"సాధ్యమయినంత క్లుప్తంగా జరిపించండి వివాహం" శాస్త్రిగారు మరోసారి హెచ్చరించారు సాటివారిలో తలవంచుకోవాలే అని ఆయన అంతరంగం కుతకుతలాడి పోతోంది.
అలాగేనని తల వూపాడు నాయుడమ్మ. ఏదో యీ మాత్రం రాజీకి రాగలిగినందుకు ఆయనకీ తృప్తిగానే ఉంది.
అందరూ వెళ్ళిపోయారు.
యుద్ధంలో ఓడిపోయిన సైనికుడిలాగా తిరుగుముఖం పట్టి ఇంటిలోకి వచ్చారు. ఆయన యీజీ చైర్ లో కూర్చోగానే పార్వతి వచ్చింది.
"పార్వతీ," ఆయన కంఠం విచలితమయింది. కనులవెంట నీళ్ళొక్కటే తక్కువ అన్నట్లున్నాయి.
"ఏమండీ బాధపడుతున్నారా? కోదండం చనిపోయినరోజే మీరు బాధపడలేదు. వాడిని మీరు మోక్షగుండం అంత ఇంజనీరుని చెయ్యాలనుకున్నారు. కనీసం రావుగారంతయినా అవుతాడని కలలుగన్నారు"
"వద్దు పార్వతీ! ఆ విషయాలు గుర్తుచేయకు. ఈ గుండె కదిలి కరిగి కన్నీరు ప్రవహించిందంటే నేతట్టుకోలేను" ఆయన గొంతు గద్గదమయి నన్నగా వణుకుతోంది.
"మీ ఆశలని సమూలంగా నాశనం చేస్తూ వాడుపోయినరోజున అల్పాయుష్కుడని అనుకున్నారేగానీ ఇలా బాధ పళ్ళేదు_ ఇప్పుడెందుకీ విచారం?"
"వీడింకా బ్రతికున్నాడు పార్వతీ_ అందుకే బాధ"
"ఏం చేస్తాం, ఒక్కొకడు నాకంటి వెలుగుగా మారిపోతాడని ఆశించానుగానీ యిలా తలా ఒకదారి అయి మనకు అప్రదిష్ట తెస్తారని అనుకున్నానా?"
"అదికాదు పార్వతీ! నలుగురికీ చెప్పనేర్చినవాడిని వాల్మీకిని హృదయస్థం చేసుకున్నవాడిని భగవద్గీతకు వ్యాఖ్య వ్రాసినవాడిని నేను కులాల గురించీ మతాన్ని గురించి వ్యధ పడాల్సి వచ్చిందే అని నా బాధ"
"ఏమండీ, పిల్లల్ని కన్నాంగానీ... వాళ్ళ అదృష్టాన్ని కన్నామా. రోజులు మారాయి, సంఘంలో విచ్చలవిడిగా తిరిగే వారి పద్ధతులు చూస్తున్నారు_ వాళ్ళతో కలిసిపోతున్నారు_ అయినా అడ్డాలనాడు బిడ్డలు కానీ... గడ్డాల నాడు బిడ్డలా? అని వూరికే అన్నారా"
"అంతేగాదు పార్వతి ఇంత చేశాం. ఇంత పెంచాం మనమేమో మన వ్యక్తిత్వాలేమో_ వీళ్ళకి తెలుసు అనుకున్నాం. అయినా ఒక్కరూ మనల్ని అర్ధంచేసుకోలేదు. అంతగా ఆ అమ్మాయిని చేసుకుని వేరుపడతానంటే కాదనేవాడినా?"
పార్వతి దీర్ఘంగా నిట్టూర్చి వూరుకుంది.
అప్పుడే వచ్చాడు కోసలరాం.
"ఏం బాబూ, ఇంత ఆలస్యమయింది" విషయాన్ని మారిస్తేనన్నా_ ఆయన మనసు కుదుట పడుతుందేమోనని ప్రశ్నించిందామె.
ఉస్సురని నిట్టూర్చి "ఏం చెప్పనమ్మా, అన్ని ఇబ్బందులూ ఒక్కసారే వచ్చాయి" అన్నాడు కోసలరాం తండ్రి పాదాలవద్ద కూచుంటూ.
నిస్తేజమయిన ముఖము, నిరాశా పూరితమయిన వాక్కు గమనించి పార్వతి గుండె జల్లుమంది_
"ఏమయిందిరా?"
"అన్నయ్య తిరుపతి వెళుతూ పిగ్మీ డబ్బు కట్టెయ్యమన్నాడు నేను ఉదయం నుంచీ పనులతో మరిచిపోయాను. ఇప్పుడే వెళ్ళి బ్యాంక్ మేనేజర్ గారికి యిచ్చి వస్తున్నాను. ఆయనకూడా ఆందోళనగా వున్నారు. డబ్బు ఇవ్వగానే తృప్తి పడ్డారు."
"ఇంక చిక్కేం వుందిరా! అమ్మయ్య భయపడి ఛస్తున్నాను. ఆ డబ్బు ఎలా కడతారా మీ నాన్నగారని. కొంత సంతోషపరిచే వార్తే చెప్పావు. భగవంతుడా నా మనసు శాంతించింది. ఉదయం నించీ వీళ్ళంతా ఆ డబ్బుతో పరారీ అయినట్టుగా అనుకుంటున్నారు" అంది తృప్తిగా.
"డబ్బుతో కాకపోయినా ఒక అమ్మాయితో పారిపోలేదామ్మా! వాడు కనీసం నాతోనయినా చెప్పలేదు. నేను తిరుపతి వస్తాన్రా అంటే వద్దని ఆపేశాడు అందుకేనేమో!"
"అదంతా తెలుసులే!" గంభీరంగా అన్నారాయన.
"తెలుసా?" అన్నట్లు తల్లివైపు చూశాడు కోసలరాం.
ఆమె తలూపింది నిర్లిప్తంగా.
"ఇదిగోనమ్మా డబ్బు! తీసిపెట్టు. రేపు ఆఫీసులేదు. సోమవారం ఏదో పండగ సెలవు. మంగళవారం ట్రజరీకి వెళ్ళాలి" అని డబ్బు అందించాడు తల్లికి.
'అలాగా!' అన్నట్లు నిర్లిప్తంగ చూశారు శాస్త్రిగారు.
అంతలో జ్యోతి, జానకిరాం వచ్చారు. ఇద్దరూ హాల్లో కూర్చున్నవాళ్ళని గమనించనట్లు లోపలికి వెళ్ళారు.
"ఏం మిడిసిపాటు!" అనుకుంది పార్వతి.
మరో పదినిమిషాలకి లుంగీ కట్టుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు జానకిరాం.
"నాన్నా! రేపు కలెక్టరుగారు కేంపుకి వస్తున్నారు" అన్నాడు పొడిగా. శాస్త్రిగారు పలకలేదు.
"ఆయన నీ స్టూడెంటేనట! నీవు ఆయన్ని కలిసి చెపితే ఏదయినా అవకాశం వస్తే జ్యోతికి ఉద్యోగం చూస్తారు" అన్నాడు.
అంతలో జ్యోతికూడా వచ్చింది.
"మావయ్యా! తాలూకాఫీసులో ఓ ఖాళీ వస్తుంది. మా స్కూలులో కూడా క్లర్క్ పోస్ట్ ఖాళీ అవుతోందట. నన్ను అప్లయి చేయమంటారా?"
"నీ ఇష్టమమ్మా!" క్లుప్తంగా అన్నారు.
"రేపు నువ్వాయన్ని కలసి మాట్లాడి ఎలాగైనా జ్యోతికి ఈ ఉద్యోగం వచ్చేలా చేయాలి. ఇలా ఎన్నాళ్ళు కష్టపడుతుంది?"
"నాకు ఇష్టంలేదు జానకిరాం. అతను నా స్టూడంటే అయితే_ అతనికంతగా నేను గుర్తు వుంటే నన్నే వెతుక్కుంటూ వస్తాడు. అంతేగాని నేను వెళ్ళి చూడను."
"మీరలాగంటే ఎలా? వాళ్ళు అధికారులు. మనం ఆశ్రిత జనులం. యిందులో తప్పేముంది? పైగా మన అవసరం."
"నాకు ఇలా ఉద్యోగాలు యాచించటం యిష్టం లేదు. ఇన్నేళ్ళ జీవితం ఒకరిని యాచించకుండా జరిగిపోయింది. ఇక ముందు ఆ రామచంద్రమూర్తి అలా జరుపుతాడనే అనుకుంటున్నా. 'అనాయాసేవ మరణం వినాదైన్యేన జీవనం' అన్నట్లుగా బ్రతుకు వెళ్ళిపోతేనే నాకు తృప్తిగా వుంటుంది."
లేచాడు జానకిరాం. అతనికి తండ్రిపద్ధతి బొత్తిగా నచ్చలేదు. అవకాశం వున్నప్పుడు ఎందుకు వినియోగించుకోకూడదు అన్నదే అతని మనస్తత్వం.
