6
రిక్షాలో కూర్చున్న దగ్గిర నుంచీ ఆవిడ కొడుకు ఉద్యోగం గురించీ, నెలకి ఎనిమిది వందలు తెచ్చే అతను బుద్దిగా ఆ డబ్బంతా తన చేతిలో పోయడం గురించి చెప్పటం మొదలు పెట్టింది -- అ పొలం ఇల్లూ అమ్మేస్తే పాతిక వేలయినా వస్తాయిట. మామయ్య సంపాదన మరో పాతిక వేలు బ్యాంకి లో వుందిట -- ఆ రెండూ కలిపి ఓ పెద్ద ఇల్లు కోనాలనుకుంటున్నారుట--
అవన్నీ నాకెందుకో అనుకుంది సురేఖ. ఖబుర్లు చెప్తూనే రోడ్డు మీద ఓ కన్ను వేసి వుంచిన ఆవిడ 'ఆ ఇటు కుడి ప్రక్కకి టిప్పు-- ఆ మూడే ఇల్లే' అంటూ రిక్షా అబ్బికి గుర్తు చెప్పింది.
అదో చిన్న డాబా -- గేటు దగ్గర్నించి ముందు, వరండా దాకా కాస్త జాగా వదిలి పెట్టి మిగతా ఖాళీ స్థలం లో రకరకాల పూల మొక్కలు క్రోటన్స్ మొక్కలు వేశారు-- బాటకి రెండు వైపులా దీర్ఘ చతురస్త్రాకారంలో వున్న చామంతి మళ్ళు మరీ మనుషులని ఆకట్టేసుకుని అడుగు ముందుకు పడనివ్వకుండా చేస్తున్నాయి. ఎక్కడా ఆకూ అనేది కనిపించకుండా పచ్చగా పసుపు ఆరబోసినట్లు మడి అంతా అల్లుకు పోయిన చామంతులని చూసి పరవశించి పోయింది సురేఖ-- అప్పటికే తాళం తీసి రంగమ్మ లోపలికి వెళ్ళిపోవటం వల్ల బాగుండదన్నట్లు తనూ లోపలికి వెళ్ళింది. ముందు చిన్న వరండా రెండు గదులు, ఓ హాలు , వంట గది -- ఇల్లు పొందికగా చాలా సౌకర్యంగా వుంది. వెనక వున్న కాస్త జాగాలో కూడా గులాబీ లు వేశారు . అవీ విరగబూశాయి అన్ని రంగుల్లోనూ.
'పూల తోట బాగా పెంచారు' అంది సురేఖ ఆవిడ పరచిన చాప మీద కూర్చుంటూ.
'వాడికన్నీ సరదాలు-- ఎన్ని వుంటే ఏం చెప్పు అనుభవించే యోగం దాని నుదుట లేకపోయాక -- ఇప్పుడిప్పుడు వాడికీ శ్రద్ధ తగ్గిపోయింది మనస్సు బాగుండక ' అంటూ నిట్టూర్చింది రంగమ్మ.
అదివరకు ఆ ఇంట్లో వుండి ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళి పోయినవాళ్ళు ఆ చెట్లన్నీ వేశారనీ, తను వచ్చిందగ్గర నుంచీ అవి చచ్చిపోకుండా కాసిని నీళ్ళు పోసి సంరక్షణ చేస్తున్నానని ఆవిడకి చెప్ప బుద్ది కాలేదు.
ఓ నాలుగు గులాబీలూ, చామంతి పువ్వులూ కోసుకు వచ్చి సురేఖ ముందు పోసి మాల కట్టి పెట్టుకో అంటూ దారం తెచ్చి ఇచ్చింది.
'నాకు రెండు చాలు-- ఇవి తీసుకు వెళ్ళి శ్యామల కిస్తాను' అంటూ రుమాలు లో చుట్టి పెట్టింది.
'ఇక్కడే కూర్చుందువు గాని రా,' పీట వాలుస్తూ వంటింట్లోంచి పిలిచింది రంగమ్మ.
చేతిలోకి తీసుకున్న పత్రిక మళ్ళీ ప్రక్కన పడేసి లేచి వెళ్ళింది సురేఖ.
'వాడికి సరిగ్గా ముప్పై నిండాయి-- ఈ వయస్సు లో ఎలా వుండాలి, మనస్సు పాడు చేసుకుని దాని ప్రాణానికి వూసూరుమని ఏడుస్తూ కూర్చోటం ఏం ఖర్మ చెప్పు-- వాడి నా స్థితిలో చూస్తూ భరించటం తల్లిగా నాకెంత రంపపు కోతగా వుంటుందో ఆలోచించు-- ఏమిటో చనువుకొద్దీ నా బాధంతా వెళ్ళబోసుకుంటున్నాను.' బియ్యం కడుగుతూ మధ్య మధ్య వెనక్కి తిరిగి సురేఖ ముఖ కవళికలు గమనిస్తూ చెప్పుకు పోతోంది.
"అయిందేదో అయిపొయింది -- ఎన్నాళ్ళు వాడిలా బైరాగి లా బ్రతుకుతాడు -- ఇదేం మన ఒక్క ఇంట్లోనూ జరిగిన విడ్డూరం కాదు...లోకం అంతటా వున్నాయి-- రోజూ వింటున్నాం , చూస్తున్నాం -- హాయిగా మరో పెళ్ళి చేసుకో అని నేను రోజూ మొత్తుకుంటూనే వున్నాను,' బియ్యం పొయ్యి మీద పడేసి కూరల బుట్టా కత్తీ పీటా ముందు వేసుకు కూర్చుంది.
'చూడు స్వతంత్రం గా అడిగేస్తున్నాను ఏమీ అనుకోకు -- నీ కిష్టం అయితే మీ నాన్నకి నేను రాసి ఒప్పిస్తాను.'
మధ్యాహ్నం నుండి ఆవిడ ధోరణి అలాంటి ప్రస్తావన కి దారి తీస్తుందేమోనన్న అనుమానం కాస్తంత వచ్చినా, నిజంగా ఆవిడ అదే విషయం మాట్లాడేసరికి సురేఖ కి వళ్ళంతా కంపరం పెట్టినట్లయింది. చూచాయిగా తనకి విషయం చెప్పి తండ్రి ద్వారా ఉత్తరం వ్రాయిస్తుందేమో ననుకుంది. కాని ఈవిడ ఇలా నిస్సంకోచంగా అడిగేస్తుందని గట్టిగా అనుకోలేక పోయింది.
భోజనం వద్దు ఏమీ వద్దు -- కడుపు నొప్పిగా వుందని వంక పెట్టి తక్షణం హాస్టల్ కి పారిపోదామా అనిపించింది.
'ఉన్నమాట చెప్పాను-- ఆలోచించుకోటానికి వ్యవధి నిస్తున్నాను.' అన్నట్లు రంగమ్మ మరి ఆ విషయం కదపలేదు.
సురేఖ ఆలోచనలు నాలుగైదు సంవత్సరాల గతం లోకి చొచ్చుకు పోయాయి-- అప్పుడు ఈ రంగమ్మ కోడల్ని గురించి వో వింతగా విడ్డూరంగా చెప్పుకునేవారు-- పెళ్ళయి అత్తవారింటికి వచ్చి ఓ ఏడాది అతనితో సంసారం చేసిన ఆ అమ్మాయి ఓసారి పుట్టింటికి వెళ్ళి మరి తిరిగి రాలేదు -- నాకు మొగుడూ వద్దు సంసారమూ వద్దు-- ఆ ఇంట్లో బ్రతికే బదులు పదిళ్ళ'ల్లో పాచి పని చేసి బ్రతకవచ్చి అని పుట్టింట్లోనే వుండి పోయిందిట-- ఆ అమ్మాయి అప్పటికే బియ్యే ప్యాసయింది. హాయిగా ఉద్యోగం చేసుకుంటోంది-- తల్లీ కొడుకూ కలిసి ఆ పిల్లని కాల్చుకు తినేవారనీ ఆ బాధలు పడలేకనే ఆ పిల్ల వెళ్ళి పోయిందనీ-- అంటారు -- ఆ పిల్ల ఒట్టి పోగరమోతు రకం అనీ, మొగుడంటే కాస్తయినా లక్ష్యం లేదనీ, కొందరన్నారు. ఏదయితేనేం ఆ పిల్ల మళ్ళీ రాలేదన్న మాట-- ఇప్పుడు కొడుక్కి మరో పెళ్ళి చెయ్యాలని ఈవిడ తాపత్రయం అన్న మాట అనుకుంది.
వంట అయిపోయి ఇద్దరూ వచ్చి హల్లో కూర్చున్నారు-- బయట స్కూటరు చప్పుడయింది.
"బావొచ్చాడు '' అంటూ తలుపు తీయటానికి వెళ్ళింది రంగమ్మ.
'అసలు ఎందుకు వచ్చానా ఇక్కడికి' అనుకుంటూ విసుగూ కోపమూ ముంచుకు వస్తుంటే ఇబ్బందిగా ఓ కుర్చీ నానుకుని నిలబడి పోయింది సురేఖ.
'చిన్నప్పుడు అంత చనువుగా వుండేదామ ఇప్పుడెంత మొహమ్మాటమో చెప్పలేం-- ఎంతో బలవంతం చేస్తే ఈ పూట భోజనం చేసి వెళ్ళటానికి ఒప్పుకుంది.' అంటూ ముందు రంగమ్మ ఆ వెనక కామేశ్వర్రావు లోపలికి వచ్చారు.
నల్లగా, లావుగా , లావుకి తగ్గ పొడుగులో సినీమాల్లో విలన్ జ్ఞాపకం వచ్చాడు అతనిని చూడగానే -- మనిషిలో ఏకోశానా దయా, జాలి మంచితనం అనేవి వుండవేమోననిపించింది. యదార్ధం ఏదైనా కాని, ఆ అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోలేనంత అయిష్టత ఏర్పడి పోయింది -- అస్తమానూ సిగరెట్లు కాల్చటం వల్ల నల్లగా వున్న మోటు పెదవులూ, ఎప్పుడూ తాంబూలం నములుతుండటం వల్ల గారకట్టిన పళ్ళూ అతను నవ్వినా ఝాడుసుకునే లాగే వుంది అనుకుంది-- ఇవన్నీ అతను అంతదూరంలో వుండగా ఏర్పడిన అభిప్రాయాలు --
'అలా నిలబడి పోయావెం, కూర్చో' అంటూ అతను మరో కుర్చీలో కూర్చునే సరికి మాత్రం సురేఖ కి కడుపులో తిప్పి వాంతి అయిపోతుందేమో ననిపించింది.

పది మందితో పాటు కంపెనీ కి తీసుకోక పొతే మర్యాద గా వుండదు అనే ఉద్దేశ్యంతో నయితేనేం ఈనాటి నాగరికత లో అదీ ఒక లక్షణం అనే వుద్ద్రేశ్యంతోనయితే నేం దాన్ని కాస్త రుచి చూస్తున్న వాళ్ళు చాలా మందే వున్నారు. కాని తమ ఇంట్లో నాగరికత అంత పెరగలేదు-- అసలు సిగరెట్లు కాల్చే అలవాటు కూడా లేదు నాన్నగారికి వాళ్ళకీ--
