9
బారిడు పొద్దెక్కాక , వోటేల్లో సందడి ఎక్కువుకాడంతో ఎంకన్నా బద్రయ్యా లెగిసి కూకున్నారు. పందుం పుల్లలు నవుల్తా ఎల్లి మొకాలు కడుక్కుని గోదాట్తో యీతాలాడా రిద్దరూ.
వోటేల్లోదే కుసింత పలారం సేసి పైమీద గుడ్దేసుకుని బద్రయ్య ఎక్కడికో ఎల్లిపోయాడు.
సెరబయ్య గల్లా పెట్టి కాడ కూకున్నాడు. ఏం సేయ్యడానికి తోసలేదు ఎంకన్న కి. ఒటేల్లోంచి లెగిసోచ్చి ఎనకున్న గుడిసి కాడ కెల్లాడు. ఎల్లాడో లేదో, అమ్మ సెత్తిలా యిరుసుకు పడ్డాదది.
"ఆడితో కలిసి తాగడాని కెల్లక మల్లా ఎందుకొచ్చావ్?" పై పేనాలు పైకే పోయినాయి అడియి.
'రేత్తిరి తాగొచ్చినట్టు దీని కెల్లా తెలిసిందో?' అనుకున్నాడు. ఇంకా ఏదో అనుకోబోతావుండగానే పడాల్ని తలుపేసేసిందది. దాంతో ఎనక్కి తిరిగొచ్చేశాడు. రాడంరాడం వూల్లో కే వొచ్చేశాడు.
కాలు కాలిన పిల్లిలా తిరుగుతుండే తలికి ఆడికి ఆవాసవొచ్చినాది. మద్దినాల రొండుజావులేలకి మల్లా సీతాలచ్చీవోటేల్లో కొచ్చినాడు.
పనోళ్ళు తినగా మిగిలివొన్నవూ , కూరా తెచ్చి బల్ల మీద వో అకేసి పెట్టారు. బల్ల మీద తిండం అలవాటు లేదేమో, నేలమీదే కూకుందా వనుకున్నాడు. "ఆళ్ళెం అనుకోరు గందా?' అంటా అనుమానం రావడంతో మల్లా ఆ వూసేత్తలేదు.
ఒన్నంతిని మల్లా వుల్లోకి ఎగబడ్డాడు. తెగ తిరిగాడు. సీకటి కూడా పడిపోయినాది.
కాని-- సేందరకాంతం యిల్లు నెలకలేక పోయాడు. ఉసూరు మనిపించింది.
పొద్దున్నుంచీ బద్రయ్య ఏమయ్యాడో? అడుంటే ఏబాదా వుండీది కాదు. దానిల్లు బంగారం కానూ, అది పట్టుకోడం యింత కట్ట పని తోత్తే తొలిసారే కుసింత జాగరతగా సూసుండీవోడు. ఇటూ అటూ దిక్కులుసూత్తా నడుత్తన్నాడు. తన గుండిలు దాని పిడికిట్తో బిగించేసి, అది అంత బలంగా లాక్కుంటాదని ఆడు కల్లో కూడా అనుకోలేదు. ఆ ఆరాటం సూత్తే తనకే సోద్దెమయినాది.
అడసలు పట్న వెందుకొచ్చాడు? యాపారం కోసరం. ఇప్పుడల్లా తిరుగుతున్నాడెం మరి? మజా కోసం. ఎక్కడ దొరుకుతాది? కాంతం కాడ. అది తన్ని వోల్లనంటే? అది అందుగా! తన్ని దరిని కూకోబెట్టుకుని ఎప్పుడూ కల్లల్లోకి సూత్తా వుండిపోతాదా?
ఆ అనువానం మట్టుక్కి తీర్లె దాడికి. సర్ధా అన్నది ఎల్లాంటిదయినా సరే, రొండుసి ట్లే'కిల్లో కరిగి పోయీదేనా సరే బతుకు మొత్తంలో ఆ రొండు సిటికిలయినా , బాధలన్నీ యిదిలేసి , గుండిల మీద సేయ్యేసుకుని , మనసులో అమురుతం నింపుకుని, మెత్తటి దాని సేతులు , తన అరిసెతుల్లో దాసుకుని , కళ్ళు సగం సగం తెరుసుకుని, తన్ని తను మరిసిపోతే సాలు!
ఎన్ని ఏల పుట్టుకులికయినా అందరికీ ఆ అదురుట్టం వోత్తదా? వొచ్చినోళ్ళు యిడుసుకుంటారా?
బద్రయ్య తన కళ్ళు తెరిపిచ్చాడు. బతుకంటే ఏంటో నిజంగా సూబిచ్చాడు. మనసులందరిలోకి తన్ని గోప్పోడ్ని సేశాడు.
కొంచెంకొంచెం తటపటాయించి, తను నడుత్తా వున్న యిదికొసని నిలుసుని బీడీ కాలుత్తా నిలుసున్న వో సోగ్గాడి నడిగాడు --
"సెంద్రకాంతం యిల్లేక్కడా?"
"ఏవయ్యో! నీకు సెంద్రకాంతం యిల్లే కావాలీ? దాని జోలి కెల్లావంటే బద్రయ్యగాడు ఎనికి లిరగ్గోడతాడు! తెలిసిందా! అంతకంటే సిణేవాటారుల్లాంటి గుంటల్ని సూబిత్తా , ఎవిత్తావ్?"
ఎంకన్నకి సిరాకేసింది. ముందలి కెల్లిపోయాడు.
బద్రయ్యకీ తనకీ ఎంత స్నేయితవున్నాదో యీడికేం తెలుసు? పట్నం సురుకుదనవంతా ఆడు తనకాడే సూబిద్డారనుకున్నాడా? తనేమన్నా కొత్తోడు కనకనా?
కోరుకున్న వొరం తీరినట్టుగానే ఎంకన్న కల్లకి ఓ డాబా యిల్లు కనిపించినాది. అదే గుమ్మం తెర, కిటికీలూ ఆయె!
జోరుగా మెట్లెక్కి లోన కెల్లబోయాడు. లోన, ఓ మొగోడూ ఆడదీ కలిసి నవ్వుకుంటా వున్నట్టనిపించినాది. టక్కుని ఆగాడు.
ఎనక్కి ఎల్లిపోడానికి మనుసోప్పలేదు. ఇంతలో సెంద్రకాంతనే గుమ్మం కాడి కొచ్చినాది. ఈడ్నీ సూసి మోజుగా నవ్వినాది. "నువ్వా మావా? లోనికి రా!"
ఆడెల్ల లేదు. ఇంకో మొగోడుంటే ఎల్లడవెల్లాగా? లోపలినించి దగ్గు యినిపించినాది . కాంతం లోన కేల్లింది.
ఎవుడితోనో మాటాడతన్నాది.
బద్రయ్య లోనున్న సంగతి , యీడికేం తెలుసు?
"ఎంకన్నేనా?"
"అవును"
"దాని గదిలోకి పంపిచ్చు!"
"పోలీసోడోచ్చి, దాని కోసం యిందాకటి నించి పడిగాపులడి కూకున్నాడు మావా! అది కనిపించాపొతే ఆడు పోడుసుకుసావడో!"
"ననెల్లి పొమ్మంటావా?"
"అంతమాటే?' అంటా అడినోరు నాలుగేల్లతో సొగసుగా మూసినాది.
"మరయితే అన్నే పొమ్మను!"
"కొత్తోడు కదా మావా?"
"కొత్తో యింతా, పాతో రోతా, కొత్తో డితోనే కులుకూ!' అంటా లెగిశాడు.
"ఎక్కడికి మావా?"
"నే నెల్లిపోతా!"
అణ్ణి రొండు సేతుల్తోనూ సుట్టేసినాది కాంతం.
"నువ్వెల్లి పొతే నే సచ్చిపోనో?
"ఆడో?"
"అసిపడోచ్చినోడు గందా, ఎనక్కి తిప్పి పంపేయడం మంచిదా మావా?"
"ఎంటన్నావ్ ?" కోపంగానే అన్నాడాడు.
నీరసంగా నవ్వినాది కాంతం.
"ఆడిమీ దంత మనుసయితే ఆడ్నే సుట్టేసుక్కూసోరాదో? నీకూ నాకూ యీయాల్టితో సరి!"
కాంతం అణ్ణి కదిల్నియలేదు.
"ఆడి మీద మనసు కాదు మావా! జాలి!"
ఎంకన్న తిరిగోచ్చీతలికి వొటేలు మూసేసున్నాది ! తలుపు కొట్టాడు.
లోన సీసాల సప్పుడనిపించినాది!
కొంచెం తలుపు తెరిసి, ఎలపలికి తొంగి సూశాడు సేరబయ్య. ఎంకన్న కేసి సూసి యిరగబడి నవ్వి టక్కుని, లోనికి లాక్కు పోయాడు.
పై మీద గుడ్డ యిసుగ్గా యిసేరేసి , సోక్కా బొత్తాలు యిప్పుకున్నాడు ఎంకన్న. తలుపు మల్లా గడియేట్టి వొచ్చాడు సెరబయ్య.
"తలుపు సప్పుడయితే పోలీసోల్లెవో అనుకున్నా బెదరో!"
అడినిపించుకోలేదు.
మూల్ని దాసినా సీసా మల్లా ఎలపలికి లాగాడు సేరబయ్య. తనకో గళాసులో పోసుకుని, అడిక్కూడా కూతంత పోసి యిచ్చాడు.
గటగటా తాగేసి పక్కనున్న కురిసీ లో సతికిల బడ్డాడు ఎంకన్న. తనది తను తాగేసి రొండు బల్లలు దగ్గిరికీడుసుకుని, అటి మీద ఎల్లగిత్తలా తొంగున్నాడు సెరబయ్య. కొంచెం సేటిదాకా యిద్దరూ ఏం మాటాడుకోలేదు. సెరబయ్య కేం తోసింది కాదు.
"ఎక్కడికెల్లోచ్చావ్ బెదరో?"
"ఎంకన్న మాటాల్లేదు.
"సెంద్రకాంతం కాడికేనా?"
ఎంకన్న గుండి దడుక్కుమన్నాది. కోపంగా సూశాడు.
"బద్రయ లోన కనిపించలేదో?"
గుండిల్లో కవ్వవెట్టి సిలుకుతున్నట్టనిపించినాది ఎంకన్న కి.
"అది మంచిదే కానీ, ఆడు మట్టుక్కి దాన్ని యింకోడికి దక్కనీడు. ఏవయినా , డబ్బు కరుస్సెత్తే రాయసంద్రవులో ఆడోళ్ళకి కరువా ఎంకన్నా?"
ఎంకన్న కి వుక్కురోసవొచ్చినాది. సెంద్రకాంతం బులిపించినట్టుగా ఆణ్ణి యింతదాకా ఎవుత్తీ సూల్లేదు. అది మనిసి కాదు, దేవత!
ఎంకన్నకి బాద సల్లార్లేదు. సెరబయ్య వూవోగుతానే ఉన్నాడు.
"తేలిగ్గా సెప్పాలంటే , ఎంకన్నా! ఉప్పూ పులుసూ కలిపితే ఊరగాయయిపోయి నోరూర్సినట్టే మొగోడూ ఆడదీ సూసుకుంటే కోరికిలల్లా పుట్టుగోత్తాయి! ముక్కు మూసుకుని జపాలు సేసుకునీ వొళ్ళుకూడా, సిలకలాటి సిన్నది కంట బడితే ఎగిరి గంతెయ్యరో?'
