Previous Page Next Page 
తపస్వి పేజి 7


    నెలరోజులు గడిచినా, విక్రమ్ లాబ్ లో పని చేసుకోవటమే తప్ప తనను మరొకసారి ప్రాధేయపడటానికి రాకపోకటంతో డాక్టర్ మాధవయ్యగారి అహం గాయపడింది.
    వీడు...వీడి గొప్పా! ఎక్కడికి పోతాడు? రాణీ అనుకున్నాడు దెబ్బతిన్న అహంతో. అంతలో విక్రమ్ పేపర్ మెడికల్ సైన్సెస్ మేగజైన్ లో పబ్లిష్ అయింది. వ్యాసం క్రింద పర్యవేక్షకుడిగా డాక్టర్ మాధవయ్యగారి పేరు లేదు.
    విక్రమ్ పబ్లిష్ చేసిన పేపర్ కి ప్రశంసల వర్షం కురిసింది. చాలా మంది మేధావులు, ఆ వ్యాసాన్ని ప్రశంసించి "ఈ యువకుడు వైద్య రంగంలో బాగా వృద్ధిలోకి వస్తాడు" అని పొగిడారు.
    డాక్టర్ మాధవయ్య గారు విక్రమ్ పేపర్ ని అప్పుడు చదివారు. మనసులో మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. అంత మంచి పేపర్ పర్యవేక్షకుడిగా తన పేరు లేకుండా పబ్లిష్ కావటం ఆయనకు కష్టమనిపించింది. వెంటనే విక్రమ్ ను పిలిపించారు. విక్రమ్ నమస్కారం చేసి నిలబడ్డాడు.
    "నువ్వు నీ సూపర్ వైజర్ పేరు లేకుండా పేపరు ఎలా పబ్లిష్ చేశావు?" తీక్షణంగా అడిగాడు.
    "మీరు దీనిని "అబ్సర్డ్" అన్నారు. గాయపడిన పక్షి వేదన విక్రమ్ గొంతులో..
    ఆ విషయం మాధవయ్యగారికసలు గుర్తులేదు.
    "అలాంటప్పుడు ఎందుకు పబ్లిష్ చేశావు? నువ్వు అలా చెయ్యకూడదు."
    "కానీ అది బాగానే ఉందని అనుకున్నాను. దాని గురించి ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆరాటం..."
    "ఓహో! నన్ను మించినవాడివి అయిపోయావన్నమాట! నీ మీద నేను డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు, తెలుసా?"
    "విక్రమ్ మాట్లాడలేదు.
    "వెంటనే అపాలజీ లెటర్ ఇచ్చి నీ పేపర్ కి సూపర్ వైజర్ ని నేనని క్షమార్పణలతో ఒక ఉత్తరం రాయి."
    "మీ పేరు చేర్చమని ఉత్తరం రాస్తాను. క్షమార్పణలు కోరను."
    డాక్టర్ మాధవయ్యగారి కోపం హద్దులు దాటింది.
    "నీకీ యూనివర్శిటీలో రీసెర్చ్ చెయ్యాలని లేదా? డిసిప్లినరీ కారణాలతో నీ రిజిస్ట్రేషన్ కాన్సిల్ చేయించగలను. జాగ్రత్త...."
    "మీ ఇష్టం!" తలదించుకునే చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. రగిలిపోయాడు డాక్టర్ మాధవయ్య. విక్రమ్ రిజిస్ట్రేషన్ కాన్సిల్ అయింది. విక్రమ్ తో పరిచయం ఉన్న విద్యార్ధి లోకం విస్తుపోయింది. విక్రమ్ తెలివిని గుర్తించి అతడిని అభిమానించే ప్రొఫెసర్లలో ఒకడు డా||కిరణ్ కుమార్.
    "తొందరపడ్డావు విక్రమ్!" అన్నారాయన.
    "నేను చెయ్యని తప్పులకు క్షమాపణ ఎలా చెప్పుకోను?"
    వ్యథను ధీరత్వంతో దాచేస్తూ అన్నాడు విక్రమ్.
    "సరే ఏదో ఆలోచిద్దాం!" అన్నారాయన.
    
                                      *  *  *
    
    అందరూ బిజి బిజి....
    విక్రమ్ రిజిస్ట్రేషన్ కాన్సిలయిందని విని బోలెడు విచారం ముఖం నిండా పులుముకుని వచ్చాడు వామన్.
    "అంతా విన్నాను విక్రం! ఈ ప్రొఫెసర్స్ ని..."
    "సరే మాధవయ్యగారిని ఏమీ అనకు. ఆయన గొప్ప మేధావి." విసుగ్గా అన్నాడు విక్రమ్.
    "ఇప్పుడేం చేస్తావ్? కామేశ్వరీ దేవికి చెప్పి వాళ్ళ హాస్పిటల్ లో జాబ్ ఇప్పించనా?"
    "వద్దు"
    "మరి ఇప్పుడేం చేస్తావ్?"
    "ఎప్పుడూ చేసేదే! రీసెర్చ్."
    "మరి డబ్బు?"
    "ఏమో! అదే వస్తుంది!"
    "నీ ఇష్టం! కానీ ఎప్పుడు నీకు జాబ్ కావాలంటే అప్పుడే చెప్పు. కామేశ్వరీ దేవి గారితో చెప్పి..."
    విసుగ్గా అతడి మాటలకు అడ్డుతగిలాడు విక్రమ్.
    తనను ప్రాధేయపడవలసింది పోయి తన మీద విసుక్కుంటున్నందుకు వామన్ కి చాలా కోపం వచ్చింది.
    "వెళ్తున్నాను" అని కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. అతడు వచ్చిన విషయం కాని, వెళ్ళిన విషయం కాని పట్టించుకోకుండా తన ఆలోచనలలో తానుండిపోయాడు విక్రమ్.
    
                                    *  *  *
    
    విక్రమ్ తో స్నేహితులు మాట్లాడారు. డా|| కిరణ్ కుమార్ దగ్గర తన పరిశోధన ఆగి పోయినందుకు ఆవేదన వెళ్ళబుచ్చుకున్నాడు విక్రం.
    యూనివర్శిటీలోని కొందరు దుడుకు విద్యార్ధులు విషయం తెలుసుకున్నారు. "విక్రమ్! నీకు జరిగినది అన్యాయం. మేము ఆందోళన చేస్తాం. నీ రిజిస్ట్రేషన్ నీకు తిరిగి తెప్పిస్తాం... అవసరమైతే మాధవయ్యగారి చేత రాజీనామా చేయిస్తాం. నువ్వు ముందు వి.సి.కి రిపోర్ట్ చెయ్యి" అన్నారు.
    "వద్దు ఇలాంటి ఆందోళన వల్ల న్యాయం ఎంత జరుగుతుందో కాని, కష్టపడి చదువుకునే విద్యార్ధుల చదువు నాశనమవుతుంది. అల్లరి పిల్లలకు మాత్రం కాలక్షేప మవుతుంది. డాక్టర్ మాధవయ్యగారికి నా మీద కోపం రావటం నా దురదృష్టమే. కాని అందుకు ప్రతీకారంగా ఆయన చేత రాజీనామా చేయిస్తే యూనివర్శిటీకి తీరని నష్టం. ఇప్పటి వరకు డా||మాధవయ్య గారు నాకు ఎంతో సహకారం అందించారు. ఆ రోజు బహుశ వారి ప్రయోగాలలోనే ఏదో సరిగ్గా వచ్చి ఉండదు. ఆ చిరాకులో ఉండి ఉంటారు. వదిలెయ్యండి." అన్నాడు విక్రమ్.
    "పాగల్ గాడు" అనుకున్నారు స్టూడెంట్ లీడర్స్. ఈ విషయం డా||మాధవయ్య గారికి, డా||కిరణ్ కుమార్ గారికి కూడా తెలిసింది. మాధవయ్యగారు కొంత నొచ్చుకున్నారు. మరొక్కసారి విక్రమ్ తన దగ్గరకు వస్తే ఎలాగైనా రీ రిజిస్ట్రేషన్ కి ప్రయత్నించాలనుకున్నాడు. విక్రమ్ ని అభిమానించే కిరణ్ కుమార్ లో అతనంటే గౌరవం పెరిగింది.
    విక్రమ్ తన దగ్గరకు వచ్చినప్పుడు "విక్రమ్! డాక్టర్ శ్రీరాములు గారు స్టేట్స్ కి వెళ్తున్నారు. రెండేళ్ళు ఉంటారుట. ఆయన లాబ్ లో పని చేసుకోవటానికి నీకు పర్మిషన్ ఇస్తానన్నారు. కానీ ఆయన ఆపరేటస్ మాత్రమే ఇస్తారు. మెటీరియల్ నువ్వే సంపాదించుకోవాలి. ఈ రెండేళ్ళలో ఎక్కడైనా సీటు సంపాదించుకోవచ్చును. నీకు కావాలంటే ఉద్యోగం చూసిపెడతాను" అన్నారు కిరణ్ కుమార్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS