మన స్నేహాన్ని బంధుత్వం కింద మార్చుకోవాలని ఆశ. తరువాత నీ యిష్టం.
సత్యం లేచి సూటుకేసు సర్దుకున్నాడు.
* * *
హోటల్ చక్రమ్ లో కృష్ణమూర్తి తిండి విషయమై తన ప్రతాపమేమిటో ప్రదర్శిస్తున్నాడు.
ఇప్పుడతను మషాలదోసె భోం చేస్తున్నాడు. అంతకుముందు అతను ఏమేమి తిన్నాడో తెలీదు. బల్లమీద ఖాళీప్లేట్లు మాత్రం ఐదువున్నాయి.
వెయిటర్ చేతులు కట్టుకు నిలబడ్డాడు - కృష్ణమూర్తివేపు జాలిగా చూస్తూ...
కృష్ణమూర్తి తిండికి పద్మ సిగ్గుపడుతోంది. అంతా తమవేపు విడ్డూరంగా చూస్తున్నట్టు గమనించి తల దించేసుకుంది. కృష్ణమూర్తి తిండిని ఆమె అంతకుముందు ఎన్నిసార్లు విమర్శించిందోగాని-ఇప్పుడు ఆ ఓపికలేక కళ్ళనీళ్ళు పెట్టుకుంటోంది.
కృష్ణమూర్తి దోసె భోంచేస్తూనే నాన్నకోసం వెయ్యికళ్ళతో వెతుకుతున్నాడు.
కృష్ణమూర్తి దగ్గిర బొమ్మలా నిలబడ్డ వెయిటర్ని హోటల్ ప్రొప్రయిటరు పిలిచేడు.
వెయిటరు అక్కడ్నించి వెళ్ళిపోయేడు.
* * *
అప్పలకొండ తనచేతిలో వున్న కార్డుని మంగమ్మకి పూర్తిగా చదివి వినిపించేడు.
అందులో విషయాలకి మంగమ్మ నొచ్చుకుంటూ అమాయకంగా అనేసింది--
"దొంగసచ్చినోళ్ళు అబ్బాయిగారంటే గిట్టనోళ్ళెవరో రాసుంటారు." అప్పలకొండ విసుక్కున్నాడు-
"తిట్టమాక ఈ ఉత్తరం అబ్బాయిగారే రాసేరు - అవునే ఎర్రి మొహమా? నాకు ఫోటో యిచ్చినట్టే పెద్దయ్యగారికి ఆకాశరామన్న ఉత్తరం రాసేడన్నమాట. దేవుడు చల్లగా చూడబెట్టి ఇయ్యాల పోస్టు నా చేతిలో పడింది. ఈ కార్డు జేబులో తోసేసి మిగతా పోస్టంతా పెద్దయ్యగారి ముందెట్టాను అమ్మమ్మో---అబ్బాయిగారెంతెంత ఆలోచన్లు చేస్తన్నారో చూసేవా?"
అతను సి.ఐ.డి. గానో ఉద్యోగం చేయాల్సింది. లక్కు బావుండక సత్యంగారింట్లో చాకిరీ చేస్తున్నాడని మంగమ్మ అనుకుంది.
"ఉత్తరం అయ్యగారికివ్వవా?" అడిగిందామె.
"ఇయ్యను."
"ఎంచేత?"
"అంతా ఇనేసి ఇంకా ఎంచేతని అడుగుతావెంటే పిచ్చిమొహమా? ఉత్తరం ప్రకారం కత నడిస్తే అబ్బాయిగారి పెళ్ళి అబ్బాయిగారిష్ట ప్రకారమే జరిగిపోద్ది. అది నాకిష్టంలేదు."
"ఇంతకి ఉత్తరాన్ని ఏం చేద్దావనుకుంటున్నావ్?"
అప్పలకొండ ఏం చేయాలనుకున్నాడో అదే చేస్తూ చెబుతున్నాడు- రన్నింగ్ కామెంట్రీలాగా.
"నాలుగు ముక్కలు చేస్తాను. నాలుగుని ఎనిమిది చేస్తాను. యెనిమిదిని పదహారుచేసి...ఇదిగో ఈ పొయ్యిలో యిట్లాపోసి తగలెడతాను."
ఆ విధంగా ఆ యొక్క కార్డు తగలడి పోయింది...
* * *
హోటల్ చక్రమ్ లో కృష్ణమూర్తి యింకా ఆపసోపాలు పడుతూనే వున్నాడు!
అతని తిండి భాగోతం మైసూరుబజ్జీతో ముగిసిపోతే బావుండునని పద్మ వెయ్యి దేముళ్ళకి మొక్కుకుంది.
అంచేత మైసూరు బజ్జి కూడ ఖర్చయేక మెల్లిగా... భయపడుతూ... అన్నది---
"ఇంకపోదాం కృష్ణా!"
కృష్ణమూర్తి పద్మ మాటని పట్టించుకోలేదు. తండ్రి రాకకోసం వెయ్యికళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఆయనింకా రాలేదు!
ఎందుకు రాలేదు? ఇది ప్రశ్న! దీనికి సమాధానం ఏమిటి? అసహ్యం.
"పోదాం పద!" అన్నది మళ్ళీ.
కృష్ణమూర్తి ఆమెను మళ్ళీ పట్టించుకోలేదు. వెయిటర్ తో అన్నాడు.
"ఊతప్పం పట్టుకురా!"
వెయిటర్ కదల్లేదు. శిలా ప్రతిమలా నిలబడ్డాడు.
అతని వాలకం చూసేక కృష్ణమూర్తికి కోపం వచ్చింది.
"నీకే చెపుతుంట. ఊతప్పం పట్టుకురా!"
అప్పటికి వెయిటరు తన ఫోజు మార్చలేదు. అక్కడ్నించి అంగుళం కదల్లేదు.
అయితే ప్రొప్రయిటరు మాత్రం కౌంటరు దిగాడు. కృష్ణమూర్తి దగ్గిరకి వచ్చి ఎంతో వినయంగా అన్నాడు-
"క్షమించాలి! మీకు సప్లయి చేయలేం!"
ఆ మాటతో కృష్ణమూర్తి అవమానం ఫీలయ్యేడు---
"బిల్లు ఇవ్వననే భయమా? ఇంద-ఈ వంద వుంచండి. అడిగింది తెప్పించండి!" అన్నాడు రోషంగా - వందకాగితం టేబిల్ మీద వుంచుతూ...
ప్రొప్రయిటరు ఆ కాగితం తీసుకోలేదు.
"మీరు బిల్లివ్వకపోయినా ఫర్లేదు. ఇప్పటికయినా వెళ్ళిపోతే అదే పదివేలు!"
ఈమాట మరింత అవమానకరంగా తోచింది కృష్ణమూర్తికి.
కుష్టురోగులూ వగైరా మనుషులిని హోటళ్ళలోకి అనుమతించక పోవడం ఆరోగ్యసూత్రాల ప్రకారం చట్టసమ్మతమే కావచ్చు... తన కల్లాంటి రోగం ఏమీలేదు. అలాంటప్పుడు తనని వెళ్ళిపొమ్మని చెప్పడానికి అతనికి ఎన్ని గుండెలుండాలి?
ఆ పాయింటే అడగాలన్న ఉద్దేశంతో ఆ మాటకి కొంచెం పాలిష్ కొట్టి అడిగేడు---
"ఎందుకు వెళ్ళిపోవాలో కూడా చెప్పండి. సంతోషంగా వెళ్ళిపోతాను."
ప్రొప్రయిటరు బిక్కమొహం పెట్టుకుని అన్నాడు---
"మీ తిండివరస చూసి కస్టమర్లు అసహ్య పడుతున్నారు."
ఆ మాటతో కృష్ణమూర్తి వళ్ళు మండిపోయింది.
"నాతిండి నాయిష్టం. అసహ్యపడటానికి వాళ్లెవరు?"
ప్రొప్రయిటరు మర్యాదగానే సమాధాన మిచ్చేడు---
"అయ్యా- పదిమందిలో తినడానికి ఒక పద్ధతీ ఒక వరసా వున్నాయండి. అవి పట్టించుకోకుండా తింటూవుంటే చూసేవాళ్ళకి రోతగానే వుంటుంది. తద్వారా వాళ్ళు తినే తిండిమీద కూడ రోత కలుగుతుంది. అటుచూడండి-తినడానికి వచ్చిన కస్టమర్లు మీ రోత తిండిచూసి రోత కలిగి ఏమీ తినకుండానే అంతా వెళ్ళిపోయేరు. యిట్లా మీకుమల్లే రోజుకోబేరం తగిలితే మేము హోటల్ మూసేసుకోవాల్సిందే!"
రోత గురించి అతనంత రోతగా చెప్పినందుకు కృష్ణమూర్తి ఓర్చుకో లేకపోయేడు.
చిన్న స్పూన్ తీసి కత్తిలాగా పుచ్చుకుని అన్నాడు---
"మిస్టర్-టూమచ్ గా మాటాడుతున్నావ్!"
పద్మకి భయం వేసింది. కృష్ణమూర్తి చేతిలోంచి స్పూన్ లాగేసుకుంది.
అప్పటిక్కూడ హోటల్ ప్రొప్రయిటరు వినయంగానే అన్నాడు-
"నామాట మీకు టూమచ్ గానే వినిపించవచ్చు. మీరోత తిండి మాత్రం డబుల్ టూమచ్! వెళ్ళండి బాబూ-మమ్మల్ని ఇట్లా బతకనీండి. అమ్మా-మీరైనా వారిని తీసుకెళ్ళండమ్మా!"
కృష్ణమూర్తి పద్మ వేపు చూసేడు. పద్మ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.
యేవనుకున్నాడో ఏమో పద్మతోపాటు అతడు హోటలునుంచి బయటకు వచ్చేస్తున్నాడు.
* * *
చాలా చిరాకుమీద ఇంటికి వచ్చేడు చిరంజీవి కృష్ణమూర్తి.
ఇంట్లోకి అడుగుపెడుతూనే కుర్చీని లాగితన్నాడు. అది కిందపడి ఢామ్మని శబ్దం చేసింది.
