Previous Page Next Page 
వారుణి పేజి 11


    మిగతా రెండు కప్పులున్న ట్రేతో సారధి గదివైపు నడుస్తూ "వాళ్ళు గదిలో వున్నారా?" అంటూ ప్రశ్నించింది సుబ్బరత్నమ్మ.
    "ఊఁ" అన్నారాయన ఆశ్చర్యంగా.
    ఆయనకి సుబ్బరత్నమ్మ వాళ్ళిద్దరికీ కాఫీ కలుపుకుని వెళ్ళటం ఆశ్చర్యంగానూ, వింతగానూ అనిపించింది. ఈ ఆడవాళ్ళు ఏ క్షణాన ఏం చేస్తారో తెలీదు కదా? అనుకున్నాడు.
    సుబ్బరత్నమ్మ సారధి గదివైపు నడిచింది.
    తలుపు తట్టి లోపలికి వెళ్ళాలనుకుందామె. కానీ లోపల నుంచి ఏదో సంభాషణ వినిపించటంతో ఆగిపోయింది తలుపు తట్టకుండా నుంచుంది.
    "ఎలా వుంది?"
    అది సారధి కంఠం-గుర్తించిందామె.
    "ఏమిటి?"
    అది స్పష్టంగా విన్పించిన వారుణి కంఠం.
    "ఈ యిల్లు-నా యిల్లు-అదే మన యిల్లు. చిన్నా! ఈ యిల్లు నీకు నచ్చిందా?"
    జవాబుగా వారుణి నవ్విన శబ్దం.
    "గడుసుదే!" అనుకుంది బైట నుంచున్న సుబ్బరత్నమ్మ.
    "చిన్నా! యీ యిల్లు ఒక చిన్న జూ లాంటిది. మా నాన్నగారిది అదో తరహా తత్త్వం. ఆయన దేనికయినా అడ్జస్ట్ అయిపోతారు."
    "ఇంటి పెద్దగా అది ఆయన ధర్మం...రథి...ఏభై ఏళ్ళు దాటిన ప్రతి మగాడూ యింటి పరిస్థితులకి అనుగుణంగా మారిపోతాడు తప్పదు. పాతికేళ్ళు పడిన ఘర్షణ, శ్రమ, బాధ ఆయనకి పాఠం నేర్పుతాయి. అందుకే వాళ్ళ ముందు తరానికి స్వాగతం పలుకుతూ, తాము మెల్లి మెల్లిగా తప్పుకుంటారు. యువతరం అవసరాలు, వాళ్ళ త్రహాలు గుర్తించి అనుగుణంగా మారలేని వాళ్ళు ఎంతో బాధ పడతారు."
    "నువ్వన్నది నిజమే. అందుకే నాన్నగారితో ఏ పేచీ లేదు" అన్నాడు సారధి.
    "మరి పేచీ ఎవరితో ?" ఆ ప్రశ్నతోపాటే వారుణి నవ్విన చిన్న శబ్దం కూడా సుబ్బరత్నమ్మ చెవిని పడింది.
    "మా అమ్మది అదో తరహా మనస్తత్వం. ఆమె యీ యింటికి మకుటం లేని మహారాణి. ఈ యింట్లో అన్నీ ఆమె యిష్టప్రకారమే జరగాలి. అన్నయ్య ఆమె యిష్టప్రకారమే మెడిసిన్ చదివాడు. నిజానికి వాడికి ఇంజనీరింగ్ చదవాలని వుండేది. మనదేశంలో మంచి ఇంజనీర్లు తయారై దేశాన్ని సస్యశ్యామలంగా, స్వర్ణగర్భగా తీర్చి తిద్దాలని వాదించేవాడు."
    "మీ అమ్మగారు అడ్డుపడ్డారా ?"
    "అవును."
    "అదేమిటి ? చదువు విషయంలోనూ నా?"
    "అవును. ఇంజనీరింగ్ చదివితే జాబ్ ప్రాస్పెక్టివ్ గా వుండదని ఆమె అనుకుంది. డాక్టరయితే అటు గవర్నమెంటు జీతం-ఇటు ప్రయివేట్ ప్రాక్టీసు- రెండూ చేతులా డబ్బు సంపాదిస్తాడని ఆశ పడింది"
    "ఐ పిటీ హిమ్." ఆమె కంఠంలో జాలి ధ్వనించింది.
    "ఏం చేద్దాం- మా అమ్మ ఆశ వలన వాడి జీవితాశయమే మారిపోయింది. అయినా ఎలాగో మెడిసిన్ పూర్తిచేశాడు. తర్వాత మళ్ళీ చిక్కొచ్చింది."
    "ఏమిటి?" కుతూహలంగా అడిగింది వారుణి.
    "వాడికి ప్రైవేట్ ప్రాక్టీసు ప్రారంభించి యధాశక్తి బీద ప్రజలకి ఉచిత వైద్యం చేస్తూ సేవచేయాలని వుండేది. కానీ అమ్మ పట్టుబట్టి గవర్నమెంటు సర్వీసులో చేర్పించింది." జాలిగా అన్నాడు సారధి.
    "అయ్యో!" అనుకుంది వారుణి.
    "ఇంకా విను! అక్కయ్య విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆమెకి ఎమ్మే చేసి లెక్చరర్ గా చెయ్యాలని వుండేది. లేదా లా చేసి ప్రాక్టీసు పెట్టాలనుకుంది. కానీ టెన్త్ క్లాస్ పాసయ్యాక ఇంటర్ లో చేరతానని ఎంత ఏడ్చి మొత్తుకున్నా వినకుండా మామయ్య కొడుక్కిచ్చి పెళ్ళి చేసింది. దాంతో దాని ఆశలన్నీ అడియాసలయ్యాయి."
    "మీరు ఏమీ అనలేదా? మామయ్యగారేం అన్లేదు?" వారుణి కంఠంలో ఆతృత ధ్వనించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS