"ఈసారి పంటలో మొత్తం అప్పు తీర్చేస్తాం?"
"అబ్బో ఆరునెలలా?" అని ఒక క్షణమాగి ఆలోచనగా అన్నాడు మళ్ళీ "అంతదాకా మాకు పనిలోకి రావాలి?"
"మళ్ళీ అదే మాటా? మేం రాం?" అన్నాడు సోము.
జానయ్య వేపు చూశాడు చౌదరి.
అటు కొడుక్కీ, యిటు ఆసామికి చెప్పలేని బలహీనతతో తలవంచుకున్నాడు జానయ్య.
"ఏం రా పొగరుబలిసిందే!"
గుడ్లురిమేడు జయన్న.
"ఓ పని చేయండి. పనికొస్తే కూలి యివ్వండి అందరితోపాటు, లేదా చెల్లు రాయండి. వారానికో మాటు లేదా చీటీ రాయండి" అన్నాడు జయన్న.
మిర్రిమిర్రి చూశాడు చౌదరి.
ఒక్క క్షణం ఆలోచించి "జానయ్యా ఇలాంటివి నా దగ్గర సాగవు. నా డబ్బు నాకు యిచ్చేదాక నాకు వుచితంగా పనిచేయాలి అంతే! లేదా మనుషులను పంపి లాక్కరమ్మంటాను నా పోతే నేనే వస్తాను. కొరడాతో బాత్తాను. రక్తం తాగుతాను నాకు బాకీ వున్నారు మీరు. బాకీ తీసుకోవటమంటే బానిసత్వం అంతే అది కాదనటానికి మీకు హక్కు లేదు పొండి. డబ్బు యివ్వండి పూర్తిగా, లేదా అందరిలాగా మెలగండి" అన్నాడు చౌదరి నిష్కర్షగా.
సోము మిర్రిమిర్రి చూశాడు.
జయన్న నిస్సహాయంగా ఉండిపోయాడు.
"ఊఁ! వెళ్ళండి" గద్దించాడు చౌదరి.
ఏదో సమాధానం చెప్పబోయిన కొడుకుని "చాల్లే" అంటూ నోర్మూయించాడు జానయ్య.
ముగ్గురూ నిస్సహాయంగా తిరుగుముఖం పట్టారు.
అందరి ముఖాల్లోనూ ఆలోచన-కోపం-నిస్సహాయత తలొంచుకుని వస్తున్నారు.
"జానయ్యా!"
భార్గవి పిలుపుకి అటు చూసి "దండాలమ్మా" అన్నాడు అతను. జయాన్న, సోము కూడా నమస్కరించారు.
"ఎక్కడినుంచి? చౌదరి యింటి నుంచేనా?"
తలూపేరు "అవునమ్మా" అంటూ.
"ఏమయింది?"
"ఏమవుతుందమ్మా! పేదరికమే మహాపాపం. అప్పు చేయటం నరకం. అనుభవిస్తున్నాం." బేలగా అన్నాడు జానయ్య.
"నేనోమాట చెపుతాను మా పనిచేసేమనిషి హఠాత్తుగా వెళ్ళిపోయాడు. కొంత యిబ్బందిగా వుంది. ఈ సంవత్సరమంతా మా యింట్లో పనికి వదిలెయ్ సోముని, మళ్ళీ ఏరువాక సాగేదాకా. నేను మీ చౌదరి అప్పు అంతా యిచ్చేస్తా. తీర్చెయ్యండి. పేరుకి పని అనే కానీ ఎక్కువ ఉండదు. మా ఇంటిపనులు చూసుకోవచ్చు. మీ పొలం చేసుకోవచ్చు."
జానయ్య ముఖం వికసించింది.
జయన్నవైపు చూశాడు. అతను సోముని చూశాడు.
సంతోషంగా తలూపాడు సోము.
"అలాగేనమ్మా" అన్నాడు జానయ్య.
"అయితే డబ్బు పట్టుకెళ్ళండి."
"రేపు మళ్ళీ వెళ్ళి ఎంతయిందో తేల్చుకుని వచ్చి ఆ మొత్తం తీసుకెళతామమ్మా ఇప్పుడెందుకు మళ్ళీ వెళ్ళాల అన్నాడు జయన్న.
"సరే, మీ యిష్టం."
"వస్తానమ్మా, దండాలు" అంటూ కదిలేడు జానయ్య. వాళ్ళిద్దరూ నమస్కరించి సెలవు తీసుకున్నారు.
7
ఒకసారి ఉరుము ఉరుముతుంది. ఊరిమీద పడుతుంది అనుకుంటాం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాం. దేవుళ్ళకీ, దైవాలకీ మొక్కుకుంటాం. అర్జునా, ఫల్గుణా, పార్దా, కిరీటి అనుకుంటాం. అయినా అది చల్లగా తేలిపోతుంది. పిడుగు తప్పుతుందో అసలే పడదో మనకి తెలియదు. అయితేనేం? మనం ప్రమాదాన్నుంచి బయటపడ్డాం అంతే చాలు అనుకుంటాం.
చౌదరి విషయంలోనూ అదే జరిగింది.
జయన్న, సోము మాత్రమే వెళ్ళారు అతని దగ్గరికి. జానయ్యని వాళ్ళు పిలవలేదు. అసలు ఆ విషయమే తెలియదతనికి.
