Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 16


    కళ్ళముందు తిరుగుతూ, ఆడుతూ, పాడుతూవున్న కూతురు హటాత్తుగా మాయం అయిపోతే, ఆ పితృ హృదయం ఎంత బాధతో విలవిల్లాడిపోతుందో తలుచుకుంటుంటే ఆయన మనసు ద్రవించింది.

    శ్రీవిద్య స్నానానికి వెళుతూ, తులసి చనిపోయినట్లే లేదమ్మా. అచ్చం నిద్రపోతున్నదానిలా వుంది. అది నీకంటే ఏడాది చిన్న. స్వాతీ__స్వాతీ అంటే ప్రాణాలిచ్చేది" అంది విచారంగా.

    మరో అరగంటకు అందరి భోజనాలు ముగిశాయనిపించారు.

    ఆఖరుగా స్వాతి, పార్వతి భోజనాలక్కూచున్నారు. కూచున్నదన్నమాటేగాని, పార్వతి మనసు రణరంగంలా వుంది. పెద్దకొడుకు సంసారం ఒకతీరు, రెండోవాడు అదోరకం, మూడోవాడొక సమస్య తెచ్చిపెట్టాడు. ఈ నాటకాల రాయుడెలా బాగుపడతాడో. వీళ్ళందరి సమస్యలతో భర్త మనసు వికలమైపోతుందేమోనని ఆమె గుండె భయంతో కొట్టుకుంటోంది.

    అప్పుడు వచ్చాడు దశరధరాం.

    పెద్దకొడుకుని చూడగానే ఆమె ముఖం వికసించింది. ప్రక్కనే కోడలూ, మామగారు వున్నారేమోనని ఆశగా చూసింది.

    "నా పిచ్చిగాని?" బాధగా నవ్వుకుంది.

    "ఏరా దాశరధీ! పదిహేను రోజులైంది వెళ్ళి ఎక్కడున్నావో... ఏమో తెలియదు. కాళ్ళు కడుక్కున్నావా? రా భోజనం చేద్దాం" అంది ఆప్యాయంగా_

    తల్లి ప్రేమ చూస్తుంటే దాశరధి హృదయం పొంగిపోయింది. తనుపడ్డ శ్రమంతా ఆ ఒక్క మమకారపు పలుకుతో తగ్గిపోయినట్లుగా అనిపించింది_

    "కాళ్ళు కడుక్కునే వచ్చానమ్మా! నీ చేతి అన్నం తినకపోతే ఎంత వెలితిగా వుందో తెలుసా?" పార్వతి పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంది.

    స్వాతి లేచి బావగారికి పళ్ళెం పెట్టింది. పార్వతి వడ్డించింది. ముగ్గురూ భోజనం చేయసాగారు.

    "ఏమైందిరా నీ ప్రయత్నం?"

    "స్టేట్ బాంక్ మేనేజరుగారు రెండువేలు యిచ్చారమ్మా. అయిదొందలు అడ్వాన్స్ యిచ్చి యిల్లు తీసుకున్నాను. అదెప్పుడో ఇంగ్లీషువాళ్ళ కాలంలో బడికోసమే కట్టారట"

    పార్వతి కళ్ళు తృప్తిగా మెరిశాయి. ఉద్యోగానికి రిజైన్ చేశాడే ఎలా బ్రతుకుతాడో అని బాధపడుతోంది ఇప్పటివరకూ.

    "తర్వాత మిషనరీ వాళ్ళు ఎందుకో బడి ఎత్తేశారు, అది ఖాళీగా వుండిపోయింది. విశాలమైన గదులు, పెద్ద గ్రౌండ్ ఆఫీస్ రూం అన్ని సౌకర్యాలున్నాయి. పైగా హెడ్ మాస్టరుకని క్వార్టర్స్ కూడా కట్టించారు. అద్దె కాస్త ఎక్కువే.

    "పోన్లే ఎవరికెంత ప్రాప్తమో! నీ చేతి కిందకి రావాలనే అది యిన్నాళ్ళు ఖాళీగా పడివుందేమో!" సంతోషంగా అందామె.

    "నెలకి రెండొందల యాభై అద్దె. రిపేర్ ఖర్చులకి ఐదొందలు పైగా అయింది. అదంతా మనమే పెట్టుకోవాలి. పదేళ్ళకి ఎగ్రిమెంట్ రాసిచ్చారు. ఆ తరువాత కూడా మనకి అంగీకారమైతే మూడొందల అద్దెతో మరో పదేళ్ళకి తీసుకోవచ్చు".

    "నాకెందుకో బాగా నమ్మకంగా వుంది. మీ స్కూల్ బాగా నడుస్తుందని" స్వాతి తలఎత్తి అంది.

    ఆ మాటకే పొంగిపోయాడతను. థాంక్స్ అన్నాడు.

    "నిజానికి అద్దె ఒక విధంగా చాలా తక్కువే. వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూట్ అని తక్కువకి యిచ్చారు. అంతా తయారైంది. అక్కడే కొంత ఫర్నిచర్ వుంది. దాన్ని రిపేర్ చేయించాను. బోర్డులకి కలర్ వేయించాను. కొంత కొత్తఫర్నిచర్ కొన్నాను. డబ్బంతా అయిపోయింది." అలా చెపుతుంటే అతని కళ్ళలో భవిష్యత్తు మీది ఆశలు అందంగా మెరుస్తున్నాయి.

    "రేపు స్కూలు ప్రారంభోత్సవానికి కలెక్టరుగారు వస్తున్నారు. ఒక్కొక్క తరగతిలో పదిహేనుమంది చేరారు. ఏడవ తరగతిదాకా పెట్టాను. అందరూ రేపు డబ్బు కట్టేస్తారు. ఒక్కొక్కరి అడ్మిషన్ ఫీజు యాభై. తరగతికి నెల ఫీజు అది, పదిహేను, ఇరవై చొప్పున కడతారు. పదిహేను వందలదాకా వస్తుంది."

    "పోనీలేరా నీ జీవితం ఒక గట్టున పడ్డట్లే. జానకి కూడా వస్తే ఎంత బావుండేది? మా మూలంగా మీరు విడిపోవడం మేం భరించలేంరా"

    ఆ మాటలు విననట్లే తనధోరణిలో తాను చెప్పుకుపోతున్నాడు దాశరధి.

    "టీచర్లకి పదకొండువందలు పోతుంది. ప్యూన్ కి వంద. నాకు మూడొందలు మిగులుతాయి. అడ్మిషన్ ఫీజు అంతా ఫిక్స్ డ్ డిపాజిట్ లో వేసేస్తాను. ఆ ఇంటరెస్టు చాలు. రికగ్నేటన్ కి కూడా వ్రాస్తామన్నారు డి.ఐ."

    ఉత్సాహంగా చెప్పాడతను.

    కానీ ఆ విషయాలు అంతగా ఆనందాన్ని కలిగించలేదామెకి. "నేనడిగింది కోడలు విషయం. అది చెప్పవేంరా." అంది.

    తల్లి మళ్ళీ భార్య విషయం ఎత్తేసరికి మవునంగా అయిపోయాడు. అతనికి అన్నం సహించలేదు. ఆ ఉత్సాహం ఆనందం జయాన్ని సాధించానన్న తృప్తి చప్పగా చల్లారిపోయాయి. కంచంలో చేయి కడుక్కుని లేచాడు.

    టవల్ తో చేయి తుడుచుకుని ఆ విషయం అడక్కమ్మా. నీకు బాధ కలుగుతుంది. జానకి తను రాలేనని రాసింది. కోర్టుకెక్కితే విడాకులకు ఒప్పుకోదట. తనలో ఏ తప్పువుందని విడాకులు ఇస్తావని వ్రాసింది. తను వచ్చి ఇక్కడ అయిదేళ్ళు సంసారం చేసిందట. ఇప్పుడు నేను అత్తారింటికి వెళ్ళాలట. బావుందికదూ?"

    పార్వతి నిర్ఘాంతపోయింది. ఇక ఈ సంసారం బాగుపడదా అనిపించింది.

    "ఆడవాళ్ళు అత్తారింటికి వెళ్ళాలా? మగాళ్ళు వెళ్ళకూడదా? అని ప్రశ్నించింది. ఇంత తెలివిమీరిన భార్యతో ఏం కాపురం సాగుతుంది? అన్నాడు బాధగా.

    ఆ మాటలు ఆమెకి మరింత ఆశ్చర్యాన్ని కలిగించాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS