Previous Page Next Page 
సురేఖా పరిణయం పేజి 13

 

    'మామయ్యా కారు హారన్ లా వుంది' అంది శ్యామల రోడ్డు మీదికి దృష్టి తిప్పుకుని.
    ఆ పిల్ల అంచనా తప్పలేదు. మాధవరావు కారు గేట్లోంచి లోపలికి వచ్చి ఆగింది.
    'కార్లో ఎవరో వున్నట్లున్నారు,' సురేఖ మాటలు పూర్తీ కాకుండానే తలుపులు తెరుచుకుని దిగిన వాళ్ళని చూస్తూ .
    'అరే మా దొడ్డమ్మొచ్చింది -- అది సరోజ -- దొడ్డమ్మ కూతురు. అనేసి గబగబా క్రిందికి వెళ్ళిపోయింది శ్యామల.
    సురేఖ చాప వాల్చుకుని కూర్చుని ట్రాన్సి స్టర్ అన్ చేసింది.
    అయిదు నిమిషాల్లో శ్యామల ఆ చుట్టాలని కూడా వెంట పెట్టుకుని పైకి వచ్చింది.
    'మా రూమ్మేటు సురేఖ.' అని వాళ్ళకి చెప్పానుగా దొడ్డమ్మా వాళ్ళనీ, ఈ ఉదయమే వూరు నుంచి వచ్చారుట,' అని సురేఖ కీ చెప్పింది.
    'కూర్చోండి ,' అంది సురేఖ చాప చూపిస్తూ.
    'ఏదో సినిమా కని బయలుదేరాం-- తయారుగా వుండమని శ్యామల కి ఫోను చేస్తానన్నాడు-- సరే ఎలాగూ వస్తున్నాం కదా అని చెయ్యలేదు --' అని త్వరగా చీర మార్చుకురా -- అసలిదీ బాగానే వుంది ,' అంది శ్యామలతో శకుంతలమ్మ.
    'నేను అన్నం తినేసే వస్తా-- భోజనం వుంచొద్దు; అని సురేఖ కి చెప్పి వాళ్ళని వెంట తీసుకుని వెళ్ళిపోయింది శ్యామల. మర్నాడు సాయంకాలం కూడా వాళ్ళంతా వచ్చి శ్యామల ని తీసుకు వెళ్ళి మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకి హాస్టల్లో దింపేశారు.
    మూడోరోజు ఆదివారం -- శలవరోజు వస్తే ఏడు గంటల దాకా లేవదు శ్యామల -- అసలా అమ్మాయి అదృష్టం ఏమిటో అలా ఎంత సేపయినా నిద్ర పోగలదు -- మధ్యాహ్నం కాస్త టైము దొరికిందంటే చాలు హాయిగా పడకేసేస్తుంది -- ఒక్కోసారి ఆలోచనలతో తల బరువెక్కి రాత్రి కూడా నిద్రకి దూరం అయిపోయే సురేఖ కి శ్యామల నిద్ర చూస్తె కూడా ఇదిగానే వుండేది, 'ఈ పిల్ల చేసుకున్న పుణ్యం ఏమిటో' అని--
    మామూలు వేళకే మెళుకువ రావటం వల్ల సురేఖ మొహం కడుక్కుని కాఫీ తెప్పించుకు తాగింది. జడ విప్పుకుంటుంటే నరసమ్మ తలుపు తోసి, 'శ్యామలమ్మ కి టెలిఫోను వచ్చింది.' అంది.
    'ఓయ్ --నీకే-- వినిపించలే -- ఫోన్ కాలుట ' తట్టి లేపింది సురేఖ.
    'మామయ్యే అనుకుంటా'' అంటూ గబగబా క్రిందికి పరుగెత్తింది శ్యామల -- అయిదు నిమిషాల్లో తిరిగి వచ్చి , 'ఇవాళంతా నెను హాస్టల్లో వుండను -- గోల్కొండ గండి పేట -- నెహ్రూ పార్కు అన్నీ తిరిగి వస్తాం-- ఇప్పుడే కాస్సేపటి లో వస్తారు వాళ్ళంతా .' ఉత్సాహంగా చెప్తూ బ్రష్ మీద పేస్టూ వేసుకుంది.
    'మరయితే త్వరగా తెములు' శ్యామల జాగు సంగతి తెలిసే హెచ్చరించింది సురేఖ.
    అన్నట్లుగానే అరగంట తరువాత వాళ్ళు వచ్చేసరికి శ్యామల యింకా తలకి నూనె రాసుకోవటం లోనే వుంది-- సురేఖ పేపరు చూస్తూ కూర్చుంది.
    'ఇంకా ఇలాగే వున్నావుటే,' అంటూ లోపలికి వస్తున్న పెత్తల్లిని సరోజనీ కూర్చోమన్నట్లు మంచం చూపించి, 'ఒక్క అయిదు నిమిషాలు; అంటూ హడావిడిగా జడ అల్లెసుకుని స్నానానికి వెళ్ళి పోయింది శ్యామల.
    వాళ్లతో ఏదైనా మాట్లాడక పొతే బాగుండదన్నట్లు పేపరు ప్రక్కన పెట్టేసి, కుదురుగా కూర్చుంది సురేఖ మాటల కోసం వెతుక్కుంటున్నట్లు.
    'మా తమ్ముడు రోజూ వస్తాడా ,' యధాలాపంగా అడిగినట్లే అడిగింది శకుంతలమ్మ సంభాషణకి వుపక్రమిస్తూ -- సరోజ తల వంచుకుని దుప్పటి కొసలు మెలి పెడుతోంది . సురేఖ తెల్లబోయింది. ఆవిడ ధోరణికి. అయినా సమాధానం చెప్పాలి కదా అనిపించి,
    'అబ్బే-- ఏ నాలుగు రోజులకో ఓసారి వస్తారు' అంది.
    'శ్యామలకి ఫ్యాషన్లు మరీ ఎక్కువ -- లోపల బాడీ ల్లాగ, ఆ జాకెట్లూ, అది సుబ్బరంగా కనిపించేలా ఉల్లి పోరాలాంటి చీర లు-- అసలా పమిట భుజం మీద నిలవనే నిలవదు కదా -- నా పిల్లలే ఇలాంటి వెర్రి వేషాలేస్తే వెన్ను చీరేసేదాన్ని ..' చీత్కారం చేసింది శకుంతలమ్మ.
    'ఏమిటి బాబూ ఈవిడ ధోరణి-- శ్యామల వింటే ఏమనుకుంటుంది .' అని భయపడుతూ గుడ్లప్పగించి చూస్తూ కూర్చుంది సమాధానం చెప్పకుండా -- 'అయినా శ్యామల కాస్త ఫ్యాషనుగా తయారయ్యే మాట నిజమే కాని ఈవిడ చెప్పినంత అన్యాయం మాత్రం వుండదు -- ఈవిడ కి తనంటే మంచి అభిప్రాయం లేనట్లుంది-- పెద్ద కుటుంబాల్లో ఈ పోల్చి చూసుకోడాలూ, అసూయ పడటాలూ తప్పవులా వుంది' అనుకుంది.
    శ్యామల ఏ నిముషంలోనయినా రావచ్చు నని ఆవిడకే అనిపించిందేమో 'మీరు వూరంతా చూశారా?' అంది టాపిక్ మార్చి.
    'ఆ ఏదో -- ఇంకా గండి పేట వెళ్ళనే లేదు-- మా కాలేజీ వాళ్ళం అందరంకలిసి గోల్కొండ వెళ్ళివచ్చాం--'
    'ఇక్కడే వుంటాం కదా అని అశ్రద్ధ -- మాలా వున్న నాలుగు రోజుల్లో అన్నీ చూసేయాలనే ఆత్రం వుండదు.' మధ్యలోనే అంది సరోజ.
    శ్యామల తయారయి వాళ్ళు బయలుదేరేసరికి మరో పది నిముషాలు పట్టింది.
    "మీరూ రండి -- కారులో చోటు వుంది ' అంది శకుంతలమ్మ వెళ్ళబోతూ.
    'అబ్బే వద్దండీ-- నాకసలివాళ లేచిం దగ్గర నుంచీ తలనొప్పిగా వుంది' అంది సురేఖ.
    మరి బలవంతం చెయ్యకుండా వాళ్ళంతా వెళ్ళిపోయారు.

                                   7
    మర్నాడు సాయంకాలం -- విజిటర్స్ రూము లో కూర్చుని ఫిలిం ఫేరు చదువుతోంది సురేఖ. మాధవరావు కారు వచ్చి వరండా ముందు ఆగింది.
    'శ్యామల ఇంకా రాలేదు -- ఆఫీసులో పని తేమలలేదేమో-- మీరు వచ్చి కూర్చోండి' సురేఖ లేచి వెళ్ళి చెప్పింది.
    అంతా కారు దిగారు-- 'ఈ రంగు మందార మనింట్లో లేదు కదూ' అంటోంది సరోజ గులాబీ రంగులో వున్న ముద్ద మందార పువ్వుని చూస్తూ.
    'ఓసారి కొమ్మ తెచ్చి పాతాం -- బ్రతకలేదు మరి' అంది శకుంతలమ్మ.
    మరీ గుబురుగా పెరిగిపోయిన చెట్ల కొమ్మల నన్నింటినీ కత్తిరించేశాడు ఆవాళ మాలీ -- అవన్నీ చిందర వందరగా ఆవరణ అంతా పడి వున్నాయి-- చీపురుతో ఓ ప్రక్క నుంచి తుడుచుకుంటూ వస్తున్నాడు.
    'ఇలాంటి పువ్వులయితే నీలాంటి ఆడపిల్లల తల్లో ఇంకా బాగుంటాయి' చీడీల మీద పడి వున్న బోగన్ విల్లా రోబ్బ సరోజ జడలో తురిమాడు మాధవ్.
    సురేఖ నవ్వు అపుకుంది కాని శకుంతలమ్మ గలగలా నవ్వేసింది.
    'ఛీ -- అన్నీ ఇలాంటి పన్లె ..' అంటూ విదిలించి పారేయబోయింది నవ్వుతూనే -- కాని ఆ రెబ్బ ని వున్న ముల్లు కసుక్కున వేలిలో దిగటం తో 'అబ్బా' అని కెవ్వున ఆర్తనాదం చేసి విసురుగా కొమ్మ అవతల పారేసింది. నెత్తురు చిమ్మిన వెలి వంక బాధగా చూసుకుంటూ.
    'ఏదీ బాగా గుచ్చుకుందా .' తన చిలిపి పనికి నొచ్చుకుంటూ ఆత్రంగా చెయ్యి అందుకున్నాడు మాధవ్-
    'తల్లో పువ్వులు పెట్టుకోటం కూడ చేతకాదు' అని వెక్కిరిస్తూనే ఆ అమ్మాయిని గబగబా కుళాయి దగ్గరికి లాక్కుపోయాడు. చెట్ల కి నీళ్ళు పోయ్యటానికి బిందెలతో నీళ్ళు పట్టుకుంటున్నా మాలిని తప్పుకోమని తనే స్వయంగా ఆ పిల్ల వేలు నీళ్ళతో కడిగి , జేబులోంచి రుమాలు తీసి తడిపి వేలుకి చుట్ట బెట్టాడు, "ఏమిటి మామయ్యా ఈ కాస్త కీ ఇంత హడావుడి చేస్తున్నావు?' అని సరోజ ఓ ప్రక్క నుంచి మొత్తు'కుంటున్నా వినకుండా --
    "ఊ ఇంద. తుడుచుకో.' అంటూ తన రుమాలు అందించింది సరోజ.
    'లేకపోతె నీ కొంగుతో తుడుచుకుంటానని భయపడ్డ్డావా?' రుమాలుతో తడి చేతులు తుడుచుకుని మళ్ళీ ఆ అమ్మాయి కిచ్చేస్తూ నెత్తి మీద చిన్న దెబ్బ వేశాడు.
    'అబ్బా మాడు అదిరిపోయింది బాబూ' తల మీద అరి చెయ్యి ఆనించుకుని గారాలు పోయింది సరోజ.
    వాళ్ళిద్దరూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వస్తుంటే శకుంతలమ్మ మొహం అంతా కళ్ళు చేసుకుని చూస్తూ 'అదంటే వాడికి చిన్నప్పటి నుంచీ అపేక్ష .' అంది సంబరంగా.
    ఆ మాటలు ఆవిడలో ఆవిడ అనుకుందో తనతో చెప్తోందో అర్ధం కానట్లు ఒక్క క్షణం చూసి , ' రండి లోపల కూర్చుందాం.' అంటూ హాల్లోకి దారి తీసింది సురేఖ.
    'నిన్న రమ్మంటే రాలేదు-- ఎంత సరదాగా వుందని -- మా సరోజ , శ్యామల చిన్న పిల్లల్లాగే గంతులు వేశారు-- ఆదివారమే కనక మీరూ వచ్చి వుంటే ఇంకా సరదాగా వుండేది.' అంది శకుంతలమ్మ కుర్చీలో కూర్చుంటూ.
    'నిజమే -- మనకి తోచలేదు ' అన్నాడు మాధవ్ లోపలికి వస్తూ.
    'నేనడిగాను రానన్నారు.' అంది శకుంతలమ్మ.
    'నన్నలా మన్నించకండి -- మీ సరోజా, వాళ్ళల్లాంటిదాన్నే' అంది సురేఖ.
    'పోనీ ఇవాళ సినిమాకి రండి.' అన్నాడు మాధవ్. రండి. అన్న పదాన్ని మరి కాస్త వత్తి పలుకుతూ.
    'అయ్య బాబోయ్ సినీమాలే -- ఈ సినీమాలు పది మందితో కలిసి వెళ్ళి సరదాగా చూసేలా వుంటున్నాయా -- అందులో పరాయి మొగవాళ్ళ తో వెళ్తే, ఇంక సిగ్గుతో చితికి పోవాలి' అనుకుంటూ చిన్నగా నవ్వేసింది.
    'రామ్మా-- తప్పేమిటి. ఇప్పుడేగా అన్నావు మా సరజా వాళ్ళ లాంటి దాన్నే అని.' తన ఆహ్వానాన్ని కూడా జోడించింది శాకుంతలమ్మ, సురేఖ మౌనంగా వుండి పోవటంతో--
    తరువాతి రెండు నిమిషాల సంభాషణ లో సురేఖ తండ్రి పేరూ, వూరూ , ఇంటి పేరూ అడిగి తెలుసుకుని, "మా పెద్దత్త గారి కోడలు పుట్టింటి పేరూ అదే -- ఎక్కడో అక్కడ కలుస్తూనే వుంటాయి బంధుత్వాలు-- అంతా బీరకాయ పీచు' అంటూ తేల్చేసింది.
    'ఐయామ్ సారీ-- లేటయాను'. ఎంత సేపయింది మీరొచ్చి.' గలగల మాట్లాడేస్తూ లోపలికి వచ్చింది శ్యామల.
    'ఇప్పుడేలె -- త్వరగా కానీ, పిక్చరు కి వెళ్దాం -- మీ స్నేహితురాలిని కూడా రమ్మను.' అన్నాడు మాధవ్.
    "రావోయ్ -- నిన్నటి నుంచి తెగ బ్రతిమాలించు కుంటున్నావు-- వస్తుంది లే -- దొడ్డమ్మా మేడ మీదికి వస్తారా --' అందరి తోటీ మాట్లాడేస్తూ సురేఖ భుజం మీద చెయ్యి వేసి మెడ మెట్ల వేపుకు నడిపించుకు పోయింది.
    ఇంకా బెట్టు చేస్తే మర్యాదగా వుండదని పించింది సురేఖకి.
    మాధవ్ ప్రక్కన శకుంతలమ్మ కూర్చుంది -- వెనక సీటులో శ్యామలా వాళ్ళూ కూర్చున్నారు. సరోజా, శ్యామలా, వసపిట్టల్లా దారి పొడుగునా మాట్లాడుతూనే వున్నారు-- కాస్సేపు సరదాగా కబుర్లు చెప్పుకొటం కాస్సేపు ఔనంటే కాదని వాదించుకోటం నువ్వు పందెం కాస్తావా అంటే నువ్వు పందెం కాస్తావా అని కవ్వించుకోటం-- మధ్య కూర్చున్న సురేఖ చెవుల తుప్పు రాలిపోతున్నా వాళ్ళ ధోరణి భరిస్తూ బిడియంగా ముడుచుకు కూర్చుంది.
    'మీ స్నేహితురాలికి మాటలు రావా.' అన్నాడు మాధవ్.
    'సరేలే. నీ మేనగోడళ్ళు మరొకరిని మాట్లాడనిస్తారా  అసలు -- ఎడా పెడా వాళ్ళే చెప్పేస్తున్నారు కబుర్లన్నీ.' అంది శకుంతలమ్మ.
    'అయినా ఆవిడ స్వతహాగా మితభాషి ఏమో.... అంతా మాలాగే వాగుతారా?' అవునా అన్నట్లు సురేఖ మొహం లోకి చూస్తూ అంది సరోజ. సురేఖ చిన్నగా నవ్వేసింది.
    'అయ్య బాబోయ్ -- సురేఖ కెనా అంత మంచి సర్టిఫికెట్టు ' గుండె బాదుకుంది శ్యామల. 'తనూ కబుర్ల పోగే -- ఎటొచ్చి మనలా కొత్తా పాతా లేకుండా వాగేయదు-- పరిచయం అయిన కొత్తలో కాస్త ముభావంగా వుంటుంది-- కాస్త స్నేహం కలిసిందా ఇంక అవతలి వాళ్ళని మాట్లాడనివ్వకుండా చెప్తుంది కబుర్లు.'
    'అయితే ఆవిడ పరిచయస్తులని స్నేహితులుగా గుర్తించటానికి ఎన్నాళ్ళు పడుతుందేమిటి?' అంత రద్దీగా వున్న రోడ్డు మీద కూడా ముందుకి దూసుకు పోవటానికి ప్రయత్నిస్తూ, పుట్టి మునిగి పోయినట్లు హారన్ హోరెత్తించేస్తున్న టాక్సీ కి సైడు ఇచ్చి రోడ్డు వంకే చూస్తూ అన్నాడు మాధవ్.
    సురేఖ కి చచ్చే మొహమ్మాటంగా వుంది. ఏదైనా సరే మాట్లాడా లనిపించింది --

               


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS