"అప్పుడు నా మాట చెల్లలేదు. నాన్నగారేమీ అన్లేదు. ఏమన్నా అమ్మ బాధ పడుతుంది. బాధ పెడుతుంది. ఇల్లంతా ఒక కొలిక్కి వచ్చేట్టు చేస్తుంది. సత్యాగ్రహం చేస్తుంది. అందుకే నాన్నగారు ఆమెకి అడ్డు చెప్పలేదు."
"చెప్పలేదా? చెప్పలేరా?"
నిట్టూర్చాడు సారధి.
ఇద్దరి మధ్యా ఒక క్షణం నిశ్శబ్దం.
"చిన్నా! నేనే ఆమె మాటని ఎదిరించాను."
చప్పున అతనికేసి చూసిందామె.
"అవును చిన్నా! చదువులో, ఉద్యోగంలో, నీతో పెళ్ళి విషయంలో అన్నిట్లో నేనే ఆమెని ఎదిరించాను. ఆమెకి నేనంటే చాలా యిష్టం, ప్రేమ. అది ఆసరా చేసుకుని అన్నీ నా యిష్టప్రకారం నెరవేర్చుకున్నాను"
"పాపం!"
"అవును పాపమే అన్పిస్తుందిప్పుడు కదూ! ఆమె చెప్పినట్లు మా మేనత్త కూతుర్ని చేసుకుని వుంటే అప్పుడు ఏమనే దానవో!" నవ్వుతూ అన్నాడు సారధి.
"అప్పుడూ అయ్యోపాపం అనేదాన్ని!"
"ఎందుకు ?" ఆశ్చర్యపోయాడు సారధి.
"ఆమెని కాదు. మిమ్మల్ని!" నవ్వింది వారుణి.
"ఏయ్ఁ"
"ఊఁ చెప్పండి."
"ఆమె నన్ను ఐ.ఏ.ఎస్. చేయించాలని ఆశపడింది. అందరితోనూ తన కొడుకు కలెక్టరవుతాడని చెప్పేది. నలుగురిలో తను కలెక్టరు తల్లి అనిపించుకోవాలనే తాపత్రయం ఆమెలో కన్పించేది."
"మీరెందుకు చదవలేదు? అబ్బాయిగారు ఈ ఎమ్మే కాగానే ప్రేమ పాఠాలు మొదలెట్టారాయె."
"అదేం కాదులే! ఆమె ఆశ వేరు. అదెప్పుడూ డబ్బుతో ముడిపడి వుండేది. నన్ను కలెక్టర్ని చేసి ఏ నాల్గయిదు లక్షలో కట్నం తెచ్చుకోవాలని ఆశ. దాంతో యీ యింటిని ఇంద్ర భవనంలా మార్చాలని కోరిక."
"తమరు ఇంద్రుడా ?"
"ఆఁ నువ్వు శచీదేవీ-"
ఫక్కున నవ్వింది వారుణి. "నువ్వు ఇంద్రుడివైనా, చంద్రుడివైనా నాకేం ఫర్లేదు. కానీ నేను మాత్రం నువ్వు అప్సరసలతో తిరగటం ఒప్పను-ఆఁ" అంది నవ్వుతూ.
"సర్లే. చదువుకుని కట్నాలకి అలా అమ్ముడు పోవటం మొదటినుంచీ నాకిష్టం లేదు. అందుకే అంగీకరించలేదు. అంతేకాదు చిన్నా! ఆమె నా చిన్నవయసు నుంచీ నా కోసం రకరకాల డిజైన్స్ లో క్లాతింగ్స్ తెచ్చేది. కానీ నాకు మొదటినుంచీ వైట్ అంటేనే యిష్టం. మొండికెత్తి, మారాం చేసి, హఠం పడితే కాదనలేక అవన్నీ అన్నయ్యకి కుట్టించి నాకోసం నే కోరినవి నాన్నగారితో తెప్పించేది!"
"అయితే మొదటి నుంచీ మీరు ఆమెకి ఎదలో ముల్లే నన్నమాట!" చిన్నగా నవ్వుతూ అంది.
"ఆఖరికి పెళ్ళి విషయంలోనూ !"
"ఆమె యిష్టం ఎలా వుంటుందో!"
"చెప్పానుగా బాగా కట్నం లాగాలని ఆమె ఆశ. మా మేనత్త వాళ్ళది బాగా కలిగిన కుటుంబం. ఆమెకి రాధ ఒక్కతే సంతానం. ఆ రాధని నాకు కట్టబెట్టాలని ఆమె సంకల్పం. నాన్నగారికి అది యిష్టమే. అనసూయత్తయ్యకి రాధ ఒక్కతే కూతురని చెప్పాగా! ఆమెకి బోలెడన్ని నగలున్నాయి. నెలకో వస్తువు చేయిస్తూ వుంటుంది అత్తయ్య. కట్నం కూడా యాభయ్ వేలదాకా యిస్తామన్నారు. నాకయితే యింక పది ఎక్కువే అన్నారు, అది కాక చీర సారెలకి ఎకరం మాగాణి కూడా యిస్తానని చెప్పింది అత్తయ్య!"
సారధి అలా చెబుతుంటే వింతగా చూస్తోంది వారుణి. అతని మనస్సులో ఎక్కడైనా అంత బంగారం, అంత కట్నం, ఎకరం మాగాణి పోగొట్టుకున్న ఛాయలు కనిపిస్తాయోమోనని నిశితంగా చూస్తోంది.
"చిన్నా...చెప్పానుగా- అమ్మకి ఆశ ఎక్కువ. కట్నం బొత్తిగా పోయిందని ఆమెకి చాలా బాధగా వుండొచ్చు. పైగా నిన్ను చేసుకోవటం బొత్తిగా యిష్టం లేదు. కట్నం వచ్చే ఆశ లేదన్నాక మరీ బాధ పడిపోయింది. అంచేత చిన్నా-నాదో రిక్వెస్ట్. కాస్త కలసిపోయేదాకా ఆమె సూటిపోటిగా ఏదయినా అన్నా నువ్వు పట్టించుకోకు. ఫర్గెట్ ఎవ్వెరిథింగ్. నాకోసం నువ్వు, నీ కోసం నేను మన కోసం మనం. మన ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించుకుందాం అంతే! అందులో యితర్లకి చోటు లేదు. ఇతర ప్రమేయమూ ఉండకూడదు. వద్దు అంచేత, చిన్నా, ఎవరేమన్నా నువ్వు పట్టించుకోకు."
