Previous Page Next Page 
వారుణి పేజి 15


                                             6


    సుబ్బరత్నమ్మది అదోరకమైన మనస్తత్వం. ఆమె దేన్నయినా సరే తెగేదాకా లాగుతుంది. ఎలా జరిగినా సరే ఆమెలో పశ్చాత్తాపం కనిపించదు.
    ఆరోజు మధ్యాహ్నం ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. నారాయణ ఏదో వ్యవహారానికి సంబంధించిన విషయాలు చూసుకుంటూ యింట్లోనే వుండిపోయాడు.
    "అన్నీ చిత్రమైన విషయాలే జరుగుతున్నాయి అవున్లే! ఇంట్లోకి చిత్రమైన బొమ్మ అడుగుపెడితే యిక చిత్రమైనవి జరగవేంటి?" అందామె.
    "ఏమిటి ?" విసుగ్గా చూశాడు నారాయణ.
    "నేను కాపురానికొచ్చి నలభయ్యేళ్ళు కావస్తోంది. నాకేనాడూ నా పేర ఉత్తరం రాలేదు. పెద్ద కోడలు కాపరానికొచ్చి అయిదేళ్ళవుతూంది. ఏ ఉత్తరమూ ఎరగదు. ఈ దొరసాని అత్తారింట్లో అడుగుపెట్టి వారం తిరగలేదు. అప్పుడే ఆమె పేర ఉత్తరం వచ్చింది." నిరసనగా అంది సుబ్బరత్నమ్మ. ఆమె మాటల్లో వ్యగ్యం, హేళన కూడా బాగా ధ్వనించాయి.
    ఆ మాటలకి నారాయణ ఏమీ అనలేదు. అతనికి ఆమె మనస్తత్వం బాగా తెలుసు.
    సుబ్బరత్నమ్మ భర్తని మళ్ళీ ప్రశ్నించింది. "ఉత్తరం యివ్వనా?" చదువుతారా అన్న కుతూహలం కూడా ఆమె ప్రశ్నలో ధ్వనించింది.
    "నువ్వు చదివావా?" కోపంగా అడిగారాయన. ఆయనకి ఇతరుల ఉత్తరాలు చూడటమంటే అసహ్యం. అలాంటి మనస్తత్వం వున్న మనుషులని చూస్తే ఆయనకి మరీ అసహ్యం. భార్యా భర్తలైనా సరే ఒకటి ఉత్తరాలు మరొకరు చూసుకోకూడదనే సిద్ధాంతం ఆయనవి.
    సుబ్బరత్నమ్మ మూతి మూడు వంకర్లు పోయింది. "అయ్యోరాత! మొగుడు ముండా అంటే వీధిలో వాళ్ళంతా ముండా అన్నార్ట! బావుంది సంబడం! నాకెంత మర్యాద తెలియదని మీరన్నా మరీ ఇతరుల ఉత్తరాలు చదివేటంత దౌర్భాగ్యస్థితికి రాలేదు లెండి. అయినా ఆ రాసేదేదో ఆమె కాలేజి అడ్రసుకే రాస్తే పోయేదిగా! ఇలా యింటికెందుకు రాయాల్ట?"
    "ఎవర్రాశారేమిటి?"
    నారాయణ ప్రశ్న వినిపించుకోలేదామె. ఇన్నేళ్ళ సంసార జీవితంలో భర్త ఏ సమయంలో ఎలాగ ప్రవర్తిస్తారో ఆమెకు బాగా తెలుసు. ఆయనతో వాదించినా, పోట్లాడినా ఫలితం ఒక్కటే! ఆయన పద్ధతుల్లో మార్పుండదు. పైగా తన పద్ధతికి రావాలనే పట్టుదల ఒకటి.
    అందుకే ఆయన ప్రశ్నకి జవాబివ్వలేదు ఆమె. మనకు సంబంధం లేదనుకున్నాక ఎవర్రాస్తేనేమిటి అనుకుంటూ విసవిసా వెళ్ళి, సారధి గది ముందు నుంచుంది. ఒక్కక్షణ మాగి కంఠంలోకి ఎక్కడలేని ఆప్యాయత తెచ్చుకుంటూ "వారుణీ! నీకు ఉత్తరం వచ్చిందమ్మా!" అందామె.
    వారుణి గది తలుపు తీసుకుని బయటికి వచ్చింది అత్తగారి పిలుపు వినగానే. అంతదాకా చదువుతోన్న "కంఠాభరణం" చేతిలోనే వుంది.  
    సుబ్బరత్నమ్మ ఉత్తరం అందించి వెళ్ళిపోయింది.
    తలుపు తిరిగి వేసుకుని లోపలికి వెళ్ళింది వారుణి. మంచంపై వాలిపోయి చదువుతోన్న పుస్తకాన్ని పేజీ గుర్తు పెట్టుకుని మూసేసి ఉత్తరం చూసింది.
    ఆ అక్షరాలని చూడగానే ఆమెకి చెల్లెలు శిరీష గుర్తుకొచ్చింది. కొన్ని వందల మందిలో వున్నా ఎలా కొందర్ని అట్టే గుర్తుపట్టేస్తామో, ఎంతమంది చేతివ్రాతలు కలసినా శిరీష అక్షరాలని యిట్టే గుర్తుపట్టగలదు తను.
    ఇసుక ఎడారిలో జలాశయం కనిపించినట్టయింది వారుణికి. ఈ వారం రోజులుగా ఆ యింట్లో ఆమెకి ప్రతిదీ సమస్యగానే తయారైంది. తమతమ వ్యక్తిత్వం, అభిరుచులు ఎలా వున్నాయో, యితర్లూ వాళ్ళ అభిరుచులు అలాగేనని యీ మనుషులు ఎందుకు అనుకోరో అనిపించింది.
    ప్రతివ్యక్తీ యితర్ల విషయంలో స్వాత్మతని సాధించగలిగితే యీ ప్రపంచంలో ఏ కుటుంబంలోనూ అపార్ధాలు, అపోహలు, గొడవలు రానేరావు కదా అనుకుందామె.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS