Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 12


    "ఈరోవురు?"
    మొకపు అడ్డంగా తిప్పి , కళ్ళు వొంకరగా సేసి, నడుం కుసింత పక్కకి వోల్సి; మోసెయ్యి ఆడి బుజం మీద అనిసి , అరిసేత్తో అడి గెడ్డం పైకెత్తి అడిగినాది సెంద్రకాంతం.
    ఎంకన్న గుండి తపతపలాడినాది, సన్నంగా నవ్వాడు బద్రయ్య.
    "మావోడేలే! ఎంకన్న. నిన్ను సూబిద్డారని తీసుకొచ్చా!"
    "ఊ!?" అంటా మొకం సక్కగా సేసిందది.
    తేలిగ్గా నిలుసుని దాని బుజమ్మీద సెయ్యేశాడాడు.
    ఎంకన్న సిగ్గు పడ్డాడు.
    "దండాలు మావయ్యగొరికి!" అన్నాది సిన్నది.
    అప్పుడేం మాటాడాలో తెలీలేదాడికి. ఎర్రిగా ఓ సిన్ని నవ్వులాటిది నవ్వాడు.
    'సేందరకాంతం బోగవుదా?' అనుకున్నాడు.
    ఎనకోతడవ , ఆడి సిన మేనమావ బామ్మరిది కొడుకు పెళ్లిలో బోగం మేళం సూశాడు. ముందల, అసలు పెళ్లి కేడడావనుకోలేదు కానీ, మురవ మురమండోళ్ళ మేలం పెట్టిత్తన్నారండంతో , అదెల్లా గుంటాదో సూదామని మనుసయి, బోలిడు డబ్బు కరుస్సేసుకుని పెళ్ళి కేల్లాడు. సిలుకు లాల్సీ లోళ్ళంతా ముందలే కూకున్నారు. మీసాలు తడుంకుని మొగతనం గురుతుకి తెచ్చుకున్నారు! ఆడు ఎనకాలే కూకున్నా , ఓ సిలక లాంటి సిన్నది జనాన్ని తోసుకొచ్చి, ఆడి సేతులో తాంబోళం పెట్టింది. ఆడి కెంతో సిగ్గయినాది. గెడ్డం కింద గందం రాసి, సేక్కిలి మీద సిటికేసినాది. అప్పుడు ఆ తాంబోళం ఏం సెయ్యాలో తేలీలేదాడికి. అటూ యిటూ సూశాడు. అందరూ తలో అర్ధ రూపాయీ పెట్టి తిరిగిచ్చేశారు. అంత తక్కువ మొత్తం పదిమంది లోనూ యివ్వడం యిట్టం లేనివోళ్ళు తాంబోళం మడిసి జేబీలో పెట్టుగుని, అది యిచ్చిన బుల్లెమ్మని పిలిసి గుట్టుగా సెవుల్లో ఏదో వూత్తావున్నారు. ఆడూ అదే సేద్దామనుకున్నాడు . కాని , దాని తాంబోళం , అర్ధనా యిలవ సేసీ తాంబోళం, తన దగ్గర వుంచుకోడం మంచిది కాదనుకుని, ఓ రూపాయి ముడుపు సేల్లించుకుని దాంది దాని కిచ్చేశాడు. ఆ సిన్నది నవ్వుతా అందుకుని, మెడ కింద కితకిత పెట్టి నాది. పై పెచ్చు అన్నాది గందా "నీ సోకుకి నేను తగనేంటి మావా" అన్నాది.
    ఆ మాటలో గుట్టు ఏంటో ఆడికి యిప్పటికీ కొంచెం అనువానవె!
    'బోగవొళ్ళ మాటలు తెలుసుకోడం కట్టవేవో?' అనుకున్నాడెంకన్న.
    "లోన కూసుందారి రా,మావా!' అంటా ఎంకన్న సెయ్యి పట్టుకుంది కాంతం.
    ఆడి నరాలు జిలజిల్లాడినాయి. అయినా కానీ, ఆ సెయ్యి మెత్తగానే వున్నాది. సల్లగానూ ఉన్నాది. ఈడి రగతం ఉడుక్కి దాని రంగు కరిగిపోయిలా ఉన్నాది.
    బద్రయ్య యీళ్లిద్దరి కంటా ముందే ఎల్లి తిన్నగా మంచమెక్కి కూకున్నాడు.
    ఎంకన్నని సోపాలో కూకోబెట్తిందది. కూకున్నాడు.
    తెల్లటి పక్కా, దాని మీద సేదిరిపోయిన మల్లి పూలూ, పక్క కిందున్న పరువు మెత్తటిదే అయుండాది. దానికింద పందిలి మంచం! ఆటన్నిటి మీదా, గది మీద దొరలా బద్రయ్యా!
    గాజులు గలగల్లాడించుగుంటా నడిసి అలవారు కాడి కేల్లిందది .
    "నేనిక్కడుండగా అలవాల్లో ఏవుందే ఎర్రి మొగవా?' అన్నాడు బద్రయ్య.
    "నీకోసవే!"
    రంగు రంగుల గుడ్డ మూటలిప్పి ఎర్రటి సీసాకాయి ఎలపలికి తీసినాది.
    పక్కగదిలో పోలీసోడున్న అలికిడీ లేదు!
    బద్రయ్య యిరబడి నవ్వాడు. సొగసుగా నవ్వింది కాంతం!
    రంగు సోడాయేవో? అనుకున్నాడు ఎంకన్న.
    పొట్టిగా వున్న గళాసులు మూడు తెచ్చి సీసా మూత యిప్పినాది.
    గుప్పుమంటా వోసన గది నిండా కొట్టినాది.
    సారానా? అనుకున్నా డెంకన్న.
    అడిగేత్తే?
    కాంతం నవ్వితే?
    పోలీసోళ్ళు రారుగందా?
    మూడిటిలోనూ కొంచెం కొంచెం పోసి , ఇంకో సీసా లోంచి యింకోటేదో తీసి కలిపినాది.
    బద్రయ్య సటుక్కుని మంచం మీంచి వురికి దాని సేతిలో సీసా అందుకున్నాడు. తన గళాసులో నిండా పోసుకున్నాడు. సాంతంగా మల్లా మంచం పడేన్నేక్కి కూసున్నాడు.
    కడవా రొండు గళసుల్తోనూ ఎంకన్న దరికొచ్చినాది కాంతం. ఆడు పట్టుకోబోయాడు . అది వోదల్లెదు. తన గళాసు బల్ల మీదెట్టి రెండోది తెచ్చి అడి పెదాలకి అందిచ్చి "ఊ!" అన్నాది. గళాసు కేసీ, దాని మొకం కేసీ చూసి, పెదాలు సాసి, సప్పరించాడు ఎంకన్న.
    ఓగరుగా వుంది కానీ, గొంతుకు లోకి ఎల్లడం తోటే మంటుట్టినాది. 'లోన కెల్లాక యింకా ఎంత మంటుడతాదో?' అనుకున్నాడు . ఆడి పక్కనే సోపామీ దానుకుని కూకుని కాంతం కూడా తన గళాసులోది తాగేసింది.
    మల్లా వొచ్చి బద్రయ్య యింకో గళాసోసుకున్నాడు.
    సోపా మీద వొంకరగా ఓలి, ఎంకన్న కేసి సూత్తా అలాగే కూసున్నాది కాంతం! 'బద్రయ్య ఏం అనుకున్నాడో గందా?' అనువాన వొచ్చినాది ఎంకన్న కి.
    కొంచెం సేపయాక ఎంకన్న కి కడుపులో ఏదో దేవేత్తన్నట్టనిపించినాది. నరాలు పొంగుతా వున్నాయి. తల తిరుగుతన్నాది.
    బద్రయోచ్చి దాన్ని సేయ్యేట్టుకు లాగి, నడుం సుట్టూ సెయ్యేసి నొక్కాడు.
    సోపాలో కూకోలేక తూల్తా ఎలపలి గదిలో కొచ్చి బల్ల మీదికి వోలిపోయాడు ఎంకన్న. ఎప్పుడో కాని, నిద్దరేపట్టేసినాది.
    ఓ రేతిరెల- జుట్టు పైకెగదోసుకుంటా యీడి గదిలో కొచ్చినాది సేంద్రకాంతం.
    అడింకా నిద్దట్లోనే ఉన్నాడు.
    దాని కళ్ళు సింతనిప్పుల్లా గున్నాయి. సేతులు వానికి పోతున్నాయి. మొకం వుబ్బరించినాది.
    ఆడి దగ్గరికొచ్చి గుండిలి మీద సేయ్యేసింది. ఇటూ అటూ కదిపింది. లేగలేదు. ఆడి జుట్టులో సేతిఏళ్ళు దూరిపి తనేంపుకు తిప్పుకున్నాది.
    సగం కళ్ళు తెరిశాడు. సెంద్రకాంతాన్ని సూశాడు. లేసి కూకుందామనుకున్నాడు. సేతులూ, కాళ్ళూ సెప్పిన మాట యిన్లేదు. మల్లా కళ్ళు మూసుకున్నాడు.
    సెంద్రకాంతం ఆగలేక పోయినాది. ఆడి మొకం మీద మొకం పెట్టి, వొల్లంతా వొలిసి, బరువుగా వోరిగినాది!
    ఎంకన్న కళ్లూ, పెదాలూ సురుగ్గా కదిల్నాయి.
    ఎనకాతలే బద్రయ్యోచ్చాడు. తూలుతా వొచ్చాడు.
    "పాపం లెత్తన్నాడు , నిదరోగోట్టకే!" అంటా బుజాలట్టుకుని లేగదీసుకు పోయాడు దాన్ని.

             

                                  8

    రవణయ్య మావ పెళ్ళాం మల్లా నీల్లోసుగున్నాదంట! ఎంతదురుట్టం! ఆడంటే దానికి ఎంతగొప్పో! సిన్నోడ్నీ తీసుకొచ్చి ఎంత వొయ్యారంగా అందిత్తాదనీ? ఓరబ్బో! యీ బూమ్మీద యింకెవరూ పిల్లల్నే కనలేదా?
    పిల్లల వూసు తలసుకున్నప్పుడు దాని గుండి లోనకే దించుకు పోతాది. తనకీ జనవకి ఆ రాత లేదేవో? ఉసూరుసురనిపిత్తాది . సీకట్లో కొంగే సుకు పడుకుని బూదేవమ్మని కరిసిసేట్టుకుని ఎడుత్తాది. ఆ కన్నీల్ల తో అబిసేకాలు సేత్తాది.
    "ఏవే! పిల్లా! మనవేడ్నేప్పుడిత్తావే?' అంటా సెరువు కాడ పుల్లమ్మ నిలేసి అడిగినప్పుడు ఎంత సిగ్గేసుకొచ్చిందనీ? అబ్బబ్బ! కళ్ళూ కుట్టినాయి.
    "ఆరేళ్ళనించి కాపరం సేత్తన్నా , దీని కడుపు నింకా ఓ కాయన్నా కాయదెవేం?' అంటా గుసగుస లాడుకోలేదో?
    లగ్గవయిన తొలిరోజుల్లోనే నీల్లోసు గున్నోళ్ళు ఎంతమంది లేరూ? సంవచ్చరాది పండుగు రోజుల్లో పెల్లయిన సీతమ్మ పుస్సిమాసవులో పండంటి బుల్లోడ్ని కనలేదో?
    'తన కారాతే వుంటే యింకేం?' అనుకున్నాది రావులమ్మ. ఎడిసేడిసి కళ్ళు వోసినాయి కూడా. బొట్టు కరిగిపోయినాది. వొల్లంతా తేవతేవయినాది.
    ఓనాడు పొలం కాడ గంగయ్య అన్నాడు గందా --
    "సిలకలాటి పెల్లాన్ని యింటో వొదిలి ఆడు పట్నం సుట్టూ తిరుగుతాడే వేం?"
    ఏంసేబుతాది? పొయిలోకి రొండు సితుకులేరుకొని మాటాడకుండా అల్లాగే ఎల్లిపోయింది.
    మొగరాజు! ఆడికే వంట! నలుగురి నొల్లల్లోనూ పడీది తను! అడల్లా మారిపోబట్టే తనందరికీ లోకువయినాది. లేపోతే -- రవణయ్య మావ పెళ్లాం లాగ -- ముగ్గురు పిల్లల్ని కని ఉండద్దో?
    సత్తెమ్మ పుట్టింటి కేడతన్నాదంటే సూట్టానికెల్లింది రావులమ్మ. 'సన్నగా సింతబరికిలా గుండీది, దాని కెంత వోల్లోచ్చిందో?' మిసమిసా మెరుపొచ్చినాది. నిగారింపోచ్చినాది. ఓరబ్బ! నవ్వితే సాలు, సేక్కిట్లో గుంటలడతన్నాయి!
    ఇన్నేల్లోచ్చినా కూడా ఆడికంత సిగ్గులేదేవో? గట్రాటలా తను నిలుసుసుండగానే పెళ్లాం సేయ్యట్టుగుంటాడా? సేక్కిలి మీద సిటికేత్తాడా? తనకే వుందా పెళ్లాం? ,మిగిలినోళ్ళు అల్లా బరితెగించరేం? బెల్ల మ్ముక్కయితే కోరుక్కుని తినరాదో?
    ఆళ్ళ పరాసకాలు సూత్తావుంటే దానికి ముచ్చటా అవుతాది. అలాంటి మొగోడు మొగుడయితే నూకాలమ్మ తల్లికి నిలువు దోపిడీ యివ్వక పోయిందా? కొడుకుట్టాక ఆడికి నూకరాజని పేరేట్టదో? ఏవనుకుంటే మట్టుక్కి ఏం లాబం? యీ జనవకి ఆ రాతుంటేనా!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS