Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 16


    కనీసం సత్యం దగ్గిరైనా తనభర్త ఆవుదూడలాగా మారినందుకు ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకుంది. అందుకే అన్నది---

 

    "మనసు పాడుచేసుకోవద్దనిమీరైనా చెప్పండన్నయ్యగారూ! దాని బతుకేదో బతుకుతుంది. దాన్ని మరిచిపొమ్మని చెప్పండి."

 

    చెబితే గిబితే సత్యం చెప్పదలుచుకున్నదికూడా ఆమాటే. ఆ మాటేదో ఆమె చెప్పేసింది గనక టూకీగా "ఊరుకో" "ఊరుకో" మంటూ పొడిముక్కలు ప్రయోగిస్తున్నాడు.

 

    ఎంతో ముచ్చటపడి పిల్లను చూసేందుకు వచ్చిన పెద్దమనిషి--- ఆ పిల్ల తల్లిదండ్రులను ఓదార్చే ప్రోగ్రాంలో పడిపోయినందుకు బాధగానే వుంటుంది మరి.

 

    వాళ్ళని తాను ఓదార్చగలిగేడు.

 

    తనని ఓదార్చే వాళ్ళెవరు?

        
                                        14


    పద్మ అన్ని పరీక్షలూ బాగానే రాసింది.

 

    ఆ రోజుతో హైదరాబాద్ కి గుడ్ బై కొట్టి రైలెక్కడమే తరువాయి, మరుసటి రోజుకి టిక్కట్టుకూడా రిజర్వు చేసుకుంది.

 

    ఎటొచ్చీ పెళ్ళి గొడవే తెమల్లేదు. కృష్ణమూర్తి వరసకి తాను ఏమనుకున్నా ప్రయోజనం లేదని గ్రహించింది. అదుగో ఇదుగో అంటాడే తప్ప అవునో కాదో చెప్పడు.

 

    ఈ విషయం యింకా బుర్రలో పెట్టుకుని మనసు పాడుచేసుకోడం పద్మకిష్టంలేదు. కృష్ణమూర్తిని పెళ్ళాడే యోగం తనకి లేదనుకున్నది. తద్వారా ఈ జన్మకి పెళ్ళే జరగదని రూఢి పరుచుకుంది. గుండెనిబ్బరం చేసుకుని రైలెక్కడ మొక్కటే కర్తవ్యమని ఎంచుకుంది.

 

    హైదరాబాదులో చివర్రోజు సరదాగా గడిపేందుక్కూడా మనస్కరించలేదు. హాస్టలు పిల్లలంతా సినిమాకి ప్రోగ్రాం పెట్టుకున్నారు. పద్మనికూడా అడిగేరు. తాను రానని తెగేసి చెప్పింది.

 

    సాయంత్రం అయిదు---

 

    ఉత్తచేతుల్తో యింటికి వెళ్ళడం బావుండదు గనక స్వీట్స్ కొందామని అబీడ్స్ చేరుకుంది. ఆపని పూర్తవుతుండగా ఎక్కడ్నుంచి వూడిపడ్డాడో గాని కృష్ణమూర్తి స్వీట్ షాపులో ప్రత్యక్షమయ్యేడు.

 

    అతన్ని చూసికూడా చూడనట్టు నటించాలనుకున్న పద్మ ప్రయత్నాన్ని అతను కొనసాగనివ్వలేదు.

 

    ఆమె చేతిని పట్టుకొని ఆదుర్దాగా అన్నాడు...

 

    "రేపేకదూ నువ్వు వెళ్ళేది?"

 

    పద్మ తలూపింది.

 

    "కమాన్ - ఇవాళే మన వ్యవహారం తేల్చేస్తాను" అంటూ ఆమెను లాక్కుపోతున్నాడు.

 

    పద్మకి ఏం చేయాలో తోచలేదు.

 

    అలాంటి పరిస్థితి పద్మకి మామూలే. కృష్ణమూర్తిమీద కొండంత కోపం వచ్చినప్పుడు ఎడాపెడా వాయించేద్డామనుకుంటుంది. అందుకు ప్రత్యక్షంగా ప్రాక్టీసుకూడా చేస్తుంది.

 

    తీరా అతన్ని చూడగానే సగం కోపం ఇట్టే కరిగిపోతుంది. అతనో అక్షరం మాటాడితేచాలు మిగతాసగం గాల్లో కలిసిపోతుంది.

 

    అతని రూపానికీ, మనస్పూర్తిగా మాటాడే అతని మాటతీరుకీ, అతని నిష్కలమయిన నడవడికీ తాను ఆకర్షితురాలయినట్టు తెలుసుకున్నా - కేవలం ఆ ఆకర్షణ ఒక్కటే. అతనికి పడిపోయేలా చేయదు.

 

    ఆకర్షణకు తోడు వేరొకటేదో ఉండివుండాలి. అతనితో తన పెళ్ళి అయిం తర్వాతగాని 'అదేమిటో' తెలీదు.

 

    అతను స్కూటరు స్టార్టుచేసి, పద్మని ఎక్కి కూచోమన్నాడు. ఆమె ఎక్కి కూచున్న తర్వాత స్కూటరు కదిలింది.

 

    ఎక్కడికి తీసుకెడుతున్నావు? ఎందుకు తీసుకు వెడుతున్నావని పద్మ అతనిని అడగదలుచుకోలేదు. అడిగినా సరయిన సమాధానం చెబుతాడన్న నమ్మకం తనకి లేదుగాక లేదు.

 

    గతంలో అట్లా ఎన్నోసార్లు అడిగి విసిగిపోయివుంది. ఈ తడవనైనా ఆ కష్టం తనకొద్దనుకుంది.

 

    అంచేత ఆమె మవునంగా ఉండిపోయింది.

 

    చివర్రోజది చేసుకోవలసిన నిర్ణయమేదో చేసేసుకుంది. ఆపైన  పరిస్థితులు ఎట్లా అఘోరించినా బాధపడనక్కర లేదన్న ఉద్దేశంతో తనకేం పట్టనట్టు స్కూటరుమీద కూచునివుంది.

 

    పద్మ మవునంగా ఉండటం అతనికి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికి అయిదారు సార్లయినా ఎక్కడికి తీసుకెడుతున్నావని అడిగి ఉండాల్సింది.

 

    అడగలేదు.

 

    పోనీ... కోపంగావుంటే స్వీట్స్ షాపులోనే కొంత రభస జరిగి ఉండాల్సింది.

 

    జరగలేదు.

 

    అలాంటప్పుడు పద్మ శాంత గోదావరిలాగా మవునంగా కూచున్న కారణమేమిటో తెలియక అతను క్షణంసేపు బెంగపడినా - తమ పెళ్ళి విషయమై తాను చేయబోతున్న చివరి ప్రయత్నం గుర్తుకు రాగానే మూడ్ మార్చుకుని స్కూటరు వేగం పెంచేడు.

 

    ఇప్పుడు స్కూటరు అసెంబ్లీ దాటింది.

 

    ఎక్కడికి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడోగాని రెండు రోజులపాటు ఊళ్లోలేని నాన్న గతరాత్రి ఇంటికి వచ్చేడు.

 

    కనీసం అప్పటికయినా ఆయన వచ్చినందుకు కృష్ణమూర్తి ఎంతో సంతోషించాడు. పద్మ బందరు వెళ్ళేందుకు ఒక్కగానొక్క రోజే మిగిలి ఉంది.

 

    ఈ ఒక్కరోజులో సమస్య పరిష్కరించుకోవాలని కృష్ణమూర్తి గట్టిగా అనుకున్నాడు.

 

    ఫోటోలూ ఉత్తరాలతో పనిజరగలేదు. వాటిని నమ్ముకోవడంకంటే ఈ పధకం అమల్లో పెట్టుకోవడమే ఉత్తమం అనుకున్నాడు.

 

    కాకపోతే... కొంచెం చొరవ తీసుకోవాలి. కొంత తెగింపు తెచ్చుకోవాలి.

 

    టూకీగా ఆ పధకం ఇది...

 

    పద్మని స్కూటరు మీద తిప్పుతూ తండ్రి కళ్ళబడితే చాలు, పెళ్ళయి పోయినట్టే!

 

    "నీ స్కూటరెక్కిన అమ్మాయి ఎవరు? ఆ పిల్లతో నీకు సంబంధ మేమిటి? అని తండ్రి అడక్క మానడు. అప్పుడు సమస్తమయిన కథ చెప్పి ఆ పిల్లతో నా పెళ్ళిచేయమని తాను చెప్పకా తప్పదు.

 

    ఫినిష్ పద్మతో తన పెళ్ళయిపోతుంది.

 

    ఆ పధకం ప్రకారం స్కూటరు సోమాజిగూడ చేరుకుంది. సత్యం ఇండస్ట్రీస్ ముందు స్కూటరాపేడు పద్మ స్కూటరు దిగింది.

 

    స్కూటరు దిగికూడా పద్మ అతన్ని ఎమీ ప్రశ్నించలేదు.

 

    ఆమె ధోరణికి అతను మరింత ఆశ్చర్యపోయాడు.

 

    ఎప్పుడూ రాని స్థలము పబ్లిక్ రోడ్డుమీద స్కూటరు ఆగింది. అక్కడ ఎందుకు ఆగవలసివచ్చిందనిగానీ, ఆ రోడ్డుమీద ఎంతసేపు నిలబడాలనిగానీ పద్మ అడగవచ్చుగదా!

 

    ఉహు... అక్షరం మాటాడకుండా దిక్కులు చూస్తోందంతే. నీ యిష్టమొచ్చినట్టు అఘోరించు అనే ధోరణిలో ఆమె నిలబడింది.

 

    ఎందుకయినా మంచిదని అతనే పద్మని పలకరించేడు.

 

    "ఇక్కడికి నిన్నెందుకు తెచ్చేనో తెలుసా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS