సినిమాలల్లో చూడటం నవలల్లో చదవటం తప్పితే ఇలా ఫ్యాషను గానయినా కాస్త పుచ్చుకున్న వాడిని చూడటం తన జీవితంలో అదే మొదటిసారి -- ఇతని ప్రవర్తన ఎలా వుంటుంది -- నడవలేక తూలి పడతాడా , నాలిక- మొద్దు బారి పోయి మాట ముద్దగా వస్తుందా -- అత్తయ్య కివన్నీ అలవాటయి పోయాయా-- బాబోయ్-- ఇవాళ ఈ ఇంట్లోంచి నేను ఎలా బయట పడతాను అనుకుంటూ గడ్డ కట్టి పోయినట్లు నిలుచుండి పోయిన సురేఖ ని ---
'ఇక్కడ కూర్చుందాం రా' అంటూ చెయ్యి పట్టుకు తీసుకు వెళ్ళి ఓ సొఫాలొ కూర్చోపెట్టి తనూ ప్రక్కనే కూర్చుంది రంగమ్మ.
సురేఖ కి కాళ్ళూ , చేతులూ వణకటం తగ్గలేదు అయితే కామేశ్వర్రావు ఆమె భయపడినట్లు ప్రవర్తించ లేదు -- కాకపోతే అవసరానికి మించిన వుత్సాహంతో తన ఆఫీసు విషయాలు క్లబ్బు సంగతులూ ఇంకా ఇవీ అవీ ఎడాపెడా మాట్లాడేశాడు.
కాస్సేపటి తరువాత భోజనాలు అయాయి. అప్పటి దాకా ఎలాగో గుట్టుకు పడి కూర్చున్న సురేఖ 'ఇంక నేను వెళ్ళిపోతాను. అంది చేతి వాచీ కేసి చూసుకుంటూ.
'వెళ్దువుగానిలే తొందరేమిటి-- ఇంకా తొమ్మిదేగా అయింది.' అంది రంగమ్మ.
'అవును, తొందరేమిటి?' తల్లికి వంత పాడాడు కామేశ్వర్రావు గుప్పుగుప్పున సిగరెట్టూ పొగ వదుల్తూ.
'లేదండి వెళ్ళిపోతాను .' నన్ను ఎవ్వరూ ఆపలేరు అన్నట్లు వుంది సురేఖ గొంతు.
'సరే అబ్బాయి, స్కూటరు మీద దిగబెడతాడులే.' అని రంగమ్మ అంటుంటే ఆ స్కూటరేదో తన గుండెల మీద నుంచి వెళ్ళినట్లే అయింది సురేఖ కి.
'నాకు భయం వేస్తుంది-- రిక్షా లో వెళ్ళిపోతాను.' అంది.
'మా అమ్మ ఎంచక్కా ఎక్కి కూర్చుంటుంది --నీకు భయం ఏమిటి." అన్నాడు కామేశ్వర్రావు పళ్ళన్నీ బయటపెట్టి ఇకిలిస్తూ. 'నువ్వే శతాబ్దానికి చెందిన దానివి?' అని వెక్కిరిస్తున్నట్లున్నాయి అతని నవ్వూ, చూపులూ.
'నేను ఇలాగే అనుకున్నాను కాని ఎక్కి కూర్చుంటే బాగానే వుంది -- భయం వెయ్యదు-- ఈ రిక్షా వాళ్ళతో బేరాలు చేసే బదులూ , బస్సు కోసం గంటల తరబడి క్యూ లో నిలబడే బదులూ, నా ప్రాణానికిదే హాయిగా వుంది.' అని ఆవిడ చెప్తుంటే ,
'ఏమో బాబూ , నాకు భయం. అలా వెనక కూర్చున్న వాళ్ళని చూస్తేనే నాకు కళ్ళు తిరిగినట్లుంటుంది.' అంది సురేఖ.
'సరే, రిక్షా ఎక్కించి వస్తాను.' అని ముందుకు నడిచాడు కామేశ్వర్రావు'.
వెనకగా నడుస్తున్న రంగమ్మ, 'మిమ్మల్నిద్దర్నీ ఇలా చూస్తుంటే నా ప్రాణం ఎంతో హాయిగా వుందే అమ్మాయి-- నేను చెప్పింది ఆలోచించు-- నువ్వు కాదనవు నాకు తెలుసు-- చూస్తున్నావుగా బావ ఎలా అయిపోయాడో -- బాధ మరిచిపోవటానికి వాడివన్నీ అలవాటు చేసుకోటం-- ఇవన్నీ చూస్తూ నేనింకా ఎందుకు బ్రతికి వున్ననురా భగవంతుడా అని నేను ఏడవని రోజు లేదనుకో-- ఈ సంసారాన్ని గురించి తలుచుకుంటుంటే బాధ తప్ప మరేమీ వుండటం లేదు నాకు-- వాడి కింక మంచి రోజులు వచ్చాయేమో ననిపిస్తోంది.' గొంతులో ఏడుపూ, రవంత ఆశా జోడించి సురేఖ చెవిలో చెప్పినట్లే మెల్లిగా అంది.
సురేఖ కి వంటి నిండా కారం రాసుకున్నట్లే వుంది. పైకి ఏమీ అనలేక , 'ఛ , ఏమిటిదీ.' అనుకుంటూ ముందుకు చూసింది. అతనికి వినిపించి వుండదులే అని మరోసారి ధైర్యం చెప్పుకుని, ఆసలావిడ ధోరణి ని వినిపించుకోనట్లే తల వంచుకు ముందుకు నడిచింది.
గేటు దగ్గిరే ఎదురయింది ఓ ఖాళీ రిక్షా.
'ఎంత , ఏమిటి?' అని అడుగుతూ అక్కడ మరో క్షణం అయినా నిలవబుద్ది కాలేదు.
"హిమాయత్ నగర్, ఉమెన్స్ హాస్టలు కి అని చెప్పి ఎక్కి కూర్చుంది.
'తరచూ వస్తుండు,' తల్లీ కొడుకులు మరోసారి హెచ్చరించారు.
రిక్షా నాలుగడుగులు వెళ్ళాక హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది సురేఖ. 'ఇప్పటి దాకా ఎంత భయం వేసిందని. అబ్బ ఏం మనుష్యులు బాబూ.' అనుకుంటూ గుండెల మీద చెయ్యి వేసుకుంది. రంగమ్మ గారు బ్రతిమాలి , నవ్వుతూ కేకలేసి, కంచం చుట్టూ వడ్డించినవన్నీ తినిపించినా నాలుగు లంఖణాలు చేసినంత నిస్త్రాణగా వుంది.
"తాగరా తాగు.' అంటూ రిక్షా అబ్బి పకపక నవ్వటంతో , సురేఖ పై ప్రాణాలు పైనే పోయాయి.
'వచ్చి, వచ్చి వీడి రిక్షా ఎక్కాను-- ఇవాళ నేను లేచిన వేళ మంచిది కాదు.' అనుకుంది వూపిరి బిగపట్టుకుని.
కాని రిక్షా అబ్బి మాటల ధోరణి చూస్తుంటే అతను ఎవరినో ఉద్దేశించి అంటున్నట్లనిపించి చుట్టూ పరికించి చూసింది-- కాస్త దూరంలో అటు పేవ్ మెంటు ప్రక్కన లైటు వెలుగులో కనిపించిన దృశ్యాన్ని చూసి స్తంభించిపోయింది. రిక్షా ముందుకు వెళ్ళిపోయినా ఆ దృశ్యం కళ్ళకి కట్టినట్లు కనిపిస్తూనే వుంది.
'నాకు వద్దు బాబూ, పదండి పోదాం.' అని బ్రతిమాలు కుంటున్నాడుఆ రిక్షా అబ్బి.
'ఊ-- తాగమంటుంటే...' నాలుక మొద్దు బారిపోయి మాట తడబడుతోంది. అందులో వున్న వ్యక్తీది-- ఫ్యాంటూ బుష్ షర్టూ వేసుకున్నాడు-- చదువూ, ఉద్యోగం వున్నవాడిలాగే వున్నాడు-- అయితే నేం , అసలు తన పరిస్థితినే గుర్తించలేని స్థితిలో-- సీటు మీద సరిగ్గా కూర్చోటం కూడా చేత కాకుండా సగం సగం క్రిందికి జారిపోతూ చేతిలో వున్న సీసా రిక్షా అబ్బికి చూపించి తాగమని బలవంతం చేస్తున్నాడు -- అంతా ఆ మందు ప్రభావం-- అది చాలాసేపు వుండదు-- తరువాత తెలివి వచ్చాక తను మైకంలో ఎలా ప్రవర్తించాడో ఎప్పుడైనా తెలుసుకుంటే అతనికి సిగ్గు వెయ్యదా -- అది తాగి తను పొందిన ఆనందం అసలు ఏమైనా వుంటే అది కాస్తా తన పరిస్థితిని సంస్కారాన్ని మరిచి పోయేలా చేసింది అని తెలుసుకుంటే అతనికి దుఃఖం కలగదా -- అయినా ఇంకా తాగుతూనే వుంటాడా-- ఇదంతా నాగరికత లో ఒక భాగమేనా ......'
హాస్టల్ ముందు రిక్షా దిగి డబ్బు ఇచ్చేసి తన గదిలోకి వెళ్ళిందాకా సురేఖ గుండెలు కుదుట పడలేదు-- ఇవాళ్టి తన అనుభవం శ్యామలకి చెప్పాలని ఓసారి అనిపించినా మళ్ళీ ఆ ఉద్దేశ్యం మార్చుకుని బట్టలు మార్చుకుని, కాళ్ళు కడుక్కువచ్చి ప్రక్క మీద ఒరిగింది.'
* * * *
లోపలికి వస్తూనే పూల పొట్లం సురేఖ వడిలో విసిరి , 'చూడు ఏం తెచ్చానో " అంది శ్యామల.
సురేఖ పొట్లం విప్పి చూసి, 'ఓ-- మల్లె మొగ్గలు, థాంక్స్ -- ఎక్కడ కొన్నావు' తృప్తి తీరా వాటి సౌరభాన్ని అఘ్రానించీ పొట్లం అక్కడ పెట్టి దారం కోసం లేచింది.
'మా రమ ఏదో కొన్నాలంటే సుల్తాన్ బజార్ వెళ్లాం లే-- ఇప్పుడిప్పుడే వస్తున్నట్లున్నాయి, మొగ్గ పీలగా వుంది' అని బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళింది.
ఆ అమ్మాయి తిరిగి వచ్చేసరికి సురేఖ మాల కట్టడం పూర్తయింది. రెండు ముక్కలు చేసి ఓ దండ శ్యామల కిచ్చి మరోటి తన జడలో ముడుచుకుంది -- శ్యామల తల దువ్వుకోటం అదీ అయాక --
'ఇక్కడ వుడక పోస్తోంది . డాబా మీదకి పోదాం పద' అంది ట్రాన్సిస్టర్ చేతిలోకి తీసుకుంటూ.
'మరి కాఫీ తాగవ్?"
"షాపింగు కని బయలుదేరినవాళ్ళం మధ్యలో హోటల్లో దూరం లే -- బాసుందీ కట్లేట్లూ, ఐస్ క్రీమూ పీక మొయ్య పట్టించాం. ఇప్పుడెం వద్దు' అంది శ్యామల ఆయాస పడుతూ.
మూల నున్న చాప తీసుకుంది సురేఖ. డాబా రోజూ తుడిపించమని చెప్పినా నౌకర్లూ ఒకోనాడు బద్ధకం చేస్తుంటారు-- మల్లె పువ్వు లాంటి ఇస్త్రీ చీరలు కట్టుకుని అక్కడ కూర్చోవాలంటే మనస్సు ఒప్పదు ఎవరికీ. ఇద్దరూ పిట్టగోడ వార నిలబడి కబుర్లు చెప్పు కుంటున్నారు.
