Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 16

 

    ఆడు లోనకొచ్చినట్టయినాది.
    మొకం తుడిసేసుకుని , పువ్వులిసిరేసి , సీర మారుసుకుని ఎలపలి కొచ్చినాది.
    అప్పటికప్పుడే ఆడు యిల్లంతా కలీ సూత్తన్నాడు.
    దానికేం సెయ్యాలో తోసలేదు. గళాసు లోకి సల్లటి నీల్లిచ్చి యీదులో కొచ్చినాది. అడూ ఎనకాతలే వొచ్చాడు.
    దాని ఏసం మారిపోడం ఆడికి నచ్చలేదు.
    "ఎందుకు పంపించాడో?"
    "గొలుసు కోసం."
    "ఏం గొలుసు?"
    "నీ మెల్లో ఉన్న సేంద్రారం కోసరం!"
    "ఎందుకో? సెంద్రకాంతాని కియడానీకా?"
    ఆ పేనాలు పైకి పోయాయి. అదిచ్చిన గళాసు కిందేట్టేశాడు . కాంతం యిసయం దీని కెల్లా తెలిసిందో? ఎవరు సేప్పెరో? పల్లిటూరు ఆడదంటే ఏంటో అనుకున్నాడు కాని యిలాంటోళ్ళు కూడా వుంటారని కల్లో కూడా అనుకోలేదు.
    "ఆ డేసాలన్నీ నాకు తెలుత్తానే ఉన్నాయి. యాపారవంటా పట్నవెల్లి, అంటి గగెల్లు అమ్మిన డబ్బంతా ఆ బోగవోళ్ళ కెట్టేసి, యిప్పుడు ఏ మొగవెట్టుకు నిన్ను పంపించాడూ? పవురుసం లేదో? మొగోడు కాడో? ఆడూ నువ్వూ కలిసి నా దగ్గర దొంగేసాలేద్దరనుకున్నారా? సేంద్రారం కాదు, సీపురు పుల్ల కూడా యియ్యనన్నానని సెప్పు! తెలిసిందా?"
    దాంతో ఆడు సిత్తయిపోయాడు. ఇలాంటి ఆడదాన్ని వొంచడం సానా కట్టవే! మంచికి రోజులుంటాయా మరి? ఆడి బుర్ర పాదరసమేదో సటుక్కుని కళ్ళు మెరిసినాయి.
    "సేప్పీదంతా యిను రావులమ్మా! అదిప్పుడు నీ మాటలు యినేట్టు లేడు!"
    "అవును! ఎందుకింటాడో?"
    "నిన్న సందెల కారు కింద పడ్డాడు. రగతం కక్కుకున్నాడు. మోసేయ్య ఎవుకిలిరిగిపోయాయి. బతికి బట్ట కడతారని కల్లో కూడా అనుకోలేదు. అంతా నీ అదురుట్టం!"
    అ మాటలు యింటూనే అది రాయయిపోయినాది. సెవులు గల్లాడి పోయినాయి. సూపూ నిలిసి పోయింది. గుండి అగేపోయింది!
    కారు కింద పడ్డాడా?
    ఎవుకి లిరిగాయా?
    రగతం కక్కుకున్నాడా ?--
    ఆడు? తనవోడు?
    గుండిలి మీద బండరాయి పడినట్టయినాది.
    మెళ్ళో తాళి తడుంకున్నాది!
    "ఏడి ? ఎక్కడున్నాడు? ఎల్లాగున్నాడు?"
    ఆడు తాపీగానే అన్నాడు. "ఆ సపటాల్లో ఈయేల కొంచెం నయం లే! రేపు వొటేలు కి వచ్చేత్తాడు. పెనానికి బయం లేదు! రగతవెక్కించి, ఎవుకిలు అతగాడానికి రొండొందలవుతాయట. అందుకే నిన్ను గొలుసు అడిగి తెమ్మన్నాడు. తరువాత నీ యిట్టవు!"
    తన మొగుడు సావు బతుకుల నడాన్ని కొట్టుగుంటా ఉన్నప్పుడు, తనకి ఉపకారం సేద్దారని ఆడొత్తే , ఉత్తి పున్నేనికి కోప్పడినందుకు తన్ని తానె తిట్టుకున్నాది.
    ఎల్లాగున్నాడో?
    ఏవయి పోతాడో?
    తన పసుపూ, కుంకం ఏవయిపోతాదో?
    దాని కళ్ళు జలజలా తడిసినాయి!
    తనబుద్ది కాలిపోబట్టే ఆడి కంత పేనాద వచ్చినాది. ఆడికి అన్నాయం సేయ్యదల్సుకున్నందుకు దేవుడు తనకే తిప్పి కొట్టాడు!
    తంది పాపిట్టి బతుకు! అణ్ణి దేవుడు సల్లగా కాయాలి. తనకి దూరవయిపోయినోడు మల్లా తనవోడుకావాలి. మంచి మాటలు సెప్పి మనసు మల్లించాలి!
    సెరబయ్య ఎంత దయిర్నేం సెప్పినా దాని గుండి కుదురు పడలేదు. ఎంటనే పట్నవెల్లి ఆణ్ణి సూసుకోవాలి. ఎయ్యి దేవుళ్ళకి మొక్కి పేనాలు దక్కించుకొనాల!
    అంత దూరం నుంచే రావులమ్మని అసగా సూసిన రవణయ్య తన కళ్ళని తనే నమ్మలేక పోయాడు. దాని సీర సూత్తేనే అడి మనసులన్నీ సప్పగా సల్లారినాయి. గుమ్మం కాడ నిలుసుని ఏం సెత్తన్నాదో? దాపు కొత్తన్న కొద్దీ యింకో మొగోడు కనిపించాడు.
    దాని మొగుడేవో?
    కానీ, సానోళ్ళని మరిగినోడు, యీ యాల్టప్పుడు యింటి కెందుకొత్తాడు? అందులోకీ ఎన్నిల రోజుల్లో!
    అల్లంత దూరాన్నే రవణయ్య ని సూసి సరసరా లగేత్తుకోచ్చింది రావులమ్మ. ఆడి వోలకం సూత్తే సేరబయ్యకి కళ్ళు కుట్టినాయి.
    దాని కళ్ళు వోసి ఉన్నాయి. మొగం అదురుతా ఉన్నాది.
    "ఏంటే రావీ? ఏవయిందే?"
    "మావా!" అంటా ఆడ్ని సూత్తా తెగ   ఎడిసినాది.
    "ఏం జరిగిందో సేప్పవెం?"
    "ఆడు కారుకింద పడ్డాడంట మావా! సెయ్యిరిగింది. అసపటాల్లో ఉన్నాడు!"
    "మాబాగా అయింది! ఎదవేసాలెత్తే కారు కింద పడ్డ? పట్న వెల్లాక ఆస ఆడికి కళ్ళు కనిపిత్తాన్నాయా అంట?"
    "అది కాదు మావా! ఇప్పుడు పెనం మీది కొచ్చింది . రగతం పోయిందంట!"
    "కొత్త రగత వెక్కించినా ఆడి గొనం సత్తే మారదు!"
    "దేవు డాడ్ని బతికిత్తాడా మావా? నా పసుపు కుంకం నిలబెడతాడా? మల్లీ నన్ను సూత్తాడా? సేప్పవా మావా, సెప్పవూ?"
    రవణయ్య గుండి నీరయినాది.
    "పరాలేదే! అడికేం పెవాదం లేదు. పట్నవులో గొప్ప గొప్ప డాకటర్లున్నారు. తలుసుకుంటే ఆళ్లు పెనాలూ కూడా పోయగల్రు! నీకేం బయం లేదు. నేనున్నాగా!"
    బోరువని ఏడిసిందది.
    గొలుసు మాట సెప్పాడు సెరబయ్య . ఆళ్లు రాపోయినా పరాలేదన్నాడు. రవణయ్య యినిపించుకోలేదు. మొన్నాడు కోడి కూతేలకి బయిలేల్లె నావలో రావులమ్మని తీసుకుని పట్నావెల్లడానికి , అక్కన్నించి తను అత్తో రింటి కెల్లి పెళ్ళాన్ని సూసి రాడానికీ అన్నీ తయారు సేసుకున్నాడు.

                     

                                 11
    నిదర్నించి లెగిసి గోదాల్లో తాణవు సేత్తావుంటే సీతమ్మ కనిపించినాది.
    "మా సొగసుగా వున్నాది!' అనుకున్నాడు ఎంకన్న.
    అలాంటిది దొరకడం బద్రయ్య సేసుకొన్న పున్నెం కాదో? ఇన్నేల్లయి తీసుకొచ్చాడు గందా , యింకా పెల్లెందుకు సేసుకోలేదో? ఆణ్ణి అంత సీదరించుకుంటాదేం? ఆడే నచ్చలేదో?
    'ఆడోళ్ళ మనసులు సిక్కుదారాల్లాంటియేవో!"
    రేవులోకొచ్చి కడవతో నీళ్లు ముంచుగుంటా వొంగుంటే, ఆడికి సూడ ముచ్చటేసినాది.
    సెయిత్ర మాసంలో కన్నిడిసిన గడ్డి పువ్వులాగున్నాది!
    మోకాలి బంటిలో నీళ్లు ముంచుకుని ఎల్లిపోతా ఎంకన్న ని సూసిందది. సూసి నిలుసున్నది నిలుసోనూలేదు. ఎల్లిపోతానే వున్నా. పోతా పోతా ఏవన్నాదంటే -- "తాత రమ్మంటున్నాడు నిన్ను!" అని.
    తనతో అన్నాదని ఆడికి తెలుసు. కట్టుకున్న సీర కాళ్ళని కరిసిపట్టుకున్నా కిందికి సూడకుండానే ఎల్లి పోయిందది.
    ఒళ్ళు తుడుసుకుని సెరసేరా నడి సెల్లాడు ఎంకన్న. పాకలో అడుగెట్టాడు. సీతమ్మ పొయ్యి రాజేత్తావున్నది. ఎదర తాత కనిపించలేదు. ఇంకూత సేపు దాని గుడిసె లో వుండడానికి ఆడికి దయిర్నేవే సిక్కింది కాదు. బద్రయ్యనే లెక్క సేయ్యనిది తన్ని యింకా ఏం తిడతాడో? అనుకుంటా ఎలపలికొచ్చే బోయాడు. అప్పుడు తాత ఎనక్కి పిలిశాడు . కర్ర టకటకలాడించుగుంటా వొచ్చాడు . ఎంకన్న ఆగాడు.
    "పేరెంటీ?"
    "ఎంకన్న"
    "ఏవూరు?"
    "ఆలమూరు."
    "ఎందు కొచ్చావిక్కడికి?"
    "నువ్వే రమ్మన్నావటగా!"
    "అది కాదు ఈవూరెందు కొచ్చావని అడుగుతన్నాను."
    "యాపారం కోసం."
    "బద్రయ్య నీ సుట్టవా?"
    "స్నేవితుడు."
    "యాపారం యీడితోనే సేత్తావా?"
    "అవును."
    ఓ సిటిక సేపు ఆగాడు ముసలయ్య.
    "నీకు బాగు పడాలని లేదా ఎంకన్నా?'
    "ఏం?"
    బరువుగా అడుగులేసుగుంటా ఎంకన్న ముందల కొచ్చాడు ముసలయ్య. మొకం ఎదరికి సాసి కళ్ళతో గుచ్చిగుచ్చి సూశాడు.
    "ఎంకన్నా! నువు బాగుపడాలంటే ముందు యిక్కడినించి ఎల్లిపో! ఆడు పచ్చి తాగుబోతు, పొగరుబోతు, బందిపోటు, దొంగోడు, కూనీకోరు! నీ డబ్బు నీకు దక్కాలంటే నీ యాపారం సాగాలంటే, నువు పెనాల్తో బయట పడాలంటే -- నీ మేలుకే సెబుతున్నా! పో, యిక్కడి నించి ఎల్లిపో! ఎంటనే ఎల్లిపో!"
    ముసలయ్య మాటలు యిడ్డూర మనిపించినాయి. అసలు ఈడ్ని తను యింతకీ ముందెప్పుడూ సూడనన్నా లేదు. సీతమ్మకి యీడికీ సుట్టరికవేంటో?
    అడల్లా మాటాడ్డం లో కిటుకేంటో? నిజవు సెప్పాలంటే యీడన్నంత సేడ్దోడు కాదు బద్రయ్య. ఇన్నాల్లనించి వోత్తా పోతా వున్నవోడు గందా, బద్రయ్య మంచి చెడ్డలు తనకి తెలవ్వో? స్నేవితం కోసం పెనాలిత్తాడు. ఉపాయం సెప్పాడంటే తిరుగు లేదు.
    ఆడ్నే వొదులు కుంటే తన లాబాలు గూబాల్లోకి రావో? ముసలోడి మాటింటే నట్టేట్టే ములిగి పోడో? సూపుల్లో ఎంత మంచితన మోతుగా కనిపించినా మాటల్లో ఎంత మంచితనవున్నాదనీ ! ఆడి బాధలు ఆడు మరిసిపోయి, కుసింత సేపు ఏ అలోసనా లేకుండా వుండిపోవాలని ఆడు సారా తాగితే తనకేం నట్టవంట? ఆ మాట కొత్తే యిప్పుడు తను మట్టుక్కు తాగడో? అన్నాయంగా బీదోళ్ళని దోసుకొని డబ్బు కూడేసుకునీ వొళ్ళని, దారికాసి సొమ్ము లాక్కుంటే అది బందిపోటుతన వెల్లాగవుతాది? సుకంగా తిని పడుండక , ఎదుటోళ్ళ రగతం పీలిసీ , వొళ్ళు బలిసీ జలగాల్లాంటోళ్ళనికూనీ సేత్తే మాత్రం తప్పేవున్నాదీ? మిగిలినోళ్ళకి వుపకారం సేసినట్టు కాదో? నాయంగా పోయీవోడికి పచ్చి మంచి నీళ్ళు ముట్టవు గదా, పెపంచకములో నాలుక్కాలాల పాటు బతికి, పెళ్ళాం బిడ్డలకి కూడెట్ట వొలిసినోళ్ళు ఏదో ఓ దారట్టా పొతే బతకడ వెల్లా గంట? తెలివి మీరిన మనుసుల్నిమంచి తనంతో ఒప్పించక పొతే కర్రెత్తి కాళ్ళిరాగ్గోట్టడం తప్పడు పనా? బూమ్మీద బతికీ వొళ్ళందరికీ సుకపడ్డానికి యీలు వుండాలని ఒప్పుకున్నవొళ్ళూ , నలుగురు గూడు పుటానీ సేసి మిగిలినోళ్ళ పొట్ట మీద కొట్టడం మట్టుకు తప్పుకాదా? ఈళ్ళు మాత్రం మనుసులు కారో? తెలివి లేదో? ఒకడికీ, మరోడికీ  నడాన తేడాలు పుట్టించి ఈళ్ళల్లో యీళ్ళకి దెబ్బలాట లెందు కేట్టాలి! తన సొంత లాబం లాటిదే ఎదటోళ్ళదీ , అని తెలుసుకొని, ఓ మనిసి మరో మనిసిని నోరారా 'తమ్ముడా!' అంటా ఎందుకు పిలవలేడూ? కట్టవూ, సుకవూ కూడా ఆళ్ళలో ఆళ్ళు అందరూ పంచుకొని ఒకరికోరు సాయం సేసుకొని అందరూ బాగుపడే దారి నెందుకు సూడ్రో?
    మోసాన్ని మోసవు తోనే లొంగదియ్యాల!
    పెపంచకపు గుట్టు మట్లన్నీ కడకంటా తెలుసుకున్నవోడు బద్రయ్య , ఆడు సేసే పనుల్లో తప్పులు దోల్లడానికీల్లేదు!
    పాతకాలపుటాలో సన్లూ, ఎర్రి ఏదంతాలూ పెట్టుకుని ఆళ్ళ బాగోగుల్ని ఆళ్ళే నీల్లకొదిలేసి, ఎందుకూ పనికిరాని సచ్చు దద్దమ్మల్లా తయ్యారయి , గద్దేక్కిన గడుసోడి కల్లా సలాములు సేత్తా, కుక్కలి కంట కూడా కనాకట్తపు బతుకు బతుకుతున్నారు. స్సీ! ఎదవ మనుసులు!
    ఎంకన్న బుర్రలో యిన్ని రకాల ఆలోసనలు దోల్లుతావుంటే ముసలయ్య ఆడి కళ్లల్లోకి సూత్తానె వుండి పసిగడతన్నాడు. ఇదంతా బద్రయ్య తరిపీదని తెలుసు.
       సీతమ్మ పొయ్యి సరడం మానేసి, యిసిని కర్ర సేత్తో పట్టుకుని అలాగే కూసుండి పోయినాది.
    తువ్వాలు గుడ్డ గుండిలు పైకి సరుదుకుని ఎంకన్న ఎలపలి కొచ్చాడు. బద్రయ్య సావాసంతో అడిలో సురుకు పాలెక్కువయినాది!
    "ఎంకన్నా!" గట్టిగా అరిశాడు ముసలయ్య.
    ఇనిపించుకోకుండానే నడిసోచ్చేశాడు.
    "ఈ ఎర్రోళ్ళని వోప్పించడం నాతరం కాదు తల్లీ! ఆ బగవంతుడే కాపాడాలి!" ఉసూరు మనిపించింది ముసలయ్య కి.
    ఆడి మొకం వొడిలిపోయినాది. కాళ్ళు ఏదో బయంతో వోనికిపోయాయి. సేతులు దడదడల్లాడాయి.
    దగ్గిరి కొచ్చి తాతని బల్ల మీద కూకోబెట్టింది సీతమ్మ.
    ఒటేలు షెడ్డు లో పక్క గదిలో కెళ్లి బట్టలు మారుసుకున్నాడు ఎంకన్న. ఇంతట్లోకే లాగేత్తు గుంటా సెరబయ్య వొచ్చాడు.
    రావులమ్మ, రవణయ్య , సెరబయ్య ముగ్గురూ వూళ్ళో కొచ్చే తలికి సలిది కూడెళయినాది. ఏదో ఎనర్జెంటు పనుందని సెరబయ్య ఏరే దార్ని ఎల్లి పోయాడు. రావులమ్మా, రవణయ్య గోదారి సీతాలచ్చ్వి వోటేల్లోకి వొచ్చారు. పక్క గదిలో కెల్లారు. అంటక ముందే ఆ గది లోంచి ఏయో నవ్వులినిపిస్తన్నయ్యల్లా సటుక్కుని పారిపోయాయి.
    తన వోడ్ని గుమ్మం కాడే సూసిన రావులమ్మ ఒక్కరుకురికి ఆడి మంచం మీద వొలి పోయినాది. గుండిలి మీద బడి బోరుని ఎడుత్తన్నాది, తన్ని తను తిట్టుకున్నాది. ఆణ్ణి తను సరిగా సూసుకోకపోడం వొల్లె యింత పెవాద వొచ్చిందనుకుంది. తన తప్పులు మన్నించి దేవుడు యీణ్ణి -- తన వోణ్ణి రచ్చించడూ?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS