ఆమె నిర్లిప్తంగా తల అడ్డంగా ఊపింది.
"పోనీ అడగొచ్చుగదా?" అన్నాడతను.
"అడిగి ప్రయోజనం ఏమిటి? నువ్వు సవ్యంగా సమాధానం ఎప్పుడు చెప్పేవు?" అన్నదామె నిష్టూరంగా.
"అయితే అడగవనేగా అర్ధం?"
"నాకు అర్ధమయ్యేలా సమాధానం చెబితే అడుగుతా!"
అప్పటికిగాని కృష్ణమూర్తి గాలి పీల్చుకున్నాడు కాదు. పెద్ద స్టయిల్ గా ఆమెతో అన్నాడు.
"మన పెళ్ళి ప్రయత్నానికిది లాస్ట్ రిసార్టు! చాలా?"
దిక్కుమార్చి సూర్యుడు ఉదయించవచ్చునేమోగాని ఈ మనిషి ధోరణి మార్చడం ఆ దేవుడితరం కూడా కాదనుకుంది పద్మ. అంచేత జరగబోయే తతంగమేదో చూస్తుండటమే తన కర్తవ్యమని కూడా అనుకుంది.
సత్యం ఇండస్ట్రీస్ గేటువేపు కృష్ణమూర్తి కన్నార్పకుండా చూస్తున్నాడు.
* * *
సత్యం ఇండస్ట్రీస్ ప్రొప్రయిటరు గది.
సత్యం ఫోన్ కాల్స్ తో గొప్ప హడావిడిగా ఉన్నాడు. అన్నీ వ్యాపారానికి సంబంధించిన ఫోన్లే. వాళ్ళందరికీ చాలా ఓపిగ్గా సమాధానాలు చెబుతూ... ఏ కొంచెం విరామం దొరికినా తన ముందు కూచున్న స్టెనోకి డిక్టేషన్ యిస్తున్నాడు.
అతని పరిస్థితి దాదాపు అష్టావధాన చేస్తున్నట్లుంది. వాచీ చూసుకున్నాడు. ఆరయ్యింది. అయిదున్నరకే రమ్మన్నాడు చలపతి. ఆ రోజు రవీంద్రభారతిలో చలపతి కూతురు నాట్యప్రదర్శన యిస్తోంది.
నాట్యం సంబంధించినంతవరకు ఆ పిల్లకి అంతో ఇంతో పేరుంది. పలుచోట్ల ప్రదర్శనలు యిచ్చింది. నాట్యమయూరి అని, నాట్యరాణి అనీ ఆ బాపతు బిరుదులు కూడా పొందింది.
గోపాలంతో వియ్యమొందే చాన్సు పోయినప్పట్నుంచీ సత్యం దిగులుగానే ఉన్నాడు. తన భార్యకిచ్చిన మాట ప్రకారము కృష్ణమూర్తి పెళ్ళి సవ్యంగా జరుగుతుందో లేదోనని వర్రీ అవుతూనే ఉన్నాడు.
సరిగ్గా అలాంటి పరిస్థితిలో చలపతి దగ్గరనించి ఫోను వచ్చింది. తన కూతురి నాట్య ప్రదర్శన ప్రోగ్రాం గురించి చెప్పేడు. మాటల్లో పిల్లకు పెళ్ళిచెయ్యాలని ఉందంటూ చెప్పినపుడు సత్యం గుండెల్లో కొత్త ఆశ మొలకెత్తింది. మీ అబ్బాయికి చేసుకుంటే సంతోషిస్తానన్నప్పుడు ఫోనులోనే ఓ.కె. చెప్పేదామనుకున్నాడు.
ఎందుకయినా మంచిదని-అమ్మాయిని చూస్తానన్నాడు.
పిల్లను చూడాలనుకుంటే ఆమె ప్రోగ్రాంకి రావలసిందిగా మరీ మరీ కోరేడు చలపతి, సరిగ్గా ఆరింటికి ప్రోగ్రాం కనుక అరగంట ముందే వస్తే సంతోషిస్తానన్నాడు. వస్తున్నానని చెప్పేడు సత్యం.
అల్లాంటిది ఆరు ఆఫీసులోనే అయిపోయింది. ఇంకా ఆలశ్యం చేయడం బావుండదనుకున్నాడు.
లేచి నిలబడ్డాడు.
నిలబడి కూచుంటాడో, వెళ్ళిపోతాడో తెలీని స్టెనో-తాను లేచి నించోవాలో స్థిమితంగా కూచోవాలో తెలీక అవస్థ పడుతుంటే, సత్యమే అన్నాడు-
"అర్జంటు పనుంది! ఆ ఫైలివ్వు. దార్లో చదువుకుంటాను. రేపు మిగతా డిక్టేషనిస్తాను. యూకెన్ గో!"
అని స్టెనో దగ్గర్నించి ఫైలు తీసుకుని గదిలోంచి బయటకు నడిచేడు.
అకస్మాత్తుగా బయటకొచ్చి "డ్రైవర్" అని పిలవగానే తాపీగా కూచున్న డ్రైవర్ కూడా ఖంగారు పడ్డాడు.
మామూలుగా-
అయ్యగారు బయల్దేరేందుకు అయిదు పది నిమిషాలముందే బంట్రోతు వస్తాడు. ఆ కబురుచెప్తాడు---అయ్యగారు వచ్చేలోగా డ్రైవరు కారు తీయడం సిద్ధం చేయడం జరుగుతుంది.
అల్లాంటిది---
ఏ కబురూ కాకరకాయ లేకుండానే సాక్షాత్తూ అయ్యగారే వచ్చి "డ్రైవర్" అని పిలిచినప్పుడు డ్రైవరు కంగారుపడక చస్తాడా?
ఆ కంగార్లోనే కారుని బయటకు తీసేడు. గబగబా వెనకవేపు వచ్చి తలుపుతీసి నించున్నాడు...
సత్యం కారులో కూచుంటూ---
"రవీంద్రభారతి" అన్నాడు.
-సత్యంగారి కారు గేటులోంచి బయటకు రాగానే, రోడ్డుమీద నిలబడ్డ కృష్ణమూర్తి స్కూటరు స్టార్టు చేసేడు. యాంత్రికంగానే పద్మ స్కూటరెక్కి కూచుంది. స్కూటరుకూడా కదిలింది.
ముందు సత్యంగారికారు పోతూవుంటే-వెనక కృష్ణమూర్తి స్కూటర్తో వెంబడిస్తున్నాడు.
తండ్రి తమని చూడాలనే ఉద్దేశంతో ఆ కారుని చాలా ధైర్యంగా వెంబడిస్తున్నాడు కృష్ణమూర్తి.
కారుకి కుడిపక్కగా స్కూటర్ని పోనిస్తూ హారన్ మోగించేడు.
సత్యం పట్టించుకోలేదు. చాలా తీక్షణంగా ఫైలు చూస్తున్నాడు.
పట్టువదలని విక్రమార్కుడిలాగా కృష్ణమూర్తి హారన్ యిస్తూనే వున్నాడు. ఈలోగా ఎదురుగా లారీ వచ్చేస్తోంది భయంకరంగా.
ఇంకా ఆ విధంగానే కారు పక్కనే స్కూటర్ని నడిపిస్తే లారీకి గుద్దుకుని పచ్చడయ్యేందుకు అవకాశాలు చాలా వున్నాయి.
తండ్రికి తన వైభవం చూపిస్తే తప్పుకోవచ్చు. కానీ-ఆ ముదనష్టపు ఫైల్లోంచి ఆయన చూపే మరల్చడంలేదు.
ఉన్నకొద్దీ లారీ ప్రమాదం దగ్గిరవుతోంది. ఆ వరస చూస్తున్న పద్మకి భయంవేసింది.
"లారీ" అన్నది కంగారుగా.
"తెలుసు" అన్నాడు కృష్ణమూర్తి తాపీగా!
ఆ తర్వాత స్కూటరు వేగాన్ని తగ్గించేడు. కారు ముందుకి వెళ్ళిపోయింది. ;లారీవల్ల ప్రమాదం వెంట్రుకవాసిలో తప్పింది.
మళ్ళీ స్కూటరు వేగం పెంచేడు కృష్ణమూర్తి. ఇప్పుడు కారుని ఎడంపక్కగా వచ్చి "హారన్" యిస్తున్నాడు-అప్పటికయినా తండ్రి తమని చూస్తాడనే ఆశతో!
కారు స్కూటరూ ఒకదాన్ని మరొకటి అంటుకుని పరుగెత్తడం జనానికి ఆశ్చర్యంగా వుండటంతో-జనమంతా ఆ విడ్డూరం చూస్తున్నారేగాని కారులో తండ్రిగారు వీసమెత్తు చలించలేదు.
ఆ దిక్కుమాలిన ఫైలు జిడ్డులాగా పట్టుకుంది. అందులో ఏముందోగాని దాన్నుంచి తండ్రిగారు చూపు మరల్చడం లేదు.
రోడ్డు నిబంధనలంటూ కొన్ని రూల్సు అఘోరించేయి. ముందురున్న వాహనాన్ని దాటాలంటే దాని కుడివేపునుంచి ఆ ప్రయత్నం చేయాలి. అది రూలు. ఆ రూలుకి వ్యతిరేకంగా కృష్ణమూర్తి స్కూటరు కారుకి ఎడంవేపు నడుస్తోంది. రాంగ్ సైడ్ నేరం. పోనీ ఆ సైడులోనే కారుని దాటేసి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడా అంటే అల్లాంటి సూచనలేమీ కనిపించడము లేదు.
అతనెందుకింత భీభత్సం చేస్తున్నాడో అర్ధంకాని పద్మ విసుక్కుంటూ అన్నది---
"నువ్వే వెళ్ళేది రాంగ్ సైడ్!"
"రాంగో రైటో-నువ్వు మాటాడకు" అన్నాడతను చిరాగ్గా.
ఈలోగా కారు స్పీడు పెరిగింది. తూనీగలాగా జారిపోతోంది.
తానుకూడా స్కూటరు వేగం పెంచాలనుకున్నాడు గానీ రోడ్డు పరిస్థితి అందుకు అనుకూలించలేదు.
