Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 11

 

    ఏడుపొచ్చినంత పనయినాది.
    ఆడు తనికి అన్నాయం సేయ్యడు గందా?
    ఆరేల్ల ఎనక రావులమ్మ యిది లించుకున్న రావణయ్య గాడు యిప్పుడు వూల్లో పరువైన పెద్ద మనిషి. గరువు సేరు వెంపుని పెంకుటిల్లు కట్టుకున్నాడు. వూల్లో మునసబు కరనాలూ , పంచాయితీబోడ్రు పెసిడెంటు గారూ యీడి మాటకి ఎంతో యలవిత్తారు. యలచ్చన్లోత్తే ఆడు సెప్పినోడికి వోట్లు పడవలసిందే! పిరికోళ్ళని మంచి చేసుకుని, గడుసోళ్ళకి కర్రసూబించి అందర్నీ తనేంపుకు తిప్పుకోగలవోడు. సదుగంటే లేదు కానీ , తలలు తీసి తలలు పెట్టగల తెలివున్నవోడు.
    అడిప్పుడు అరికాల్ల దాకా పంచిలు కడతన్న్జాడు. పొడుగు సేతుల సోక్కాలు తోడుగుతున్నాడు. కాళ్ళకి సేనపిల్లి లంక జోడేసుకుని నడుత్తావుంటే , ఆడు కూడా , ముందు ముందు  మంతిరి అవలేక పోతాడా అనిపిత్తాది.
    రవణయ్య యింతగా మారిపోడం రావులమ్మ కి యిడ్డూరవయినాది. గోప్పోళ్ళతో జడుసుకోకుండా నిలుసుని మాటాడ్డం సూత్తే ఆడు ఎనకటి రవనయగాడేనా అనిపిత్తాది 'తన్ని కొంగట్టుకు లాగినోడే?"
    అడి కిప్పుడు ముగ్గురు పిల్లలు. ఆళ్లల్లో యిద్దరు మొగోళ్ళు. ఆ ఎంపుకి ఎల్లినపుడు ఆ పిల్లల్ని ముద్దులాడకుండా రాదు -- రావి. ముద్దులు మూటగట్టే పిల్లల్ని కన్నందుకు సత్తెమ్మ ని మెచ్చుకుంటానూ ఉంటాది. సివంలాంటి మొగోడుకనకే అల్లాటి పిల్లలు!
    సత్తెమ్మ నిజంగా సత్తి కాలపు మనిసే! పాపం, అన్నెం పున్నెం ఎరగదు.
    "మా ఎంపు కి రాడమే లేదేం సెల్లమ్మా?' అన్నా డోపాలి. "మావ మీద కోపవయితే నేనేం చేశానో?' గుచ్చి గుచ్చి అడిగినాది. అప్పుడది కసిక్కుని నవ్వేసింది.
    రవణయ మావ ఎనకట్రోజులు రావులమ్మ వొక్కోటే మరిసిపోతా వొచ్చింది.
    కోటయ కూతురుతో ఎటకారాలూ--
    సోదెమ్మ గారమ్మాయిని పాకలోదాసెయ్యడం ---
    పట్నం బోగందానికి పదినోటీడం --
    ఆ మాట కొత్తే సింతల తోపులో తన సిగలో సీవసింత తోడియిలు గుచ్చడవూ --
    హవ్వ! ఇయ్యన్నీ కట్టుకున్న పెళ్లానికి కూడా సేప్పుగునీ మొగోడేక్కడేనా ఉంటాడా? ఒకేల సేప్పెడే అనుకుందారి, సివాల్ని నవ్వేసి ఆడికే దన్నాలేడతాదెం సత్తెమ్మా? తనైతేనా-- సేవులట్టుకు గుంజలాగదో?
    ఆళ్ల సిన్నోడు అచ్చం తండి పోలికే! అణ్ణి ముద్దాడితే రవణయ గాడు బుగ్గలు తడూకుంటాడేవో! వోరబ్బో! పాత గొనా లింకా సొంకం తియ్యలేదు.
    దొరల్లో పుట్టవలసినోడు రవణయ మావ! ఆణ్ణి సూసినప్పుడల్లా సింతతోటలో వూసు గురుతోస్తాది.
    సవచ్చరాది పండుక్కి సింతలూరు తీరతాని కెళ్ళింది. ఆడొద్దన్నాడు. ఇనలేదు. జోడ్దోరి ఒటేలి కేదురున్న సెరుకు పానకం దుకానం కాడ రవణయ్య మావ కనిపించాడు. తన్ని సూసి నవ్వాడు. అదీ నవ్వింది. తన సరస కొచ్చి సెరుకు పానకం డబ్బులు ఆడే యిచ్చేశాడు. కూడా వచ్చీ సిత్రాలన్నీ సూబిచ్చాడు. అయిసుకీవంట నల్లటి దేదో తినిపించాడు. రంగులురాట్టం ! ఎక్కిచ్చాడు. రంగురంగుల రిబ్బన్లు కొని పెట్టాడు. సుక్కల సీర్లూ, రంగుల రాయికలూ కూడా ఉన్నా యక్కడ. తను మనసు పడ్డం సూసి "కావాలేంటే?' అనడిగాడు మావ. డబ్బు కోసం జేబీ లో సెయ్యేట్టాడు కూడా! సయ్యన్నదల్లా సెయ్యి తిప్పేసింది. "ఏవేం?" అన్నాడు. 'నువు కొనిపెడితే ఆడు అనువానపడతాడు మావా!" అల్లా అంటావుంటే దానికి సిగ్గొచ్చి నాది. ఆడు యిరగబడి నవ్వాడు.
    "మావ మంచోడే!" అనుకున్నాది రావులమ్మ.
    ఇంటి కొత్తావుంటే దార్లోనే సీకటి పడిపోయినాది. గుమ్మవు లో అడుగు పెట్టిందో లేదో, ఎంకన్న గాడు శివాలెత్తాడు. అది నోరిప్పలేదు. ఆడు కూడు తిన్నన్నాడు. తను మట్టుక్కి గుక్కిడు గంజి నీళ్ళు తాగింది.
    ఇల్లు సక్కబెట్టుకొని ఆడి మంచం కాడి కొచ్చినాది. కాళ్ళ కాడి దిక్కుని కూకుండి, మీద సేయ్యేసింది.
    ఎలపల వెన్నెల ముసురుకొచ్చినాది. దొడ్దో జాజిపూల వాసన గుమ్మంటా ఉన్నాది.
    "తను దరికొచ్చి కూకుంటే అడలా నిగడ దన్ని పడుకుంటాడెవో? ఎరెప్పుడయితే తనకేం పట్టింపు లేదు. పండుగ రోజుని కూడా మాటాడకుండా తొంగోడవే? అందరూ యిలాగే సేత్తారా?"
    రవణయ మావయితేనా?
    ఆడోళ్ళ మనసు ఆపాటి తెలీదేవో యీడికి?
    'ఆడే వొద్దనుకుంటే నేనే అంత లోకువా?' అనీ అనుకున్నాది.
    మల్లా ఆస పుట్టుకొచ్చింది. గెడ్డ మ్మీద సేయ్యేసింది. "నిదరోచ్చిందా?' ఉలకలేదు .
    "కోపవా?"
    కదలా లేదు. ఉసూరువంటా నేల మీదే కొంగేసుకు పడుకున్నాది . స్సీ! ఏం మొగోడు అనుకున్నాది.
    రావులమ్మలాంటి అడదాంతో ఏగడం మా సెడ్డ కట్టం! పట్నావులో బిగినీసు మానేసి ఎలపలి పపంచవులో దొరికీ సర్ధలన్నీ యిదిలేసి ఎప్పుడూ దాని వోల్లో తలెట్టుకు తొంగుని, దాని కళ్ళల్లోకి సూత్తా కూకోడానికి మొగోడికి యీలవుతాదా? తనేవన్నా గట్రాటకి కట్టిన దూడేంటి? పెళ్ళి అయితే మట్టుక్కి గోడక్కోట్టిన మేకా? మొగోడు తిరక్క సేడ్డాడు .ఆడది తిరిగి సేడింది!
    మొగోడి మనుసులు వోయిసుమల్లితే పోతాయి. ఆడదానికి అల్లాగా? పెల్లాయిన కొత్తలో మొగుడి మీదా, పొతే పిల్లలి మీదా, యింకా పొతే సొమ్ముల మీదా -- అల్లా గల్లా మోజులు మారతా ఉంటాయి.
    అడి పెళ్లి బాలయ గారి చేతి మీదగానే అయినాది. లగ్గం నాడు రేతిరి లెగిసి లెగిసి గుండెంత కొట్టుకున్నాదనీ? ఉండబట్ట లేక పెళ్లి పీటమీదే దాని సిగ తడువుదారని పించలేదో? ఏ పొద్దేలకీ పెద్దోళ్ళు దాన్నోదలక పొతే గుండి గుబగుబ లాడి పోలేదో? దాని సేవులో కతలు సెప్పి కళ్ళు మెరిపిచ్చాలనిపించింది కాదో? ముచ్చటయిన పదాలు పాడించి సెవులారా యినాలని పించలేదో?
    అయితే మట్టుక్కి పట్నావులో యాపారం సేత్తా ఉన్నప్పుడు ఎనకట్లా ఉండడానికి యీలవుతాదా?
    
        
                                  7

    ఓ డాబా యింటి కాడి కెళ్లి అగారాళ్ళు. గుమ్మం తెరిసే ఉన్నాది కాని, తెరోటి అడ్డం ఉంది. కిటికీలి క్కూడా రంగు గుడ్డలు కట్టి ఉన్నాయి. అటికెనక ఏదో కదిల్నటయినాది.
    ఎంటనే గల్లుమంటా గాజులు సప్పుడయినాయి. ఆ గాజులున్న సేతులు తన గుండిలు మీదే గల్లువన్నట్టు అనిపించింది ఎంకన్నకి!
    దాన్ని సూసి ఎంటనే బుర్ర వొంచేసు కున్నాడు.
    బద్రయ్య బుర్ర అక్కల్లేదు. ఆణ్ణి పిలాడానికి యీడి నోరు పెగల్లేదు.
    అదింకా అల్లా సూత్తానె ఉన్నాది. యీణ్ణి గుచ్చి గుచ్చి సూత్తన్నాది. అది కట్టుకున్న సీర సన్నటి నడుం కాడ బయంగా అంటుకు పోయి, పోయి, పోయి సుట్టూ, తిరిగొచ్చి, గోప్పోది సూపులా పైకి లేసి, ఎడల్పుగా ఎనక్కి వొలి పోయినాది! మొకం లో పాపం చాయకి తక్కువ రంగు మటుక్కి కాదు. కొంచెం పాలిపోయి ఉన్నాది. పెదాలు సన్నగా కదుల్తున్నాయి. కళ్ళకి కాటికి లేదు. జుత్తు ముడేసుకోలేదు. నల్ల జెండా లా ఎనక్కి ఎలాడతా ఉన్నాది.
    దాన్ని సూడ్డం తోటే సీరి మీద కలిగిన మోజు ఆడికి మనిసి మీద కలగలేదు! తరవోత్తరవొత మనిసీ నచ్చినాది.
    రెప్పలోల్చకుండా అదింకా సూత్తానె ఉన్నాది. దాంతో ఆడోల్లు సిగ్గులో ముడుసుకుపోయినాది.
    'పరాయి మొగోడుగందా , ముక్కూ మొగవూ తెలీదు గందా. పైపెచ్చు ముమ్మరమయిన యీడులో ఉన్నది గందా - తనకేసి అల్లా సూత్తాదేవా? అంటా అనువానవూ కలిగినాది. పెద్ద మనిసి తరా కోసరం అడయితే మొగం తిప్పేసుకున్నాడు.
    'సదూకున్న గొప్పింటి అడోళ్ళంతా ఇంతే నేవో?' అనీ అనుకున్నాడు.
    బద్రయ్య యిదెం సూడా పోడంతో ఆడు వంటిగాడిలా యిల యిల్లాడాడు. ఆడి, మోసేత్తో ఆణ్ణి పొడిసి, గుమ్మం కాడికి సూబిచ్చాడు. యిద్దరూ ఒకే పాలి సూశారు. కాని ఆ సిన్నది అక్కడ లేదు. ఎంకన్న తెల్ల మొగం ఏశాడు. బద్రయ్య నవ్వాడు.
    "అంత తొందరెందుకు ఎంకన్నా? ముత్తాబు సేసుకొని రానియ్యి సూద్దూగాని!"
    ఎంకన్న మల్లా సిగ్గుపడ్డాడు.
    పక్క గుమ్మం కాడ ఎవురో మొగోడి మాట యినిపించినాది. తొలిసారి కనిపించిన కుర్రది మల్లా లోనికి రాలేదు.
    అంతలోకి సేందరకాంతం వచ్చినాది. తిన్నగా వచ్చి బద్రయ్య బుజం మీద వయ్యారంగా సెయ్యేసినాది. ఎంకన్న నోరెల్లబెట్టుకు సూత్తన్నాడు.
    'ఇందాకా గుమ్మం లో నిలుసుని సూదిలా తనేంపుసూసిన సిన్నదేనా సేందరకాంతం!' అనుకున్నాడు. ఇందాకటి కంట యిప్పుడు సాలా మారిపోయినాది.
    మొకం లో కొత్త రంగు ఎలుగుతా ఉంది. కళ్ళు సెక్రాల్లా మిలమిల్లాడతా ఉన్నాయి. జుట్టు అల్లుకుని రొండు జల్లెసుకున్నాది. ఈ సిడు మల్లి పూల దండ తల్లో దూరుసుకున్నాది. దండ కొసలు రెండూ , యీ ఎంపూ ఆ ఎంపూ బుజాల మీద వోల్తా ఉన్నాయి. సెవులదుద్దులు వజ్జిరాల్లా తలతల్లాడుతున్నాయి!
    'ఇందాకా , పాలిపోయినట్టు కనిపించిన మొగవే నాయిది?' అనుకున్నాడు ఎంకన్న.
    ఇది మనిసా? వూరవసా? గోప్పింటి పిల్లా సినేవా బొమ్మా?
    ఆడి సూపూ, మాటా-- అన్నీ అదే మింగేసి నాది!
    ఎంకన్న మనస్సులో ఏయో మనసులూరి పోయినాయి. గుమ్ముమంటా మత్తేక్కిత్తూ ఉన్న ఆ వోసన్లవరదలో కాలవ లో గడ్డి పోసలా కొట్టుకు పోతన్నాడు.
    బతికున్న నాల్రోజులూ-- బయలూ, బాధలూ, సీదరింపులూ, మోసాలూ, సెడ్డ పన్లూ కూడా సేయ్యాలన్న తెగింపూ , ఉన్న మనుసులికి-- బూమ్మీదుండి వయ్యారాలన్నీ కల్లారా సూసీ అదురుట్టం ఒక్క సారేనా దేవుడిత్తాడా?    
    కడుపునిండని కూడూ, గొంతుకు తడవని దాగం, గుండిల్లోంచి నవ్వని పెళ్ళాం , ఎంత దిన్నినా పండని ఎగసాయం , తనమీద తనకే దయిర్నేం లేక సోడవూ-- అన్నీ మరిసిపోయి, తన్ని తాను మరిసిపోయి , తియ్యటి పెదాల మీద సాకీ సల్పని నవ్వులాగ , బతుకు మొత్తం మీద రొండు సిటికలేనా సర్దాగా గడిపీ యోగం ఎంత మంది కొత్తాది?
    రొండు జావు లేళ , సూరీడు నెత్తి కాలి సేత్తావున్న యిసికి సర్రలో, నల్లటి నీల్ల గుంట ఎంత మందికి దొరుకుతాది?
    పెపంచంలో ఉన్న అందాలు సూసీ కళ్ళు లేక తియ్యగా సప్పరించి దగాలు తీరుసుకునే నోరు లేక, గుమ్మనీ వోసన్లు పీల్చుకునీ తీరిక లేక, ఎవురేనా కమ్మని పదం పాడతావుంటే యినసేవుల్లేక-- బతుకులో ' ఏం సూసుకుని సంతోసించాలో తెలుసుకోలేక -- మనుసులు, కాలం మల్లకుండానే గుడ్డోళ్ళూ , సేవిటోళ్ళూ, ముసలోళ్ళూ అయిపోయి కాటికి కాల్లు సాత్తారు! అసలు ముసలోళ్ళయిపోతే కాని ఆళ్ళ సంగతి ఆళ్ళకి పట్టదు! అప్పుడు దొరకనియి తలుసుకుని సప్పరించుకుంటానికి ఆళ్ళ నాలికలు సెప్పిన మాట యినవు. కోపవోచ్చి కోరుక్కుందారంటే పళ్ళు అసలే వుండవు! 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS