Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 15


    "ఆయ్! పొరపాట్లనేవి అనేక రకాలుగా జరగొచ్చండి. ఉత్తరము అంతా రాసి అడ్రస్సు రాయడం మరిచిపోయేరనుకోండి, అప్పుడు ఎట్లా వస్తదండీ?"

 

    రామబాణంలాంటి ఆ ఉదాహరణకి కృష్ణమూర్తి బెదిరిపోయేడు. నిజమే! అడ్రసు రాసేడో లేదో గుర్తులేదు. ఆ కంగారులో రాయకపోయినా పోవచ్చుననే ఆ;ఆలోచన రాగానే నుదురుమీద గబగబా కొట్టుకున్నాడు.

 

    అప్పటికే అప్పలకొండ అక్కడినుంచి జాగ్రత్తగా నిష్క్రమించేడు.

 

    కృష్ణమూర్తికి బెంగ ఎక్కువయింది. ఊరంటూ వెళితే ఏ ఊరు వెళ్ళినట్టు? ఎప్పుడు వచ్చేట్టు?

 

    పరీక్షలయిపోగానే పద్మ బందరు వెళ్ళిపోతుంది. దట్ మీన్స్ ప్రేమ వెళ్ళిపోతుందన్నమాట. ఈలోగా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే తండ్రిని అడగాలి. అడిగితే కాదనడనే నమ్మకం తనకుంది. పద్మ వెళ్ళేలోగా తండ్రి రావాలిగదా?

 

    కృష్ణమూర్తి ఫోను అందుకున్నాడు. తండ్రి వివరాలు ఆఫీసులో తెలుస్తాయనే ఆశతో సత్యం ఇండస్ట్రీస్ కి ఫోను చేశాడు.


                                                                  13


    ఆ ఊళ్ళో గోపాలం ఇంటిముందు సత్యం కారుదిగుతున్నప్పుడు గోపాలం వాళ్ళ తాతలనాటి గడియారం సరిగ్గా అయిదంటే అయిదుగంటలు కొట్టింది.

 

    కాలు నేలమీద పెట్టగానే శుభమని గంటలు వినిపించడం మంచి శకునంగానే సత్యానికి తోచింది.

 

    మంచిశకునం కాకపోతే ఏమిటి మరి?

 

    భూలోకంలో అంత అందమయిన అమ్మాయి ఉంటుందని తాను కలగన్నాడా? ఆ పిల్ల సాక్షాత్తు గోపిగాడి కూతురే అవుతుందనిఎవరయినా జోస్యం చెప్పేరా?

 

    ఆఫ్టరాల్ గోపిగాడెవడు?

 

    యస్సెసెల్సీ రోజుల్లో తన లెక్కల పేపరు కాపీకొట్టి పాసైనవాడు కాదూ? ఇప్పుడెంత స్థితి కెదిగినా కాపీకొట్టి పాసైన చరిత్ర వాడిది!

 

    ఇన్నాళ్ళుగా ఆ కాపీ వెధవ గుర్తుకు రానందుకు బాధగా వున్నా వాడికో అందమైన కూతురుండి, ఆ పిల్ల తనకి కోడలు కాబోతున్నందుకు బోలెడు ఆనందించేడు.

 

    గోపాలం ఇల్లుకూడా గొప్ప డాబుసరిగానే వుంది.

 

    సత్యం ఆ ఇంట్లోకి అడుగు పెట్టేడు.

 

    పెద్ద హాలది. సోఫాలు వగైరా అడంబరాలతో అందంగా వుంది.

 

    అంత అందమైన వాతావరణం గోపాలం కేకల్తో భీభత్సమై పోయింది.

 

    గోపాలం కేకల్తోనే సరిపెట్టుకోలేదు. చేతితో తుపాకీకూడా వుంది. దాన్తో హైరానా పడుతున్నాడు కూడా!

 

    అతని రుద్రావతారం చూళ్లేక అతని భార్య అతని కాళ్ళావేళ్ళా పడుతూ బ్రతిమలాడుతోంది. చట్ వీల్లేదంటున్నాడు గోపాలం. "నీక్కాదూ చెప్తూంట తప్పుకోమని" హెచ్చరిస్తున్నాడు.

 

    కాల్చి చంపనిదే తనకసి తీరదంటున్నాడు.

 

    అతని ప్రతి బెదిరింపుకీ "తగదునాధా" అంటూ అతని భార్య బ్రేకులేస్తోంది.

 

    ఈ వరస సత్యానికి బోధపళ్ళేదు.

 

    రాకూడని వేళలో వచ్చినందుకు కించిత్తు సిగ్గుపడ్డాడు కూడాను. ఇంటి గొడవలు సవాలక్ష వుంటాయి. అయితే మాత్రం-తుపాకీ పుచ్చుకుని శివాలు తొక్కేంత అవసరమేమొచ్చింది?

 

    ఇంతకీ గోపాలం ఎవర్ని ఎందుకు కాలుస్తానంటున్నాడో మనిషికంత కోపం ఎందుకు వచ్చిందో సత్యానికి అర్ధం కాలేదు.

 

    గోపాలం యింకా చిందులు తొక్కుతూనే వున్నాడు. ఆ కోపంలో సత్యాన్ని కూడా పట్టించుకోలేదు.

 

    ఆ లెవల్ కోపంలో అతనికి సత్యం కనిపించకపోయినా ఆశ్చర్య పడక్కర్లేదు.

 

    మేడ దద్దరిల్లేట్లు రంకెలు వేస్తున్నాడు గోపాలం---

 

    నా కడుపున చెడ పుట్టిందే! నా పరువూ ప్రతిష్ఠలు గంగలో కలిపింది. ఇంత చేసినదాన్ని క్షమించడం నాచేతకాదు. అడ్డం తప్పుకో!"

 

    గోపాలం భార్య రెండుచేతులూ జోడించి ఏడుస్తూ అంటోంది.

 

    "చిన్నపిల్లండి? తెలిసో తెలీకో చేసిన తప్పు క్షమించలేరా?"

 

    "తెలిసో తెలీక కాదే! నన్ను దెబ్బతీయాలనే అంతపని చేసింది. మనకులం కాదు మన మతం కాదు. ఎవడో లోఫర్ వాడితో లేచిపోయిందంటే నేను బ్రతికేం ప్రయోజనం? దాన్నీ ఆ బాస్టర్డ్ నీ ఎక్కడున్నా వెతికి మరీ కాలుస్తాను. ఆ ఇద్దర్నీ చంపి నేనూ చస్తాను. ఆనక నువ్వు చావు. అందరం చద్దామే. టైంలేదు. తప్పుకో" అంటూ తుపాకీ మడంతో ఆమెను కొట్టేడు.

 

    నిజానికి ఆ దెబ్బతో ఎంత లావుమనిషైనా స్పృహతప్పి పడిపోవాల్సిందే! చీపురుపుల్లలా వున్న ఆమెకు మాత్రం స్పృహదప్పితే కన్న కూతురు ఏమైపోతుందో నన్న ఆందోళన అమెనింకా స్టడీగా నిలబెట్టగలిగింది.

 

    అంచేత అంత దెబ్బతిన్నాకూడా ఆమె గోపాలానికి అడ్డంపడి ఇంకా బ్రతిమాలుతూనే వుంది.

 

    కథేమిటో అర్ధంచేసుకున్న సత్యం నీరుకారి పోయేడు. గాయత్రిని కోడలుగా చేసుకుందామని ఎంతో ముచ్చటపడి ఇంతదూరం వస్తే---ఆ గాయత్రి ఎవడ్తోనో లేచిపోయిందనే వార్త సత్యం గుండెల్లో గట్టిగానే గుచ్చుకుంది.

 

    అసలు కృష్ణమూర్తికి తన చేతులమీదుగా పెళ్ళంటూ చేయగలడానే డవుటు కూడా అతనికి అప్పుడే కలిగింది.

 

    వచ్చినపని అయిపోయింది గనక గుట్టుచప్పుడు గాకుండా తిరుగు ప్రయాణం చేయడం శ్రేయస్కరమని సత్యం వెనక్కి తిరిగేడు.

 

    రెండడుగులు కూడా వేసేడు. "ఆగు" అని గోపాలం సింహగర్జన వినిపించింది.

 

    తన కాళ్ళకి బ్రేకులు పడినట్టుగా ఆగిపోయేడు.

 

    గోపాలం తన భార్యతో అంటున్నాడు---

 

    "చూడవే? వాడిని చూడు! కోటీశ్వరుడు. మన కులంవాడు. పైగా నాకు ఆప్తమిత్రుడు. వాళ్ళబ్బాయికి మనమ్మాయిని చేసుకోడానికి వచ్చిన ఫ్రెండు. ఇప్పుడు వాడికేం చెప్తావో చెప్పవే? మనమ్మాయి లేచిపోయిందని చెప్తావో? చచ్చిపోయిందని నమ్మిస్తావో నీ యిష్టం. ఏదో ఒకటి చెప్పి పంపించు."

 

    కొత్త మనిషి-అందునా భర్తకి స్నేహితుడు. అకస్మాత్తుగా వచ్చేడని తెలీగానే ఆమెకు కొత్త ఆశ ఒకటి కలిగింది. కనీసం ఈ వ్యక్తి వల్లనైనా భర్త ఉగ్రరూపం శాంతింప చేయవచ్చనే నమ్మకంతో ఆమె సత్యాన్ని ప్రాధేయపడింది-

 

    "అన్నయ్యగారూ---మీరైనా చెప్పండి. గాయత్రి ఉత్త అమాయకురాలండీ! అన్నెం పున్నెం తెలీని పిల్ల. అదేదో తొందరపడిందే అనుకోండి. అంతమాత్రాన దాన్ని చంపుకుంటామా? చెప్పండన్నయ్యగారూ- చెప్పండి?"

 

    ఆ తల్లి మొహంలో కనిపించిన దైన్యానికి సత్యం కరిగిపోయేడు. గాయిత్రి తనకు కోడలు కాలేక పోయినందుకు వర్రీ అవుతున్నా-ఆ పిల్లను బతికించాలనే తాపత్రయంలో అతను గబగబా గోపాలాన్ని చేరుకున్నాడు. అతని చేతిలో తుపాకీని గుంజుకున్నాడు.

 

    తుపాకీ సత్యం చేతిలో చేరగానే గోపాలం మంత్రించిన మనిషిలా మారిపోయేడు. చేతుల్తో మొహం కప్పుకుని ఘొల్లున ఏడ్చేసేడు.

 

    సత్యం అతన్ని దగ్గిరకు తీసుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS