'అయితే నువ్వనేదేమిటి --' ఇది ఎప్పటికి ఇలాగే జరగలనా?'
'ఒప్పు కుంటున్నాం లే బాబూ. మార్పు రావాలని-- అది అన్ని వయిపుల నుంచీ జరగాలి. లంచం పుచ్చుకున్న వాడే కాదు ఇచ్చిన వాడు దోషే అన్న భావం అందరిలోనూ కలగాలి-- మనం అందరం మామయ్యా చెప్పిన లాంటి మంచి మనుష్యులం అయిపోవాలి. కడు శ్యామలా ' అంది సరోజ.
'అబ్బబ్బ -- ఇంకా అదే గొడవా -- మరి ఆకాశ గంగ అవి చూసి రాచాలనుకున్నాం గా -- ఇంకా ఎప్పుడు బయలు దేరతాం .' అంది శకుంతలమ్మ అన్నీ చూడాలని సరదా ఆవిడికి - ' వెళ్దాం లే ఓ అరగంట పోనీ -- ఇంకఏం వాదించుకోటం అంటావా, మనది రామరాజ్యం మనకి వాక్ స్వాతంత్యం వుంది. మరో రాజ్యం అయితే అందరం 'నోళ్ళూ మూసుకు కూర్చో వలసిందే .'- కాస్సేపు నడుం వాల్చటానికి తన గదిలోకి వెళ్తూ అన్నాడు మాధవ్.
* * * *
ఇదంతా ప్రయాణం బడలికేనా!' అయిదు గంటలయినా గాడ నిద్రలో మునిగి పోయి వున్న శ్యామలని చూస్తూ నవ్వింది శకుంతలమ్మ.
'ఆ బడలికేమిటీ ? టైము దొరికితే సరి ఎప్పుడంటే అప్పుడే హాయిగా నిద్ర పోతుంది ' లోపలికి వచ్చిన శకుంతలమ్మకీ సరోజ కీ కూర్చోటానికి కుర్చీలు చూపిస్తూ శ్యామలకి మేలుకొలుపు పాడింది సురేఖ.
యాత్రలు అవీ ముగించుకుని అ క్రితం రోజే అంతా హైదరాబాదు తిరిగి వచ్చారు.
'అప్పుడే అయిదయిందా?' బద్దకంగా ఆవులిస్తూ చేతి వాచీ కేసి చూసుకుంది అప నమ్మకంగా.
'త్వరగా లేచి స్నానం అదీ కానియ్యి మరి-- మామయ్య ఒక్కడూ ఆ విజిటర్స్ రూమ్ లో కూర్చున్నాడు -- అయినా ఏం నిద్ర బాబూ.' విసుక్కుంది సరోజ.
'అయిదంటే అయిదు నిమిషాలు.' అంటూనే హడావిడిగా తయారవటం మొదలు పెట్టింది.
'రేపు వూరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా.' శ్యామల ముడుచు కుంటున్న సిగ వంకే చూస్తూ అంది శకుంతలమ్మ.
'అప్పుడేనా, మరో నాలుగు రోజులుండకూడదూ?' ముడి అందంగా కుదిరిందో లేదో అని రెండు అద్దాలలో చూసుకుంటూ అంది శ్యామల.
'నయమే ఇంకా నాలుగు రోజులా -- అక్కడ మీ పెద్ద నాన్న చిందులు తొక్కుతూ వుంటారు -- అమ్మమ్మ ఒక్కతే చేసుకోలేదు -- రాకరాక వచ్చాను కదా అని పది రోజులు పైనే వున్నాను-- మరో వారం అయితే అయింది కాని వాడి ధర్మమా అంటూ నాలుగు పుణ్య క్షేత్రాలు చూశాను.'
'అనుకోకుండా నాక్కూడా దైవదర్శనం చేయించారు. అంది సురేఖ.
'ఒకళ్ళు చేయించేదేమిటమ్మా -- ఆ దేవుడే నిన్ను తీసుకు వెళ్ళాడు -- ఇలాంటివి ప్రాప్తం వుండాలే కాని మన ప్రయత్నం మీద జరగవు .' శకుంతలమ్మ స్వానుభవంతో చెప్తుంటే సురేఖ చిన్నగా నవ్వేసింది --
'మీ అందరి తోటి చాలా సరదాగా గడిచి పోయింది. ఇంటికి వెళ్ళలేదు అన్న ఆలోచనయినా రానివ్వకుండా ఎంతో అభిమానం గా చూసుకున్నారు.' కృతజ్ఞతా పూర్వకంగా అంది.
'ఇంకా అలా ఖబుర్లూ చెప్తూ కూర్చో -- నన్నంటావు మళ్ళీ.' శ్యామల హడావిడి పడిపోయింది.
'చీర మార్చు కోటమేగా .'-- పెట్టి తెరిచి చీర తీసి మంచం మీద పడేసింది -- అలమారు లోంచి మూడు మంచి గంధం చెక్క పెట్టెలు తీసింది -- చిన్న టాయిలెట్ బాక్సు సైజులో వున్న పెట్టెలు నాలుగు బెంగుళూరు లో కొంది -- పెట్టి నాలుగు ప్రక్కలా సన్నటి లతలూ పువ్వులూ చెక్కి వున్నాయి. మూత మీద ముచ్చటైన నెమళ్ళ జంట -- కంటికి సొంపుగా వుండటమే కాకుండా మృదువైన సుగంధాన్ని వెదజల్లే ఆ పెట్టెలు వీళ్ళ ముగ్గురికి తన తల్లికి అనే తీసుకుంది -- కానీ ఖర్చు లేకుండా అన్ని వూళ్ళు తిరిగాను ఏదైనా ఇవ్వాలి అనే వుద్దేశ్యంతోనే వాటిని తీసుకుంది.
వాటితో పాటు గంధం చెక్కతో చేసినవే నాలుగు కుంకం భరిణ'లు కూడ. వాటిలో కాస్త కుంకం వేసి పెట్టిలో పెట్టి.
'మనం ఇన్నాళ్ళు సరదాగా చేసిన ప్రయాణానికి గుర్తుగా వుంచండి.' అంటూ మూడు పెట్టెలూ ముగ్గురి చేతుల్లోనూ పెట్టబోయింది.
'వాళ్ళంటే వూరికి వెళ్ళి పోయేవారు -- నాక్కూడా ఎందుకూ?" చెయ్యి వెనక్కి తీసుకుంది శ్యామల.
'ఊరికి వెళ్ళిపోతే మాత్రం ఎందుకీప్పుడు ?' పరాయి పిల్ల దగ్గర్నించి అవి తీసుకోటానికి బోలెడు మొహమ్మాట పడిపోయింది శకుంతలమ్మ'.
'ఇలాంటి గుర్తులేమీ లేకపోతె మరిచిపోతామనేనా మీ ఉద్దేశం ,' అంది సరోజ.
"ప్లీజ్ -- అలాంటి అర్ధాలు తియ్యకండి -- నేను సరదాగా ఇస్తున్నాను-- మీరు తీసుకోనంటే నా మనస్సు చాలా బాధపడుతుంది -- మనం మళ్ళీ కలుసుకోలేక పోవచ్చు -- కాని ఒకసారి కలిసి చేసిన ప్రయాణానికి గుర్తుగా వుంటాయివి.' అర్దిస్తున్నట్లు చూసింది సురేఖ.
'అయితే సరే -- నేనూ ఒకటిస్తాను -- నువ్వు వద్దన కూడదు.' తన పెద్దరికం నిలబెట్టుకుంటూ అంది శకుంతలమ్మ.
'అవును మరి-- వద్దన కూడదు , వంత పాడారు శ్యామలా సరోజా.
'అలాగే -- 'సురేఖ కి ఒప్పుకోక తప్పలేదు.
'చీర సింగారించేసరికి అన్నమాట నిజం చేశారు-- చదివిన పేపరు చదువుతూ ఒకడ్ని ఎంతసేపని ఇక్కడ కూర్చుంటా ననుకున్నారు?' నవ్వుతూనే విసుక్కున్నాడు మాధవ్.
'పాపం ఈ అమ్మాయిదెం లేదు -- నీ ముద్దుల మేనగోడలు నిద్ర లేచేసరికే అరగంట పట్టింది .' అంటూ సురేఖ ఇచ్చిన బహుమతులు చూపించి 'నినిచ్చే బహుమతి ఆ అమ్మాయి తీసుకునే కండిషన్ తోనే తీసుకున్నాను' అంది శకుంతలమ్మ.
'అంతేలెండి -- ఆడవాళ్ళంతా ఒక్కటే -- మీరూ మీరూ స్నేహాలు కలిపెసుకున్నారు బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు -- ఇన్నాళ్ళూ వూళ్ళన్నీ తిప్పిన డ్రైవరు బక్షీసు మాట ఎవ్వరికీ గుర్తులేదు. హస్యంగానే నిష్టూరం వేశాడు.
మిగిలిన ముగ్గురూ గలగల నవ్వేసారు కాని సురేఖ ఒక్క క్షణం సిగ్గుతో ముడుచుకు పోయి మరు క్షణం లో 'ఉండండి' అంటూ చర్రున లోపలికి పరుగెత్తింది. 'నేను సరదా కి అన్నాను-- ఇప్పుడెం వద్దు ' అంటున్న మాధవ్ మాటలు వినిపించుకోకుండా.
పది నిమిషాలలో తిరిగి వచ్చింది చేతిలో చిన్న అట్ట పెట్టెతో -- పెట్టి మూత తీసి టీపాయి మీద పెట్టి పదిలంగా పెట్లోంచి తీస్తుంటేనే వాళ్ళకి తెలిసిపోయింది అదేమిటో -- మంచి గంధపు చెక్కతో చేసిన చిన్న మండపం -- ఒకరి చేతులలో ఒకరు ఒరిగి పోయిన రాధా మాధవుల దంతపు విగ్రహం మండపం మధ్య స్క్రూతో బిగించి వుంది -- అది కూడా బెంగుళూరు లోనే తీసుకుంది. సురేఖ తన కొసమని.
తీసుకోండి -- అసలు మీరు అడగకుండానే ఇవ్వాల్సింది -- కాని, బెజవాడ లో మీరు అలా హెచ్చరించిన తరువాత అలాంటి సాహసం చెయ్యలేక పోయాను' అంది టీపాయ్ మీద పెడుతూ.
'నేనేదో హస్యాని కన్నాను-- మీరు సరాదపడి కొనుక్కున్నది ఇవ్వటం బాగుండలేదు -- కాస్త పరిచయం అయేసరికి ఏదో సరదాగా మాట్లాడటం నాకలవాటు -- వీళ్ళందరికీ తెలుసు నా సంగతి -- ఏమీ అనుకోకండి ...' యాదాలాపంగా అన్నాడే కాని నిజంగా సురేఖ ఇవ్వబోయేసరికి ఎందుకన్నానా అని పశ్చాత్తాప పడసాగాడు.
'అనుకోటానికేముంది ఇందులో -- నేనూ సరదాగానే ఇస్తున్నాను. తీసుకుంటే సంతోషిస్తాను' అంతకన్న బలవంతం చెయ్యటం సురేఖ చేత కాలేదు -- తీసుకోమని చెప్పండి అన్నట్లు శకుంతలమ్మ వైపు చూసింది -- కాని ఆవిడ నోరు మెదపాల్సిన అవసరం లేక పోయింది -- టీపాయ్ మీది మండపాన్ని చేతిలోకి తీసుకుని 'సరే తీసుకుంటాను -- నిజం చెప్పొద్దు -- మీరు గబుక్కున అలా పరుగెత్తుకు వెళ్ళేసరికి మిగిలిపోయిన ఆ నాలుగో బొట్టు పెట్టి తెచ్చి నాకిస్తారేమో అనుకున్నా.....'
అతని మాటలు పూర్తీ కాకుండానే అందరూ కిసుక్కున నవ్వేశారు -- తృటి కాలం వాళ్ళ ముగ్గురి మోహలలోనూ అవరించుకున్న మబ్బు తెరలు మాయం అయ్యాయి. ఒక్క క్షణం సేపు స్తంభించి పోయిన కాలంలో చలనం వచ్చినట్లూ, ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరి అయిపోయి నట్లున్న వాతావరణం మళ్ళీ ఉల్లాసంగా మారిపోయినట్లు అనిపించింది.
క్షణం క్రితం -- 'ఛ - పొరపాటు చేశానా,' అనుకున్న సురేఖ ఆ భావాన్ని పైకి కనపడ తీయకుండా ,
'అయ్య బాబోయ్ -- మీరు ఏమీ పట్టించుకొనట్లుంటారే కాని ఎవరెవరు ఏమేం కొన్నదీ కూడా గుర్తు ఉందన్న మాట,' అంది చిన్నగా నవ్వుతూ.
'అదే మరి నాలో ప్రత్యేకత.' మరోసారి ముచ్చటగా చేతిలో వస్తువు కేసి చూసి దాన్ని పెట్టెలో పెట్టేసి , 'ఊ రండి త్వరగా.' అంటూ కారు వేపుకి నడిచాడు.
'తనని ప్రత్యేకం అడిగి పుచ్చుకున్నావు-- మరి మమ్మల్నే మిమ్మంటావు ,' అంది సరోజ వెనకే నడుస్తూ.
'నాక్కావాల్సినప్పుడు చెప్తాలే -- ముందు కారేక్కండి ,' అన్నాడతను తలుపు తెరిచి ఎక్కండి అన్నట్లు పట్టుకుని.
'నేను రాను,' అనాలని నోటి చివరి దాకా వచ్చిన మాటలు అలాగే మింగేసి వాళ్ళతో పాటు కారు ఎక్కింది సురేఖ.
'మీరు వూరికి ఎప్పుడు వెళ్తారు , అన్నాడు మాధవ్.
'రేపో ఎల్లుండో వెళ్తాను-- ఇంకా ఎప్పుడొస్తావు అంటూ ఇవాళ అమ్మ దగ్గర్నించి వుత్తరం కూడా వచ్చింది అంది సురేఖ .
