"ఏం పిదపకాలం వచ్చిందిరా? అలా రాసిందా? వుండు నేవెళ్ళి దాన్నీ దాని నాయన్ని నాలుగు దులిపేస్తాను. వాడలా చేశాడా? మేమలా చేశామా? తల్లికి చెల్లికి లేని పట్టింపులు కూతురు దగ్గరకి వచ్చేసరికి కొత్తగా పుట్టుకొచ్చాయా? వాడికి పెళ్ళాం బుద్ధులు వచ్చాయి. అది ఆడించినట్లల్లా ఆడుతున్నాడు."
"అమ్మా! ఆ విషయం వదిలెయ్!"
"ఎందుకు వదులుతానా. అయినవాళ్ళయితే మాత్రం అంతగా నెత్తికెక్కించు కుంటాననుకున్నావా! మీ అత్తసంగతి నీకు తెలీదు. మగడిని గుప్పెట్లో పెట్టుకుని ఆడించింది. అత్తనూ, ఆడబిడ్డనూ తిరిగి చూడకుండా చేసింది. తన నగలు, తన చీరలు తన సుఖమే చూసుకుంది".
"ఇన్నీ తెలిసినదానివి ఎలా గోతిలో పడ్డావమ్మా!"
"అంతా నా ఖర్మరా!, మారకపోతుందా అని ఆశ పడ్డాను. జానకికి నిన్ను అడగటానికి వచ్చినప్పుడే అన్నీ అడిగెయ్యాలనిపించింది .కానీ పిలిచి పిల్లనిద్దామని వచ్చిన వాడిని ఏమీ అనవద్దన్నారు మీ నాన్న...
"నువ్వూ మెత్తబడిపోయావు"_
"అదీగాక చేతులుపట్టుకుని ప్రాధేయపడ్డాడు. అమ్మాయిని చదివించాను. ఆమె చదువుకి తగ్గ అబ్బాయిని తేవాలంటే వేలకి వేలుపోయాలి. నా శక్తి తెలియదా! అని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. ఆ రోజులన్నీ పోయాయి అనుకుంటున్నారు" అంది ఆవేశంగా.
ఆమె మాటలకి సమాధానం యివ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు దాశరధి.
వెళ్ళి తండ్రి వద్ద కూచుని విషయమంతా చెప్పాడు.
కొడుకు ప్రయోజకుడై తనింత తిని నలుగురికి పెట్టగలిగినందుకు ఆయన చాలా సంతోషించాడు.
"మంచిది దాశరధీ! అన్ని దానాలలోకి విద్యాదానం చాలా శ్రేష్ఠమైంది. అది చేస్తున్నావు. అందులోనే స్వార్ధంవున్నా సేవకూడా వుంది. మంచి విద్యాలయం అని పేరు వచ్చేట్లు కృషి చెయ్. నువ్వు కష్టపడితే, నీ ఎసిస్టెంట్సు కూడా కష్టపడతారు" అన్నాడు.
దాశరధి తలూపాడు. శాస్త్రిగారు రామాయణం అందుకున్నారు. పడుకోటానికి వెళ్ళిపోయాడు దాశరధి.
రేపు ప్రారంభించాల్సిన అరణ్యకాండ చదవటంలో మునిగిపోయారాయన. అన్ని పనులు ముగించుకుని వచ్చిన పార్వతి సీతారాం విషయం చెప్పింది. వేయిరూపాయలు ఇచ్చి వెళ్ళాడని అంది. ఆయన మౌనం వహించారు.
ఆయన ముభావం చూసి ఆమె మరేం మాట్లాడలేదు.
"పట్టాభి రాలేదు కదూ?" శాస్త్రిగారే పలకరించారు పదినిమిషాలు గడిచాక.
"ఊహుఁ రేపు ఎక్కడో క్రికెట్ మాచ్ వుందట. రాత్రికే వెళ్ళతానని చెప్పాడు."
"ఫరవాలేదు తండ్రి గుర్తులేకపోయినా తల్లయినా గుర్తుంది"
పార్వతి సమాధానం యివ్వలేదు.
"కోడలు రానందట కదా!"
... ... ... ...
"ఆరోజే చెబితే విన్లేదు. యిప్పుడు చూడు వాడి జీవితం ఎలా అయిపోయిందో?"
"నేను ఒకరకంగా బాధపడ్డాను. వారు మరోరకంగా బాధపడుతున్నాడు"
భర్త ముఖంలోకి చూసింది పార్వతి. ఆమెకి అయన మాటలు శూలాల్లగా గుచ్చుకున్నాయి.
"పిల్లల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా వున్నా వాళ్ళ అదృష్టం కొద్ది జరుగుతుంది. మనం ఆలోచించి ఆవేశపడటమేకాని అందువల్ల లాభం ఏముంది? బాధ తప్ప"
ఆమాటకీ పార్వతి సమాధానం యివ్వలేదు.
శాస్త్రిగారు రెట్టించలేదు. తిరిగి రామాయణ పఠనంలో మునిగిపోయారు. మరికొద్దిసేపటికి పార్వతి నిద్రపోయింది. బాగా పొద్దు పోయేదాకా చదివి కళ్ళు బరువెక్కేసరికి పుస్తకం మూసి, పక్కన పెట్టి నిద్రపోయారు.
ఉదయం లేచి అనుష్ఠానం ముగించుకుని బయటికి వచ్చారు. రోజులాగానే ఆయన దేవుడిగది నుంచి బయటికి రాగానే కనిపించింది స్వాతి. ఆమె చేతిలో కొత్తపుస్తకం పెన్ వున్నాయి.
"రామ్మా"__
చిత్రాసనంముందు రాయటానికి సిద్ధంగా కూర్చుంది స్వాతి.
కళ్లు మూసుకొని భగవధ్యానం చేసి ప్రారంభించారు.
దాదాపు రెండు గంటలసేపు నిరాఘాటంగా రచన సాగింది.
కలం పక్కన పెట్టి లేచింది స్వాతి.
సరిగ్గా ఆసమయంలో రెండు రిక్షాలు వచ్చి ఆగాయి యింటిముందు.
దాశరధి రిక్షాదిగి "అమ్మా! అమ్మా" అంటూ వచ్చాడు.
వసారా దాటగానే తండ్రి కనిపించటంతో "నాన్నా! రిక్షాలు వచ్చాయి. వెళదాం పదండి. మరోగంటకల్లా కలెక్టరుగారు వస్తారు. సరిగా పది గంటల పదినిమిషాలకి ముహూర్తం"
మరోమాటకి తావివ్వకుండా తయారైపోయారాయన. పార్వతి కూడా తయారైంది .శ్రీవిద్య తనూ బయల్దేరింది. మరో పదినిమిషాలకి రిక్షాలు కదిలాయి.
అదంతా గమనించిన జ్యోతి 'చూశారా'! అంది, ఆమె అప్పుడే లేచివచ్చింది. కాఫీ తాగుతూ వుండగా స్వాతి విషయం చెప్పింది. జ్యోతి వెళ్ళి జానకిరాంని పిలిచి లేవగొట్టింది.
భార్య వెంట నిద్రలేచి వచ్చిన జానకి రాం రిక్షాలో ఎక్కి వెళుతున్న తల్లిదండ్రుల్ని, అన్ననీ చెల్లినీ చూచి
"ఎక్కడికి ఉదయమే పేరంటం వెళ్ళినట్లు వెళుతున్నారు__" అని అడిగాడు. అతనికింకా నిద్రబద్ధకం వదల్లేదు.
"మీ అన్నగారు బడి పెడుతున్నారటగా. కలెక్టరు గారు వస్తున్నారట ప్రారంభోత్సవానికి. వెళ్ళి ఆయన్ని కలవమని నిన్న అడిగితే ఊఁహు అన్నారు. ఈ రోజు పెద్దకొడుకు అడిగేసరికి గోచి సవరించుకొని వెళ్ళారు." నిష్ఠూరంగా అంది జ్యోతి.
జానకిరాం సమాధానం యివ్వలేదు. ఆలోచనలో పడిపోయాడు.
"ఛీ! ఈ యింట్లో ఉండటం కూడా బుద్ధి తక్కువే. వెళ్ళిపోదాం పదండి. ఏం మనం బ్రతకలేమా? మన తిండి మనం సంపాదించుకుంటున్నాం. నెలనెలా జీతం తెచ్చి దోసెట్లో పోస్తుంటే హోటల్లో పెట్టినట్లే తిండి పెడుతున్నారు__
