Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 15

 

    'రండి. సరదాగా వెళ్దాం.' అంది సరోజ.
    'వస్తుందిలే -- '' మాట ఇచ్చేసింది శ్యామల.
    అప్పటికే ఆలశ్యం అయిపోవటం వల్ల ఇంక యింటికి వెళ్ళి పోదాం అనుకుని లేచారు.
    సురేఖ తన అభిప్రాయం ఏమీ తేల్చి చెప్పలేదు -- అప్పటి కప్పుడే సమాధానం రాబట్టాలని వాళ్ళూ బలవంతం చెయ్యలేదు.
    "ఏమాలోచించారు -- వస్తున్నట్టేనా?' హాస్టల్లో వాళ్ళని దించేసి కారు స్టార్టు చేయ్యబోతూ అడిగాడు మాధవ్.
    "వస్తాను.' - రెండు గంటల సేపు అలోచించి వచ్చిన నిర్ణయాన్ని తెలియజేసింది సురేఖ.
    'ఇక్కడేదో సరదాగా తిరిగినా బాగుంది కాని పరాయి వాళ్ళతో పోరుగూళ్ళ కి కూడా వెళ్ళటం ఏం బాగుంటుంది -- కారు ప్రయాణం కనక తనకోసం ప్రత్యేకంగా ఖర్చు ఏమీ కాదు-- అయినా టిక్కెట్టు ఖర్చు లేకపోతె మాత్రం మిగతా ఖర్చులన్నీ వుండవా -- ఖర్చు సంగతి ఎలా వున్నా వాళ్ళు నలుగురూ అయితే ఓ గదిలో సర్దు కుంటారేమో -- తనూ వాళ్ళతో పాటు ఎలా వుండగలదు.' అన్న ఆలోచనలన్నీ వచ్చే , వూరికి వెళ్తున్నానని వంక పెట్టింది --
    కొద్ది రోజులు పోయేదాకా ఇంటికి వెళ్ళకూడదు అని అంత క్రితమే నిర్ణయించుకున్న మాటా నిజమే .--
    'ఉమకి ఏడో నెల అనీ నాలుగు రోజులలో తీసుకు వస్తామనీ వారం రోజుల క్రిందటే అమ్మ దగ్గర నుంచీ వుత్తరం వచ్చింది -- ఈ పాటికి వచ్చే వుంటారు. చెల్లెల్ల్నిచూస్తె తనకి అసూయ అని కాదు కాని ఏమిటో వాళ్ళతో కలవ లేనట్లు ఏదో వెలితిగా వున్నట్లు అనిపిస్తుంది -- అందులో ఇప్పుడు సీమంతం అదీ ఇదీ అంటూ అమ్మ అత్తయ్య వేడుకలు చెయ్యటం అదీ కావలసినంత హడావుడి వుంటుంది. అది అయ్యాక వెడితే తనకి మరీ అంత ముళ్ళ మీద వున్నట్లుండదు ' అనుకుని ఆ నిర్ణయానికివచ్చింది . అసలు ఆ స్థితిలో  ఉమని చూడాలంటేనే తనకి సిగ్గేస్తున్నట్లు వుంది -- అయినా ఏమిటో పెళ్ళయిన వెంటనే ఈ కాన్పులు -- చదువుకున్న వాళ్ళయినా జాగ్రత్తగా వుండ రెందుకనో -- అనిపించింది.
    ఓసారి స్టాఫ్ రూమ్ లో ఈ విషయమే చర్చ జరిగింది -- రెండు నెలల క్రిందట పెళ్ళి చేసుకున్న యామిని వేవిళ్ళ తో చిక్కి సగం అయిపోయేసరికి మిగిలిన వాళ్ళంతా హాస్యాలు  మొదలు పెట్టారు.' ఇంత చదువుకున్న నువ్వు కూడా ఇంతేనా ఓ రెండేళ్ళ పాటయినా సరదాగా తిరగద్డా-- పెళ్ళయిన ఏడాది లోపునే కెరు కెరు మంటూ చంటి పిల్ల తయారయితే చిరాగ్గా వుండదా -- బస్సుల మీద కూడా ఎడ్వర్ట్ యిజు చేసేస్తున్నారని మళ్ళీ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటారు.' అంది వివాహం అంటే ఇష్టం లేక కుమారి గానే వుండి పోయిన నలబై అయిదేళ్ళ కుముదినీ దేవి.
    'మీరలా అంటే నేను ఒప్పుకోను-- జాగ్రత్తగా వుండాలనే అందరికీ వుంటుంది -- కాని ఆ విషయాలు కాస్త మాట్లాడుకునే చనువు వచ్చేసరికి అంతా ,మించి పోతుంది -- అందుచేత మొదటి సారికి మార్జిన్ వదిలేయాలి. ఆ తరువాత జాగ్రత్త పడకపోతే అప్పుడనాలి.' అంది రేవతి.
    'స్వానుభవమా?' అని ఇంకెవరో అనటంతో మిగిలిన అందరూ ఘోల్లున నవ్వారు.
    యామిని సిగ్గుతో మరీ ముడుచుకు పోయింది -- వాళ్ళ సంభాషణ లో పాల్గొనాలంటేనే చచ్చే సిగ్గు ముంచు కొచ్చి చివర కుర్చీలో కూర్చుని పుస్తకం పుటలు తిరగేయ్యటం మొదలు పెట్టింది సురేఖ.
    ఉమని తలుచుకుంటుంటే రేవతి మాటలే గుర్తు వచ్చాయి-- అయినా అసలీ ఆలోచనలన్నీ తనకి అనవసరం -- ఆ హడావుడి కాస్త తగ్గేక వెళ్తే సరి. మళ్ళీ ఆ పేరంటాళ్ళు తనని చూసి జాలిపడే బాధ తప్పుతుంది -- వీళ్ళూ ఇంత అభిమానంగా పిలుస్తున్నారు. శకుంతలమ్మ గారు వుండనే వుంది. తప్పేముంది అనిపించి వస్తానని చెప్పేసింది చివరికి.

                                   8
    అన్నట్లుగానే శ్యామల పదిరోజుల శలవు సంపాదించింది-- శుక్రవారం సాయంకాలం సరికే బట్టలు అవి సర్దేసుకుని తయారయి పోయారు.
    శనివారం మధ్యాహ్నం మాధవ్ ఆఫీసు నుండి వస్తూ శ్యామలనీ వాళ్ళనీ ఎక్కించుకుని ఇంటికి తీసుకు వెళ్ళాడు.
    చంద్ర పరీక్షలు కాలేదు కనక అతనింట్లో వుండి పోవాలని మొదట నిర్ణయించుకున్నారు -- కాని ఈలోగా -- తండ్రికి జబ్బుగా వుందని ఇంటి నుంచి వుత్తరం రావటం వల్ల వారం రోజులలో వస్తాను అని రెండు రోజుల క్రిందటే అతను వూరికి వెళ్తాడు -- ఆ రెండు రోజుల నుంచీ వంటపని శకుంతలమ్మ మీద పడింది.
    'ఇక్కడికి వచ్చీ నువ్వు పని చెయ్యటం ఏమిటి? క్యారియరు తెప్పిస్తాను.' అని మాధవ్ అన్నాడు కాని.
    'నయమే నేనేం పాటు పడాలి -- నాకు ఈ కాస్త వంట ఒక లెక్క -- సరోజ మాత్రం రేపు పెళ్ళయితే మొగుడికి వండి పెట్టు కోవద్దు?' అంటూ వంట గదిలో నాలుగు మూలలా ఏమేమి వున్నాయో చూసుకుని వంటకి వుపక్రమించింది.
    'ఈ కూర సరోజ చేసింది -- మామయ్య కి మరి కాస్త పెరుగు పచ్చడి వెయ్యి.' అంటూ అటు తమ్ముడినీ, ఇటు కూతుర్ని సన్నిహితం చేయ్యాలని చాలా తాపత్రయ పడింది. -- అసలు ఇలాంటి అవకాశం రావటం , సరోజ ఇల్లు ఎంత చాకచక్యంగా దిద్దుకోగలదో తమ్ముడికి తెలియటం శుభసూచకమే అనుకుంది.
    'మేమున్నన్నాళ్ళూ నువ్వూ ఇక్కడే వుండి పోరాదుటే '' అని శ్యామలతో మొదటి రోజున అన్నప్పుడు , ' ఇక్కడ్నించి మా ఆఫీసుకి బోలెడు దూరం బాబూ, పోనీ మామయ్య దిగాబెడతా డనుకుంటే తను ఎనిమిదింటికే వెళ్ళిపోతాడు -- అందరం కలిసి సరదాగా తిరుగు తున్నాం గా, ఎక్కడుంటే ఏమిటి.' అని ఆ అమ్మాయి సమాధానం చెప్పడం కూడా బాగానే వుంది  అనుకుంటూ సంబరపడింది --
    మాధవ్ వాళ్ళూ వచ్చేసరికి ఇన్ని పూరీలు బంగళా దుంపల కూరా పెరుగు గారెలూ తయారు చేసి వుంచారు తల్లీ కూతురూ కలిసి.
    'నే నీవాళంతా ఇంట్లోనే వున్నాను- ప్రొద్దుటే రావలసింది -- శ్రమంతా మీ ఇద్దరిదే అయింది. అంది సురేఖ నొచ్చుకుంటూ.
    'ఆ, ఫరవాలేదు.' అంది సరోజ ప్లేట్లలో వడ్డిస్తూ.
    'ఆ గిన్నె ల్లో వన్నీ ఇప్పుడు తినటానికెనా .' వెక్కిరింపుగా అన్నాడు మాధవ్.
    'తిన్నన్ని తింటారు -- మిగిలినవి క్యారియరు లో పెట్టుకుందాం .' అంది శకుంతలమ్మ.
    'ఏం ? బెజవాడ లో అన్నం దొరకదనుకుంటూన్నావా?"
    ;దొరికినా దొరక్క పోయినా ఇవాల్టి కి నాకింకేమీ అక్కర్లేదు . మీ ఇష్టం ఏం  తిన్నా సరే.'
    'మామయ్య మాటలకేం గాని, అన్నీ పట్టు కెళ్దాం -- దారిలో ఆకలేస్తే తినొచ్చు.' అంది శ్యామల కూరలో వేసిన కారానికి ఒగరుస్తూ.
    'నీ కసలు బుద్ది లేదు -- నువ్వు తినకుండా వుండాలని వాళ్ళు అంత కారం నేనేసినా ఇంకా అవే తింటానంటావు.' వాళ్ళిద్దరికి కబ్జా పెట్టబోయాడు మాధవ్.
    'కారం లేదు బాగున్నాయి.' అంది సురేఖ .
    'ఈ మాత్రం లేకపోతె బాగుండదు .' అంది శ్యామల.
    సరదాగా ఖబుర్లు చెప్పుకుంటూ తెమేలే సరికి మరో అరగంట పట్టింది.
    విజయవాడ చేరేసరికి రాత్రి ఎనిమిది దాటింది -- హోటలు ముందు కారాపి మేనేజరు తో మాట్లాడటానికి లోపలికి వెళ్ళాడు' మాధవ్ -- కాస్సేపటి తరువాత హోటల్ బాయి వచ్చి సామాన్లు తీసుకు వెడుతుంటే అందరితో పాటు అతని వెంట బయలుదేరిన సురేఖ కి ఏమిటో భయంగాబిడియంగా అనిపించింది.
    మాధవ్ బుక్ చేసినవి రెండు గదులు అని తెలియగానే హమ్మయ్య అనుకుంది -- ఆడవారంతా ఒక గదిలో సర్దుకున్నారు -- అతనిం కోగదిలో వున్నాడు.
    దారిలో మళ్ళీ ఓసారి కడుపు నిండా టిఫిన్ తీసుకోటం వల్ల ఎవరికీ ఆకలి లేదు. -- ఇంక ఆ పూటకి భోజనం ప్రసక్తి లేదు -- మర్చి నెలలోనే విజయవాడ పట్టణం తన తడాఖా రుచి చూపిస్తోంది -- స్నానాలు చేసి కాస్సేపు అలా చల్లగాలిలో తిరిగి రావాలని బయలు దేరారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS