"ఏం ఫోటో?" అని అడిగి గాలిపటమ్మీద దృష్టి నిలిపేడు తండ్రి. అతనిప్పుడు విజయానికి చాలా దగ్గరలోకొస్తున్నాడు.
ఆ తండ్రి కొడుకుల వరస గమనించిన అప్పలకొండ... సాయం పట్టకపోతే సమస్య తెమలదనే ఉద్దేశంతో కృష్ణమూర్తి పక్కకి వచ్చి కూచున్నాడు.
"కోటు గురించి అడక్కండి" అన్నాడు.
"ఎంచేత?" అని ప్రశ్నించాడు కృష్ణమూర్తి.
అప్పలకొండ రహస్యం చెబుతున్నట్టు చెప్పేడు...
"ఆఫీసునుంచి వస్తుంటే అయ్యగారి కోటుమీద ఆటోరిక్షా ఒకటి బురద కొట్టిందట. ఆ పళంగా అక్కడికక్కడే కోటుతీసి లాండ్రికి పంపించేరుట."
టకారం వినిపించడం వలన అతను...
"ఆ సంగతి నీకెవరు చెప్పేరుట?" అడిగేడు.
"ఆఫీసు ప్యూను. లాండ్రీకి వేసేప్పుడు జేబులు అయ్యగారు వెతుక్కోలేదుట. వేసిన ప్యూను చూడలేదుట. అంచేత ఆ విషయం మరిచిపోండి" అన్నాడు అప్పలకొండ.
అంతమాట అన్నందుకు అతను నెత్తిన చేతులు వేసుకున్నాడు.
ఆ వేళకి సత్యం పొరుగువాడి పటాన్ని కూల్చడం కూడా జరిగిపోయింది. అంచేత అతను 'హిపిప్ హుర్రే' అని గట్టిగా కేకపెట్టాడు.
ఆ వెర్రికేకకి పరాకుగావున్న కృష్ణమూర్తి జడుసుకున్నాడు.
12
పరీక్షలనేవి అనేక రకాలుగా వుంటాయి.
పద్మకి ప్రస్తుతం రెండు రకాల పరీక్షలు జరుగుతున్నాయి. ఒకటి చదువు పరీక్ష, రెండు ప్రేమ పరీక్ష.
సొంత ఊరు బందర్లో చదువుకునేందుకు మంచి కాలేజీలే వున్నాయి. తన కూతురు హైదరాబాదులో చదువుకుంటుందనే హోదాకోసం తండ్రి ఆమెను హైదరాబాదు పంపించేడు.
హాస్టల్ వసతి ఏర్పాటుచేసి చదవమన్నాడు.
తండ్రి తనమీద పెట్టుకున్న ఆశకు భంగం రానీకుండా శ్రద్ధగానే చదివింది. పద్మ పరీక్షలుకూడా బాగానే రాస్తోంది.
అంచేత చదువు పరీక్షలో ఢోకా లేదు.
ఎటొచ్చి ఈ ప్రేమ పరీక్షే ఎటూ తెమలడం లేదు.
ప్రేమ అనే రెండక్షరాలను నిర్వచించడానికి ఏ భాషకి ఎన్ని అక్షరాలున్నా చాలవంటాడొక కవి.
అదొక తియ్యటి అనుభూతి ఎవరికి వారు అనుభవించాల్సిందేగాని అభివర్ణించడానికి అశక్తులే!
హైదరాబాదంటూ రాకపోతే పద్మ ప్రేమలో పడేది కాదేమో.
ప్రేమను కొందరు ఏక్సిడెంట్ తో పోల్చేరు. ప్రమాదవశాత్తూ కారుకింద పడ్డట్లే అనుకోకుండా కొందరు ప్రేమలో పడతారుట. పద్మ కూడా అట్లాగే పడింది.
ముందు ఆమె స్కూటరుకిందపడి ఆనక ప్రేమలో పడిందంటే సబబుగా ఉంటుందేమో.
ఆ స్కూటరువాలా పేరు కృష్ణమూర్తి.
ఒక ఆగస్టు పదిహేను. ఉదయం ఎనిమిదిన్నర. పెరేడ్ గ్రౌండ్సులో ఉత్సవాలు చూడటానికి పద్మ వస్తుంటే వెనకనుంచి ఒక స్కూటరు వచ్చి ఆమెను తాకింది.
జస్టు తాకిందంతే!
ఆ తాకిడికి తనకేదో జరిగిందని పద్మ కెవ్వున కేక పెట్టినమాట వాస్తవమే.
అంతకంటే ఎక్కువ ఖంగారుపడ్డాడు కృష్ణమూర్తి.
స్కూటరు ప్రక్కనపెట్టి పద్మకి సపర్యలు చేసేడు. సోడా తాగించేడు. ఆపైన కూల్ డ్రింక్ తాపీగా తాగమన్నాడు. తనదే బుద్ధి తక్కువని క్షణానికోమాటు అపాలజీ కోరేడు. సరిగ్గా అన్ని తడవలూ దెబ్బలేమైనా తగిలేయా అని అడిగేడు. తన పొగరబోత్తనానికి తగిన శిక్ష కావాలన్నాడు. తనను పోలీసులకు వప్పగించమన్నాడు. వాళ్ళు కొట్టి చంపుతారేమోనన్న భయముంటే ఆమెను తన చెంపలు వాయించమన్నాడు.
స్కూటరు గుద్దుకోవడం కాదుగానీ ఆ మానవుడి ఆందోళన ఆమెను ఖంగారు పెట్టింది. ఆ మనిషిని ఆ విధంగా వదిలేస్తే ఆ వర్రీలో అతను ఏ చెట్టుకో గుద్దుకొని అయిపోతాడనే డవుటు కూడా కలిగింది.
అంచేత ఆమె అతన్ని సంబాళించడానికి చాలా శ్రమ పడవలసి వచ్చింది.
ఇద్దరూ కాఫీతాగి వర్రీ కాకూడదని ఒట్టేసుకున్నారు. వర్రీ కాకూడదనుకున్నారే తప్ప ప్రేమలో పడకూడదని హెచ్చరించుకోలేదు.
అంచేత వాళ్ళు అప్పట్నుంచీ ఒకరికొకరు దగ్గరయ్యేరు. ఆ దగ్గిరితనం మరింత దగ్గరయ్యేసరికి వాళ్ళు ప్రేమికులై పోయేరు.
కథ అంతవరకూ సవ్యంగానే నడిచింది. జీవితాంతం ప్రేమతోనే బండినడిస్తే పెళ్లెప్పుడయ్యేను!
ప్రేమకి పెళ్ళయితేనే బావుంటుంది.
ఆ పెళ్ళిమాట ఎత్తితేచాలు కృష్ణమూర్తి ప్లానేదో చేస్తాను చూడు అంటాడే తప్ప వాళ్ళ పెద్దవాళ్ళతో సంప్రదించే సూచనలు ఏమీ కనిపించడం లేదు.
తెగించి తాడోపేడో తెల్చేసుకుందామంటే తాను ఆడపిల్ల. బుద్ధిగా అణుకువగా వుండాలేతప్ప "పద మీ యింటికి" అంటూ చెంగునదూక కూడదు.
అక్కడికి కృష్ణమూర్తిని ఒకటి రెండుసార్లు అడిగింది కూడాను వాళ్ళ యింటికి తీసుకెళ్ళమని.
ఏకంగా మూడుముళ్ళు వేసి లాక్కుపోతానన్నాడు కృష్ణమూర్తి.
కృష్ణమూర్తివట్టి మాయగాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. అతని మాటలోగాని చేష్టలోగాని కల్మషంలేదు. సస్పెన్సంటే ఇష్టం. అదొక్కటే, పద్మకి చిన్న చిరాకు కలిగిస్తుంది.
ఏమైనా అతనొక టైపుమనిషి.
ఆ టైపు ఏమిటోగాని పద్మకది బాగా నచ్చింది. మగాడన్న తర్వాత ఆ టైపులోనే వుండాలంటుంది.
మరో మూడురోజుల్లో పరీక్షలైపోతాయి. ఈ లోగానే ప్రేమ పరీక్షకు ఒక రిజల్ట్ రావాలి.
పరాకుగా నడుస్తున్న పద్మవెనక స్కూటరు శబ్దమైంది. వెనక్కి తిరిగి చూసింది.
కృష్ణమూర్తి!
సరిగ్గా పద్మ పక్కనే స్కూటరాపేడు.
మనిషి గొప్ప డల్ కొట్టేసి వున్నాడు, దాదాపు బిక్క మొగం పెట్టుకున్నట్టుంది అతని మొగం.
అతని అవతారం చూసి పద్మ బెంగపడింది.
"ఏం జరిగింది?" ఆందోళనగా అడిగింది.
"ఏం జరగలేదు. అదే నా వర్రీ! నువ్వు పరీక్షలు బాగా రాయి."
"మన సంగతి యింట్లో చెప్పేరా?"
"కుదిరి చావలేదు. నేనొక లైన్లో వెడితే మా నాన్న యింకో లైన్లో వచ్చాడు. అందుచేత కథక్కడే ఆగిపోయింది."
పద్మ తల దించుకుంది. ఆమె మవునంగా ఉండటం కృష్ణమూర్తికి నచ్చలేదు.
"కోటుమీద బురద పడిందట!" అన్నాడతను.
అతనేం మాటాడుతున్నాడో అర్ధం కాలేదు. ఖర్మంటూ నుదురు బాదుకోపోయింది. వద్దంటూ ప్రాధేయపడ్డాడు.
ఆ తర్వాత ఒక స్టేట్ మెంటిచ్చేడు.
"దిగులు పడకు, పరీక్షలు బాగా రాయి."
పద్మ కృష్ణమూర్తివేపు సూటిగా తీక్షణంగా చూసింది. ఆ చూపు కృష్ణమూర్తిని కలవర పెట్టింది. అంచేత తల దించుకోవడం ఇప్పుడతని వంతయ్యింది.
