పద్మ కొంచెం కోపంగానే అన్నది.
"నా పరీక్షలు గురించి నువ్వేం దిగులు పడక్కర్లేదు. మూడే మూడు రోజులు ఈలోగా మన విషయం మీ యింట్లో చెప్పకపోతే నీకూ నాకూ యింతే!"
"పద్మా!" అన్నాడు బెంగగా.
"దురదృష్టవశాత్తూ ప్రేమించేననుకుంటాను. ప్రేమించిన పాపానికి బతుకంతా ఆ ప్రేమను తలచుకుంటూనే గడుపుతాను. అంతే!"
---అనేసి ఆమె వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ నడకలోనే తన కోపాన్ని కలిపేసింది.
కృష్ణమూర్తి తన చెంపల్ని తానే వాయించుకున్నాడు.
* * *
న్యాయానికి కృష్ణమూర్తి తిన్నగా యింటికి చేరుకోవలసింది.
దార్లో వచ్చిన ఐడియా ఇంటికి వెళ్ళనివ్వలేదు. తిన్నగా అతన్ని పోస్టాఫీసుకి తీసుకెళ్ళింది.
కృష్ణమూర్తి కారు కొన్నాడు. దానిమీద వాళ్ళ నాన్న అడ్రస్సు రాసేడు. ఆపైన నాల్గు పంక్తులు ఈ విధంగా చెరిగేడు.
సత్యంగారూ-
ఘోరాలు జరిగిపోతున్నాయి. మీ అబ్బాయి కృష్ణమూర్తి ఒక అమ్మాయి వెంట కుక్కపిల్లలాగా తిరుగుతున్నాడు. ఆ పిల్లనే పెళ్ళి చేసుకుంటాడట. నా మాటమీద నమ్మకం లేకపోతే ఈ ఉత్తరం మీకు ఇవాళే అందుతుంది గనక---ఇవాళ సాయంత్రం 5 గంటలకు హోటల్ చక్రమ్ కి దయచేయండి. అక్కడ మీ అబ్బాయినీ ఆ అమ్మాయినీ చూడవచ్చు. అడగవలసిందేదో అక్కడే అడగవచ్చు.
- -మీ శ్రేయోభిలాషి
ఉత్తరం రాయడం పూర్తయ్యాక దాన్ని పోస్టుబాక్సులో వేసి తనకి ఆపాటి జ్ఞానం కలిగినందుకు ఈలవేసేడు.
* * *
పద్మకి రేపు ఇండియన్ హిస్టరీ పరీక్ష.
అంచేత ఆమె చదువుకోడానికి ఇందిరా పార్కుకి వెడుతుందని కృష్ణమూర్తికి తెలుసు. అంచేత అతను తిన్నగా అక్కడికే వెళ్లేడు.
అనుకున్నట్టుగా పద్మ పార్కులోనేవుంది. కృష్ణమూర్తిని చూడగానే ఎందుకో ఆమెకు జాలికలిగింది.
చదువుతున్న పుస్తకాన్ని మూసేసి అతను కూచోడానికి తనపక్కనే చోటు చూపించింది.
కృష్ణమూర్తి ఆదరాబాదరా మాటాడేసేడు-
"కూచోడానికి టైంలేదు. అయిదుకావస్తోంది!"
"అయితే ఏమిటి?"
"అమ్మో! అయిదునంత తేలిగ్గా తీసిపారేయకు. అయిదంటే అయిదే. సరిగ్గా అయిదింటికి మనం హోటల్ చక్రమ్ లో వుండాలి!"
"హోటల్ చక్రమ్? అదెక్కడ?"
"నాకు తెలుసు. నువ్వు త్వరగా తెములు!"
"ఇప్పుడు ఆ హోటల్తో అంత అవసర మేమిటి?"
"మన పెళ్ళి జరగాలంటే అల్లాంటి హోటల్స్ సాయం చేయాలి. కమాన్!"
పద్మ సంశయిస్తూ ఏదో అడగబోతే కృష్ణమూర్తి ఆమెను వారించాడు, ఆమె చెయ్యిపట్టుకుని లేపుతూ అన్నాడు---
"దయచేసి నన్నేమీ అడక్కు. నే చెప్పింది ఏమిటీ ఎందుకని ప్రశ్నించకుండా చేసేస్తే సుఖపడిపోతాం. కమాన్---"
పద్మ ఖర్మఖర్మ అంటూ తల బాదుకోపోయింది. అతను వద్దొద్దొద్దొద్దంటూ అడ్డంపడ్డాడు.
ఇద్దరూ స్కూటరెక్కేరు.
* * *
హోటల్ చక్రమ్ రద్దీగానే వుంది.
అందరికీ కనిపించే విధంగా కృష్ణమూర్తి పద్మతోపాటు రెస్టారెంటు మధ్య కూచున్నాడు.
వాచీ చూసుకున్నాడు. అయిదు!
చుట్టూతా చూసేడు. వాళ్ళ నాన్న రాలేదు. నాన్న రాలేదుగానీ వెయిటరొచ్చేడు.
"ఏం కావాలి సార్?"
"ఇంతకుమునుపు ఒకసారి అడిగేవు కదూ!"
"ఒకసారి కాదు సర్. నాలుగుసార్లడిగేను."
"ఇప్పుడా లెక్కలెందుకులే! రెండు కాఫీ తీసుకురా!"
వెయిటర్ వెళ్ళిపోయాడు.
పద్మ అడిగింది.
"ఇంకెంతసేపు ఇక్కడ కూర్చోవాలి?"
"చూద్దాం!"
"ఏమిటి చూసేది?" విసుగ్గా అడిగింది.
"ప్లీజ్ పద్మా! కొంచెం కొ ఆపరేట్ చెయ్యి. దట్సాల్!"
కాఫీలొచ్చాయి తాగారు.
వాచీ చూసుకున్నాడు. ఐదూ పది. నాన్న రాలేదు. ఎందుకురాలేదు?
వెయిటర్ బిల్లిచ్చాడు. పద్మ బిల్లు తీసుకొని లేవబోయింది. కృష్ణమూర్తి ఆమె చేతిని పట్టుకుని ఆందోళనగా అడిగాడు-
"ఏమిటి నీ ఉద్దేశ్యం? వెళ్ళిపోదామనే?"
"కాఫీ తాగేసేంకదా? వెళ్ళకుండా కూచుంటే ఏం బావుంటుంది?"
కృష్ణమూర్తి వెయిటర్ని పిలిచాడు. అతను రాగానే రెండు కూల్ డ్రింక్సు తీసుకురమ్మన్నాడు.
వెయిటర్ తల తడుంకున్నాడు.
పద్మ ఆదుర్దాగా అన్నది.
"ఇప్పుడేగా కాఫీ తాగాం!"
"పర్లేదు. కాఫీ తాగాక కూల్ డ్రింకు పుచ్చుకుంటే కులాసాగా ఉంటుంది. నాకీ పధ్ధతి బాగుంటుంది. నువ్వు వెళ్ళవయ్యా వెయిటరూ!"
వెయిటర్ బిక్క మొగం పెట్టుకు వెళ్ళిపోయేడు.
* * *
సత్యంగారిల్లు! ఆ ఇంట్లో సత్యంగారి గది!
ఆరోజు వచ్చిన ఉత్తరాలు చూస్తున్నాడు సత్యం.
చాలావరకు వ్యాపారానికి సంబంధించిన ఉత్తరాలే! వాటిమధ్య కవరు కనిపించింది. దాన్ని చించేడు.
లోపలున్న కాగితాన్ని లాగుతుంటే ఒక ఫోటో జారి కిందపడింది. కిందపడ్డ ఫోటో తీసేడు. సినీతార శ్రీదేవి ఫోటో అది!
సత్యం ఆ ఫోటో చూసి ఉలిక్కిపడ్డాడు. గబగబా ఉత్తరం విప్పి చదివేడు. ఆ ఉత్తరం ఇట్లా వుంది.
డియర్ సత్యం.
మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నట్లు తెలిసింది. సంతోషం. నాకు ముగ్గురమ్మాయిలు. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి పంపించాను. మూడోపిల్ల పెళ్ళికి సిద్ధంగా వుంది. పేరు గాయత్రి వయస్సు పదహారు.
మా అమ్మాయి సినీ స్టారని చెప్పనుగానీ అందచందాల్లో ఆ స్టార్సుకి మా గాయత్రి ఏ మాత్రం తీసిపోదు. ఈ ఉత్తరంతోపాటు ఫోటో కూడా జతచేసేను. పిల్లను చూడాలనుకుంటే వెంటనే బయలుదేరు. వచ్చేముందు వైరివ్వు.
