తలుపు రెక్కని ఫెడేల్మని మూసేడు. ఆ దెబ్బకి గోడ గజగజా వణికింది.
కృష్ణమూర్తి చూపు ముచ్చటగా వున్న ఫ్లవర్ వాజ్ మీద పడింది. అమాంతంగా దాన్ని తీసి హాల్లోకి విసిరాడు.
అది కిందపడి ఫట్ మంటూ ముక్కచెక్కలైంది.
కృష్ణమూర్తి క్షణమాగేడు-ముక్కుపుటా లెగరేస్తూ---
చెట్ ఫట్ లూ ఢామ్ ఢీమ్ లూ, ఫెటా ఫెడేల్లా ఇన్ని శబ్ధాలవుతున్నా తండ్రి రాలేదంటే ఆశ్చర్యంగానే వుందతనికి!
ఆయన ఇంట్లోవున్నట్టా లేనట్టా?
- కోపాలొచ్చినప్పుడు ఆ తండ్రీ కొడుకులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తారు. తమకి కోపం వచ్చిందనే విషయం తెలియజేయడానికి ఇంట్లో వున్న సమస్తమైన వస్తువులన్నీ గిరాటు వేస్తారు.
అది ఖరీదయిన ట్రాన్సిష్టర్ కావచ్చు. టెలివిజన్ సెట్టు కావచ్చు. చేతికి ఏది దొరికితే అది విసిరేయడం రూలు!
కంచాలూ, చెంచాలూ, చెంబులూ, సరేసరి విష్ణుచక్రాల్లాగా ఎగురుతుంటాయి. ఇద్దరిలో ఎవరిక్కోపం వచ్చినా ఈ రూలుని వారు తప్పకుండా పాటిస్తారు.
కోపం వచ్చినవారు వస్తువులతో చెడుగుడు ఆడుతుంటే- ఆ శబ్దం విన్నవారు అవతలివారికి కోపం వచ్చిందని గ్రహించాలి. ఆపైన వారిని బుజ్జగించే ప్రయత్నం చేయాలి.
ఇప్పుడు కృష్ణమూర్తికి కోపంవచ్చింది. రూలు ప్రకారం విధ్వంసకాండ ప్రారంభించేడు. శబ్దాలు వింటున్న తండ్రి వెంటనే రావాలిగదా! వచ్చి బుజ్జగించాలి గదా!
...ఒకోసారి తండ్రీ కొడుకులిద్దరికీ ఒకేసారి కోపాలు వస్తాయి. ఓదార్చే దిక్కులేదు గనక అలాంటి పరిస్థితిలో అక్కడ ఇక్కడ దీపావళి మోతలే వినిపిస్తాయి.
వారు కంచం విసిరితే వీరు తప్పేళా విసురుతారు. వీరు టూ ఇన్ వన్ తగలేస్తే వారు రికార్డు ప్లేయరు పచ్చడి చేస్తారు. ఈ విధంగా కొంత భీభత్సం జరిగేక ఆటోమేటిగ్గా అలసిపోతారు. అప్పటికిగాని అసలు విషయం మాటాడుకోరు.
కోపాలు తగ్గాక అస్థీ నష్టం ఎంతో అంచనావేస్తారు. వెంటనే పాడు చేసిన వస్తువుల స్థానంలో కొత్తవి కొనేసి తృప్తిపడతారు.
అప్పలకొండకి ఈ తిక్కపనులు బాగా తెలుసు అంచేత శబ్దాలువిని పరుగెత్తుకుంటూ వచ్చేడు అప్పలకొండ.
అప్పలకొండ వచ్చే వేళకి కృష్ణమూర్తి ఫ్రిజ్ ని ఒకపట్టు పట్టే ప్రయత్నంలో ఉన్నాడు.
అదిచూసి అప్పలకొండ ఖంగారుపడ్డాడు.
"ఆయనగారు ఇంట్లోలేరు బాబూ!" అన్నాడు గాభరాగా.
ఆ మాటతో ఫ్రిజ్ బతికిపోయింది.
"ఎక్కడికెళ్ళేరు?" కోపంగానే అడిగాడు కృష్ణమూర్తి.
"తెలవదండి."
"నీకేం చెప్పలేదా?"
"లేదండి"
అతను క్షణమాగేడు. సోఫాలో కూచుంటూ తాపీగా అడిగేడు...
"పోస్టేమయినా వచ్చిందా?"
"వచ్చిందండి."
"నాన్న ఉన్నప్పుడే వచ్చిందా?"
"ఆయ్!"
"ఎన్ని ఉత్తరాలొచ్చాయి?"
"చాలా వచ్చాయండి."
"అందులో కార్డులేమయినా ఉన్నాయా?"
"అవే ఎక్కువగా ఉన్నాయండి."
"అన్నీ చదివేరా?"
"మొత్తం చదివేసేరండి!"
"నీకెట్లా తెలుసు?"
"ఆరు చదివేప్పుడు నేనక్కడే ఉన్నానండి. అన్నీ చదివేసేక హడావిడిగా లేచి బయటకు వెళ్ళిపోయారండి."
ఆమాట వినగానే...
బహుశా ఆయన హోటల్ చక్రమ్ కి బయలుదేరి ఉండవచ్చుననే డవుటు కృష్ణమూర్తికి కలిగింది. అంచేత నొక్కి నొక్కి అడిగేడు...
"ఖంగారుగా వెళ్ళాడా? హడావిడిగా వెళ్ళాడా?"
ఆ రెంటికీ తేడా ఏమిటో తెలీకపోయినా ఏదో ఒకటి చెప్పాలిగనక.
"ఖంగారు హడావిడిగా ఎల్లేరండి" అన్నాడు అప్పలకొండ.
"అదెట్లా చెప్పగలవు?"
"ఆరి మొహంచూస్తే తెలీదండి!" అన్నాడు పెద్ద ఆరిందలాగా.
అనుమానంగా అడిగేడు కృష్ణమూర్తి...
"ఏదయినా హోటల్ కి వెళ్ళచ్చంటావా?"
"ఓటల్ కెల్లేవోరయితే అంత కంగారు హడావిడీ ఎందుకు పడతారండీ? అయినా ఆరికి ఓటల్ కెల్లే అలవాటు లేదుగా!"
"వెళ్ళివుండవచ్చు గదాని అడుగుతున్నానంతే" అన్నాడు విసుగ్గా.
"ఎల్లివుండరని చెబ్తున్నానండి!" అన్నాడు స్టడీగా.
"ఎట్లా చెప్పగలవు?"
"ఎల్లేముందు గబగబా సూటుకేసు సర్దుకున్నారండి. ఓటల్ కెల్లే వారికి సూటుకేసెందుకండి?"
సూటుకేసనే కొత్తపాయింటు అతన్ని ఖంగారు పెట్టింది.
"సూటుకేసు తీసుకెళ్ళేరా!" అంటూ ఆశ్చర్యంగా అడిగేడు.
"ఆయ్! అంచేత అయ్యగారు ఓటల్ కి కాకుండా ఏదయినా ఊరేళ్ళుంటారండి."
"ఏ ఊరు?" భయపడుతూ అడిగేడు.
"తెలవదండి."
"ఉత్తరాలన్నీ చదివేరన్నావు?"
"అన్నానండి."
"అలాంటప్పుడు హోటల్ కి కాకుండా ఊరెళ్ళడమేమిటి?" అన్నాడు కృష్ణమూర్తి అయోమయంగా.
"మద్దెన ఓటలేంటండి బాబూ?" అనడిగేడు అప్పలకొండ-తనకేమీ తెలీనట్టు.
"ఆ ఉత్తరం చదివివుంటే నాన్న ఖచ్చితంగా హోటల్ కి వచ్చేవాడు" అన్నాడతను... తనలో తాను గొణుక్కుంటున్నట్టు.
"అవుతే చదవలేదు కాబోలండి!"
"అన్నీ చదివేరన్నావుగా!"
"అన్నానండి. ఆరి చేతికొచ్చిన ఉత్తరాలన్నీ చదివేరండి!"
"మరలాంటప్పుడు ఆ ఉత్తరంకూడ చేతికి రావచ్చుగదా?"
"ఏ ఉత్తరమండి?"
"అదొక ఉత్తరం! అంతే!" అన్నాడు అతను కోపంగా.
"అదా బాబు? అయితే అదొచ్చివుండదండి."
"పోస్ట్ చేసేక ఎందుకురాదూ!"
"రావాలని రూలెక్కడుందండీ?"
"అప్పలకొండా..."
