ఒకరి లాబ్ లో మరొకరిని పని చేసుకోవటానికి అనుమతించటం చాలా కష్టం. విక్రమ్ పేపర్ చదివి తెలివైనవాడు అనుకోవటం వల్ల డాక్టర్ కిరణ్ కుమార్ మీది గౌరవంతో ఒప్పుకున్నాడు శ్రీరాములు గారు.
విక్రమ్ మనసు ఆనందంతో పొంగింది. కానీ మెటీరియల్ సంపాదించుకోవాలి. "ఉద్యోగం చూడండి" అన్నాడు.
డా|| కిరణ్ కుమార్ కొద్ది రోజుల్లోనే విక్రమ్ కి జాబ్ చూపించాడు. అది కామేశ్వర అండ్ శశాంక గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లోనే. విక్రమ్ డాక్టరుగా జాయిన్ అయ్యాడు. తన సాయం లేకుండానే విక్రమ్ తనంత తానే జాబ్ లోకి రావటం వామన్ కి నచ్చలేదు.
"కానీ నా కిందనే కదా అతను పని చెయ్యవలసింది" అనుకున్నాడు తనను తాను ఓదార్చుకుంటూ...
5
ఫోన్ లో అవతలి వైపు నుండి మిసెస్ కామేశ్వరీ దేవి కంఠం వినిపించగానే లోలోపల విసుక్కుంటూనే "హలో!" అన్నాడు తెచ్చిపెట్టుకుంటున్న ఉత్సాహంతో శశాంక.
"ఏం చేస్తున్నారు? మిమ్మల్ని డిస్టర్బు చెయ్యటం లేదు గదా!" అవతలి వైపు నుండి విలాసంతో కూడిన నవ్వు.
మండింది శశాంకకు-ఈ విలాసాలొకటి! పోనీ, ఆడది కదా, ఏదో చూద్దామని దగ్గరకెళితే తన పాతివ్రత్యపు కథలు మొదలు పెడుతుంది. మళ్ళీ ఈ విలాసాలు, కులుకులు, కవ్వింపులు మానదు! బోర్!
నవ్వుతూ సమాధానం చెప్పాడు.
"క్రొత్తగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడటం నాకు డిస్ట్రబెన్స్ అవుతుందా? మీ భగవద్ద్యానానికి భంగం కలిగించటం ఇష్టం లేక నేను ఫోన్ చెయ్యను కాని"
"అవునండోయ్! బాగా గుర్తు చేశారు! పూజకు వేళవుతోంది. అందులో శనివారం, నా పని త్వరగా చెప్పేస్తాను."
"నువ్వు తొందరగా తెమల్చకేం?" అని మనసులో విసుక్కుని "ఏమంత తొందర? చెప్పండి" అన్నాడు.
"తొందర లేకపోవటం ఏమిటండీ! నేనసలు శనివారం సాయంత్రం పూజ మానను తెలుసా! ఈ శనివారాలు మొదలుపెట్టి అయిదేళ్ళయింది. అప్పటి నుండి ఒక్కవారం కూడా మానలేదు. అయిదేళ్ళ క్రిందట ఏం జరిగిందో చెప్పనా? మా పిన్ని గారి..."
"నీ తొందర తగలబడినట్లే ఉంది." అనుకుని రిసీవర్ చెవి దగ్గర ఉంచుకుని తన ప్లాన్స్ చూసుకోసాగాడు శశాంక. ఇంచుమించు అరగంట తర్వాత "ఇంతకూ మీరు తప్పకుండా చేస్తారుగా!" అన్న మాట వినిపించి ఉలిక్కిపడి "ఏమిటి?" అన్నాడు.
"మీరు వినటం లేదా?" రోషంగా పలికింది.
"వినకపోవటం ఏమిటండీ! మీ భక్తికి ఆశ్చర్యపోతూ ఆలోచనలో పడ్డాను. అందుకని చివరి మాటలు వినబడలేదు. మరొక్కసారి చెప్పండి."
"అదేనండీ! మన కాండిడేట్ వసంతరావును మన హాస్పిటల్ లో డాక్టర్ గా వేయించాలి. కోమలరావు గారు తలచుకుంటే అవుతుందది! కోమలరావు గారిని మీరేగా నిలబెట్టారు! మీ మాట కాదంటారా?"
"కాదనరనుకోండి. అయితే ఇక్కడ డాక్టరుగా అప్పాయింట్ అవ్వడానికి అయిదేళ్ళ సర్వీస్ ఉండాలని రూల్ ఉంది. అతనికుందా ఆ సర్వీస్?"
అవతలి వైపు నుండి పకపక నవ్వు.
"భలేవారండీ! వేదాంతులేమన్నారు? 'ఓ భగవంతుడా! మేము పుణ్యాత్ములమయితే నువ్వెందుకు? మేము మహా పాపాత్ములం కనుకనే నువ్వు కరుణా సముద్రుడివై మమ్మల్ని కరుణించి కాపాడాలి!' అని....అలాగ, అన్ని అర్హతలూ ఉంటే మీరు, నేను ఎందుకండీ?"
"అలాగే! చూద్దాం! ఇంతకూ ఆ 'ఎ' బ్లాక్స్ కాంట్రాక్ట్ ఎవరికిప్పిస్తున్నారు?"
"ఎంత గడుసుగా అడుగుతున్నారు? నాకిప్పించమని అడగలేదు!"
"మీ దృష్టిలో మరొకరుంటే, నేను అడిగి మాత్రం ప్రయోజనం ఏముంది?"
"మీరు కావాలనుకుంటే మరొకరు, మరొకరు ఎవరికీ రాదు!"
"థాంక్యూ!"
"వసంతరావు సంగతి మరచిపోరుగా!"
"మీరుచెప్పటం..నేను మరిచిపోవటం..ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా?"
"ఉంటాను. పూజకు ఆలస్యమవుతోంది!"
ఫోన్ పెట్టేసి ఎదురుగా కూర్చున్న సౌందర్యను చూసి ఎందుకో తప్పు చేసినట్లు ఒక్క క్షణం తలవంచుకుని అంతలో "నేనేం చేశాను?" అనుకుని తలెత్తి సౌందర్యను చూసి నవ్వాడు.
"ఆ వసంతరావుకి ఉద్యోగం ఇప్పిస్తున్నారా?"
"అంతా విన్నావన్నమాట! ఆవిడ నాకు 'ఎ' బ్లాక్స్ కాంట్రాక్టు ఇప్పిస్తుంది కదా!"
"ఒకవేళ ఆ వసంతరావు కంటే మంచి అభ్యర్ధి వచ్చినా వెనక్కి పోవలసిందేగా!"
"అంతే! ఇందులో ఏముంది పెద్ద? అందరూ చేస్తున్నదే! అంతటా జరుగుతున్నదే!"
"అవును! ఏం లేదు!"
"అవునమ్మా! అంతా మామూలే!"
"నాన్నగారూ! నేను మీకు సాయం చేస్తాను!"
"పిచ్చి తల్లీ! నువ్వు నాకు ఏం సాయం చేస్తావమ్మా?"
"కోమలరావుగారు నాకు తెలుసు! ఇవాళే వెళ్తాను. ఆయనతో మాట్లాడతాను. వసంతరావును అప్పాయింట్ చేసేలా చూస్తా."
"వద్దు! వద్దు! సౌందర్యా! నువ్వు వెళ్ళకు!"
"ఏం నాన్నగారూ! ఇందులో ఏముంది? అందరూ చేస్తున్నదే! అంతటా జరుగుతున్నదే! అంతా మామూలే!"నవ్వి వెళ్ళిపోయింది సౌందర్య.
హతాశుడైపోయాడు శశాంక.
