Previous Page Next Page 
వారుణి పేజి 17


    నువ్వు మన కులం కాని అబ్బాయిని చేసుకున్నా, వాళ్ళేం బాధ పడలేదు. అసలీ కులాలు ఎందుకేర్పడ్డాయో, వాటి ప్రాముఖ్యత, అవసరం ఏమిటో నాన్నకి తెలీదా ఏమిటీ? అమ్మకి తెలీదా?
    ఆ జరిగే పెళ్ళి శాస్త్రోక్తంగా జరిగివుంటే బావుండేదని. తమకీ తృప్తిగా వుండేదని అనుకున్నారు. అది నెరవేరలేదనే ఎంతగానో విచారించారు.
    నీవూ నీ భర్తా మీ జీవితాలని బాగా గడపవచ్చు. సుఖ సంతోషాలని అనుభవించవచ్చు. కానీ మీ భవిష్యత్తులో మీకు కలగబోయే సంతానం సంగతేమిటి? వాళ్ళ కులమేమిటి? గోత్రమేమిటి?
    వాళ్ళ విద్య ఉద్యోగాల విషయంలో ఏ పేచీ రాకపోయినా పెళ్ళిళ్ళప్పుడు గొడవలు రావా? అవి మధనపడ్డారు నాన్నగారు. మరి ఎలా పరిష్కరించేది యీ సమస్యని?
    వాళ్ళ పెళ్ళిళ్ళ సమయానికి వాళ్ళకీ మీలాగే వర్ణాంతర వివాహం చేసుకున్న సంబంధాలే చూస్తారా? అప్పుడూ హెచ్చు తగ్గుల సమస్యలు వచ్చేస్తాయేమో! కాకపోతే నీలాగే వాళ్ళూ ప్రేమ వివాహాలే చేసుకుంటార్లే అని ధైర్యంతో వుంటారా?
    ఏమో !
    భవిష్యత్తు తలుచుకుంటే బ్రహ్మాండంగా వణుకు పుడుతోంది సిస్టర్!
    పోన్లే అన్నీ ఆ కబుర్లే ఎందుకు.
    పేరుకి యీ వూరు పల్లెటూరే అయినా యిక్కడ బాగా పొద్దుపోతోంది మాకు. రేడియో, టేప్ రికార్డర్ వున్నాయి. మద్రాసు దగ్గరే కాబట్టి టి.వి. కూడా వుంది. మీ మరిదిగారు వీడియో కూడా కొంటామని అంటున్నారు. ఆయనకి నాపై ఎంత ప్రేమో చెప్పలేను. ఎప్పుడూ ఏవో బహుమతులుగా యివ్వాలని తాపత్రయం. ఈ రోజే నాకు టు_ఇన్_వన్ ప్రజెంట్ చేశారు. అది నా కోసమేనట!
    అన్నట్టు మాకు తిరుపతి కూడా చాలా దగ్గరే! వస్తే మా యింటికి తప్పక రావాలి. నువ్వూ బావగారూ రండి. అత్తయ్యకి నీవూ మేనకోడలివే కదా! మీరు తిరుపతి స్పాట్ వాల్యుయేషన్ కి వస్తారేమో_ అప్పుడిక్కడికి రావటం మరవకండి.
    అత్తయ్య నిన్నీ మధ్య చూడనే లేదని చాలా వాపోయింది. నీ గురించి చాలా చింతించింది.
    వారుణీ_మగవాళ్ళ మనస్సు లెలా వున్నా ఆడవాళ్ళ ఆంతర్యాలన్నీ దాదాపు ఒకే విధంగా వుంటాయేమోననిపిస్తోంది. నిజమా కాదా?
    హాయిగా విశాలమైన బంగళాలో విశ్రాంతిగా కాలం గడుపుతున్నాను. పుస్తకాలు రోజుకొక్కటి చదివేస్తున్నాను. కేసెట్ లో గజల్స్ వింటూ, నచ్చిన పుస్తకాలు చదవుకుంటూ వుంటే ఎంత హాయిగా వుంటుందో తెలుసా? కొత్త కోడలిని కదా! ఇంకా యింటి డ్యూటీ తీసుకోలేదు. అందుకే ఏ పనులూ లేవు. హాయిగా వుంది. నీకూ అంతేనా?
    అయినా యిక్కడ ఏం పనులుంటాయి లెద్దూ! అన్నిటికీ మనుషులున్నారు. వంటకి మామయ్య చెల్లెళ్ళున్నారు. అజమాయిషీలకి అత్తయ్యగారున్నారు. నా పనల్లా వేళకి అన్నీ తినెయ్యటమే! అదే బోర్ కొడుతుందేమో!
    నీ విషయాలు ఏవీ తెలీవు. అన్నీ వివరంగా రాసెయ్యాలి సుమా!
    అత్తారిల్లు ఎలా వుంది?
    ఇప్పుడు ఉద్యోగం ఎలా వుంది? రెండు డ్యూటీలూ బాగా చేసుకుని పోగలుగుతున్నావా? ఏ యిబ్బందులూ లేవు కదూ? అయినా కొత్త కోడలికి ఏం యిబ్బందుల్లే.
    వారుణీ_అన్నీ వివరంగా రాసెయ్యరాదుటే!
    మరి వుండనా ?
                                                  నీ ఉత్తరం కోసం ఎదురుచూసే
                                                               నీ చెల్లి
                                                                శిరీష
    బరువైన నిట్టూర్పు వెలువడింది.
    ఉత్తరం పూర్తి చెయ్యగానే అదోలా అనిపించింది వారుణికి.
    ఎంత ఆత్మీయత అనుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS