"అవేం మాటలు జ్యోతి!" జానకిరాం వారించబోయాడు.
జ్యోతి వూరుకోలేదు_ "మీకేం తెలియదు వూరుకోండి! పైగా నామీద నిష్టూరాలు_నేను కష్టపడుతున్నాను. మా వాళ్ళకి ఇస్తున్నాను. మిగతావాళ్ళు కష్టపడటం లేదు_ ఇవ్వటం లేదు. నేను కూడా అక్కలాగా మా ఇంట్లో నేవుండిపోతే ఏం చేస్తారు?"
"జ్యోతీ! ఆ విషయాలెందుకిప్పుడు? ఆవిడేం ఆదర్శప్రాయురాలా?"
"కాకపోవచ్చు! మా యింటికి వెళదాం. అమ్మా నాన్న కళ్ళకద్దుకుంటారు" అంది తీవ్రంగా.
"జ్యోతీ!"
"మీకేం తెలియదు. అందరూ మీలాగే అనుకుంటారు. తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్ళు అనుకుంటారు మీరు. కాలం మారిపోతోంది. ఎవరి బ్రతుకు తెరువు వాళ్ళు చూసుకోవాలి. మనమేనా అంత తెలివి తక్కువ వాళ్ళం_"
"నమస్కారం వదినగారూ! ఏమిటి? మా వాడికి ప్రొద్దున్నే అష్టోత్తరం ప్రారంభించారు?" అప్పుడే నిద్రలేచి వచ్చిన కోసలరాం అడిగాడు.
"మీ వాడికి అష్టోత్తరమే కాదు, సహస్రనామార్చిన చేసినా కర్తవ్యం బోధపడదు" తీవ్రంగా అన్నది జ్యోతి.
"అబ్బెబ్బే! వాడిది కాస్త మట్టిబుర్ర! చురుకుపాలు తక్కువ. ఎప్పుడూ మందకొడిగా వుంటాడు. ఏదో ఆఫీసు పనికాబట్టి అట్టే పేచీలు లేకుండా లాక్కొస్తున్నాడు. అదే ఏ బాధ్యతగల ఉద్యోగమో అయితే ఈ పాటికి ఇంటికి తిరిగి వచ్చేవాడు."
"ఒరేయ్ నోర్ముయ్యరా!"
"అదికాదురా జానకీ! వదినగారు పొద్దున్నే హితబోధ ప్రారంభిస్తే కిక్కురుమనకుండా వింటూ వుంటే కాస్త భయం వేసిందిలే!"
"ఆవిడ చెప్పిందాట్లో అబద్దమేముందీ?" మెల్లగా సణుగుతున్నట్లుగా అన్నాడు.
"నువ్వు అత్తారింటికి వెళ్ళిపోయినంత మాత్రాన ఇక్కడ ఇంటిలో వాళ్ళు తినటానికి లేక పస్తులుండిపోరు. లేదా నువ్వెళ్ళావని బెంగ పెట్టుకోరు. కానీ నాన్నగారే బాధపడతారు."
"బాధపడటం ఎందుకు నాయనా? మీ అన్నయ్యేమీ చేయకూడని పనిచేయటం లేదే?" వెటకారంగా అంది జ్యోతి.
"చేతికెదిగి వచ్చిన కొడుకులు తలా ఒక అకార్యం చేస్తుంటే మహర్షిలాంటి ఆయన బాధపడుతున్నారు. అదే నా బాధ__"
"మరిది గారూ!"
"ఏం వదినగారూ!"
"వెటకారం చాలించు! పెద్దా చిన్నా తారతమ్యం లేకుండా మాట్లాడకు. హద్దూపద్దూ లేకుండా మాటాడితే మర్యాద దక్కదు" అసహనంగా అంది జ్యోతి.
"కొంచెం శాంతించండి వదినగారూ! పెద్దాచిన్నా అన్నారే మీరు_ ఆ మర్యాద అత్తామామల విషయంలో పాటిస్తున్నారా? ఊఁ నీతులు ఇతర్లకి చెప్పటానికే వున్నాయి కానీ ఆచరించేందుకు కాదు."
"ఏమండీ!"
"ఒరేయ్ కోసలరాం నీకెందుకు నోర్మూసుకుని వెళ్ళు" భార్యపిలుపు విని కసురుకున్నాడు జానకిరాం.
అసహ్యంగా చూశాడు కోసలరాం.
"ఒరే నువ్వింత ఆడంగి వెధవనుకోలేదురా!"
"మాటలు జాగ్రత్తగా రానియ్!" ఖస్సుమంది జ్యోతి.
కోపంగా చెయ్యెత్తాడు జానకిరాం_
"దించరా! చెయ్యిదించు! లేదా ఎత్తిన చెయ్యి అటు తిప్పు. అలాకాకపోతే చేతులు కలిశాక అన్నేముంది? తమ్ముడేముంది?" కఠినంగా అన్నాడు కోసలరాం.
"కోసలరాం!" అంతదాకా వంటింట్లో వున్న స్వాతి కల్పించుకుని మరిదిని పిలిచింది.
"వస్తున్నా వదినా! ఈ బుద్ధిహీనుడికి బుద్ధి చెప్పి వస్తాను."
"నోర్ముయ్!" అరిచాడు జానకిరాం.
"ఛీ"
"ఏమండీ ఈ ఛీ కొట్టడాలు వింటూ ఇక్కడుండలేను నేను. మీరు వస్తేరండి_ లేకపోతే నేను వెళ్ళిపోతాను" అభిమానంగా అంది జ్యోతి.
"జ్యోతీ! కొంచెం నెమ్మదిగా మాట్లాడమ్మా! మామగారికీ విషయం తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. జానకక్క వెళ్ళినందుకే వాళ్ళు కుమిలిపోతున్నారు దుఃఖంతో. ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళిపోయారంటే ఇక చెప్పనక్కరలేదు" అంది స్వాతి.
'ఆ విషయం నాకు తెలుసులే' అన్నట్లు చూసి_
"చూడండి ఇక ఈ ఇంటిలో ఒక్కక్షణం కూడా వుండను. మనం ఇప్పుడే వెళ్ళిపోదాం" అంది జ్యోతి.
ఆ మాటలకి జానకిరాం సమాధానం యివ్వలేదు.
స్వాతి, కోసలరాం కూడా మౌనం వహించారు.
నిశ్శబ్దం అందరిమధ్యా వున్న ఆత్మీయతని కత్తికొక కండగా చీలుస్తోంది. పుత్రశోకంతో రోదిస్తున్న తండ్రి హృదయంలాగా వుంది ఆ వాతావరణం.
జానకిరాం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు లాగుంది. "జ్యోతీ! ఒకగంట ఓపికపట్టు_ మన సామానులన్నీ సర్దెయ్. నాన్న వాళ్ళు రాగానే_ వాళ్ళు దిగిన రిక్షాలోనే వెళ్ళిపోదాం. వాళ్ళకేం చెప్పి వెళ్ళాల్సిన బాధ్యత మనకిలేదు. కానీ వాళ్ళముందు వెళ్ళిపోతేమంచిది" అని బాత్ రూం వైపు నడిచాడు.
ఆ మాటలు విన్న కోసలరాం నిర్ఘాంతపోయాడు. అన్న యింత త్వరగా ఒక నిర్ణయానికొస్తాడనుకోలేదు. చిలికి చిలికి గాలివానయ్యిందే అనుకుని బాధపడ్డాడు.
జ్యోతి మరిదికేసి గర్వంగా చూసింది.
అది విన్న స్వాతి "అయ్యో! ఈ ఇంటికేవో చెడ్డరోజులు వచ్చా" యనుకుంది.
* * *
పన్నెండు గంటలైంది_
శాస్త్రి దంపతులిద్దరూ రిక్షాలో నుంచి ఆగారు. ఎండనపడి రావటం వల్ల ఇద్దరి ముఖాలు వాడిపోయాయి.
