Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 14

 

    సరదాగా సంభాషణ దానంతటది కలవాలి కాని, మనం మాట్లాడాలి అనుకుంటే అదేమిటో అప్పటికప్పుడు ఒక్కటీ దొరకదు' అనుకుంటూ , 'శ్యామలమాటలు నమ్మకండి , తనేదో అంటూనే వుంటుంది.' అంది చివరికి-- ఆ తరువాత అట్టే కబుర్లు చెప్పుకునే వ్యవధి లేకుండానే దియేటరు దగ్గిర కారు ఆగింది.
    టిక్కెట్లు తీసుకుని లోపలికి వెళ్ళారు-- సినిమా మొదలయింది -- 'ఇప్పటి మట్టుక్కి ఫరవాలేదు-- కాస్త వంటి నిండా బట్టలున్నాయి .' అనుకుని ఎప్పటి కప్పుడే తృప్తి పడుతుండేది సురేఖ -- ఆ సినిమా అంతా ఏడుపే. - అదేం ప్రారబ్ధమో అలాంటి సినిమాలు చూస్తుంటే సురేఖ కళ్ళల్లోంచి కూడా నీళ్ళు ఓడిపోతాయి.
    'అదంతా నిజం అనుకుంటున్నా వేమిటి -- వాళ్ళు అలా నటించటానికి ఎంత డబ్బు తీసుకుంటారో తెలుసా? నువ్వు డబ్బు పెట్టి టిక్కెట్టు కొని ఏడుస్తావు .' అనేది శ్యామల హాస్యంగా.
    'అది నిజం కాదని తెలియకనా -- ఏమిటో తనలో ఆ బలహీనత. అనుకుంటూ ఇటు ప్రక్కన కూర్చున్న శకుంతలమ్మ అటు రెండు కుర్చీల అవతల వున్న మాధవ్ ఎక్కడ గమనిస్తారో అన్నట్లు తలతిప్పకుండా మధ్యమధ్య రుమాలు తో చెంపలు తుడుచుకుంటూ కూర్చుంది.
    ఇంటర్వెల్లో లైట్లు వెలిగాయి -- శకుంతలమ్మ ఏదో అడుగుతుంటే తల తిప్పి చూసింది సురేఖ . ఆవిడ కళ్ళు కూడా అలాగే వున్నాయి. ఇద్దరూ ఒకర్ని చూసి ఒకరు సిగ్గుపడి పోయారు -- ఇక మళ్ళీ లైట్లు ఆరిపోయి సినీమా మొదలయింది. ఆ రెండో సగం మరీ ఘోరంగా వుంది-- అయినా సురేఖ శకుంతలమ్మా మరి మొహమ్మాట పడకుండా కరువు దీరా ఏడ్చేశారు. ఆ తరువాత లేచి వచ్చేస్తూ .
    'ఏడిస్తే ఏడిచాం కాని సినిమా బాగుంది' అంది శకుంతలమ్మ.
    'ఈసారి నుంచి మీరూ మా అక్కయ్యా రుమ్మాళ్ళ బదులు తువ్వాళ్ళు తెచ్చుకోండి.-- అసలు మీలాంటి వాళ్ళ కోసం టిక్కట్టు తో పాటు ఓ కర్చీఫ్ కూడా ఇచ్చే పద్దతి పెడుతున్నారుట విదేశాలలో.' అన్నాడు మాధవ్.    కారు మాధవ్ ఇంటి ముందు ఆగింది. చంద్రం పరుగెత్తుకుంటూ వచ్చి గేటు తెరిచాడు.
    వీళ్ళు కారు దిగి కాళ్ళు కడుక్కుని వచ్చేసరికి టేబిలు మీద అన్నీ సర్దేసి వడ్డించేశాడు చంద్రం.
    'మారు కావలిస్తే మేం వడ్డించుకుంటాం లే -- నువ్వెళ్ళి చదువుకో -- రేపెం పరీక్ష ' అన్నాడు మాధవ్.
    'ఇంగ్లీషు ' అన్నాడు చంద్రం నెయ్యి వడ్డిస్తూ , 'మేం వేసుకుంటాం లే -- నువ్వెళ్ళు , మాధవ్ మరోసారి హెచ్చరించటం తో చంద్రం వెళ్ళిపోయాడు.
    'హాయిగా పెళ్ళాం వుంటే ఈ అవస్థ వుండదు -- వీడి చదువూ వంటా బాగానే వున్నాయి -- బోలెడు దుబారా కూడా చేసేస్తాడు .' మెల్లిగా సనుక్కుంది శకుంతలమ్మ.
    'నయమే -- ఎంత జాగ్రత్తగా వుంటాడో తెలుసా? క్లాసు పరీక్ష లేవో వున్నాయనీ, అదయినా నేను అన్ని సార్లు చెప్పాననీ వెళ్ళాడు కాని లేకపోతె నాకు ఏం కావాలో నేను అడగక్కర్లె'కుండానే గ్రహించుకుని అమర్చి పెడతాడు - కట్టుకున్న పెళ్ళాం కూడా అంత శ్రద్దగా చూడదు.' పెంకిగా జవాబు చెప్పాడు మాధవ్ మెల్లిగానే.
    పిల్లలు ముగ్గురూ చేతులు నోటికి అడ్డం పెట్టుకున్నారు -- శకుంతలమ్మ మూతి ముడుచుకుంది.
    భోజనాలు అయాయి-- కంచాలు అవతల పెట్టాలి , బల్ల శుభ్రం చెయ్యాలి అవి కూడా మేమే చేసుకోవాలా అన్నట్లు శకుంతలమ్మ తమ్ముడి వంక చూసింది -- అతనేం సమాధానం చెప్పకముందే చంద్రం బల్ల ముందు హాజరయ్యాడు--
    చంద్రానిది దగ్గరలో నే వున్న ఓ పల్లె టూరు -- అక్కడ అందుబాటు లో వున్న చదువు అయిపోయాక పట్నం వెళ్ళి చదువు కోటానికి శక్తి లేక, వారాలు చేసుకుని చదువుకోటానికి ఆత్మాభిమానం అడ్డు రావటం చేత బ్రతుకు తెరువు వెతుక్కుంటూ హైదరాబాదు వచ్చిన అతనికి మాధవ్ దొరకటం అదృష్టమే అనాలి-- చంద్రం లాంటి వాడు దొరకటం నాదీ అదృష్టమే అంటాడతను నవ్వుతూ.
    'నిజమే -- నువ్వు మరోకడిని చూసుకో - పిల్లలతో చేసుకోలేక మా ఆవిడ నానా అవస్థా పడుతోంది-- బుద్దిగా పనిచేసే నమ్మకంగా వుండే మనిషి దొరక్క చచ్చి పోతున్నాం .' అంటారాతని స్నేహితులు.
    'అదృష్టాన్ని ఎవరైనా వదులుకుంటారా?' అని పైకి సమాధానం చెప్పినా, చంద్రం జీవితం అలా స్థిరపడి పోకుండా పైకి తీసుకురావాలని లోలోపలే నిర్ణయించు కున్నాడు.
    ఉదయం ఎనిమిది గంటలకి వెళ్తే మళ్ళీ సాయంకాలం నాలుగు దాకా రాడు మాధవ్-- పనిమనిషి ఉదయం సాయంకాలం వచ్చి పై పనులన్నీ చేస్తుంది-- ఇంక చంద్రానికి చేతి నిండా పనే వుండేది కాదు--
    'ప్రయివేటు గా మెట్రిక్ కి చదువుతాను' అని చెప్పాలనుకున్న చంద్రం , ముందుగా మాధవే ప్రోత్సహించటం తో స్కూల్లోనే జేరాడు-- ఉదయం మాధవ్ వెళ్ళిపోయాక తనూ అన్నం తిని స్కూలుకి వెళ్తాడు. సాయంకాలం ఎవరు ముందు వచ్చినా ఇద్దరి దగ్గరా చెరో తాళం వుంటాయి -- గబగబ టిఫిను, కాఫీ చేసేస్తాడు చంద్రం-- అవి తిని మాధవ్ క్లబ్బు కో షికారు కో లేక మేనకోడల్ని చూడటానికో వెళ్తాడు -- తను రాత్రికి వంట ముగించి చదువుకుంటూ కూర్చుంటాడు-- రాత్రి భోజనాలు అయాక పనులన్నీ చక్క బెట్టుకుని తెలియని పాఠాలు మాధవ్ చేత చెప్పించుకుంటాడు-- ఈ దినచర్య లో వాళ్ళ కెలాంటి ఇబ్బందీ అనిపించలేదు.
    కాని శకుంతలమ్మ మాత్రం ఇల్లాలు లేని ఇల్లు ఇల్లే కాదంటుంది-- ఆవిడ వచ్చిం దగ్గర నుంచీ కనీసం పది సార్లయినా ఆ సంగతి తమ్ముడి దృష్టిలోకి తీసుకు వచ్చింది -- అతను విని నవ్వేస్తాడు -- అంతే --

                         *    *    *    *
    నాలుగు రోజులు గడిచి పోయాయి -- ఆ నాలుగు సాయంకాలాలూ శ్యామల కోసం మాధవ్ వాళ్ళు రావటం, 'ఒక్కరూ ఏం కూర్చుంటారు-- సరదాగా రండి .' అంటూ సురేఖ ని కూడా బలవంతం చేసి తీసుకు పోవటం మాములయి పోయింది.
    ఊరంతా తిప్పటమే కాకుండా, 'మళ్ళీ మనవూళ్ళో మీకు దొరకవు ,' అంటూ శకుంతలమ్మ నీ సరోజని వూరిస్తూ రోజుకో మంచి హోటల్ కి తీసుకు వెళ్ళి కట్లేట్లూ ఐస్ క్రీములూ ఇప్పించటం కూడా మరో కార్యక్రమం అయిపొయింది -- ఆ ఖర్న , ఆకలయినంతమట్టుకే మాధవ్ ఇంట్లో భోజనం చేసి పడుకోటానికి హాస్టల్ కి వచ్చేవారు శ్యామలా సురేఖా.    
    "నీ పుణ్యమా అని ఊరంతా  చూపించావు , కాలు కదపకుండా , ఒళ్ళు అలవకుండా మహా హాయిగా వుంది ప్రాణం -- అక్కయ్య కోరికలకి అంతం అంటూ  వుండదు అని నువ్వు అనుకోనంటేనే నోటి అడుగుతాను.' నౌ బత్ పహాడ్ మీద నుంచి జంట నగరాల సౌందర్యాన్ని రెప్ప వాల్చకుండా చూస్తూ తమ్ముడితో అంది.
    "బలేదానివే -- ఏమీ అనుకోను కాని-- అదేమిటో చెప్పు .' మెత్తటి పచ్చిక మీద చతికిల పడుతూ అక్కగారిని కూడా వచ్చి కూర్చోమన్నట్లు పిలిచాడు-- అమ్మాయిలు ముగ్గురూ అప్పటికే చీరలు మసి పోకుండా రుమాలు పరుచుకుని మరీ కూర్చున్నారు.
    "తిరుపతి వెళ్ళి వెంకటక రమణ మూర్తిని దర్శించుకు రావాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను-- అప్పుడు శారదా వాళ్ళతో అమ్మ వెడతానంది కదా అని నేనింట్లో వుండిపోయాను.....'
    'ఇప్పుడు వెళ్దాం అంటావా. ' మధ్యలోనే అడిగాడు మాధవ్.
    "నీకు వీలయితేనేలే -- మీ బావ ఇదుగో అదిగో అనటమే కాని తీసుకు వెళ్ళటం పడటమే లేదు- అయినా ఆ దిక్కుమాలిన రైళ్ళ ల్లోనూ బస్సుల్లోనూ పడి వెళ్తే ఏం సుఖం చెప్పు-- ఆహా -- అందరికీ కార్లే ఉంటాయని కాదు-- ముందుగా సీట్లు రిజర్వు చేసుకోటం -- ప్రయాణాల్లో కూడా సౌకర్యాలు అమర్చుకోటం మీ బావకి చెతకాదు -- ఎంతసేపు అయన హైరానా పడిపోయి అవతల వాళ్ళ మీద కేకేలేసేస్తారు -- ఏమిటో ఆ చిరాకు అదీ చూస్తుంటే అసలు ప్రయాణం చెయ్యాలన్న సరదాయే వుండదు. ' చిన్న పిల్లలాగే అమాయకంగా చెప్పుకుంది.
    ఆవిడ చెప్పిన దాంట్లో అసత్యం ఏమీ లేదు. చలపతి అదో రకం మనిషి. పైగా ముక్కు మీద కోపం -- ఉదయం తను లేవటం కాస్త ఆలస్యం అయినా, భార్య లేవటం ఆలశ్యం అయినా అతనికే చిరాకు వచ్చేస్తుంది-- ఆఫీసుకి అరగంట టైమువున్నా వంటయిందా అంటూ హడావుడి పడి పోతాడు-- ఒక్క నిముషం అటూ ఇటూ అయినా చిందులు తొక్కేశాడన్నమాటే -- అలాంటి మనిషికి ప్రయాణం అంటే ఎలా వుంటుందో వూహించుకోవచ్చు -- రైలు కదిలే లోగా ఎక్కలేక పోతామేమో అని ఎక్కే ముందు భయం -- అది కదిలే లోగా దిగలేక పోతామేమో అని దిగేముందు భయం -- ఆ భయాలన్నీ చిరాకు రూపంలో బహిర్గతం అయి భార్య మీద విరుచుకు పడతాయి--
    బావగారి సంగతి చిన్నతనం నుంచీ తెలిసిందే గనక అక్కగారి కోరికని అర్ధం చేసుకోగలిగాడు -- పాపం ఏదో ఇన్నాళ్ళ ఇల్లు కదిలి వచ్చింది-- నాలుగూ చూపించి పంపించాలనిపించింది.
    'వెళ్దాం లే', అని 'శ్యామలా రేపు ఆఫీసుకి వెళ్ళినప్పుడు ఓ వారం రోజులకి శలవ పెట్టేసిరా' అన్నాడు-- 'మరో నాలుగు రోజులు పొతే  కాని నాకు శలవదొరకదు మామయ్యా-- అప్పుడయితే పది రోజులయినా పెట్టగలను.' అంది శ్యామల ముద్దుగా.
    'ఓ.కే -- వచ్చే శనివారం వెళ్దాం -- అవాల్టి నుంచి సురేఖ గారి కాలేజీ కి కూడా శలవ లిచ్చేస్తారు .' అని మాధవ్ అంటుంటే అంతా తెల్లబోయారు.
    సురేఖ ఒక్క క్షణం లోనే తెప్పరిల్లి 'నేను మా వూరు వెళ్దాం అనుకుంటున్నాను.' అని తడుము కోకుండా సమాధానం చెప్పేసింది.
    'భలేవారే -- నిన్న అడిగితె ఇప్పుడిప్పుడే ఎక్కడికీ వెళ్ళను అన్నారు-- ఒక్కరోజు లోనే యింటి మీదికి ధ్యాస మళ్ళిందా?-' మాతో రావటం ఇష్టం లేక మీరీ వంక పెడుతున్నారు -- ఆ సంగతి నేను కనిపెట్టేశాను అన్నట్లుంది అతని ధోరణి.
    'అన్నా ననుకోండి....' నసిగేసింది.
    'మరి -- అక్కడ్నించి తిరిగి రాగానే మీ వూరు వెళ్ళొచ్చు-- ఈ నాలుగు రోజులూ అందరం సరదాగా తిరిగాం-- మరో వారం రోజులు మీ కంపెనీ ఇవ్వగలిగితే సంతోషిస్తాం -- ఏం అక్కయ్యా '-- మీ రెవ్వరూ మాట్లాడరేమిటి, నేను చెప్తే ఆ అమ్మాయి మొహమ్మాట పడుతోంది అన్నట్లున్నాయి అతని చూపులు.
    'నిజమే -- ఎలాగా శలవలే కదా -- ఎంత వారం లోపలే వచ్చేస్తాము .' --ఇన్నాళ్ళూ సరదాగా తిరిగి ఇప్పుడు వదిలేయటం మర్యాదగా వుండనిపించింది అవిడిక్కూడా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS