బెగ్ చేస్తే అర్ధో, రూపాయో-దానం చేసేవాడికి ఆఫ్టరాలవుతుంది.
వెధవది ముష్టి అడుక్కోడంలోనే ఇంతతేడా వున్నప్పుడు సాయం చేయమని ఇంగ్లీషులో అడిగితే కాదనడానికి ఎవరికైనా ఎన్ని దమ్ములుండాలి? పైగా-అడిగిన మనిషిపక్కన ఒక అప్సరసకూడా నిలబడి వున్నప్పుడు "నో" అని ఎట్లా అనగలడు.
అంచేత---
ఇంగ్లీషు నరికినందుకు కృష్ణమూర్తిమీద బేడ్జి మనిషికి గౌరవం పెరిగిపోయింది. ఎన్ని కష్టాలెదురైనా సరే-కృష్ణమూర్తినీ అతని పక్కనున్న అప్సరసనీ ఆ సీట్ల దగ్గిరకి తీసుకెళ్ళాలని పంతం పట్టేడు బేడ్జిమనిషి.
అందుకు సంకేతంగా "ఓ ష్యూర్...ష్యూర్" అన్నాడు కూడాను. ఆ తర్వాత ఆ జంటకు మొదటి వరస ముందునుంచీ తీసుకువెడుతున్నాడు.
ఇంగ్లీషు దెబ్బ చేసినందుకు కృష్ణమూర్తి సంతోషించేడు. పద్మని అతుక్కుపోయి బేడ్జిమనిషిని అనుసరిస్తున్నాడు.
ఒక అందమైన అబ్బాయి మరో అందమైన అమ్మాయిని అతుక్కుపోయి నడుస్తుంటే-ఆ దృశ్యం అందంగానే వుంటుంది.
అలాంటి పరిస్థితులలో వేదికమీద ఏం జరుగుతుందో పట్టించుకోరు. నాగిని కావచ్చు. నెమలి కావచ్చు. కాసేపు ఆ గొడవకి స్వస్తి చెబుతారు.
అదే జరిగింది!
అందమైన ఆ జంటని చాలామంది కళ్ళార్పకుండా చూస్తున్నారు. చాలామంది చూస్తున్నారనే పాయింటు గుర్తించి బ్యాడ్జీ మనిషి ఆ జంటను తీసుకెళ్ళడం ఒక గొప్ప ఘనకార్యంగా భావించి, రొమ్ము విరుచుకు నడుస్తున్నాడు.
అంతవరకు బాగానే వుంది!
అందరూ తమని చూస్తున్నా తండ్రిగారు మాత్రం తన చూపుని వేదిక మీదే లగ్నం చేసేరు. కేవలం డాన్స్ ఒక్కటే తప్ప ఇతరత్రా చిల్లర దృశ్యాలు చూడకూడదని ఒట్టేసుకున్నట్టుంది వారి వాలకం?
తండ్రిగారి వరస కృష్ణమూర్తికి నచ్చలేదు. కనీసం యిప్పటికైనా ఆయన తమ జంటను చూడకపోతే ఎట్లా?
అప్పటికే తండ్రి దగ్గరకు వచ్చేస్తున్నారు. మరో మూడంటే మూడు సీట్లవతల తండ్రిగారు బుద్ధావతారంలాగా కూచుని వున్నారు.
వారి ముందునుంచీ ఏనుగు అంబారీ వెళ్ళినా పట్టించుకోని వారి పరిస్థితిని కృష్ణమూర్తి అర్ధం చేసుకున్నాడు. అయినా సరే-వారిచూపు తమవేపు ప్రసరింపచేసే ప్రయత్నం వెంటనే జరగాలి. జరక్కపోతే ఇంత అవస్థా బూడిదపాలవుతుంది.
వెంటనే కృష్ణమూర్తి మెదడులో మరొక ఫ్లాష్ వెలిగింది. అది వెలగ్గానే దాన్ని ఆచరణలో పెట్టేసేడు.
తమకి తోవ చూపిస్తూ తీసుకెడుతున్న బ్యాడ్జి పెద్ద మనిషిని కావాలని ముందుకు నెట్టేడు . ఆ దెబ్బతో బ్యాడ్జివారు సత్యంమీద తూలిపడ్డాడు.
దాంతో సత్యంగారి చూపూ దీక్షా దెబ్బతిన్నాయి. తనమీద పడ్డ మనిషిని నాగరికంగా విసుక్కున్నాడు.
తన తరుపునా ఆ జంట తరుపునా తనే సారీ చెప్పేసి లేచాడు బ్యాడ్జి మనిషి.
ఆ అదను గమనించేడు కృష్ణమూర్తి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్సు పోగొట్టుకోకూడదనుకున్నాడు. పద్మ మరింత అతుక్కుపోయి సుతారంగా ఆమెను నడిపిస్తున్నాడు.
ఆ జంటని తండ్రిగారు ఎట్టకేలకు చూడగలిగేరు! కృష్ణమూర్తినీ అతను అంటించుకున్న పద్మనీ తండ్రిగారు చాలా శ్రద్ధగానే చూసేరు.
వారు తమని చూస్తున్నారని కృష్ణమూర్తి గమనించేడు.
