Previous Page Next Page 
వారుణి పేజి 14


    "అవును. మా నాన్నగారికి కట్నం యివ్వగల శక్తి వుంది. స్తోమత వుంది. కానీ యివ్వటం నాకిష్టంలేదు. మీకు యీ కట్నాలు, కానుకలు నచ్చవనే అనుకున్నాను. అయినా మన మధ్య ఎన్నడూ ఆ ప్రసక్తి రాలేదు."
    "నేను కట్నం అడిగానా ?"
    "పోన్లెండి. మీ అమ్మగారికి డబ్బే ప్రధానమా ? అయినా లెక్చరర్ గా నాకొచ్చే జీతమంతా ఆవిడకి యిచ్చేస్తాను కదా! సంవత్సరానికి పదిహేను వేలు, ఓ పదేళ్ళు తీసుకోనివ్వండి జీతం, ఇంక్రిమెంట్లు, వడ్డీలు కలిపితే 3 లక్షలు అవుతుందేమో_ అంతకంటే ఏ కోడలు కట్నం తెస్తుందో చెప్పండి."
    తలుపు వద్ద నుంచుని "అంతా" వింటున్న సుబ్బరత్నమ్మ గారికి కళ్ళు తిరిగినట్టయింది. "అమ్మో అమ్మో మూడు లక్షలే! అంత డబ్బా" అనుకుంది.
    సారధి జవాబివ్వలేదు.
    ఎందుకింత ఆవేశంగా మాట్లాడుతుందా అని ఆవేశంతో ఎరుపెక్కిన ఆమె కపోలాన్ని, చెక్కిళ్ళని తదేకంగా చూస్తున్నాడు.
    "కానీ_నేను పైసాకూడా యివ్వను." కఠినంగా అంది వారుణి. బయట నుంచుని వింటున్న సుబ్బరత్నమ్మకి యీసారి నిజంగానే కళ్ళు తిరిగినట్టయింది.
    "అవును. ఎందుకివ్వాలి? రైతు ఆవును కొని కోరిన దూడని కోరినంత ధరకి అమ్ముకున్నట్టుగా కన్న కొడుకుల్ని అమ్ముకునే వాళ్ళంటే నాకు భలే అసహ్యం."
    సారధి మాట్లాడలేదు.
    "రధీ! కొత్త కోడలికి తగిన స్వాగతమే యిచ్చారే ఏదీ మీ వదినగారు. అదే మా తోడికోడలు. మీ చెల్లాయిగారు. దర్శనాలే లేవేం?" మాట మార్చింది.
    సారధి మళ్ళీ మౌనమే వహించాడు. అతనికి బాగా తెలుసు. ఆవేశంగా మాట్లాడే ఆడవారికి మాటకి మాట జవాబు చెబితే ఆ ఆవేశం యింకా రెట్టింపే అవుతుంది.
    "నాకు తెలుసు."
    "తెలిస్తే_ మరి యీ బాధ ఎందుకు ?"
    "బాధ కాదా !"
    "చిన్నా! నువ్వూ మామూలు ఆడవాళ్ళ స్థాయిలోనే ఆలోచిస్తావేం?" మెల్లిగా అడిగాడు సారధి.
    "అదేమిటి?" ఆమె అభిమానం దెబ్బతిన్నట్టయింది. బాధగా అడిగింది.
    అతను వివరించలేదు.
    రెండు నిమిషాలు నిశ్శబ్దం. సారధికి ఆమెతో మాటాడాలంటే ఏదోలా వుందే. కొత్తగా గడపలో అడుగు పెట్టీపెట్టగానే ఏకాంతంలో యిలా వాదన వచ్చిందేవిటా అని తపనపడ్డాడు.
    వారుణికి కూడా అదోలా అనిపించింది.
    లోపలినుంచి మాటలు వినిపించకపోవటంతో సుబ్బరత్నమ్మ తలుపు తట్టింది.
    పొగలు చిమ్మే కాఫీ చల్లబడుతోంది మరి!
    "ఎవరు ?"
    "సారధి_" మెల్లిగా పిలిచింది.
    "రామ్మా !"
    లోపలికి వెళ్ళింది సుబ్బరత్నమ్మ.
    "రామ్మా !" మళ్ళీ పిలిచాడు సారధి.
    ఇద్దరికీ కాఫీ కప్పులు అందించిందామె.
    "ఎందుకు తెచ్చావమ్మా! లోపలికే వచ్చేవాళ్ళం కదా! అంతా కలిసి తాగేవాళ్ళం." అన్నాడు సారధి.
    "ఎందుకులే బాబు! కొత్త కోడలు కదా! వారుణి యిప్పుడే వచ్చింది! అప్పుడే వంటిల్లు ఎందుకు చూడాలి. ఆ రోజులు ముందు ముందున్నాయి." నవ్వుతోనే నసాళం అంటేట్టుగా నర్మగర్భంగా అందామె.
    వారుణి సమాధానం యివ్వలేదు.
    చల్లబడబోతున్న కాఫీని అలాగే తాగేసింది. మామూలుగా అయితే అలాంటి కాఫీ తాగదు. కాఫీ పొగలు కక్కుతూ వుండాలి. సారధి చెప్పిన సర్దుబాటు అప్పుడే ప్రారంభమైందా అనుకుంది.
    ఖాళీ కప్పుని తిరిగి ట్రేలో పెట్టేసింది.
    సారధి కూడా మౌనంగానే కాఫీ తాగేసి కప్పు తల్లి చేతికి యిచ్చాడు. సుబ్బరత్నమ్మ మాటా పలుకూ లేకుండా ఖాళీ కప్పుల ట్రే తీసుకుని, తలుపు తీసుకుని బయటికి వెళ్ళి, తిరిగి తలుపు మూసి వెళ్ళిపోయింది. గదిలో ఇద్దరే మిగిలారు. ఇద్దరి మధ్యా నిశ్శబ్దం, ఆలోచన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS