తర్వాత కళ్ళుమూసుకుని చకచకా చెప్పసాగారు. ఆయన వాక్ప్రవాహానికి అనుగుణంగా అంతవేగంగానూ తప్పుల్లేకుండా చకచకా రాయసాగింది స్వాతి. దాదాపు రెండు గంటల కాలం దివ్యంగా గడిచిపోయింది.
అయోధ్యకాండ రచన పూర్తయింది. తృప్తిగా కళ్ళు తెరిచారు శాస్త్రిగారు.
కోడలివైపు చూసి_ "స్వాతీ! ఇప్పుడున్న ఆవేశంలో, ధారా వేగంలో మొత్తం రామాయణం యిలాగే యిప్పుడే పూర్తిచేద్దామా అన్నంత తపన వుంది" అన్నారు నవ్వుతూ.
"సంకల్ప సిద్ధులు మీరు" అంది స్వాతి.
కోడలి విచక్షణా జ్ఞానాన్ని సమయజ్ఞతని మనసులోనే మెచ్చుకున్నారు.
"అయోధ్యరాముడు అడవికి పోయాడమ్మా! రేపటి నుండి అరణ్యకాండ ప్రారంభిద్దాం. రచన యిలాగే యీ వేగంతోనే సాగేట్టయితే నాలుగు నెలల్లో పూర్తవుతుందమ్మా."
"మామయ్యా! మీరు రామాయణం పూర్తి చేశాక భాగవతం కూడా రాయండి. అది మనమే అచ్చువేసుకుందాం. అకాడమీ సహాయం కూడా ప్రయత్నం చేస్తే దొరుకుతుంది."
శాస్త్రిగారు నవ్వారు_ "అమ్మా! నాకు భాగవతమే కాదు భారతం కూడా రాయాలనే వుంది. ఆ రామచంద్రుడి దయ ఎలా వుందో? ఒక్క శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు తప్ప మూడు గ్రంధాలు వ్రాసిన వాళ్ళు లేరమ్మా. చాలా క్లిష్టమైన పని!"
స్వాతి జవాబివ్వలేదు వెంటనే. మామగారి పాండిత్యం మీద ఆమెకి అపారమైన నమ్మకం వుంది. ఒక్కక్షణం ఆగి "ఏమైనా మీరు భాగవతం వ్రాయండి" అంది ధృడంగా.
శాస్త్రిగారు ఏదో చెప్పబోయేంతలో బయట నుంచి ఎవరో పిలిచారు.
"ఎవరో పిలుస్తున్నట్లున్నారు. వసారాలో లైటు వెయ్యమ్మా" అని శాస్త్రిగారు బయటికి వెళ్ళారు. ఆయన గడపదాటే సరికి వసారాలో లైటు గుప్పుమని వెలిగింది. ఒక్కసారిగా వెన్నెల పరుచున్నట్టు వ్యాపించిన ఆ వెలుగుకి ఆయనకళ్ళు కొద్దిగా చెదిరాయి.
"ఎవరు? కూర్చోండి" అన్నాడు ఎదురుగా నుంచున్న వ్యక్తుల్ని చూసి.
ఆ వసారాలో ఎప్పుడూ రెండు చాపలు పరిచి వుంటాయి. అవి అతిధులకి స్వాగత పత్రాలు.
ఆ చాపమీద కూర్చున్నారు వాళ్ళు.
శాస్త్రిగారు బండమీద కూర్చుని గోడకు ఆనుకుని ఆ వ్యక్తులకేసి నిశ్చలంగా చూశారు. వెలుగుకి అలవాటు పడ్డ ఆయన కళ్ళు వాళ్ళను గుర్తించాయి.
వాళ్ళు...
ఒకతను జూనియర్ కాలేజి ప్రిన్స్ పాల్ నాయుడమ్మ. రెండో వ్యక్తి_ అదే కాలేజీలో తెలుగు హెడ్ - పరంతపశాస్త్రి. మూడోవ్యక్తి కాలేజి తెలుగు హెడ్ పరంధామ్. నాలుగో అతను వీళ్ళస్కూలు హెడ్మాస్టరు ఇబ్రహీంసాబ్.
"అయ్యోయ్యో! మీరంతా క్రింద కూర్చున్నారేవిటి? లెండి! లెండి! లోపల కూర్చుందాం. మసక వెలుతుర్లో మిమ్మల్నెవర్నీ గుర్తించలేదు. ఎంతసేపయింది వచ్చి. లోపలికి నేరుగా రాక ఇక్కడ ఆగారేం?"
ఆ వ్యక్తులపై గౌరవభావం, తన ఇంటి మర్యాదా, మన్ననా కలిసి శాస్త్రిగారితో అలా పలికించాయి.
"లేదులే బావా! ఇక్కడే కూర్చుందాం. మేము వచ్చి పది నిముషాలైంది. నువ్వు అమ్మాయికి డిక్టేట్ చేస్తుంటే వింటున్నాం. ఎంత బాగా చెపుతున్నావు అక్షర రమ్యత అద్భుతంగా ఉంది" అన్నాడు పరంతప శాస్త్రి.
శాస్త్రిగారు కొద్దిగా సిగ్గుపడ్డారు. "పరంతపా! నువ్వెలా ఎక్కడ కూర్చున్నా ఫరవాలేదోయ్! వాళ్ళంతా పెద్దవాళ్ళు... గౌరవించవలసిన వాళ్ళు...
శాస్త్రిగారి మాట పూర్తికాకుండానే "ఫరవాలేదు లెండి. ఇందులో చిన్నా పెద్దా ఏముంది? కాలేజీలోనే అదంతా. ఇక్కడ మీరే పెద్దవారు" అన్నాడు నాయుడమ్మ.
"అదంతా మీ మంచితనం బాబూ! ఎంతయినా అధికారం అధికారమే! దాన్ని గౌరవించాల్సిందే. ఉండండి కాఫీ తెప్పిస్తాను. కుచేలుడింటికి పరమాత్ముడొచ్చినట్లుగా వచ్చారు. కొండంత దేవుడికి పత్రి తేగలమా? కాఫీ తీసుకుందురు" అని ఇంట్లోకి వెళ్ళబోయాడు.
"శాస్త్రిగారూ! ఈ వేళప్పుడు కాఫీ ఏవిటి? కూర్చోండి మీతో మాట్లాడాలని వచ్చాం. మీరు ప్రశాంతంగా నాలుగు నిమిషాలు కూర్చొని కర్తవ్యం వుపదేశిస్తే వెళ్ళిపోతాం" అన్నాడు నాయుడమ్మ.
"మీరలా అంటే ఏం చెప్పగలను. మా యింట్లో కాఫీ_
"బావా! కాఫీలు తరువాత. ముందు వారితో మాటాడు."
"సరే మీరంతా అలా అంటే నేనేం చెప్పగలను? విషయమేమిటో సెలవియ్యండి!"
"బావా! పెద్దవాడివి! పండితుడివి కడుపునిండా సంతానం వున్న వాడివి. భక్తుడివి. పైగా రామాయణ కర్తవు. నీకు పూర్వాపరాలు చెప్పదగిన వాడిని కాను. కానీ కొంచెం పెద్ద మనసు చేసుకో! జాగ్రత్తగా ఆలోచించు."
"పరంతపా! ఏవిటిదంతా?" కంగారుగా అన్నారు పరబ్రహ్మశాస్త్రిగారు.
"ఏం లేదండీ మీ అబ్బాయి నాయుడమ్మగారి కూతుర్ని పెళ్ళిచేసుకోబోతున్నాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారుట" పరంధాం క్లుప్తంగా అన్నాడు.
హఠాత్తుగా వురుములు లేకుండా పిడుగుపడ్డట్టయింది శాస్త్రిగారికి.
"ఏవిటి? ఏవిటి? ఏమంటున్నావ్ పరంధామ్? మా అబ్బాయి? నాయుడమ్మ కూతుర్ని ప్రేమించాడా? పెళ్ళి చేసుకోబోతున్నాడా? ఎవరు? ఎవరి విషయం నీవంటున్నది" తత్తరపాటుతో ప్రశ్నించాడు.
"మీ కుమారుడే శాస్త్రిగారూ! అయోధ్యరాం లేడూ అతడే నాయుడమ్మగారి రెండో అమ్మాయి అహల్యని ప్రేమించాడు. ఇద్దరూ క్లాస్ మేట్స్."
