Previous Page Next Page 
సప్తపర్ణి పేజి 11

    పకపక నవ్వారు శాస్త్రిగారు.

    "వాడికింకా పెళ్ళి సంబంధాలు చూడటమే ప్రారంభించలేదే! పెళ్ళయిపోయిందంటావేమిటి? తెనాలి నుంచి ఎవరో శాస్త్రిగారు చెప్పి పంపారు. ఆ విషయం మొన్ననే రాయుడితో అన్నాను. అప్పుడే పెళ్ళయిపోయిందనుకున్నావా?"

    "భలేవారండీ! అతనూ కోడలూ ఈరోజు వుదయం టింగు రంగామంటూ మోటార్ బైక్ మీద వెళుతూ వుంటే ఈ కళ్ళతో చూస్తేనూ"

    శాస్త్రిగారు ఒక్కక్షణం ఆశ్చర్యంగా చూశారు.

    "నాయుడూ! ఈరోజు ముఖం కడుక్కున్నావా? నీకు బీడీలు తాగి తాగి పైత్యం ఎక్కువై కలలుకన్నావా? లేక కళ్ళు మసకలు కమ్మి ఒకరికి ఒకరనుకున్నావా?" రాయుడు మళ్ళీవివరంగా అడిగాడు.

    "సాక్షాత్తు నా కళ్ళతో నేను చూశాను. ఎవరైనా గర్ల్ ఫ్రెండేమో?"

    "ఛ! ఛ! అలాంటి అలవాట్లు వాళ్ళ ఇంటావంటా లేవు. అసలు మనకి తెలీకుండా, మనం వెళ్ళకుండా పెళ్ళెలా అవుతుందయ్యా. బ్యాంకు వాళ్ళిచ్చిన మోటార్ బైక్ తీసుకుని అతనీరోజు తిరుపతి వెళ్ళాడుట. ఇప్పుడే శాస్త్రిగారు చెపుతున్నారు. ఇంతలో నువ్వొచ్చావు. పెళ్ళయింది కోడల్ని చూశానంటావేమిటి?" విదిలించేశాడు రాయుడు. 

    తను అనలేని మాటలు అతనన్నందుకు తృప్తిగా చూశారు శాస్త్రిగారు.

    నాయుడు సిగరెట్ ముట్టించుకుని "రాయుడూ! భట్రాజు వుద్యోగానికి బెస్టుగా సరిపోతావు నేను కళ్ళారా చూస్తే ఏవేవో హరికథలు చెపుతావేం? నాకేం శాస్త్రిగారంటే గిట్టదా? ఊరికే అభండాలు వేస్తానా?" అన్నాడు నిశితంగా చూస్తూ.

    రాయుడు సమాధానం చెప్పలేకపోయాడు.

    శాస్త్రిగారికి అయోమయంగా వుంది. ఎవరిమాట నమ్మటం? వీడేమన్నా చెడుదోవలు పట్టలేదుకదా! అమ్మో అలా జరిగితే ఇంకేమన్నా వుందా? ఈ నాయుడు తనని మరింత వుడికించడూ?" ఆయన మనసు బాధగా మూలిగింది.

    అంతలో ఇంటర్వెల్ పూర్తయి తిరిగి బెల్ కొట్టారు.

    ఆయనకక్కడ ఉండాలనిపించలేదు.

    "నాకు ఆఖరు పిరియడ్ క్లాసు లేదు. హెడ్మాష్టరు నడిగి ఇంటికి వెళతా రాయుడూ!" అని లేచారు శాస్త్రిగారు.

    ఎవరూ ఏమీ అనలేదు.

    ఆయన గడపదాటుతూ వుండగా "శాస్త్రిగారూ! నన్నపార్ధం చేసుకోకండి. ఆ విషయం చెప్పానే అని తిట్టుకోకండి నేచూసింది నిజం. నే కళ్ళారా చూశాక చెప్పాను. ఈరోజు రేపు ఆగండి. ఒకవేళ మీ అబ్బాయి ఏమైనా లవ్ ఎఫైర్ లో పడ్డాడేమో? తిరుపతిలో దేవుని ఎదుట కల్యాణం చేసుకువస్తాడో ఏమో! రెండురోజులు ఆగితే మీకే తెలుస్తుంది" అన్నాడు నాయుడు తిరిగి.

    శాస్త్రిగారు ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు.

    రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఈ ప్రపంచమే ఇరుకుగా, ఆ వూరు మరీ ఇరుకుగా, ఆ పాఠశాల మరీ ఇరుకుగా, అందులో మనిషి మనసు మరీ సంకుచితంగా అనిపించింది రాయుడికి.

    ఛీ! అనుకున్నాడు అతను.

    రాయుడివైపు చూసి కళ్ళతో నవ్వాడు నాయుడు.

    అతడికి శాస్త్రిగారి వ్యక్తిత్వం మీద ఇన్నేళ్ళకి ఇన్నాళ్ళకి దెబ్బ తీయగలిగాననిపించింది. గర్వంగా మరో సిగరెట్ అంటించాడు. తృప్తిగా పీల్చాడు.


                                *    *    *


    చికాకుగానే ఇంటికి వచ్చారు శాస్త్రిగారు.

    ఆయన చికాకుని మరింత ఎక్కువ చేసే విషయం చెప్పింది పార్వతి. నిన్న పిగ్మీ కలెక్షన్ కట్టవలసి వుంది అయోధ్యరాం. ఆ సోమవారం నుంచి శుక్రవారం దాకా వసూలయిన మొత్తం డబ్బుకట్టాలి బ్యాంకిలో. కానీ కట్టకుండా శనివారం ఉదయమే తిరుపతి వెళ్ళాడు అతను. వెళుతున్నట్టు బ్యాంకి మేనేజరుకి కానీ కాషియర్ కి కానీ చెప్పలేదు.

    వాళ్ళు అతని విషయమై ఆందోళనతో, అనుమానంతో వున్నారు. ఏ రోజు పిగ్మీ ఆరోజే కట్టాలి మామూలుగా. అలా కాకుండా వారందాకా పర్మిషనిచ్చేరతనికి. ప్రత్యేకంగా తిరగవలసిన ఏరియా ఎక్కువగా వుండటం, పార్టీలు కూడా ఎక్కువగా వుండటంతో అన్నీ వీక్లీ పిగ్మీలుగా ఏర్పాటు చేశారు. ఎట్టి పరిస్థితులలోనూ శనివారం కట్టాలి. అందుకే ఆందోళనగా వున్నారు.

    ఉస్సురని నిట్టూర్చారు శాస్త్రిగారు.

    "అయ్యో! భగవంతుడా! ఏవిటీ పరీక్ష" అనుకున్నారు.

    స్నానం చేసి, సంధ్యావందనం, జపం ముగించుకుని కొద్దిగా ఫలహారం చేసి కోడల్ని పిలిచారు. మామగారి మనసెరిగిన స్వాతి నోటుబుక్కు, పెన్ తీసుకుని వచ్చింది. అయోధ్యకాండ కొద్దిగా మిగిలివుంది.

    స్వాతి రాగానే "కూర్చోమ్మా! ఈ రోజు అయోధ్యకాండ పూర్తిచేద్దాం! రేపు స్క్రిప్టు యిస్తే మరోరెండు వేలు ఎడ్వాన్స్ తీసుకోవచ్చు" అన్నారు.

    "మామయ్యా!"

    "ఏమ్మా!"

    "మీరు ఈ రచన పూర్తికాగానే వెళ్ళి బ్యాంక్ మేనేజరుని కలవండి. పిగ్మీ మొత్తానికి ఈ డబ్బు వాపస్ చేయమనండి_అతనొచ్చాక మిగతా విషయాలు కనుక్కోవచ్చు"

    కోడలి వితరణ ఆయనకి చాలా తృప్తినిచ్చింది.

    "లేదు స్వాతి! ఈ రోజు శనివారం ఎలాగూ అయిపోయింది_ రేపు ఆదివారం లాభం లేదు. ఇక సోమవారం నాటికెలాగో వాడు వచ్చేస్తాడు. వాడి విషయం వాడే చూసుకుంటాడు_లేనిపోని బాధ్యతా, బాధా నాకెందుకమ్మా?"

    "అదికాదు మామయ్యా! మీరు వెళ్ళి చెబితే వారికి ఓ విధమైన తృప్తి ఉంటుంది. అతనిపై అనుమానానికి ఆస్కారం ఉండదు."

    పేలవంగా నవ్వారు శాస్త్రిగారు_ "నీకు తెలియదమ్మా. డబ్బు విషయంలో అనుమానాలు రానే రాకూడదు. వచ్చాయా అవి అంత సులభంగా పోవు. అందులో బ్యాంకి వాళ్ళతో వ్యవహారమంటే మాటలా? కత్తిపై సాము. దమ్మిడీకి పోయిన మర్యాద, నమ్మకం లక్షలు పెట్టినా రాదమ్మా!"

    స్వాతి మాట్లాడలేదు.

    కొద్ది క్షణాలు మౌనంగా గడిచాయి_

    ఆ కొద్దిసేపు సర్వజగదధినేత, జానకీ మనోహరుడు కోదండరాముడు ఆయన మనసుని పరిపాలించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS