"పంచ తంత్రమా? హితోపదేశమా?"
ఆమె చిరుకోపంగా అడిగింది.
సారధి తమాషాగా నవ్వేశాడు. "చిన్నా! ఇది పంచతంత్రమూ కాదు, హితోపదేశమూ కాదు. కేవలం ప్రేమోపదేశం. మనం కొన్నిటిని ఆశిస్తే కొన్నిటితో రాజీ పడటం నేర్చుకోవాలి, తప్పదు."
ఆ మాటలు అంటున్నప్పుడు అతని కంఠం అదోలా ధ్వనించింది.
"రాజీపడాలా?"
"అవును... చిన్నా.. ఉదాహరణకి మనం ప్రేమ వివాహం చేసుకున్నాం. మన పెళ్ళికి మీ నాన్నా వాళ్ళు రాలేదు"
"మీ నాన్నా వాళ్ళూ రాలేదు."
"అవునవును. అయినా మనం బాధపడ్డామా? లేదే! మనకి పెళ్ళి ముఖ్యం, వాళ్ళ రాక కంటే."
ఆమె జవాబివ్వలేదు.
"చిన్నా" అతనేదో అనబోయాడు.
"రధీ, రాజీల విషయం నాతో ఎన్నడూ అన్లేదే. నువ్వు యీ విషయం నాతో ఎందుకు చెప్పలేదు. రధీ! నేనెన్నడూ దేనిలోనూ రాజీపడటం ఎరగను. అది నా పద్ధతికి వ్యతిరేకం. నా మనస్తత్వానికి వ్యతిరేకం. నా మనస్సు వ్యతిరేకించిన దేన్నీ నేను చెయ్యను. నాకు మనస్సు కష్టపెట్టుకోవటమే అలవాటు లేదు. ఇక మనస్సు చంపుకోవటం బొత్తిగా తెలీని విషయం" కొంచెం ఆవేశంగానే అంది వారుణి. ఆమె ముఖం ఎర్రనైంది.
"చిన్నా! మా అమ్మ నాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది"
"నా కంటేనా ?" దెబ్బతిన్నట్టయి చప్పున అడిగింది. తనకంటే సారధిపై యింకెవరికి ఎక్కువ ఆశలుంటాయి. తల్లిదండ్రులు కొన్నేళ్లే కలసి వచ్చే ప్రయాణీకులు. కానే తను అతని జీవన సహచారిణి. అతనితో జీవితాంతం కలసిమెలసి సుఖంగా జీవించాలి. మరి తనకి ఎక్కువ ఆశలుంటాయా? ఆమెకి అత్తగారికి వుంటాయా? అనుకుంది వారుణి.
"అలా అడక్కు"
"ఎందుకు ?" దారుణంగా దెబ్బతిన్నట్టయింది.
"చిన్నా ! నీకు నేనే జీవితం."
"అవును_"
"నేనే జీవం_"
"ఆఁ"
"నేనే జీవనం_"
"ఆఁ"
"నేనే దైవం_ధ్యానం."
"అవును_అవును_అవును_నువ్వే నా జీవితం జీవం, జీవనం, దైవం, ధ్యానం, యోగం, యాగం, ప్రాణం, ప్రణవం అయితే_"
"కానీ ఆమెకి అలాకాదు. ఆమె ఆశకి నేను ఓ కేంద్ర బిందువును. ఆమె నా నుంచి_ నా ద్వారా ఎంతో హోదా, డబ్బు, దర్పం, సుఖం ఆశించింది. అవి దక్కలేదు."
"అయితే_"
"చిన్నా_"
"ఏమిటో చెప్పండి ?" నిలదీసినట్టుగా అడిగింది.
"చిన్నా ! ప్లీజ్ నన్నర్థం చేసుకో. కట్నం డబ్బు_"
చప్పున ఖండించిందామె.
"మన మధ్య కట్నం ప్రసక్తి ఏమిటి? నేనే మీకు ఎందుకు కట్నం యివ్వాలి. నాలా చదువుకుని, ఉద్యోగం చేస్తోన్న అమ్మాయి భార్యగా లభించినందుకు మీరే నాన్నగారికి యివ్వాలి."
"చిన్నా_"
"అఫ్ కోర్స్ వద్దులెండి. అయిన మా నాన్నగారు కట్నం యివ్వటం నాకు బొత్తిగా యిష్టంలేదు. ఆయనకి శక్తి లేదని కాదు. నా సిద్ధాంతాలకి వ్యతిరేకం."
"అది కాదు చిన్నా_"
