Previous Page Next Page 
వారధి పేజి 7


    "ఇంట్లో  వండిపెట్టిందికి  ఒక ఆడమనిషి  ఉంది కదా. ఇప్పుడు నా పెళ్ళికి వచ్చిన తొందరేముంది?" అన్నాడు శివయ్య విరక్తిగా.

    ఏదో ఒక పని  కల్పించుకొని  పగలంతా  పొలంలోనే  గడిపేవాడు. అన్నపూర్ణ ఆ ఇంటిలో కాలుపెట్టి ఆరునెలలు  దాటుతున్నా  ఆమెపట్ల  శివయ్య మనసులో  మాతృభావం కలగలేదు. ఆ కారణంగానే  సాధ్యమైనంతవరకూ ఆమెకు  దూరంగా వుండాలని  నిశ్చయించుకొన్నాడు. ఎన్నోసార్లు ఆమెను 'పిన్నీ' అని పిలిచి  ఆదరంగా మాట్లాడాలని  ప్రయత్నించేడు. కాని, ఎప్పటికప్పుడు ఏదో అతని కంఠాన్ని  బలంగా  అదిమి పట్టినట్లు  అనిపించింది. మాట పెగిలేదు కాదు.

    ఆమె ఇంటా, ఇతడు బయటా వుంటున్నా  గ్రామంలో  పుకార్లకు కొదవలేదు. తన పెళ్ళిప్రస్తావన వచ్చినప్పుడల్లా  శివయ్య విదిలించికొట్టడం వాటికి మరికాస్త శక్తి  ఇచ్చింది. "ఇంట్లో చక్కని చుక్కలాంటి  పిల్ల ఉండగా  పెళ్ళి చేసుకోకపోతేనేం?" అనేవారు శివయ్య వెనకగా.

    అన్నపూర్ణ ఏటికి వెళ్ళినా  ఆడంగులు ఏవో సూటీపోటీ  మాటలు అనేవారు. మొదట్లో ఆ మాటల అర్ధం ఆమెకు తెలిసిరాలేదు. వాటి అంతరార్ధం బోధపడిన తరవాత  కొయ్యబారిపోయింది. తన పుట్టుకను తిట్టుకొంది. పుట్టగానే పీక నొక్కి  పారేయక పెంచి, పెద్దచేసి  ముసలివాడిచేతిలో  పెట్టిన తండ్రిని నిందించింది. పెళ్ళి  చేసుకోకుండా  తనని ఇటువంటి  అపవాదుల పాలుజేసిన శివయ్యపై కోపం తెచ్చుకుంది.

    కాని, అందువల్ల అయ్యే దేముంది? తను విన్న మాటలు తండ్రీ కొడుకుల చెవుల్లో మాత్రం పడలేదా? ఏమీ పట్టనట్లు ఎలా తిరుగుతున్నారు? అరిటాకు-ముల్లు  సామెతలా నాశనమయ్యేది ఆడదనేగా  వీళ్ళ ధీమా?

    రోజూ శివయ్య భోజన సమయంలో అన్నీ వడ్డనచేసి, పెరుగుగిన్నె పక్కన పెట్టి వంట ఇంట్లోకి వెళ్ళిపోయేది అన్నపూర్ణ. మధ్యలో ఒకటి రెండుసార్లు  వచ్చి "ఏదైనా మారు కావాలా?" అని అడిగిపోతూండేది.

    ఆరోజు అలవాటుకు  భిన్నంగా పెరుగు గిన్నె  పక్కనలేదు. మిగిలిన ఆదరువు లన్నిటితోను  భోజనం పూర్తిచేసి, పెరుగుకోసం అన్నం ముందుకు తీసుకొని ఇటు అటు చూసేడు శివయ్య. వంట ఇంటిలో మనిషి  ఉన్న అలికిడి లేదు. మంచినీళ్ళ  గ్లాసు  గట్టిగా  నేలమీద పెట్టేడు. వంట ఇంట్లో  మట్టెల చప్పుడు వినిపించింది.

    "ఈరోజు పెరుగు లేదులాగుంది." అక్కడ   ఉన్న   వ్యక్తికి వినిపించేలా గట్టిగా అన్నాడు.

    "ఎందుకులేదు, బాబూ! మరచి పోయేను." మాట పూర్తి చేస్తూనే అన్నపూర్ణ పెరుగుగిన్నె, గరిట తెచ్చింది.

    శివయ్య విస్తరికి  దగ్గిరగా  నేలమీద కూర్చుని, అతని విస్తట్లో ఉన్న అన్నంలో గరిటతో  తీసి పెరుగు వేసింది.

    ఎందువల్లనో  ఆరోజు  ఆమె  అలా దగ్గిరగా  కూర్చుని  వడ్డన చేస్తూంటే తల్లి తలపులోకి  వచ్చింది శివయ్యకి. అతడికి పెరుగు వడ్డించి గిన్నె పక్కనేవున్న ఉట్టిమీద  పెట్టివచ్చి తిరిగి  అక్కడే  కూర్చుంది అన్నపూర్ణ. ఆది ఏనాడూ లేని అలవాటు. శివయ్యకు  తల ఎత్తి  అవాంఛను  అంతలోనే అదుపులోకి తెచ్చుకొన్నాడు.

    అన్నపూర్ణ మెల్లిగా  దగ్గి  కంఠం  సవరించుకొని  "నాకు కోడల్ని ఎప్పుడు తెస్తావు, శివా?" అంది.

    నోటిలో  పెట్టుకోబోతున్న  ముద్ద దబ్బున  విస్తట్లో  వదిలి తెల్లబోయి ఆమెవైపు  చూసేడు  శివయ్య.

    ఆమెకు  నిండా  పద్దెనిమిది ఏళ్ళ  వయసులేదు. కాని  ఆ మాట అన్న తీరు నలభై ఏళ్ళ  గృహిణి పెళ్ళి  ఈడు కొడుకుతో  అన్నట్లుంది.

    ఇదెలా  సాధ్యం? ఈమెలో  ఇంత చిన్నతనంలోనే  ఇంత  పరిపక్వత ఎలా వచ్చింది? తనకంటె వయసులో పెద్దవాడిని నన్ను కొడుకుగా  స్వీకరించి, కోడల్ని ఎప్పుడు తెస్తావని అంత ఆప్యాయంగా ఈమె  ఎలా అడగగలిగింది?

    పిడుగుపాటు  తిన్న  వ్యక్తిలా అలా మిడిగుడ్లు  పెట్టుకొని  ఆమెనే చూస్తూ  ఉండిపోయేడు శివయ్య.

    అతడు తన మాటకు జవాబు చెప్పకపోవడంతో  తిరిగి తనే మాట అందుకొన్నది అన్నపూర్ణ:

    "చూడు, బాబూ! మీ పంతాలు మీవే కాని ఆడవాళ్ళ కష్టసుఖాలు మీకు తెలియవు. మీ తండ్రీకొడుకులు  పొలానికి పోతే ఇంత ఇంట్లో  ఒంటరిగా ఉండేందుకు  ఏదో బితుకుగా ఉంటుంది. ఆడది ఒంటరిగా ఉన్నదంటే నలుగురూ నాలుగు రకాలుగా  అనుకొంటారు. కోడలుపిల్ల  వస్తే  ఒకరికొకరం  తోడుగా...."

    ఆ మాట అంటూంటే  ఆమె గొంతుక బొంగురు పోయింది. ముఖం పక్కకి తిప్పుకొని పైట చెంగుతో  కళ్ళు తుడుచుకొంది.

    ఒక్కసారిగా  కళ్ళముందు తెర  తొలగి ఆమె ఆవేదన అర్ధమయినట్లు  అనిపించింది శివయ్యకి. ఊరివాళ్ళ మాటలను తను, మగవాడు కాబట్టి, లక్ష్యపెట్టకపోయినా  ఆమెను ఎంతగా బాధించేయో  అర్ధం చేసుకొన్నాడు. తన మూలంగా ఆమె బాధపడడం  అతడు సహించలేకపోయేడు.

    "మీకు నచ్చిన పిల్లని తీసుకురండి, నేను పుస్తె కడతాను" అన్నాడు శాంతంగా.

    నీళ్ళు నిల్చిన  అన్నపూర్ణ కళ్ళలో ఆనందం  తొణికిస లాడింది.

    "మంచిది, బాబూ! మీ నాన్నగారితో  చెబుతాను" అంది  నెమ్మదిగా.



                           *    *    *


    ఆరు నెలలు దాటకుండానే  శివయ్య  పెళ్ళి  మీనాక్షితో జరిగిపోయింది. అన్నపూర్ణా, మీనాక్షీ  రమారమి  ఒక్క ఈడువారే. వారిద్దరూ  అత్తా కోడళ్ళలా కాక  అప్పచెల్లెళ్ళలా ఇంట్లో మసలుకొనేవారు. సరదాకుకూడా  ఒక రోజయినా  పోట్లాడుకోని ఆ అత్తాకోడళ్ళ  గురించి  ఊరంతా  విడ్డూరంగా చెప్పుకొనేవారు.         
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS