"అన్నపూర్ణ కోడలిని మరీ అంతలా పూసుకు తిరుగుతుందేమిటి? అసలే సవతికొడుకాయెను. ఆ పిల్లని అలా నెత్తిమీద ఎక్కించుకొంటే ఎటొచ్చి ఏమయినా దీన్ని వాళ్ళు సరిగా చూస్తారా? కాస్త భయభక్తుల్లో కోడలిని ఉంచాలికాని" అనేవారు.
మీనాక్షి ఇంట్లో కాలు పెట్టగానే అంతకాలంగా బిగుసుకుపోయిన చిక్కుముడి అతి సులువుగా విడిచిపోయినట్లు అనిపించింది ఇంట్లో అందరికీ. శివయ్యపెళ్ళాం కాపరానికి రావడంతో ఊరిలో పుకార్లు కూడా చాలావరకు చల్లబడ్డాయి.
మీనాక్షి కాపరానికి వచ్చిన మూడు నెలలకు సంక్రాంతిపండుగ వచ్చింది. మీనాక్షి తండ్రి కూతుర్నీ, అల్లుడినీ పండక్కి తమ ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చేడు. నూర్పుల మూలంగా తనకి ముందుగా వచ్చేందుకు వీలుకాదని, మామగారితో భార్యని ప్రయాణం కట్టించేడు శివయ్య.
"ఊఁహూ, నేను వెళ్ళను" అంది మీనాక్షి.
"పండగనాటికి నేనూ వస్తాను. మీ నాన్న స్వయంగా వచ్చి పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోవడం బాగుండదు. నువ్వు ముందు వెళ్ళు" అన్నాడు శివయ్య.
ఎవరెంత చెప్పినా మీనాక్షి తనూ భర్తతో వచ్చి ఆ మూడు రోజులూ ఉంటానంది. "మరీ ఇదేమి విడ్డూరమమ్మా! మొగుడిని వదిలి పుట్టింటికి పోయి నెలరోజులు ఉండలేదుట" అని బుగ్గలు నొక్కుకున్నారు అమ్మలక్కలు.
శివయ్యకి ఆ మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించేయి. ఆ మాట భార్య నోటిమీదుగా వినాలనే కాంక్షతో రెట్టించి అడిగేడు. "ఎందుకు వెళ్ళవు మీనాక్షీ?" అంటూ.
మొదట్లో మీనాక్షి చెప్పేందుకు వెనకాడింది. కాని శివయ్య ఆమె చెప్పేవరకూ వదలలేదు.
"అత్తయ్య ఒక్కత్తే ఉండాలి." నసుగుతూ చెప్పింది మీనాక్షి.
ఆమె పుట్టింటికి పోననడానికి తను ఊహించిన కారణం కాకపోవడంతో చికాకుపడ్డాడు శివయ్య. 'ఇంతాచేస్తే ఈ హంగామాకి కారణం అత్తాకోడళ్ళ పొత్తా?' అనుకొన్నాడు. తన భార్య మనసుని అంతలా ఆకట్టుకొన్న అన్నపూర్ణపట్ల అసూయాభావం అతని మనసులో కదిలింది.
"ఆమెకోసం నువ్వు పుట్టింటికి పోకపోవడం ఏమిటి? నువ్వు రాకపూర్వం ఒక్కత్తే వుండలేదూ? నువ్వు లేకపోతే ఈ నెలరోజులకి మీ అత్తయ్య వసివాడిపోదులే" అన్నాడు.
"ఇప్పుడు ఎప్పటిలాగా కాదు కాబట్టే నేను ఈ మాట అన్నాను" అంది మీనాక్షి ఎంతో నెమ్మదిగా.
"అంటే?" అర్ధం కానట్లు చూసేడు శివయ్య.
"మీకు తమ్ముడో, చెల్లెలో పుట్టబోతున్నారు." భర్త చెవిలో మెల్లిగా ఊదింది మీనాక్షి.
"ఆఁ!" నమ్మలేనట్లు చూసేడు శివయ్య.
"ఇప్పటినుండీ గోలచెయ్యకండి, ఇంకా నాలుగు నెలలైనా కాలేదు."
"నాన్నకి తెలుసా?" కుతూహలం పట్టలేక అడిగేడు శివయ్య.
"తెలిసే ఉంటుంది" అంది మీనాక్షి.
భార్య ప్రయాణం గురించి మరి పట్టు పట్టలేదు శివయ్య.
అన్నపూర్ణకి అయిదవ మాసం వచ్చేసరికి ఈ వార్త అందరికీ తెలిసిపోయింది. "పోనీ, రెండో పెళ్ళి అయినందుకు ఆమె కడుపున ఒక పిల్లో, పిల్లడో పుడితే కాలికి, చేతికి అవుతారు" అన్నారు పెద్దవాళ్ళు.
"తాతగారు కావలసిన వయసులో తండ్రి అవుతున్నాడు. తమాషాగా ఉందికదూ" అన్నారు కుర్రకారు.
తొమ్మిది నెలలు నిండి అన్నపూర్ణకు కొడుకు పుట్టేడు. పిల్లడు సన్నంగా, పొడుగ్గా ఉన్నా ఆరోగ్యంగానే వున్నాడు. పదకొండవ రోజున 'వరదరాజు' అని తాతగారి పేరున నామకరణం జరిపించేరు.
పిల్లడికి పదినెలలు వచ్చిన దగ్గరనుంచి ఊళ్ళో గుసగుసలు మళ్ళీ ఒక్కసారి రేగేయి. "అన్నపూర్ణ కొడుకు ముమ్మూర్తులా శివయ్య పోలికే" అంటూ పోలికలు నిర్ధారించేరు.
"రత్తయ్యా! నీ కొడుకు లిద్దరూ ఒకే పోలికయ్యా" అని మరికొందరు బలపరిచేరు.
గ్రామస్థులు మాటల్లో కొంత నిజం లేకపోలేదు. శివయ్య తండ్రి పోలిక. వరదరాజుకు కూడా చాలావరకు తండ్రిపోలికలే వచ్చేయి. కాని గ్రామస్థులు ఆ విషయాన్ని వ్యంగ్యంగా అనడంలోనే మెలికె ఉంది. అప్పటి వరకూ పెళ్ళికి ఇష్టపడని శివయ్య తరవాత ఎందుకు ఒప్పుకొన్నాడో ఊహా గానాలు కూడా చేసేరు.
ఈ రకమైన మాటలు విని మీనాక్షి ఏమనుకొంటుందో అని దిగులు పడ్డాడు శివయ్య. ఆమె మనసులో ఏముండేదోకాని పైకిమాత్రం ఏమీ ఎరగనట్లే నడుచుకొనేది. పనికట్టుకొని ఎవరైనా చెప్పబోతే "ఇందులో వింతగా అనుకొనేందుకు ఏముంది? అన్నదమ్ములకి, అక్కచెల్లెళ్ళకి పోలికలు ఉండవా?" అని ఎదురుప్రశ్న వేసేది.
శివయ్య ఊరివాళ్ళ మాటల్నికాని, ఇంటిలో పెరుగుతున్న పిల్లాడిని కాని పట్టించుకొనేవాడు కాడు. మీనాక్షి కాపరానికి వచ్చేక అతనికి అన్నపూర్ణ ఎదుటబడి మాటలాడవలసిన అవసరమే కలగలేదు.
ఒకరోజు అతడు పొలంనుండి వచ్చి అరగంటకి పైగా అయినా మీనాక్షి కంటపడలేదు. అన్నపూర్ణని అడగాలనిపించలేదు. పెరట్లోకి పోయి స్నానానికి కాగులోని నీళ్ళు బిందెలోకి తొలుపుకొంటున్నాడు.
"రాజు ఏడుస్తూంటే అలా బయటికి తీసుకువెళ్ళింది మీనాక్షి. నువ్వులే శివా, నేను నీళ్ళు తొలుపుతాను" అంది అన్నపూర్ణ పెరట్లోకి వచ్చి.
"తీసుకొన్నాను. మరి అక్కరలేదు" అంటూ బిందెని పక్కకు లాక్కున్నాడు శివయ్య. అతడి స్నానం పూర్తి అయ్యేసరికి మీనాక్షి వచ్చింది.
