"నాన్నా! ఇవన్నీ పిచ్చివూహలు. అతడు నిన్ను గుర్తించి వస్తాడా?"
"రాకపోతే పోనీరా!"
"అలా అనకండి. మనం వెళ్ళి యాచిస్తేనే పనులు జరగటం కష్టం. అయినా మీరు మొదటినుంచీ అంతే..."
"ఏం చేశానోయ్?" నవ్వుతూ ప్రశ్నించారు.
"జ్యోతి విషయంలో పక్షపాతంగానే వ్యవహరిస్తున్నారు. ఆమెకి ఇప్పుడు ఉద్యోగం దొరక్కపోతే జరగదని కాదు. ఆమాటకొస్తే ఒక్కో నెలలో జీతం కంటే ఎక్కువే వస్తుంది. కానీ పర్మినెంటు ఉద్యోగం అయితే భద్రత వుంటుంది, గ్యారంటీ వుంటుంది."
"నిజమే కాదనను_ దానికి నేనేం చేయలేను."
"మీకనిపించవచ్చు ఆమె ఆదాయం అంతా తండ్రిగారికే ఇస్తుంది కదాని."
"నేనెప్పుడూ అలా అనుకోలేదు నాయనా కంగారుగా వారించారాయన.
అయినా జానకిరాం వినిపించుకోలేదు.
"ఆ తల్లిదండ్రులిద్దరూ పోయాక అదంతా మనదేకదా! ఆ యిల్లుచాలు_ కొన్ని వేలు చేస్తుంది. అయినా కొడుకయినా కూతురయినా జ్యోతి ఒక్కతే వాళ్ళకి దిక్కు. ఆమె వాళ్ళను ఆదుకోవటం తప్పంటారా?"
"తప్పని నేను అనలేదు_ ఇక ముందు అనబోను. ఆ ఉద్యోగం కోసం అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం నాకు చేతకాదు" ఖచ్చితంగా అన్నారాయన.
పార్వతి ఏదో అనబోయింది_ కానీ భర్తముఖం చూసి వూరుకుండి పోయింది.
జ్యోతి లేచి నుంచుంది_
"మావయ్యా! మీకు శాస్త్రాలు తెలుసు. ధర్మాలు తెలుసు. అయితే ఏం లాభం? మీకు లౌక్యం తెలియదు" కోపంగా అనేసింది.
"వదినా!" అరిచాడు కోసలరాం.
"మీరు పెద్దవారు. మిమ్మల్నేమీ అనకూడదు_ ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు మాత్రం మీరు చాలా దురుసుగా ప్రవర్తించారు."
"నాకేం నువ్వు చెప్పనక్కర్లేదయ్యా" కోపంగా విదిలించేసింది జ్యోతి.
"కానీ_ కొన్ని కొన్ని సమయాల్లో చెప్పక తప్పదనిపిస్తుంది. నేనూ మీలాగా బి.ఏ. పాసయ్యాను. టైపు షార్టుహాండ్ వచ్చు. ఇంకా ఎధిలెటిక్ క్వాలిఫికేషన్సు వున్నాయి. అయినా నా ఉద్యోగం కోసం నాన్నగారు ఎవర్నీ యాచించలేదు."
"అవకాశం వచ్చినపుడు ప్రయత్నించటంలో తప్పు లేదుగా, అదేదో మహాపరాధమైనట్లు నీవు మీ నాన్నగారు ముఖం గంటు పెట్టుకోవడం దేనికి?"
"ఆత్మాభిమానం చంపుకోలేక. స్వతంత్రంగా బ్రతకమని నన్ను స్టాంపు వెండర్నీ చేశారు. నెలనెలా ఎల్.డి.సి. జీతం వస్తోంది నాకు. చాలు ఇండిపెండింట్ లైఫ్! మీరూ అంతే! ఉన్నదానితో తృప్తిపడక ఆయన్ని హింసిస్తారెందుకు?"
అసహ్యంగా చూసింది జ్యోతి. నీతో నాకేం అన్నట్లు తలెగరేసింది. జానకిరాంకి మండిపోయింది. అతనికి తమ్ముడిని తన్నేయ్యాలన్నంత కోపం వచ్చింది. కానీ తండ్రిముందు అవిధేయతగా ప్రవర్తించటం ఇష్టంలేక వెళ్ళిపోయాడు.
జ్యోతి అతన్ని అనుసరించింది.
"భోజనానికి లేస్తారా?" అంది పార్వతి.
"పద! మన మానసిక వ్యధలతో శరీరాన్నెందుకు కష్టపెట్టాలి" అని లేచారు శాస్త్రిగారు.
అప్పుడే శ్రీవిద్య వచ్చింది.
* * * *
"ఏమ్మా అలా వున్నావ్!" దీనంగా వున్న కూతుర్ని చూసి ప్రశ్నించారు శాస్త్రిగారు.
తండ్రి అంత ఆప్యాయంగా ప్రశ్నించేసరికి ఒక్కసారి ఏడ్చేసింది శ్రీవిద్య.
"ఏమైంది? ఏమైందమ్మా?" కంగారుగా ప్రశ్నించారందరూ.
"మా మాస్టారి చెల్లెలు చనిపోయింది నాన్నా!" వెక్కిళ్ళు పెడుతూ అంది.
నిర్ఘాంతపోయారాయన. "హిమాద్రి చెల్లెలు చనిపోయిందా?" తనలో తనే అనుకున్నారు.
"అవున్నాన్నా! ఎండ్రిన్ తాగి చనిపోయింది. హిమాద్రి మాష్టారు తోటకి స్ప్రే చేయించాలని ఇంట్లో తెచ్చి పెట్టారట, మధ్యాహ్నం నాలుగింటికి తాగేసింది. ఆరుగంటలదాకా కనుక్కోలేదు. పెరట్లో బావిగట్టున చెట్టుక్రింద అరుగుమీద నిద్రపోతోందనుకున్నారు.
"అంతసేపు కనుక్కోకుండా ఏం చేస్తున్నారూ?" పార్వతి నొచ్చుకుంది.
"తీరా కనుక్కోకుండా ఏం చేస్తున్నారూ?" పార్వతి నొచ్చుకుంది.
"తీరా ఇంత పొద్దయిందే అని లేవబోతే ఏముంది? చనిపోయింది తర్వాత ఓ అరగంటకే.
"తులసికేమైంది ఎండ్రిన్ త్రాగటానికి" అడిగాడు కోసలరాం.
"వాళ్ళ మేనత్త కొడుకుతో పెళ్ళి ఖాయం చేశారు. అతనికి బొకారాలో వుద్యోగం వచ్చింది. జాయినై తిరిగి వస్తూ వుంటే కటక్ వద్ద ట్రయిన్ యాక్సిడెంటులో పోయాడతను. వుదయం టెలిగ్రాం వచ్చిందట. మాష్టారుగారు నర్సాపురం వెళ్ళారుట.
పరధ్యానంగా వున్న తులసిని చూసి ఏమో అన్నదట వాళ్ళ వదినగారు. అంతే ఎండ్రిన్ తాగేసింది.
"శివశివా!" అన్నాడు శాస్త్రిగారు.
"అంత చిన్న విషయానికే చనిపోవాలా? ఎంత ధైర్యం చేసింది?" కోసలరాం బాధగా అన్నాడు.
"అసలు దానికి చావంటే భయమో నాన్నా! చనిపోయిన వాళ్ళని చూడటమన్నా, వాళ్ళని గురించి వినటమన్నా ఎంతో భయంతో వణికిపోయేది. అలాంటి పిల్ల ఎలా తెగించిందో ఏమో!" స్వాతికి దుఃఖం ఆగటంలేదు.
"ఏం కాలమో ఏమో! అందరికీ ఇదో తేలిక పనయిపోయింది. కాస్త కష్టం వస్తే చాలు. చావాలనుకోవటమే. దాన్ని ధైర్యం ఎదుర్కొందామానుకున్నారు. చచ్చి ఏం చేస్తారు? బ్రతికుంటే ఏమైనా చేయొచ్చు గాని" విచారంగా అంది పార్వతి.
"వాళ్ళ బావ చనిపోగానే దానికీ జీవితం మీదే విరక్తి పుట్టిందేమో! ఎటూ ఆలోచించకుండా ప్రాణాలు తీసేసుకుంది.
"స్నానం చెయ్యాలమ్మా! నువ్వు వెళ్ళు" అన్నారాయన కూతురితో. ఆమె అదే విషయం తలుచుకుని తలుచుకుని బాధ పడుతుంటే ఆయన భరించలేకపోయారు.
