Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 16

 

    'కూల్ డ్రింక్స్ తీసుకుందాం రండి .' అంటూ ఓ ఐస్ పార్లర్ లోకి దారి తీశాడు మాధవ్ -- ఒకరు ఆరెంజి -- ఒకరు ద్రాక్ష , మరొకరు మజ్జిగ ఎవరికి కావలసినవి వాళ్ళు అర్దరిచ్చారు.
    ఆఖర్ని బాయ్ బిల్లు తెచ్చి టేబిలు మీద పెట్టగానే గబుక్కున తీసుకుని పిడికిటి లో పెట్టుకుంది సురేఖ.
    'అదేం పని -- మీరు నా గెస్టు .' మాధవ్ బిల్లు కోసం చెయ్యి జాపుతూ అన్నాడు.
    'తక్కువే కదండీ.' పర్సు తెరుస్తూ ఉంది సురేఖ.
    'తక్కువైనా, ఎక్కువైనా మీరివ్వటానికి వీల్లేదు -- మళ్ళీ మనం హైదరాబాదు వెళ్ళి అక్కయ్యా వాళ్ళూ వూరికి వెళ్ళిపోయేదాకా ఖర్చంతా నా చేతి మీదుగా జరగాల్సిందే -- మీ పర్సు లో డబ్బు ఎక్కువుంటే ఇంకా మయినా కొనుక్కోండి.' నవ్వతూనే అన్నా ఆ కంఠం లో వున్న పట్టుదలని ఎదిరించే సాహసం లేక సురేఖ మాట్లాడకుండా బిల్లు అతని చేతిలో పెట్టేసింది.
    మర్నాడు ఉదయమే స్నానాలు ముగించుకుని, సామానంతా సర్దుకుని కార్లో పడేసుకుని హోటలు ఖాళీ చేసేశారు . కాఫీ టిఫిన్ ముగించుకుని.
    కనకదుర్గ గుడి నుండి తిరిగి వస్తుంటే సరోజ అంది 'మంగళ గిరి కూడా వెళ్దాం' అని.
    'ఇక్కడిలా ఆ కొండ మీదికి కారు వెళ్ళదు -- మెట్లెక్కగలరా ?' అందర్నీ ఉద్దేశించి అడిగాడు.
    'ఆ ఎక్కుతాం. ఫరవాలేదు.' ఇంచుమించు అంతా ముక్త కంఠం తో సమాధానం ఇచ్చారు.
    'అయితే నా అభ్యంతరం ఏం లేదు' అన్నాడు.

                                       
    పానకాల స్వామిని దర్శించుకుని గుంటూరు చేరేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. ఎండ పెల్చేస్తోంది. ముందు ఉబలాట పడినా మంగళ గిరి కొండ ఎక్కిదిగిన అలసట అందరి మోహాల మీద కనిపిస్తూనే వుంది. హోటల్లో నాలుగు మెతుకులు తిని కాస్సేపు ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటే కాని మరి ప్రయాణం చెయ్య లేమని పించింది.
    "అన్నట్లు మా పెద్దత్త గారి కూతురుంది. ఈ వూళ్ళో -- కాస్త చల్ల బడిందాకా అక్కడ కూర్చున్నట్లు వుంటుంది -- మనల్ని చూసి ఆవిడా సంతోషిస్తుంది .' పుణ్యము పురుషార్ధమూ కలిసి వచ్చే వుపాయం చెప్పింది శకుంతలమ్మ.
    ఆ పెద్దత్త గారి అల్లుడు కేశవరావు మాధవ్ కి కూడా తెలుసు, ఇవాళ ఆదివారం ఇంట్లోనే వుంటాడు అనుకుంటూ , శకుంతలమ్మ చెప్పిన గుర్తులని బట్టి దారి పొడుగునా పదిమందిని అడుగుతూ ఎలాగో ఇల్లు చేరారు.
    ఆ దంపతులు వీళ్ళని చూస్తూనే బోలెడు సంబరపడి పోయి ఆదరంగా ఆహ్వానించి, కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళిచ్చి ఎంతో మర్యాద చేశారు.
    'మేం హోటల్లో భోజనం చేసి వచ్చాం' అని చెప్పగానే మాత్రం '' అయితే ఎందు కొచ్చినట్టు అసలు -- ఇంక నుంచి మేమూ ఇలాగే చేస్తుంటాం -- అదీ - ఇదీ అంటూ గయ్ మంది ఆ ఇల్లాలు.
    అప్పటికి తోచిన క్షమార్పణలు చెప్పుకుని అవిడిని శాంత పరిచి, పరిహారంగా ఆవిడ పకోడీలు చేసే దాకా కూర్చుని అవి తిని కాఫీ తాగి బయలుదేరారు.
    ఆ రాత్రి నెల్లూరు లో ఆగిపోయారు. మర్నాడు ఉదయమే రంగనాధ స్వామి దర్శనం చేసుకుని అక్కడ్నించి కాళహస్తి వెళ్ళి అక్కడ అర్చనలూ అవీ చేయించి సాయం కాలం సరికి తిరుపతి చేరుకున్నారు. శాకుంతలమ్మ కీ ప్రయాణం ఎంతో నచ్చింది. ఒక్కో గుడిని దర్శించు కున్నప్పుడల్లా ఒక్కోసారి తమ్ముడిని మెచ్చు కుంటుండేది.
    'అందరూ చెప్తుంటే వినటమే కాని ఇక్కడికి రావాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు -- ఎంత మంది యాత్రికులు-- ఎలాంటి ఏర్పాట్లు ' గార్డెన్ హోటల్లో సుష్టుగా భోజనం చేసి వచ్చి కాటేజీ తాళం తీసి సోఫాలో కూలబడుతూ అన్నాడు మాధవ్.
    'కలియుగ వైకుంఠం ఇది -- ఎన్ని సేవలు ఎంత పూజ జరుగుతుందో చూశావుగా .... ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నది ఇప్పటికి నెరవేరింది .' భక్తీ పారవశ్యంతో పాటు సంతోషం సంతృప్తి కూడా నిండి వుంది శకుంతలమ్మ గొంతులో.
    'కొన్ని కొన్నిచూస్తుంటే -- మరీ వేలం వెర్రేమో అనిపిస్తుంది -- అయిదు వందలు ఇచ్చి దేవుడికి కల్యాణం చేయించే వాళ్ళూ ఇంకా పెద్ద పెద్ద పూజలు చేయించే వాళ్ళూ -- అందర్నీ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది -- రోజూ పది మందయినా వుంటారుట అలా కల్యాణం చేయించే వాళ్ళు -- అలా కల్యాణం చేయించినందువల్ల దేవుడు సంతోషిస్తాడో లేదో మనకి తెలియదు- అందువల్ల మనకేం పుణ్యం వస్తుందో అంతకన్నా తెలియదు -- ఆ అయిదు వందలు పెట్టి ఒక బీద పిల్ల పెళ్ళి జరిపిస్తే ఆ కుటుంబం ఎంత సంతోషిస్తుందో --'
    'చాల్లే -- ధోరణీ' మధ్యలోనే అడ్డుకుంది శకుంతలమ్మ విస్మయంతో తలమునక లోతూ . బ్రహ్మచారి జీవితం గడుపుతున్న' తమ్ముడింట్లో పూజలు పునస్కారాలూ జరగవని ఆవిడకి తెలుసు -- అయినా అతనికీ కాస్తో కూస్తో దైవభక్తి వెంకటరమణమూర్తి సన్నిధి లో అతని లాంటి మాటలు మాట్లాడటం ఆవిడ కెంతో బాధగా కూడా వుంది --తమ్ముడి అపచారానికి దేవుడు కినుక వహించకుండా వుండగలందులకు దేవుడికి ఐ నమస్కారం పెట్టి క్షమార్పణ కోరుకుంటూ రెండు లెంపలూ వాయించుకుంది. అక్కగారి అమాయకత్వానికి నవ్వుకున్నాడు మాధవ.
    'నవ్వెందుకోస్తుంది -- అర్ధం పర్ధం లేకుండా హాస్యంగా మాట్లాడినందుకు లింబర పడాల్సిందే '' చనువుగా మందలించింది.
    'హాస్యం కాదు, నిజమే చెప్పాను --'
    'ఆ -- చెప్పావు -- దేవుడికి పూజ చేశాం దానికి ప్రతిఫలంగా మనకేం  దక్కింది అని లెక్కలు వేసుకుంటారా ఎవరైనా -- దైవ కార్యం చేయించ గలగటమే ఓ అదృష్టం. ఆ పుణ్యం ఇదీ అని మన కంటికి కనిపించక పోయినా మన్ని వెన్నంటి వస్తూనే వుంటుంది.
    -- అయినా నువ్వేదో ఓ బీద పిల్ల పెళ్ళి చేయించేస్తే ఆ కుటుంబం బోలెడు సంబరపడి పోయి నీ అడుగులకి మడుగులోత్తుతారనుకుంటున్నా వేమో- అదంతా వట్టి భ్రమ -- ఫలానా అయన ఈ సాయం చేశాడు అని చెప్పుకొటం కూడా నామోషీగా అనుకునే వాళ్ళుంటారు-- చేసిన మేలు మరిచి పోవటం అనేది మనుష్యులకి చేతనయినంతగా జంతువులకి కూడా తెలియదు -- ' కాస్త దూకుడుగానే వచ్చాయి ఆవిడ మాటలు.
    క్షణం విస్మయంగా అక్కగారి ,మొహం లోకి చూశాడు మాధవ్ 'కృతజ్ఞత అనేది మనుష్యుల్లోనే వుంటుంది నిజమే -- అంతేకాదు -- అనాడేప్పుడో నేను సహాయం చేశాను. దాన్ని వాళ్ళు కలకాలం గుర్తుంచుకోవాలి అనుకునే బలహీనత , వుహు -- కాదు, దురాశ కూడా మనుష్యుల్లోనే వుంటుందేమో ...' అంత దూకుడు గానూ మొదలుపెట్టిన అతని గొంతు క్రమంగా మాములుగా అయిపొయింది. ఏమిటింత అవేశాపడ్డాను పడ్డాను అని సిగ్గుపడుతున్న వాడిలా అయిపోయి అది కప్పి పుచ్చుకోటానికి పెద్దగా నవ్వేసి .
    'అయినా ఆ దంపతులు జీవితాంతం నీకు కృతజ్ఞు లై వుండాలనే పేరాశ ఎందుకు? వధూవరు లై పెళ్ళి పీటల మీద కూర్చున్న సమయంలో వాళ్ళు నిండు మనస్సులోంచి పొంగి వచ్చిన సంతోషం సంతృప్తి వాళ్ళ కళ్ళల్లో ఎలా ప్రతిబింబిస్తాయో ఒక్క సారి చూడగలిగితే చాలు. ఆ అవకాశం లేకపోతె వూహించుకోగలిగితే చాలు. ఆ కళ్ళ ల్లోని మెరుపు ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్న మన మనస్సు ఆ వ్యక్తమైన తృప్తితో నిండిపోతుంది. జీవితంలో ఆ ఒక్క మంచి పనయినా చేశాం అన్న తృప్తి చాలదూ -- ఏం? అయినా వాళ్ళు మాత్రం మరిచి పోతారని మనం ఎందు కనుకోవాలి' అన్నాడు ముగ్గురమ్మాయిల కేసి చూస్తూ .
    'బాగుంది రా నీ వితండవాదన - అయినా నీకు దేవుడి లో నమ్మకం లేదని తెలిస్తే అసలు నిన్ను అడిగేదాన్ని కాదు -- ఎలాగో మీ బావే తీసుకొచ్చేవారు -- చిరాకో, పరాకో కట్టుకున్న పెళ్ళానికి తప్పదు కదా ' యాత్ర చేసిన ఫలితం కూడ తనకి తక్కదేమో నన్నట్లు మాట్లాడింది శకుంతలమ్మ-- 'దేవుడి లో నాకు నమ్మకం లేకపోవటం కాదు. భగవంతుడి అస్తిత్వంలో నాకు విశ్వాసం వుంది- మన మనస్సుకి ఏకాగ్రత కుదరటం కోసం ఆ సర్వాంతర్యామికి మనం ఒక రూపం నామం కల్పించుకుంటున్నాం అన్న దాంట్లో కూడా ఎలాంటి ఆక్షేపణ లేదు -- ఎటొచ్చి ఆ దేవుడి పేర మనం చేస్తున్న దంతా కేవలం ఆడంబరంగానూ ఆర్భాటం గానూ పరిణమిస్తోందనదే నా వాదం....'
    'ఒక విషయం మీరు మరిచి పోకూడదు '' అప్పటి దాకా ఆ అక్కాతమ్ముళ్ల వాదన వింటూ మౌనంగా కూర్చున్న ముగ్గురిలో సురేఖే ముందు మాట్లాడింది . ' అదృష్టం కలిసి వచ్చిందనో ఆపదల్లో ఆదుకున్నాడనో దేవుడికి మొక్కుబడి తీర్చుకుంటాం -- ముఖ్యంగా ఆపదల్లోనే కదా దేవుడు ఎక్కువగా గుర్తు వచ్చేది -- ఓ తల్లి ఉందనుకొండి -- తన ఒక్కగానొక్క కొడుక్కి ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఆ గండం గడిస్తే ఏదో చేస్తానని మొక్కు కుంటుంది -- దేవుడి కళ్యాణం చేయిస్తాననో నిలువు దోపిడీ ఇస్తాననో ఏదో ఆవిడ శక్తి ని బట్టే అనుకోండి -- దేవుడి మహత్యం ఏం లేదు వాడికి ఆయువు వుండి బ్రతికాడు అన్న వాదాన్ని కాస్సేపు ప్రక్కకి పెట్టేదాం-- ఇంక అలాంటి సమయంలో మీలాంటి వారు ఆ డబ్బు తో ఓ బీదపిల్ల పెళ్ళి చేయించవచ్చు. పది మంది బీద విద్యార్ధులకి చదువు చెప్పించువచ్చు అంటే అ తల్లి భరించగలదా. మీ వాదంలో సబబు వుండొచ్చు కాని తమ మొక్కు తీర్చక పొతే మళ్ళీ బిడ్డ కేమయినా ఆపద ముంచుకొస్తుందోనన్న భయంతో ఆవిడ ప్రాణాలు తల్లడిల్లి పోతాయి -- ఆ డబ్బుతో మరో మంచి కార్యం చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందనీ, చివరికి దేవుడు కూడా ఎక్కువ సంతోషిస్తాడనీ మీరు చెప్పినా ఆమెకి ధైర్యం చాలదు' తను అనుకున్నది అనుకున్న విధంగా వినియోగిస్తేనే ఆమెకి తృప్తి -- దానిని మీరు మూడ విశ్వాసం అనండి, గుడ్డి నమ్మకం అనండి....'
    'అంత గాడంగా నమ్మే దేవుడి ముందు కూడా మనం అబద్దాలాడటానికి వెరవం -- అన్యాయాలు చెయ్యటానికి భయపడం -- ఏ మంత్రి గారి దగ్గర నుంచో సిఫారసు తెచ్చుకుంటే క్యూ మధ్యలోనే జొరబడి త్వరగా దర్శనం చేసుకుని ఇవతల పడతాం -- ఏ పలుకుబడి లేనివాడు గంటల తరబడి అలా నిలబడే వుంటాడు..'
    'నిజమే మామయ్యా -- కాని అలా సిఫారసు సంపాదించి ముందుగా దర్శనం చేసుకు వెళ్ళిపోయే వాళ్ళల్లోనూ కొంతమంది కి తాము చేస్తున్నది తప్పు అనిపిస్తుంది -- కాదు అంటే నేను ఒప్పుకోను-- తప్పు అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరి మట్టుకు వారికే తమ పని తెముల్చుకు వెళ్ళిపోవాలనే తొందరే మరి -- ఏదో అవకాశం వచ్చినా వినియోగించుకోకుండా మీనం మేషం లెక్క పెడుతుంటే నువ్వు అక్కడే వుంటావు -- నువ్వొక్కడివి ముక్కుకి సూటిగా వెళ్తానంటే అంతా అలాగే వుండరు- వెనక వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళి పోతుంటారు -- మరి ఏమీ లేని వాడికి అన్యాయం ఎప్పటికీ జరగాల్సిందేనా అంటే అందుకు అందరి లోనూ పరివర్తన రావాలి -- అధికారం చేతిలో వున్నవాళ్ళు అలాంటి సిఫారసులు ఇవ్వకుండాను, తెచ్చిన వాటిని లక్ష్య పెట్టకుండానూ వుండాలి -- మొత్తం మీద అందరిలోనూ మార్పు రావాలి....'
    'వస్తుంది ...వస్తుంది. ఎవరికి వారే అవకాశం వదులుకోటం ఎందుకూ అని అన్యాయానికి నడబడుతుంటే మహా చక్కగా బాగు పడుతుంది దేశం --'
    శ్యామల మాటలని మధ్యలోనే తుంచేశాడు మాధవ్ .
    'నీకంత కోపం వస్తోంది కాని, ఎవరో ఏదో చేశారని దుయ్యబట్టే వాళ్ళకి నిజంగా ఏదైనా అవకాశం వస్తే చేతులు ముడుచుకు కూర్చుంటారంటావా -- ఎంతసేపూ ఎదుటి వాడిని తప్పు పట్టటానికే ఈ ఆదర్శాలు ఆశయాలు పనికి వస్తాయి కాని తమ దాకా వచ్చేసరికి అవన్నీ గాలికి యెగిరి పోతాయి .' అంది శ్యామల.
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS