"ఇది ఇలా ఉండగా నిన్నరాత్రి ఎడంపక్కలో పోటు వచ్చింది. బాధతో గిలగిలలాడిపోయేను. నిన్ను లేపి ఈశ్వరయ్య దగ్గిరకు పంపుతానంది మీ పిన్ని. మంచినిద్రలో ఉంటాడు. మరి కాస్తసేపు చూసి తగ్గకపోతే లేపవచ్చును అన్నాను. ఆ తరువాత వేడినీళ్ళలో తేనెవేసి ఇచ్చింది అన్నపూర్ణ, దానిలో మెల్లగా సర్దుకొంది.
"ఇదంతా ఎందుకు చెప్పుతున్నానంటే_ నా బ్రతుకు ఎప్పుడు తెల్లవారిపోతుందో తెలియదు. ఏమీ తెలియని అమాయకురాలు మీ పిన్ని. పాపం, పుణ్యం ఎరగని పసివాడు వరదరాజు. వీరిద్దరినీ ఎలా చూసుకొంటావో? వారి బాధ్యత నీ చేతుల్లో పెడుతున్నాను."
కస్సుమని తోకతొక్కిన తాచులా తండ్రిపైకి లేచేడు శివయ్య.
"ఏభై ఏళ్ళ ప్రాయంలో పెళ్ళి చేసుకొన్నప్పుడు ఈ తెలివిలేకపోయిందేం? అప్పుడు ఎవర్ని అడిగి, ఎవరి సలహామీద చేసుకొన్నావు? నీ వయస్సు, ఆ పిల్ల వయస్సు అప్పుడు గుర్తుకు రాలేదా? ఆమె జీవితం సార్ధకం చెయ్యగలనని నమ్మే తీసుకువచ్చేవా? ఇప్పుడు కొడుకు నీకు గుర్తుకు వచ్చేడా? నా కదేం తెలియదు. నేనెవరి బాధ్యతా నెత్తిని వేసుకోబోవడం లేదు. కావాలనుకొంటే రేపే ఆస్తి పంపకాలు జరిపించు. నా బ్రతుకు నేను బ్రతుకుతాను" అన్నాడు కఠినంగా.
"చూడు శివా! పొరపాటు చేసినమాట నిజమే. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు చర్చించడంలో అర్ధంలేదు. జరిగిపోయిన దానిని ఇప్పుడు వెనక్కి లాగలేము. ఆది తప్పయితే దానికి నువ్వు శిక్షించవలసింది నీ తండ్రిని; అన్నపూర్ణని కాదు, పసివాడిని కాదు. సవతితల్లి అని అన్నపూర్ణ నీకు విషం పెట్టలేదు. కన్నకొడుకు కన్నా మిన్నగా అభిమానించి అన్నం పెట్టింది.
"ఆ పసివాడు నీ ఆస్తిమీద యాజమాన్యం కోరడు. ఈ ఆస్తి అంతా నా స్వార్జితం. అదంతా నీ పేర వ్రాస్తాను. వాడికి మనిషిలా బ్రతకగలిగే మార్గం నువ్వు చూపించు. ఆ పిల్లవాడి పెంపకంలో అన్నపూర్ణకి కాస్త చెయ్యి, ఆసరా ఇయ్యి.
"ఇది నిన్ను తండ్రిగా ఆజ్ఞాపించడం లేదు. వేడుకొంటున్నాను. నిన్న రాత్రినుండి నా మనసు అగ్నిగుండలా రగిలిపోతున్నది. నీ చల్లని మాటతో దానికి ఉపశమనం కలిగించు శివా!" రత్తయ్య కళ్ళలో నీరు వాడిన బుగ్గలమీదుగా పొరల సాగింది. అతడి కంఠం బొంగురుపోయింది.
నిశ్శబ్దంగా తల వంచుకొని వెళ్ళిపోయేడు శివయ్య.
* * *
రెండు మూడు రోజులవరకు శివయ్య జవాబుకోసం ఆత్రంగా ఎదురుచూసేడు రత్తయ్య. గడుస్తున్న ప్రతి రోజూ అతని గుండెలమీద మణుగు బరువు దింపి మరీ పోతున్నాది. త్వరగా ఇల్లు చేరుకోవాలనుకొంటున్న సమయంలో, ఎంతకీ రాని బస్సుకోసం అసహనంగా ఎదురుచూసే ప్రయాణీకుడిలా కొడుకు జవాబుకోసం నిరీక్షించేడు రత్తయ్య. మౌనమే అతని జవాబయింది. మౌనం అర్ధాంగీకారం అనుకోవచ్చునా? కొడుకు ముఖంలోని కరగని కాఠిన్యాన్ని చూసేక అలా అనుకోలేకపోయేడు రత్తయ్య. 'శివయ్య శిలగా మారిపోయేడు. ఆ శిలని ద్రవింపజేసే శక్తి ఈ తండ్రి వశంలో లేదు.' అంటూ నిట్టూర్చేడు. మనసులోని బాధను భార్యముందు చెప్పుకోకుండా ఉండలేకపోయేడు. ఆవేదన, ఆశక్తత పెనవేసుకొని ఆ వృద్దుని మనసుని కమ్మరికొలిమిలా మంట పెడుతున్నాయి. ఆ వేడికి ఉపశమనం కొడుకువల్ల కలగలేదు. భార్యనుండైనా పొందగలడా?
"శివుడు నా కోర్కెను మన్నించలేదు అన్నపూర్ణా! చావు పైబడుతున్న వయసులో నిన్ను పెళ్ళిచేసుకొని, నీకూ, నీ పిల్లాడికీ అన్యాయం చేసేను. మాయా మర్మం ఎరగని అమాయకురాలివి నువ్వు. పసివాడు రాజు మీరిద్దరూ ఎలా బ్రతుకుతారు? ఎక్కడికి పోతారు? మరి నాలుగు కాలాలపాటు బా బొందిలో ప్రాణం ఈ మాత్రంగానైనా ఉంటే నీకోసం ఏమైనా చెయ్యగలిగి ఉండేవాడినేమో? కాని, ఆ ఆశ ఇంక నాకు లేదు. రోజురోజుకీ ఒంట్లో శక్తి సన్నగిల్లుతున్నది. గుండెలమీద బరువు పెరుగుతున్నది. ఇంక నేనేం చెయ్యలేను అన్నపూర్ణా! భగవంతుడే మీకు దిక్కు. నీ మంచిమనసే నీకు రక్ష" అన్నాడు రత్తయ్య కళ్ళనీళ్ళతో.
ఆ వృద్ధుని ఆవేదన చూసిన అన్నపూర్ణ మనసు కరిగిపోయింది. ఆమె బాగా బ్రతికిచెడిన కుటుంబంలో పుట్టిన పిల్ల. దారిద్ర్యం వారింట తాండవిస్తున్నా మాలిన్యం వారి మనసులను అంటలేదు. కట్నం ఇచ్చి పెళ్ళి చెయ్యలేనని తండ్రి తన అశక్తత తెలియజేసిన వాడు, ముసలివాడయినా అట్టే ఆస్తిపాస్తులు లేవని తెలిసినా రత్తయ్యని పెళ్ళి చేసుకొని, ఇంటి పరువు మర్యాదలు నిలబెట్టింది అన్నపూర్ణ.
ఆశించినవన్నీ అందరికీ సమకూడవు. 'తనకి ఈ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించేడు. దీనిలోనే ఆనందం పొందేందుకు ప్రయత్నించాలి' అని నిశ్చయించుకొంది.
అత్తిల్లు ఆనందధామంలా ఉంటుందని అన్నపూర్ణ ఆశించకపోయినా అంత అపశ్రుతిలా కూడా ఉంటుందనుకోలేదు. తండ్రి చర్యకి నిరసనగా మాటామంతీ లేక ఇంట్లో తిరుగుతున్న వయస్సులో ఉన్న సవతికొడుకు, వయసుమీరిన భర్త, ఏపాటి అలజడికైనా కాకుల్లా గోలచేసే గ్రామస్థులు. అత్తలేని కాపురమైనా కత్తిమీద సామువంటిదే అనుకొంది. క్షణకాలం ఆమె మనసు వికలమయింది. అంతలోనే ధైర్యాన్ని చిక్కబట్టుకొని కర్తవ్యపథంలో నడకసాగించ నడుం కట్టింది.
ఈ జీవితంలో తను ఆశించవలసిన ఆనందాలు, పొందబోయే అనుభూతులూ ఏమీ ఉండవు. తన ఆనందానికి పనికిరాని ఈ బ్రతుకు ఇతరుల సంతోషానికైనా వెచ్చించగలిగితే జన్మసార్ధకమైనట్లే అనుకొంది. తను కాలుపెట్టిన ఆ ఇంటిని తీర్చిదిద్ది చల్లగా సాగేలా చూడాలనీ, వృద్దుడైన భర్తకి, చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన సవతి బిడ్డకీ సదుపాయంగా రోజులు గడిపివేయాలనీ నిర్ణయించుకొంది.
