ఆతృతగా ఉత్తరం చించిందామె.
"వారుణీ?"
ఎలా వున్నావే?
కులాసాయేనా?
మీ అత్తయ్య, మామయ్య ఎలా వున్నారు? మనుషుల్లాగే వున్నారని సమాధానం చెప్పొద్దు. మానవత్వం వుంటేనే మనిషి పుట్టుకకి, రూపుకి సార్థకత. లేకపోతే మనిషి వేషం వేసుకున్న జంతువులకీ వాళ్ళకీ అట్టే తేడా వుండదు. అవి నమ్మించి మింగేస్తాయి. వీళ్ళు ముంచేస్తారు. అంతే తేడా?
వాళ్ళు ఎలా ప్రవర్తించారు? నిన్ను బాగా గౌరవంగా, మర్యాద పూర్వకంగా రిసీవ్ చేసుకున్నారా? కట్నం తేని కోడలని నిన్ను డి_గ్రేడ్ చేశారా?
నువ్వు వాళ్ళతో కలిసిపోయావా? వాళ్ళూ నీతో కలివిడిగా వుంటున్నారా? బావగారు ఫర్లేదనుకో. ఆయన నీ పార్టీ మనిషి. నిన్ను అభిమానించి, గౌరవించి, ప్రేమించి పెళ్ళాడిన మనిషి కదా!
ఇతర్ల మాటేమిటి ?
మీరిద్దరూ ఒకటయిపోయారనే యింకా ఎదుస్తున్నారా యింట్లో వాళ్ళు? కలిసొచ్చారని ఆప్యాయంగా ప్రేమగా చూసుకుని ఆడరిస్తున్నారా? చెప్పవే!
వారుణీ! ఇక్కడేం జరిగిందో నీకు పూర్తిగా తెలీదు కదూ!
నువ్వు తమ మాట కాదన్నావని మొదట అమ్మా నాన్నా కోపగించుకున్నారు. అయినా చివరికి నీ మాటే నెగ్గించారు. కొందరు పెద్దవాళ్ళు ఏది చెబితే అలా వినేస్తారు_ నాలాగా. మరికొందరేమో నీలాగా తమ ఊహలు, ఆలోచనల ప్రకారమే ప్రవర్తిస్తారు. పెద్దవాళ్ళని కూడా తమ మార్గానికే రమ్మంటారు. కని, పెంచి, పెద్దచేసి మన భవిష్యత్తుని తీర్చిదిద్దటం తమ బాధ్యతగా గుర్తించేవాళ్ళకి మన ప్రవర్తన కొంత బాధ కలిగిస్తుంది. వాళ్ళు ఆ బాధకి తట్టుకోలేరు.
నీ పెళ్ళి, నా పెళ్ళి కలిపి చేయాలనుకున్నారు నాన్నగారు. కానీ మీ అత్తా మామా పీటలపైకి రారని, అలా జరిగితే అది అవమానకరమని, నలుగురిలో తలవంపులకి కారణమవుతుందని నాన్నగారు ఆ ఊహని అణిచేసుకున్నారు. అందుకే నీ రిజిష్టరు మేరేజి జరిగే సమయానికే నా పెళ్ళీ చేశారు.
ఆ విధంగా మన యిద్దరి పెళ్ళిళ్ళూ ఒకే ముహూర్తంలో చేయాలనుకున్న ఆయన సంకల్పం నెరవేర్చుకోగలిగారు ఏం చేస్తారు చెప్పు? నాన్నగారిలాంటి వాళ్ళు తమ కోరికలని తీర్చుకోటానికి ఇతరులని బాధించరు. తమ మార్గంలో తమ కోరికలను తీర్చుకుని అలా సంతృప్తి పడగలరు.
బావగారి కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని ఆశపడ్డారు నాన్నగారు. లోకంలో అన్ని దానాల కన్నా కన్యాదానం గొప్పదని, ఫలప్రదం అనీ మనవాళ్ళు భావిస్తారు. దేశం ఎంత నాగరికం పెరిగినా, మనుష్యుల మనస్సుల్లో ఎంత అధునాతనత్వం వచ్చినా యింకా ఇలాంటి సంప్రదాయ భావాలు చెరిగిపోలేదు. అదేనేమో ఈ సంస్కృతిలోని గొప్పదనం!
అదే మన సంస్కృతి, సంప్రదాయాలకీ చిహ్నం అంటారు ఆయన_అదే మీ మరిదిగారు.
నాన్నకి నీ పెళ్ళి యిష్టం లేకపోయినా నీ మాటని మన్నించారు. వారుణీ! జీవితాంతం పెళ్ళివలన సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలూ అనుభవించేది మనం. మనం మంచి మార్గంలో వెళ్ళితే సుఖపడతామని, అందుకే మనల్ని మంచి బాటలో పెట్టాలని పెద్దవాళ్ళ తాపత్రయం.
అందుకే నాకు పదివేల కట్నం యిచ్చి చేస్తున్నట్టుగా నీ పేరునా పదివేలు బ్యాంకులో వేశారు నాన్నగారు. అది నీకు ప్రస్తుతానికి అవసరంలేదు. అయినా ఇప్పుడు ఉపయోగించకపోయినా నీకు భవిష్యత్తులో దాని అవసరం రావచ్చు. లేదా నీ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడవచ్చు. ఎప్పుడే అవసరం వస్తుందో మనం చెప్పలేం కదా?
అమ్మ నీ సామానంతా పంపింది. అదీ, సారె రిజిష్టర్ ఆఫీసు వద్దకి పంపేరట. అందిందా?
వారుణీ! నిన్నటితో నా పెళ్ళయి నాలుగు రోజులు. అందుకే అత్తారింటికి పిలుచుకుని వచ్చారు. ఏవేవో పూజలు, వేడుకలు జరిపారు. అవన్నీ ఆనందా విష్కృత కారణాలు. ఇవన్నీ నీకు జరగలేదని అమ్మ ఎంతగానో బాధ పడింది. తల్లికైనా తనపిల్లలకి అందరికీ ఒకేలాగా జరగాలని అని వుంటుంది కదా!
