Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 14

 

    సెరబయ్య వోగుడు ఎంకన్న కి నచ్చలేదు. ఉండబట్టలేక 'సెరబయ్య !" అంటా అరిశాడు.
    "ఏం?"
    "నోరు మూయ్!"
    మూసుకున్నాడు. ఎంకన్న బుర్రలో అలోసన్లు గిరగిరా తిరిగి పోతన్నాయి. ఆడూ, బద్రయ్యా-- ఆడూ, బద్రయ్యా, కాంతవూ-- ఉట్టి బద్రయ్యా, కాంతవూ -- ఆడికి ఆడే మిగిలాడు!
    గుమ్మం లో కెల్లాక, రమ్మన్నదల్లా, మల్లా ఎలపలి కెందుకు రాలేదు? తనంటే కాంతానికి మనుసయినప్పుడు, బడ్రయ్యకి ఉలుకెందుకో? తను కూడా డబ్బిచ్చుగుంటన్నప్పుడు, అది ఆడు దాసి పెట్టిన సొత్తేల్లాగావుతాది? అది మట్టుక్కూ బద్రయ కెందుకు జడిసిందీ? తను మాత్రవెం తక్కువా?
    స్సీ! అ జాతే అంత!
    మనసిరిసేసాక దాని వూసేత్తడం తందె తప్పు! మురిపించి, మురిపించి మూతి మీద తన్నీ రకం!
    డబ్బుకీ, మనసుకీ సుట్టరికం లేదు. లచ్చలికి లచ్చలు కాళ్ళ కాడ గుమ్మరించినా, యీ బూ పెపంచకంవులో మనసిప్పి మాటాడేవొళ్లు లేరు.
    తన కొరికి సుట్టూతా అల్లుకున్న ముళ్ళ కంచి సెంద్రకాంతం! ఇంకా పాకితే, నరకడానికి తయారుగా ఉన్న పదును గొడ్డలి బద్రయ్య!
    "రాయసంద్రవెల్లబోకు
    రంగు బట్ట కట్టబోకు -- రాయ" అంటా పదం పాడతా ఉన్న సెరబయ్య కేసి వొడిగా సూశాడు ఎంకన్న. స్సట్టుక్కుని లేసి అడి దగ్గిరికి లగేత్తుకోచ్చాడు సెరబయ్య.
    "సూడు ఎంకన్నా! దాని మీదే మనసు నిలుపుతావెందుకు? సరిగా డబ్బెట్టావంటే, కాంతాన్ని మించినోళ్ళు కోయంటే కోటి మందోత్తారు. దాన్ని నువ్వు మరిసిపోకపొతే బద్రయ్య తో నీకేల్లాగా గొడవ తప్పదు. నీ యాపారం బుగ్గయిపోతాది. నీకున్న మనుషులూ, నువు కావాలనుకునీ సుకాలూ, ఏయీ తీరకుండానే వూడబెరికి గోదాట్లో యిసిరేత్తాడాడు. మన్లో మనకి పోటీ లెందుకు ఎంకన్నా? మనవంతా కలిసి పనిసేత్తే అందరం గోప్పోల్లవయిపోవూ? నీ సేత కొత్త ఏపారవేదో సేయిత్తానని యీ యేలే బద్రయ సేప్పాడు! మా అందరి కంటా నువ్వంటే ఆడికి మా సెడ్డ యిట్టవు! ఆడి మనసిరిగి పోయిందంటే , నీకేక్కడా యింక మంచి నీల్లుట్టవు. మన్నిసుట్టూ తిప్పుకోడం తప్ప యిడిత్తే, అసలు ఆడోళ్ళల్లో ఏవున్నాదీ అంట? మనకున్న సీవూ నెత్తురే ఆళ్ళకీ ఉన్నాది. మిగిలిన సొగసులన్నీ మన్ని గుప్పిట్లో పెట్టుగోడానికే తెచ్చి పెట్టుగుంటారు. ఆళ్ళమాయిలో పడ్డావో, నీ కళ్ళకి పొరలు కమ్మేత్తాయి. నా మాటిను! సుకవంటే ఆడోళ్ళల్లో లేదు బెదరూ! మన మనసుల్లో ఉన్నాది. రొండు సేతుల్నిండా డబ్బు గడించేదారి సూడు ముందు. అది దొరికితే లచ్చ సుకాలు దొరుకుతాయి! ఏవంటా?"
    ఆడు మాటాల్లేదు.
    "కొత్త యాపారం సేత్తావా మరి?"
    ఈడి కేసి తిరగాలేదు.
    "నీరసంగా ఉన్నాదా? పోనీ రేపు మాటాడ దారిలే! ఇంకో గళాసు ఏసుగుంటావెంటి?"
    పక్క బల్ల మీదున్న సీసా తీసి, సెరబయ్య మల్లా గళాసులో పోశాడు. ఈసారి ఎంకన్న గళాసు నిండా తాగాడు. సీసా దాసేసి మల్లా వొచ్చి బల్ల మీద పడుకున్నాడు.
    "ఆ కత్తికి రొండోపులా పదునే!" అంటా గొణుక్కున్నాడు ఎంకన్న.
    "ఏంటదీ?" మగతగా అడిగాడు సెరబయ్య.
    మాటాడకుండా , పొడుగ్గా మూలిగి ముందలికి వోలిపోయాడు ఎంకన్న.
    తెలతెల వోరతా ఉండగా లేసి, మొకం కడుక్కుని గోదారి, రేవులో దిగి కడవలో నీళ్ళు ముంచుకు వోత్తా ఉన్నాది సీతమ్మ.
    అప్పటికప్పుడే సానాసేపటి ఎనకే నిదరలేసి బద్రాది రావయ్య కి మేలుకొలుపు పాడతా వున్న ముసలయ్య, పాట ఆపేసి దానికేసే సూత్తా వున్నాడు. సలాసని వొళ్ళూ, సన్నని సేతులూ, కోలమొకం , నున్నని సేక్కిళ్ళూ , సనసన్నగా సినుకులు రాల్తావున్న మబ్బుల అకాసెం లాగ తడి తడిగా నల్లటి జుట్టూ --
    "ఏ దేవుడు తపస్సు సేత్తావున్నాడో దీని కోసం!' అనుకున్నాడు ముసలయ్య.
    దాన్ని సూత్తావుంటే ఆడికి ఎనకటి రోజులు గురుతోచ్చినాయి. రోజులు సజావుగా నడిత్తే, సిట్టికి మాత్రం తను పెళ్ళి సెయ్యవొలిసినోడు కాడో? అది బతికున్నాదా? ఏనాటి కెనా ఆ బద్రాసేలం రావయ్య తన సిట్టిని తనకి సూబించక పోతాడా? ఈ జనవానికి అరాతున్నదా?
    సిట్టీ, సివయ్యా, సూరీ , రాజియ్యా!-- ఆళ్ళ వూసు తలుసు కోడంతో ఆడి మొకం లో నెత్తురివికినాది.
    ఆళ్ళేవురో , తనేవురో! పెళ్ళాం లేదు, బిడ్డలూ లేరు! సుట్టాలింక అసలే లేరు. రావయతండే అడికంతా! అయిన తప్పకండా కనికారం సూబిత్తాడు. ఈ ముసలితనం లో ఈ బాధలన్నీ మరిసిపోయి, అయిన సేవలోనే రోజేల్లబెట్టుకుంటాడు. ఎప్పటికో దయ తలిసి, తన్ని యీ పాడు పెపంచకవులోంచి తీసుక పోయి ఎక్కడికో-- ఎక్కడెక్కడికో , నీళ్ళు లేని సవుద్రాలు దాటించి గాలిలేని ఆకసాలు తోసేసి, యింకా యింకా పైపైకి తీసికెళ్ళి పోతాడు.
    అక్కడ , తన్ని ఎక్కిరిబించీ మనసులుండరు. మొగుల్ల ని యిడిసేసీ పెళ్లాలుండరు కాళ్లు యిరగోట్టే యుద్దాలుండవు. తన బతుకంతా డోసుకు తీసుకునీ మోసాలుండవు. కూటి కోసం సెడ్డ పన్లు సేయ్యక్కర్లేదు. పరువు కోసం అబద్దాలాడక్కర్లేదు. పేరు కోసం అన్నాయాలు సేయ్యక్కర్లేదు. మోసగాళ్ళ కి మొక్కక్కర్లేదు. ఇట్టం లేనిదానికి బలవంతం లేదు. మనసులో వోమాటా, ఎలపాలి కింకో మాటా అడతా నోటిని తాటిపట్టె సేయ్యక్కల్లేదు. ఈ బూమ్మీదుండగా తను బతికిన సెండాలం బతుకు తలుసుకుని రోతపడక్కల్లేదు. ఆ సీరావసేంద్రమూర్తి పాదాల కాడే వోలిపోయి అయినలోనే కలిసి పోతాడు. ఆడే అయిసయి పోతాడు!
    ముసలయ్య కళ్లలో నీళ్ళే వోరిగినాయి. అయి వొంచేసీ లోగానే సీతమ్మ వొచ్చి అడేదరకూకున్నది. ఆడి కళ్లలో కే సూత్తా కూసున్నది.
    "ఏంటి తాతా?"
    ఆడు మాటాడలేదు. గబగబా కళ్ళు తుడుసుకున్నాడు.
    "ఒంట్లో బాగో లేదా?"
    "ఉ?హు!"
    "మనసులో బాదగా ఉందా?"
    "నువ్వుండగా నాకు బాదెంటమ్మా?"
    సీతమ్మ సన్నగా నవ్వినాది.
    ఎట్టో పడి కొట్టుకొచ్చిందానికీ, యుద్దంలో కాల్లిరగ్గోట్టుకుని వూల్లెంబడి తిరిగి తనకీ సుట్టరికవేంటి?
    'ఇంతకాలం తను బతికి ఉన్నాడంటే దాని లాలింపు కోసవే నేవో?' అనుకున్నాడు ముసలయ్య. బలవంతంగా తెచ్చుకుని నవ్వాడు. దాని మెడ సన్నగా, బోసిగా ఉన్నట్టని పించినాది. ఒక్క వొంటి పేట గోలుసుంటే దానికి ఎంతందవోచ్చేదో?
    "కుసిన్నీ గెంజి నీళ్లు తాగుదూ గాని, లోనకి రాతాతా!" ఆడు మాటాల్లేదు. వోద్దనీ అనలేదు. కర్రవూతం తీసుకుని నిలుసుని, రొండో సెయ్యి దాని బుజమ్మీద ఏసుకుని , మేల్లిగా అడుగేశాడు.
    'ఈయేల గొలుసు సంగతి తెలిసేయ్యాలి!' అంటా గొనుక్కున్నాడు.
    "ఏం గొలుసు తాతా?"
    "నీ జిగినీ గొలుసు!'
    గెంజి తాగి సెయి కడుక్కుని తుడుసుకోబోతా వుంటే బద్రయ్య గుడిసి లో కొచ్చాడు.
    సూదుల్తో పోడిసినట్టు సూశాడు ముసలయ్య. అటికిఅడు ఆగలేకపోయాడు.
    ముసలోడంటే బద్రయ్య కి బయవే! ఆడు తనతో ఎప్పుడూ ఎక్కువ మటాడ్డు. మాటాడేడో , తన్ని సిత్తు సేసేడన్నమాటే!సూటిగా ఎల్లీ వొళ్ళతో అదే గొడవ!
    కాయిడి పెట్టె లోంచి సిన్న డబ్బా తీసి దాంటో ఉన్న రూపాయి నోట్లు కొంచెం ఎలపలికి తీసి, మల్లా మూత పెట్టేశాడు.
    ఎల్లిపోబోతావుంటే, ముసలయ్య పిలుపు యీపుమీద సరిసినట్లు అనిపించినాది. ఎనక్కి తిరిగాడు బద్రయ్య.
    "దాని గొలుసు దాని కిచ్చెయ్ రాదో?"
    బోన్లో నిలుసున్న దొంగోడిలా సూశాడు బద్రయ్య.
    "అది అమ్మేశాను!"
    "మరోటి సేయించూ!"
    గుమ్మానికి తగలకుండా తలొంచుకుని ఎల్లిపోయాడు బద్రయ్య.
    అడి లక్కీ సాన్సు ఏదో తను అమ్మేసిన గొలుసు లాటిదే దొరికినాది. దర కోసం ఎనక తియ్యకుండా ఎంటనే కొనేశాడు.
    అది జేబీలో పెట్టుకుని తెత్తావుంటే , లోన గుచ్చుకుని గుండిలు గోలేట్టినాయి.
    ఉసారుగా సోరబడ్డాడు . ముసలయ్య లేడు. సీతమ్మ కొప్పు ముడేసుకుంటా ఉన్నాది. ఈడ్ని సూసి నిలుసుంది. ఎందుకన్నట్టు సూడనూ సూసింది. ఎందుకంటె , ముసలోడు లేనప్పుడు ఆడు లోనకి రాడానికి యీల్లేదు కనక!
    "ఎందుకు సెప్మా?' అనుకున్నాది.
    జేబీలో వున్న రంగుల పెట్టి తీసి, మూత తెరిశాడు.
    దాని కళ్ళు జిగేలు మన్నాయి.
    తనదే, జిగినీ గొలుసే!
    అడక్కుండానే సేతులు ముందికి జరిగి అందుకోబోయాయి. కాని నిల్దోక్కున్నాది.
    సొగసుగా దాని సేతికిత్తా అన్నాడు గందా--
    "బాగున్నాదా?"
    అది మాటాడకుండానే కళ్ళింత సేసుకుని గొలుసు సూసుకుంటా మురిసి పోయినాది.
    "ఎల్లా వుందీ?"
    ఎళ్ళతో తడవ బోయింది. ఆడు అడ్డేట్టాడు.
    "నీ మెళ్ళో నువ్వెట్టుగుంటే ఏవుంటాదే?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS