Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 17

 

    సెరబయ్య గోడకేసి తిరిగి, సిణేవ కుర్రదాని సొగసులన్నీ ఎలపలికి కనిపించీ బొమ్మ ఎంపుకి తిరిగి నిక్కి నిక్కి సూత్తన్నాడు.
    రావి బాద సూత్తే రవణయ్య కి కూడా కళ్ళు సెమ్మగిలినాయి.
    ఎంకన్న బరువుగా రెప్పలిప్పి సూశాడు. రావులమ్మ ఆడి మీదే వొరిగి పోయున్నాది. గుండిలి ముందు కుంపటి మండుతన్నాది . అ ఏడికి అది కయిలిపోతన్నాది.
    "ఎల్లాగుంది ఎంకన్నా?'
    మూలిగాడు.
    "పాపం, గట్టి దెబ్బలే తగిల్నిట్టున్నాయి!"
    "ఆసపటాల్నించి ఎప్పుడు తీసుకొచ్చారో ?" అనడిగాడు సెరబయ్యని.
    "ఈ ఏలేనంట!"
    "తెప్పించాల. డబ్బు దగ్గిరి లేక వూరు కున్నాం!"
    "అదేంటి సేరబయ్యా, డబ్బు లేదని మందూ, మాకూ ఎయ్యాపొతే పేనం మీదికి రాదో!"
    "అందుకేగా నే నాలమూరోచ్చింది! గొలుసుసిమ్మంటే ఆయమ్మ నిక్కి నీలిగినాది. నేనేం సెయ్యాలి?"
    సట్టుని ,మెల్లోంచి గొలుసు తీసి సెరబయ్య కందించింది రావులమ్మ.
    "ఇదమ్మేసి, ఆ డబ్బుతో మందులు తెప్పించి పెట్టు అన్నా! నీకాల్లట్టుగుంటా! నేన్నీ సెల్లిల్ననుకో. నా తాలి నిలబెట్టు!"
    ఎక్కెక్కి ఎడిసినాది.
    సెరబయ్య గొలుసు తీసుకొని సిణేవా బొమ్మంపు ఓ నవ్వు యిసిరాడు.
    "బయం లేదు రావే! పట్నం లో పెద్ద పెద్ద డాకటేర్లున్నారే! రకరకాల మందులిత్తారు . నీవోడ్నీ తప్పకుండా బతికిత్తారు. నీలాటి దాన్ని దేవుడు తప్పకుండా సూత్తాడు. ఏడవకు" అంటూ జాలిగా మాటాడాడు రవణయ్య.
    కొంచెం సేపున్నాక సేతిలో సంచీ తీసుకొని లెగిశాడు. "మరి నేనెల్లోత్తా వెంకన్నా! నీ పెనానికేం బయం లేదులే! కరీదయినా మందు లేనా వోడుకుని బెగే వొళ్ళు బాగు సేసుకో! ఇప్పుడు మా అత్తోరింటి కేడతన్నా నేను. దీన్నీ, పిల్లల్నీ " సూసి రెండు మూడు రోజుల్లో యింటి కొచ్చేత్తాను.
    అప్పుడు మల్లా కలుసుగుందారి!"
    ఎంకన్న వులకలేదు. అడెంపు సూడనన్నా లేదు.
    "ఎల్లోత్తా రావే!"
    కడుపులో బాద పట్టలేపోయినాది రావులమ్మ.
    "ఎడిత్తే లాబవెంటే సెప్పు! ఇలాటప్పుడే గుండికి దయిర్నేం తెచ్చి కోవాలి. నెమల్లా వొచ్చి సూత్తాగా! నీకేం పరవాలేదు."
    దానేడుపు సేవన మాసంలో వుబుక్కొచ్చిన వోరదని మించి పోయినాది.
    ఇద్దర్నీ జాలిగా సూత్తా, తలుపు సేరేసి రవణయ్య ఎలపలికొచ్చాడు.
    రావులమ్మ ఆడి మంచం కాడే సతికిలబడి కూకుని, కాళ్ళ మీద సేతులేట్టుకుని మొగం వోల్సుకున్నాది.
    రొండు సెనాలు యిటూ అటూ సూసి ఎంకన్న సటుక్కుని మంచ మించి లెగిసి కూకున్నాడు.
    రావులమ్మ కొయ్యి లాగయి సూసినాది.
    దుప్పటీ యిసిరేసి కాళ్ళు జాడించాడు.
    "సిలకంటే సిలకవే
    బంగారు సిలకవే
    పంచి వోన్నెల రావి సిలకా!"
    అంటా రావులమ్మ బుజాలు ఎత్తి పట్టుకుని మంచం మీదికి లాక్కున్నాడు.
    ఆడి మోసం దానికి తెలిసి పోయినాది.కోపంతో కళ్ళు ఎర్రబడి నాయి. పవురసం తో పెదాలు తిట్టుకున్నాయి.
    బుస్సుని ఆణ్ణి తోసేసింది.
    "ఓసోస్! నీదెంత సోగుసే సి రావి సిలకా!" అంటూ ముద్దెట్టుకొబోయాడు. బుజ్జగించాలని సూశాడు.
    "గొలుసు పోయిందని బాద పడతన్నావా? ఎర్రి కూనా! దాంతో మేం కొత్త యాపారం పెడతాన్నానే! లచ్చలకి లచ్చలు గడిత్తాన్నావు కాసుకో మరి! ఎదవ సేంద్రారం పొతే పోయింది కానీ అల్లాటియి రేపు ఎయ్యి సేయించిత్తాను . ఇంక మరి కోపం యిడిసేసి నదర్నీ కూకోవో?"
    "స్సీ! దొంగసచ్చినోడా!" మొగం సిట్లించుకున్నాది. ఆడి సేతులు తోసి పారేసి దూరంగా జరిగిపోయింది.
    కారు కింద పడ్డాడని పేనం మీద కొచ్చిందనీ , అబద్దాలాడి యిద్దరూ కలిసి తన్ని మోసవు సేశారు. అనా తక్కువు నాలుగు కాసులు గొలుసు కాజేసుకున్నారు. తన మెల్లోంచి లాక్కుని ఆ సేంద్ర కాంతాని కియ్యడానికెనా?
    సెంద్రకాంతం పేరు గురుతుకు రాగానే దానికి రగతం అంతా మొకంలోనే పేరుకున్నాది. కళ్ళు సిందూరమయినాయి. పళ్ళు పటపటలాడినాయి. ఒళ్ళు సలసలా కాగినాది.
    "అంతిసురెందుకే రావే? ఆడదాని సొమ్ము తినేటంత సచ్చు మొగోడ్నానుకున్నావా? నీ డబ్బులో సిల్లుగవ్వ నా కక్కర్లేదు. గొలుసు నమ్మేసి, మావోడు తెచ్చీ డబ్బంతా ఈ యాపారానికే పెడతాను. యాపార వంటే అనా కానీ యవ్వారవనుకున్నావెంటే? మాది గొప్ప యాపారం! ఏంటో తెలుసా?"
    ఆడు సెప్పెమాటలేయీ రావులమ్మ యినిపించుకోలేదు. దాని కోపమంతా చందర కాంతం మ్మీదే గడ్డ కట్టుకున్నాది.
    టంకు పెట్టి లో దాసిన సీసా ఎలపలికి లాగి, రావులమ్మ కి సూపించి, యిరగబడి నవ్వాడాడు.
    "మనం సేసే యాపారం అందరి లాంటిది  కాదే ఎర్రి మొగవా! తెలివి తక్కువోళ్ళు నాసిరకంది సేత్తారు. మంది సాలా యిలవైనది. ఆళ్లు పొగలు సేత్తారు, మనం రేత్తిరి . ఆళ్లయి రూపాయిలూ, పావళాలు లాబం. మనయి లచ్చల్లచ్చలు! బతికున్నన్నాల్లూ బిగినీసు సేసినా ఆళ్ళకి మిగిలేది సున్న. మనకి పట్నం లో రెండు మేడలూ, అల ఊల్లో పోలవూ, యిక్కడో సిన్నకారూ, మన పిల్లల్నెత్తు కొడానికి నవుకరోళ్ళూ-- అబ్బో యిప్పుడే అంతా సెప్పేత్తే నువ్వు ఒళ్లు మరిసిపోవూ? మరేవో నీకు అరుపేటల సేంద్రారం కావాలా , పదేను కాసుల రాళ్ల నెక్కిలిసు కావాలా?"
    అడి మాటలు అది యింటవులేదు.
    "పోనీ, నెక్కిలీసు మాట తరువాత సేబుదూగాన్లె! ఎంకన్న ఎల్లాంటోడో యిప్పుడేనా తెలిసిందా? ఈ సీసా లో కిటుకు గురుతు పట్టేవా? సేంద్రకాంత వుందేం , దానికిదంటే మా సెడ్డ మనుసు! నాతొ బాటు కుసింత నువ్వు కూడా తాగ్గూడదో?" అంటా ఆసీసా దాన్నోట్లో ఒంచేయ బోయాడు. రావులమ్మ తోసేసినాది. దానోళ్ళు మండిపోతన్నాది.
    ఆ గొడవలో పలాసటి సాల్రాయి బొమ్మ లాంటి బుల్లెమ్మేవురో గుమ్మం కాడ నిలుసోడం ఎంకన్న సూల్లెదు.
    అగ్గిలో నూనోసినట్టయినాది రావులమ్మ కి.  ఇదేనా సేందరకాంతం? ఎందు కొచ్చిందో? గొలుసు కోసవేమో? తన సేంద్రారం కోసనేవో? మొగుళ్ళనీ. మొగోళ్ళనీ ఎంత మందిని బుట్టలో ఏసుగున్నాదో? ఎన్ని కాపరాలు పడగోట్టిందో ? బతుకంతా ఆళ్ళు సేవటోడిసి గడించిన నాలుగు రాళ్ళూ తన ఎదాన్నేట్టుకుని ఎంతమంది వుసురు తిన్నాదో? రంగు రంగుల సీరెలు కట్టి, దొంగ సింగారాలు తెచ్చి పెట్టుకుని, తియ్య తియ్యటి సూపులి కెనక గుండెల్లో యిసాలు దాసుకొని ఎంత మందిని తన పొట్టనెట్టుకున్నాదో? పడగిప్పి ఒయ్యారంగా ఆడీ కోడితాసులాగ , సేకసేకా సిందులాడే ఆడది కంటికి కనిపిస్తే మొగోళ్ళ సూపులో నాగస్సరా లెలా పుట్టుకోత్తాయో? మనసిచ్చిన పెళ్ళాన్నోదిలి యిలాంటి మాయి దారి దాని కొంగట్టు కేలాడుతూ తిరగడానికి యీ మొగోళ్ళకి సిగ్గెందుకు లేదో? నలుగురూ ఎలెత్తి సూబించరో? పలానా రావులమ్మ మొగుడు ఉంచుకున్నది అంటా ఆళ్లు అడిపోసుకోరో? తన పరువు పోదా?
    ఆడదంటే అంత మనుసు పడీవోడయితే పెళ్ళాన్ని డిసెయ్యాలనుందా? అయినోళ్లకి దూరమయిపోవాలా? అడికేం కరువు కాలిందనీ? ఎప్పుడేనా కాదో, కూడదో అంటే తను మటుక్కి ఆడి సరదాలకి అడ్డెడతాదా? పీసు మిఠాయి యిట్టవంటే ఒద్దని నోరు కట్టేసిందా? ఏపాపం సేసిందని తనకీ రాత?
    అయిందేదో అయినాది. ఇప్పుడేనా ఆడి మనసు మారితే అన్నారం సత్తేన్నాయిడికి అర్రూపాయిలు ముడుపు కట్టదో? తన కళ్లల్లో నీళ్ళు తుడిసేత్తే , ఆ సింతలూరు నూకాలమ్మ కి నిలువు దోపిడీ ఇయ్యదో? తన కడుపునో కాయి కాత్తే ఆ తిరపతెంకన్నకి ఒడ్డి కాసులు ఒడి నిండా పోయ్యదో?
    ఆడి బుద్ది మారితే దేవుడల్లె ఆడి కాళ్ళ కాడే పడుండదో?
    శివశివా ఎందుకొచ్చిన అడ బతుకురాయిది అంటా బాదపడినాది. తనకింత గతట్టి నందుకు దాని మీద దానికే జాలి కలిగింది రావులమ్మకి. ఆడి మీద వుక్కురోసం ఒచ్చినాది. ఒకిట్లో నిలుసున్న దాని మీద సిర్రుని సిరాకేత్తుకొచ్చినాది.
    మల్లా మనసు రకరకాలుగా పోతాది. అన్నిప్పుడు తిట్టుకుని ఏం లాబం? దాంది మట్టుక్కు తప్పేవున్నాది? దాని పొట్ట కూటి కోసమే గందా అది అల్లా సేత్తన్నాది! ఇంతకీ తన రాత బాగా వుంటే యిల్లా గెంతుకవుతాది? ఎంకన్న మీదొచ్చిన కోపం కూడా రావులమ్మ  గుండిల్లో లోతు కంటా ఎల్లి జాలిగా కరిగిపోయినాది.
    ఆడి తప్పే లేదు. ఈ మాయిలన్నీ దానియ్యే! స్సీ! ఆడదయి పుట్టి ఆడోళ్ళ మీదే పగ బట్టినాది. మెరుపులా మెరిసి, పిడుగులా నెత్తిన పడినాది. సుట్టుతా గూడు కట్టుక్కూసున్న జనం దాని ఏడికీ , ఎలుగుకీ ఎప్పుడో అప్పుడు మాడి బుగ్గయిపోయీవోళ్ళే!
    కళ్ళల్లో కోపాలు ఒడిగా పదునట్టి గుమ్మల్లోకి సూసేతలికి ఆ సిన్న దక్కడ లేదు.
    తన్ని సూసి బయపడిందా? ఎందుకొచ్చిన ఏసవంట? తన కాపరం నట్టేట్లో ముంచడానిక్కాదో? అయినోడు అలాంటోడయాడు కనక, అలుసు తీసుకుని తన మీద సవ్వారి సేయడానిక్కాదో?
    ఇదేం పట్టనట్టే , ఎంకన్న గది కిటికీలన్నీ మూసేసి, సీసా అంతా కాళీ సేసి, మనుసుట్టి బడ్డట్టు సూత్తా రావులమ్మ దరికోచ్చాడు. మల్లా బుజం మీద సేయ్యేశాడు. తీసేసినాది. మెడ తడివాడు. దూరంగా జరిగిపోయినాది. సేయ్యేట్టుగున్నాడు. ఇదిలిచ్చుగున్నది. సల్లగా గుమ్మం కాడికి నడిసి సట్టుక్కుని తలుపేసేశాడు. ఎర్రెక్కినట్టు సూసింది రావులమ్మ.
    "ఓసి పిచ్చమ్మీ! నీ కంత దుడుకేందుకే?  నిసా లో వున్నపుడు నీలాటిది దరి నుంటే ఎన్ని సరదాలు పుడతాయో నీకు తెలుసునంటే? నాసావిరంగా , వూరవసి, దిగొచ్చినట్టు కాదంటే? ఒకో బుడ్డి ఎసుగున్నానంటే, ఒకో గంట నీ కాళ్ళ కాడ కట్టేసు కోవంటే? ఓలబ్బో యిద్దరు కలిసేసుగుంటే యిందరలోకం సూడవంటే? ఎప్పుడూ లేంది యిప్పుడంత సిగ్గెందుకే నీకు రావులమ్మే?"
    అప్పటికే ఆడి బుర్ర , కాపీ కాళాసులో సేంచా పెట్టి తిప్పినట్లు తిరిగి పోతావున్నాది. ఏం మాటాడతున్నాడో , ఏం సెత్తన్నాడో ఆడికే తెలీకుండా అయిపోయినాది.
    "నీకూ నాకూ నడాన్ని యింత దూర వెందుకే పిల్లా? సెంద్రకాంతం పేరు నీకు తగింది కాదే! నిన్ను రావులమ్మా అంటా పిలామంటా? లోపాలున్నోళ్ళు ఎలిపలికి మన్నేలా సూత్తారే? సొగసుగా పక్కేసిన మంచం వుండగా మనం నిలుసునుండడవేంటే?"
    ఆవురావురు మంటా లగేత్తుకోత్తన్న ఎంకన్న కి దొరక్కుండానే తప్పించుకుందారనుకున్నది రావులమ్మ. అయితే ఆడిది ఏనుగు బలవాయే!
    పిచ్చి కుక్క మీద కురుకుతావున్నప్పుడు బయవేసి అరిసీ సిన్నపిల్లలా కూసినాది రావులమ్మ. కళ్లల్లో కక్కిన నిప్పులఏడికి ఒల్లంతా సేవటలు సిమ్మినాయి. గొంతుకు బిగిసి పోయినాది.
    ఆడు ఎంకన్నే అయినా, తనవోడే అయినా ఎప్పుడూ లేంది,దానికేంటో అయేల సెప్పలేనంత దడుట్టినాది. ఓ మూల ఏడుపూ, ముంచెత్తినాది. అంతకు ముందెప్పుడూ ఆణ్ణి అలా సూల్లేదు. సూత్తదని అనుకోనూ లేదు. మనసులో ఎన్ని దన్నలెట్టియినా యీ యేల ఆణ్ణి కొరుక్కు తినేదా రన్నంతా కోపవూ,వొచ్చినాది. కాని ఏం సేత్తాది? ఆడు తన మొగుడు , మొగోడు.
    సుర్రుని దూకి దాన్ని రొండు సేతుల్తోనూ సుట్టేసినాడు. ఒక్క సిటికి దాకా ఏం సెయ్యనే లేకపోయిందది. కాని , ఎంతయినా గుండి బలవున్న పడుసు కనక సటుక్కున ఎనక్కి తోసేసి, యిసురుగా బయిటికి వురుకొచ్చి పడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS