Previous Page Next Page 
వారధి పేజి 9


    "ఈరోజు తొందరగా  వచ్చేసేరే?" అంది.

    "మరేం?" అన్నాడు శివయ్య  ముక్తసరిగా.

    "మామయ్య ఇంకా  రాలేదా?"

    "వెనకనుండి  వస్తున్నాడు."

    "కలిసి రాలేకపోయేరా, వయసుమళ్ళిన  మనిషిని  ఒంటరిగా విడిచి రాకపోతే? నిన్నటి నుండి ఒంటిలో బాగులేదంటూనే  పొలానికి  బయలుదేరేరు?"

    "ఆయనకు వయసు మళ్ళిందని  నువ్వూ, నేనూ  అనుకొంటున్నాం."

    "అదేమిటండీ, ఆ మాట?"

    "లేకపోతే ఈ వయసులో పెళ్ళేమిటి? మళ్ళీ పిల్లలేమిటి?"

    "ఊరుకోండి. ఆవిడ  వినగలదు."

    "వింటే నాకేం?"

    "మీకేం లేదన్న సంగతి ఏనాడో గ్రహించేను  కాని, నాకు బాధగా ఉంటుంది."

    "ఎందుకో అంత అభిమానం?"

    "ఎందుకా? సాటి ఆడది  కాబట్టి, ఆమెకు  జరిగిన  అన్యాయానికి  జాలిపడటం  సహజం  కాబట్టి."

    "అన్యాయమా?"

    "అన్యాయంకాక  ఆమెకు  ఈ ఇంట జరిగిందేమిటి? ఆమె కావాలని వలచి  మీ తండ్రిని  పెళ్ళి చేసుకుందనుకున్నారా? లేక మీ తండ్రీకొడుకుల ఆదరాభిమానాలకి  మురిసి, మూర్ఛపోతున్నదనుకొన్నారా? పరువు, మర్యాదలున్న  ఇంట పుట్టినపిల్ల  కాబట్టి  మీ అనాదరాన్ని  మనసులో  నిలుపుకోకుండా  సవరించుకు  పోతున్నాది.

    "ఇందులో ఆమె చేసిన  తప్పేమిటో మీరు  ఒకసారి  అయినా  ఆలోచించేరా? చంటివాడినైనా  మీరు కొనగోటితో  తాకకుండా  తప్పుకుపోతూంటే ఆమె ఎంతగా బాధ పడుతున్నాదో మీకు అర్ధంకాదు" అంది మీనాక్షి నిష్ఠూరంగా.

    "అందరి  వంతూ  అర్ధంచేసుకొని  అత్తని, మరిదిని  నువ్వు సాకుతున్నావు కదా, ఆది చాలులే." నిరసనగా అక్కడినుంచి  కదలిపోయేడు శివయ్య.

    వరదరాజుకి రెండో ఏడు వచ్చింది. వాడు మొదట నేర్చిన మాటలు అత్త, తాత, అన్న, తాత ఎదురుగా లేరు. అక్కడ ఉన్నది అన్న మాత్రమే. రాజు అన్న అనేసరికల్లా " అరుగో అన్న" అని శివయ్యని  చూపేది మీనాక్షి.

    శివయ్య పొలానికి  పోతుంటే  వచ్చీరాని  నడకతో, పడుతూ లేస్తూ ఎదుటికి వచ్చి "అన్న....అన్న" అనేవాడు వరదరాజు, చేతులు ముందుకి చూస్తూ.  
   
    పెద్దవారిని  విసిరికొట్టినట్లు  ఆ పసివాడిని  తప్పించుకోలేక  పోయేవాడు శివయ్య. క్షణకాలం  వాడి ముఖంవంక చూసి, ఒక్కసారి చేతుల్లోకి  తీసుకొని కిందికి దింపేవాడు.

    ఒకరోజు   అలా  ఎత్తుకొన్న  సందర్భంలో ఆ లేత  బుగ్గలమీద నాలుగైదు దోమకాట్లు  కనిపించేయి శివయ్యకి. వారాంతంలో  పట్నం పోయినప్పుడు  ఒక చిన్న  దోమలగొడుగు కొనితెచ్చి, భార్య చేతికి ఇచ్చేడు.

    "ఇది దేనికి?" తెలియనట్లే  అడిగింది  మీనాక్షి.
   
    "మహాతెలివిగా  మాట్లాడుతున్నా ననుకొంటున్నావు కదూ? చంటివాడి బుగ్గలనిండా  దోమకాట్లే! ఎంతో అభిమానంట ఇంట్లో  అందరికీ! పిల్లాడికి కాస్త  మంచినూనె  రాసి  పడుకోబెట్టాలనే  దృష్టి  అయినాలేదు." గిర్రున తిరిగి వెళ్ళిపోయేడు శివయ్య.

    పైటకొంగు  నోటికి అడ్డం పెట్టుకొని  మెల్లగా నవ్వుకొంది  మీనాక్షి. అటుపిమ్మట పట్నం పోయినప్పుడల్లా  ఒక లక్కకాయో, రబ్బరుబొమ్మో విధిగా ఇంటికి వస్తూండేవి కాని, వాటిని  తనంత తానుగా తీసి ఇచ్చేవాడు కాడు  శివయ్య.

    ఆ చందనం  బొమ్మతో మూతి  బద్దలు  కొట్టుకుంటూన్నాడని  మీ బజారుసంచిలో ఉంటే తీసిఇచ్చేను" అనేది మీనాక్షి.

    "ఊఁ...సరే!" తనకేం పట్టనట్లు  జవాబు చెప్పేవాడు శివయ్య.



                           *    *    *


    వరదరాజుపట్ల  శివయ్య  మనసులో వస్తున్న మార్పు హఠాత్తుగా నిలిచిపోయే సంఘటన జరిగింది ఆనాడు. రాత్రి భోజనం ముగించుకొని రామభజనమండపంవైపు  పోతున్న  శివయ్యని "శివా! ఇలా రా, నాయనా" అంటూ ఆప్యాయంగా పిలిచేడు తండ్రి.

    అతడు చేతిలో చుట్ట లేకుండా  వీథి అరుగుమీద కూర్చోవడం చూసి వింతపడ్డాడు శివయ్య. రత్తయ్య వివాహం చేసుకొన్నా తరవాత కొడుకుని అంత ఆప్యాయంగా "శివా" అని పిలవడం అదే మొదటిసారి. మాటల మధ్య ఎప్పుడైనా "శివా' అన్నా, అందులో ఉండవలసిన  ఆప్యాయత లోపించినట్లే  అనిపించేది శివయ్యకి. ముందుకువేసిన అడుగును  అయిష్టంగానే  వెనక్కితీసి  అరుగుమీదికి  వచ్చేడు శివయ్య.

    తను చెప్పబోయే  విషయాన్ని సూటిగా  మొదలుపెట్టేడు రత్తయ్య. "ఈ ఏడాది మొదలయిన దగ్గిరనించీ  నా ఒంట్లో ఏమంత బాగులేదు. కొద్దిపాటు శ్రమకికూడా  శరీరం ఓర్చుకోలేకపోతున్నది. నేను  పొలం ముఖం చూసి  నెల్లాళ్ళకి పైగా  అయింది. ఏ రోజు కారోజు  వెళ్ళాలనుకొంటూనే వెళ్ళలేకపోతున్నాను.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS