Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 13


    "అయితే అయినంత మాత్రాన" శాస్త్రిగారికంతా అయోమయంగా వుంది.

    "చదువుకున్నప్పటినుంచీ ఇద్దరికీ పరిచయం వుంది. ఇప్పుడు ఇద్దరూ తిరుపతి వెళ్ళారు. పెళ్ళికూడా అయిపోయి వుంటుంది. ఇక రేపో మాపో తిరిగి వస్తారు."

    ఇందాక నాయుడన్న మాటలు చూసిన చూపులు ఆయనకి మనో పధంలో మెదులుతున్నాయి.

    "అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ మేజర్లు ఏ మనటానికి వీల్లేదు. అంచేత రేపు వాళ్ళిద్దరూ తిరిగిరాగానే మన సంప్రదాయం ప్రకారం పెళ్ళిచేస్తే బావుంటుంది. రెండు కుటుంబాలకి మర్యాదగా వుంటుంది."

    వింటున్న శాస్త్రిగారికి తల తిరిగిపోతోంది. ఏవిటిదంతా? సంభవమేనా? ఎందుకిలా జరిగింది?

    మళ్ళీ పరంధాం చెప్పసాగాడు.

    "లౌకికంగా మీరు బ్రాహ్మణులు. వాళ్ళు కాదు. వాళ్ళకీ మీకు ఆహార విహారాల్లో ఎంతో భేదముంది? కాదనం. అందుకే ఈ పెళ్ళి అయినంత మాత్రాన వాళ్ళు మీరు పోసుకు తిరగటాలు ఏమీ వుండవు. ఎవరి సంప్రదాయం వాళ్ళది. ఎవరి ఆచారం వాళ్ళది! ఎవరి గౌరవమర్యాదలు వాళ్ళవి."

    నాయుడమ్మ పరబ్రహ్మశాస్త్రి ముఖ కవళికల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు.

    "ఒకర్నొకరు హెచ్చుతగ్గులు అనుకోవలసినపని లేదు. అవసరమూ లేదు. అందువలన ఫలితమూ లేదు. రేపు పెళ్ళి ముగించేద్దాం. ఆ తర్వాత మీ యిష్టం. అమ్మాయిని మీ లోగిల్లోకి రప్పించుకున్నా సరే! అబ్బాయినీ, అమ్మాయినీ వేరే వుంచినా సరే!"

    కొడుకు ఇంతపని చేస్తాడని వూహించని శాస్త్రిగారు మాన్పడిపోయారు. ఆయన జీవచ్చవంలా అతను చెప్పిన పాటాలన్నీ విన్నాడు నోటమాట రాలేదు.

    "బావా!"

    "పరంతపా! నాకు చెప్పక్కర్లేదు ఏదీ మన చేతుల్లో లేదని ఇప్పుడిప్పుడే నాకు అర్ధమౌతోంది. ఏవో అనుకుంటాం. ఏదో జరుగుతుంది. ఏదో ఆశిస్తాం. మరేదో దొరుకుతుంది. అదే ఈజీవితం_"

    "అదికాదు బావా"

    "నువ్వూరుకో! నాయుడమ్మగారూ! ఇదేదో భగవత్సం కల్పం_ మనం కాదనటానికి శక్తి చాలదు. ఔననటానికి మనసూ, సాంప్రదాయమూ అంగీకరించటంలేదు. మా అంతవాళ్ళం మేం మీ అంతటి వాళ్ళు మీరు_"

    "ఈ రోజుల్లో కూడా ఇంకా కులాలూ, మతాలూ ఏవిటి బావా! ఏం వాళ్ళు మాత్రం మనుషులు కారా? ఇదేదో అనుకోకుండా జరిగిపోయింది. అవతల ఆడపిల్ల జీవితం ఏం చేస్తాం చెప్పు" పరంతప శాస్త్రి సర్ది చెప్పబోయాడు.

    "బావా ఇవన్నీ మాటలు వినటానికి బాగానే ఉంటాయి. మనం సంఘజీవులమయ్యా! ఆ సంగతి మర్చిపోతే ఎలా? నాయుడమ్మగారూ! మీ సంబంధం మాకెంత నచ్చదో - మాతో వియ్యమూ మీకంత నచ్చదు. అంత తెలియని వాడినికాదు." కాస్సేపు ఆగారాయన.

    ఆయన మనసుతో ఎంత అగ్ని రగులుతుందో అక్కడున్న వారికి అర్ధమవుతూనే ఉంది. కానీ... ఆయన నిర్ణయం ఎలా ఉంటుందోనని అందరూ వూపిరి బిగబట్టి వింటున్నారు.

    అంతవరకూ వింటున్న శాస్త్రిగారి భార్య పార్వతి మెల్లగా దృడంగా అంది_

    "అయ్యా, మీరు వాళ్ళిద్దరూ తిరిగి రాగానే పెళ్ళి జరిపించండి. శాస్త్రోక్తంగా జరుపుకుందాం - మేం పీటల మీద కూర్చుంటాం_ మీరు కన్యాదానం చేయండి_ పెళ్ళికాగానే మాదారి మాది_ మీదారి మీది"

    ఆమె మాటలు వింటున్న నాయుడమ్మ కొద్దిగా కదిలాడు, ముఖంలో వికాసం వచ్చింది.

    "అబ్బాయినీ అమ్మాయినీ మీ యిష్టానికే వదిలేస్తాం_ కలసి కాపురం చేసేవాడు కలసి పోవటానికి అంగీకరించవచ్చు"

    "అంటే మీ యింట్లో ఉండనివ్వరా" సందేహంగా అడిగాడు నాయుడమ్మ.

    "దిక్కూ మొక్కూ లేనివాళ్ళలాగా వేరే ఉండాలా ఇదేం న్యాయం? పెద్దవారు మీరు చెప్పాల్సిన మాటేనా ఇది?" పరంధాయ్ కల్పించుకుని అన్నారు.

    "నా మనసులోని మాట చెప్పింది ఆవిడ_ ఆ తర్వాత మీ ఇష్టం" అన్నారు శాస్త్రిగారు.

    "శాస్త్రిగారూ! నాయుడమ్మ పిలిచాడు.

    "చెప్పండి"

    "మీకు కష్టంగానే ఉంటుంది కాదనను_ నేనూ లౌక్యం నేర్పినవాడినే_ మా అమ్మాయి చేసిన పని నాకూ కష్టంగానే ఉంది_ కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది_ కానీ కోడల్ని వెలివేయండి. మీ యింట్లో వ్యక్తిగా మసలనీయండి" ఆశగా చూస్తూ అన్నాడు.

    శాస్త్రిగారు బాధగా నవ్వారు_ "మీరు చెప్పింది కూతురిమీద మమకారంతో. కాదనను_ కానీ మీరు మా పరిస్థితి కూడా ఆలోచించాలి_ పెళ్ళికావాల్సినపిల్ల వుంది. బంధువుల్లో నా మీ గౌరవమూ పరపతీ వున్నాయి_ ఇవన్నీ ఎలా పోగొట్టుకోను" ఆయన గొంతులో ఆవేదన కెరటంలా లేచింది.

    "వాళ్ళది ఉడుకురక్తం_ ఆవేశం ఆదర్శాలు వాళ్ళకి ఎక్కువ తొందరపడ్డారు_ ఆశీర్వాదాలు యివ్వడమే మన కర్తవ్యం కానివ్వండి_ ఎక్కువ మాటలతో ఏం పనివుంది? దాని అదృష్టం ఎలా ఉందో? మీలాంటి కుటుంబంలో పడటం అదృష్టమేగాని, అదీ మాకు మనశ్శాంతిని దూరం చేస్తుంది. అదే నా బాధ" నాయుడమ్మ బాధగా అన్నాడు.

    అతనికీ పరిస్థితి బాధగానే ఉంది. భరించలేనంతగానూ ఉంది_ ఒకపక్క ఆనందం, మరోపక్క ఆవేదన.

    "రేపు వాళ్ళు రాగానే మీరు చెప్పినట్లే చేస్తాం. వస్తాం మరి" అంటూ లేచారు.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS