Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 15

                

                               10
    మబ్బుల్లోనే వొచ్చి మాసెమ్మ సెప్పింది -- "రవణయగాడి పెళ్ళాం , మల్లా మొగోడ్నే కందిట!"
    ఆ మాటలు రావులమ్మ గుండిల్లో కసిక్కుని గుచ్చుకున్నాయి!
    మాట సేవినేసిన మాసెమ్మ మల్లీ తిరిగి ఎల్లి పోవొచ్చా! అహ! అన్నీ దానికే కావాల.
    "మల్లీ యీ రోజుకి నీ సంకలో కూడా వో బుల్లోడు ఎలవాలే బుల్లెమ్మా!"
    ఓరయ్యో! అంత సుళువే?
    'సత్తెమ్మ దెంత అదురుట్టం!' అనీ అనుకున్నాది.
    'ఆడు తనకే పుడితే?'
    "స్సీ! రవణయ్య మావ కొడుకు తనకి పుట్టడవేంటే?'
    మనసు సివసివలాడినాది.
    ఓరబ్బో! ఎంత సిగ్గో!
    'ఈ మాటంటే ,మావేం అనుకుంటాడో?"
    పెళ్ళాం పుటింటి కెల్లాక రవణయ్యకి తిండి, ససిలేదు. రొండు మెతుకులు ఆడే వుడేకేసుకుతినీవోడు. ఉప్పూ, పులుసూ లేని సప్పటి కూడు! అదీ లేపోతే నల్లటి గెంజినీళ్ళు! దాంతో తిండంటే జీవసచ్చి ; సిరుతిళ్ళు మరిగాడు. బోలిడు డబ్బు కరుసు సేడతా సేలాకీగా తిరిగివోడు. ఎన్ని సరదాలు తెచ్చి పెట్టుకున్నా యింట్లో పెళ్లావున్న సాటోస్తాదా? పురిటికి పుట్టింటికి పంపిత్తే , తస్సాదియ్యా! ఆ బెమ్మదేవుడు కూడా ఒక్కడూ వుండలేడు. ఇప్పుడయినా తప్పని సరయింది కానీ, లేపోతే దాన్నసలు వొదిలీవోడా తను? అదేల్లిన కాడినించీ వొంటి సుకం సచ్చిపోయింది. పక్క మీద పడుక్కొని యిటూ అటూ దొల్లు పుచ్చకాయిలా కదిలీవోడు. నరాలు పీక్కు తినీయి. బుర్ర నిదరోయింది కాదు. గుండి మారాం పెడతాది! 'ఎన్నెల రేత్తిళ్ళు మరీ బాధ! పురిటి నీల్లయి పోగానే దాన్నెంట బెట్టు కొచ్చేయ్యాలి!"
    సత్తెమ్మని యిట్టవు లేపోయినా పెళ్ళి సేసుకున్నాడాడు. కొత్తలో దాన్ని ఎంత సీదరించుకునీవోడో! ఎత్తుపళ్ళూ, కోతి మొగవూ!
    రేత్తిరి రెండు జావు లేళకొచ్చినా కల్లల్లో దీపాలేట్టుకుని గుమ్మం కాడ కూకునీది.
    "పాపం!" అనుకునీవోడు. దాని తెల్ల సీరకేసి సూసి పుసిక్కునినవ్వుకునీవోడు.
    పెళ్ళి సేసుకోక ముందు తను ఆడిన నాటకాలన్నీ రావులమ్మ ముచ్చట్లూ పూసలు గుచ్చినట్టు సేప్పీ వోడు. దాని కళ్ళు కుడితేగా!
    మా దొడ్డ పిల్ల! అనుకున్నాడు.
    ఇప్పుడదే ఆడికి దేవతకాదో?
    సుక్కురారంనాడు --
    రావులమ్మ వొచ్చి ఇంటి వోలకం సూసి నవ్వినాది. 'అత్త లేపోతే నువ్వుండలేవు మావా!"
    "ఆడకూతురు లేని కొంప మరేల్లా గుంటాదే?"
    అది మల్లా నవ్వినాది.
    "ఆపాటి మొగమాటం అందరికీ వుంటాది లేమావా! కూరా వారా లేందే బువ్వ ఎలా తింటావ్? నన్నడిగితే నేనేసి పెట్టనో? సాటోల్లం గందా, వోకళ్ళ కొల్లం సేసుగుంటెం తప్పా మావా?"
    రవణయ్య కి రావులమ్మ మీద సెప్పలేనంత యిట్టవు కలిగినాది.
    అసలు రావులమ్మ ఎప్పుడూ మంచిదే! తన్ని సేసుగుంది కాదు కానీ, దాని సుట్టూ గుడి కట్టేసి పూజిసేసీవోడు కాడో?
    "అత్త కడుపుని మల్లా బుల్లి మావ ఎలిశాడు!"
    "దేవుడు సల్లగా సూత్తే నీకు మట్టుక్కి?"
    "అంత బాగ్గెం కూడానా?"
    "అంత వోయిరాగ్గెం వొచ్చిందేవే? అప్పుడే ముసిలిదాని వయిపోయావంటా?"
    కసిక్కుని నవ్వేసింది రావులమ్మ.
    ఆ నవ్వు సూత్తే ఆడికి సింతల తోపు గురుతోత్తాది!
    అంతటితో మావ మాట మారిసేత్తా డనుకున్నాది.
    "సిలకలాంటి పెళ్లాం వుండగా ఏటేటా కవల పిల్లలు పుట్టరో?"
    వొంటినిండా సిగ్గేసింది దానికి. అది ఆడుసూడనూ సూసాడు.
    "నిన్నింటో యిడిసేసి పట్నం లో ఆడు ఏం రాసరిక వెలగ బెదతన్నాడే? ఏం రోగవంట? నేనేప్పుడేనా అల్లా సేశావా?"
    "సాల్లే మావా!"
    మొగం తిప్పెసుకున్నాది. తిప్పుకోడం లో ఆ వొయ్యారం మల్లా సూడాలనిపించిందాడికి.
    "నీకు పప్పుసారు మనుసుగందా, సిటికి లో కాసి పెడతా! సందేలకి తెమ్మంటావా?"
    రమణయ్య గుండి ఎగిరి గంతేసింది.
    "నీ మాం మీద యింత దయోచ్చిందెం రావే?'
    ఆ మాటిని నవ్వుకుంటా అది ఎల్లి పోబోతావుంటే -- కొంగు లాగి అన్నాడాడు--
    "సీకటి తోటే గూట్తోవోల్తా! సన్నీల్లల్లో వుతకాలాడి నీకోసమే సూత్తా వుంటా! సయ్యేనా సిలకా?"
    "సొగసోడు మావ!' అనుకున్నాది.
    వొయ్యారంగా సేతులు తిప్పుతా, మాటాడకుండానే ఎల్లి పోయిందది. కుసింత దూరం ఎల్లి, మల్లా ఎనక్కి తిరిగి సూసింది. అడింకా గుమ్మం పట్టుకుని తన్నే సూత్తా వున్నాడు. సూత్తా, ఆడు మీసం తడువుకుంటా వుంటే అడినవ్వే కోరికిల పుట్ట! ఆడి సూపె యీత ముళ్ళ కట్ట!
    మావలాంటి మొగోడు అందరికీ దొరుకుతాడా?
    అన్నారం దేవుడి వొరం కాదో?
    ఆడి నవ్వు అందరికీ వోత్తాదేంటి?
    మల్లా అడిపోలికి పిల్లల్నే కండానికి, సత్తెమ్మ ఎన్నో నోవులు నోసుకున్నాదో?
    పోయి మీద వొంణం గెంజి వోరిసి, సిటికి లో ఆడి కాళ్ళ కాడ వోల్దో?
    ఉడుకు నీళ్ళతో తాణవుసేసి , సిక్కటి పాలల్లాంటి సీరకట్టి , పచ్చ గన్నేరు రేకంటి రయికి తొడిగి ఎబుళం మల్లి పూల దండనీ, ఆకాసెంలో సందమావలా తురువుకుని, మంచు లాటి ఎన్నెట్తో అనిముత్తెం లా నిలుసుంది రావులమ్మ.
    దాని మనసులో సరికొత్త వోసన్లు ముసురు  కున్నాయి. తియ్యటి మనుసులు పరుసుకున్నాయి. కొత్త జనవే యిరగ బూసింది!
    రవణయ మావ తన మీద అంత కనికారం మాబిత్తాడని ఎప్పుడేనా అనుకున్నాదా?
    అప్పుడు సిన్నతనవే కావొచ్చు, యిసురు పొంకవే అవొచ్చు -- మనుసుపడి ఆడు దరికొత్తే తను యిసిరి కొట్టలేదో?
    సీకట్లో సిగ తడివి నవ్వితే, సేరసెర నడిసోచ్చేయ్య లేదో?
    అడు తన్ని కంటి రెప్పల్లో దాసుకు సూసుగుంటా  నంటె జాలి తలిసేనా పెళ్లి సేసుకున్నదా?
    అప్పటి రవణయ కాడో, ఇప్పటి మావ?
    ఎప్పుడు అవుపడినా నోరారా పలకరిత్తాడే కాని ఎనకటి సీదరింపులు మనసులో పెట్టుకుని కసిరి కొట్టాడా?
    అంత మంచోడ్ని యిదిలించుకుని, యీడ్ని కట్టుకుని ఏం సుకపడతన్నాది?
    రవణయ్య మావ గొంతుకు లోంచి వొచ్చీ మాటల ముచ్చట జనవ జనవాలకయినా యినగలుగుతాదా? తన అదురుట్టం కాదో?
    ఎంతసేపటికి అది యిల్లు కదలక పోడంతో యిసుగేత్తుకొచ్చి సెందురుడు మబ్బుల్లోకి ఎల్లి పోయాడు.
    రావులమ్మ గుండి గుబగుబలాడినాది.
    ఆడి దరి కెల్లాలి! కాళ్ళ కాడ వొలిపోవాలి!
    రవణయ్య మావ జాలికి మనసులో దణ్ణాలు పెట్టాలి!
    సత్తెమ్మ సినకొడుకు తన సంకలోనే మేడుల్తా ఉన్నట్టనిపించినాది రావులమ్మ కి!
    దొంగసాటుగా సందమావ తొంగి సూడ్డం తో అది సిగ్గులోనే దాగుండినాది.
    ఎనకనకే కొరికీ ముంచు కొచ్చింది!
    తెగింపూ యిరుసుకు పడినాది!
    దొడ్డి తలుపులేసి గడేట్టింది.
    మనుసేసి మల్లా అద్దం మొగం సూసుకున్నాది. సిగ్గురాడం తో బోర్లా తిప్పేసి, సేరాసేరా నడిసింది. దీపం బుడ్డి సన్నగా సేసింది.
    వొచ్చేసి తలుపు మీద సేయ్యేసింది.
    తన గుండిలి మీదే ఎవురో సెయ్యేసినట్టనాది.
    ఆ సెయ్యి రవణయ్య మావది లాగే వున్నాది.
    వొళ్ళు పులకరించినాది.
    మనసు ముందరికీ, సిగ్గు ఎనక్కి!
    అబ్బబ్బ! అపుకోనూ లేక పోయినాది.
    తలుపు మీద దాని సెయ్యి అలా వుండగానే ఎలపల్నించి సప్పుడనిపించినాది.
    "మావే నేవో?'
    మనుసాపుకోలేక తన కోసవే వొచ్చాడా?
    ఎప్పుడూ లేంది యిప్పుడింత తొందరెంటో?
    నలుగురూ సూసి గుసగుస లాడుకోరో?
    అంత వుండబట్టలేనోడు , యిన్నాల్లూ ఎలా వుండగలిగాడో మరి?
    తనమీద జాలిపడి ఆడే నేలుక్కుంటా వొచ్చాడా?
    రవణయ్య మావ తన పాలి దేవుడు కాడో?
    ఏపాటి రేతిరికి రావులమ్మ రాకపోయీ తలికి మనసు సిక్కబట్టుకోలేక పోయాడు రవణయ్య.
    ఇంతలోకే మనసు మారుసుకున్నాదా?
    ఆడి తప్పింది కదా?
    మరింత జాగారవెందుకో?
    ఆడి గుండిల్లో గుబులు కమ్ముకున్నాది. ఎన్నెల కిందే నిలుసున్నా యిసినికర్ర తీసుకో కుండా వుండలేక పోయాడు. ఎంత యిసురుకున్నా పొగలు సల్లారలేదు. ఉసూరువంటా మంచం కాడి కేల్లాడు.
    ఇంటో పని మూలాన్ని యింకా యీలవ లేదేవో?
    ఎన్నిల రేత్తిరి వోకత్తీ రాడానికి సిగ్గయినా దేవో?
    పోనీ రమ్మంటే తనే ఎల్లీవోడుగా!
    దార్లో ఎవురన్నా ఆటకాయించారేవో?
    అబ్బబ్బ! అది తన్నింత బాద పెడతాదని ఎప్పుడేనా అనుకున్నాడా? పగ్గెం విసిరి తన మనసు లాక్కుంటాదని కలగన్నాడా?
    అవుసురులో ఆడు నిలదొక్కుకునే లేక  పోయాడు.
    ఈ యాల్టికింక రాదేవో?
    దడదడల్లాడి పోయాడు.
    సివోల్ని లేసి ఎలపలి కొచ్చి తలుపు గొల్లె వెట్టాడు.
    అప్పుడే కట్టుకునా సాకింటి బట్టలు సూసుకుని, ఆ ఎన్నిట్లో తన్ని సూసుకుని తనే మురిసి పోయాడు.
    కండిగిలో దానిల్లు సేరుకునీ దాకా ఆడి మనసు మనసులో లేదు!
    ఓరగా తలుపు తీసి ముచ్చటగా సూసింది రావులమ్మ. కళ్ళు పెద్దయిసేసీ సూసింది!
    ఆడు రవణయ్యకాడు!
    ఎవుడో కొత్తోడు , దొంగోడు!
    ఆడదాన్ని ఒంటిగా సూసి, దోసుగుందారని వొచ్చాడు!
    బయంతో వోనికేపోయినాది. గాజులు గలగలా గోలేట్టినాయి. కాళ్ళు దడుసుకుని సేవట్లు కమ్ముకున్నాయి. గుండిలు అదిరిపడి ఉవ్వెత్తు నిలేసినాయి!
    రావులమ్మ నోటంట మాట రాలేదు!
    ఆడు నవ్వాడు.
    "ఎవరూ లేరా?"
    ఆడు నిజంగా దొంగోడేనని యిప్పుడే బలపడి పోయినాది. ఏం సేయ్యాలో? ఎవుర్ని పిలవాలి? రవణయ్య వొచ్చినా బాగుండి పోయీది!
    "నీపేరు రావులమ్మ కాదో?"
    ఆడికి తన పెరేల్లా తెలుసో? దొంగ సచ్చినోడు!
    మల్లా నవ్వాడాడు.
    "నా పేరు సేరబయ్యలే! పట్నవులో ఎంకన్న జతగాడ్ని . ఆడే పంపించాడు!"
    అప్పటికి కొంచెం దయిర్నేం కలిగినాది.
    "ఎందుకో?"
    "నీ కోసం!"
    "ఏంటీ?"
    "ముందు కుసింత దాగనియ్యి. అన్నీ యివరంగా సేబుతాను!" అంటా లోనకి రాబోయాడు.
    ఆడ్ని రానీడానికి కానీ, పోమ్మండానికి కానీ దానికేం తోసలేదు.
    ఆడికి సోద్దెమానిపించినాది.
    దాని మనసు సివుక్కు మన్నాది. సేరసెరా లోన కెళ్లి ఉసూరువంటా అద్దంలో సూసుకుని, సీర కొంగుతో మొకం కప్పుకున్నాది.        


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS