Previous Page Next Page 
తపస్వి పేజి 9


    ఈ సౌందర్యకేం దెయ్యం పట్టింది? అన్నీ ఉన్నాయి. ఏం కావాలంటే అది సమకూర్చటానికి తను సిద్దంగా ఉన్నాడు. ఒక్కనాడూ ఖరీదైన చీరలు కట్టుకోదు! నగలు పెట్టుకోదు! ఎందుకిలా తిక్కగా ప్రవర్తిస్తోంది? పసిపాప నవ్వు లాంటి స్వచ్చమైన ఆ చిరునవ్వులో ఎలాంటి కాలుష్యమూ లేదని తనకు తెలుసు! సౌందర్యలో ఏ బలహీనతా లేదని తను నమ్మగలడు! కానీ, ఈ ప్రవర్తన సహజంగా మారటానికి నోమైనా, వ్రతమైనా, ఏదైనా ఉందేమో మిసెస్ కామేశ్వరీ దేవిని కనుక్కోవాలి!
    తన ఆలోచనకు తనే గతుక్కుమన్నాడు శశాంక. నోముల్లో, వ్రతాల్లో తనకు ఏ మాత్రం నమ్మకం లేదు.
    కామేశ్వరీ దేవి భక్తిలో అసలు గౌరవం లేదు. కానీ వ్రతాన్ని గురించి కామేశ్వరీ దేవిని అడగాలనే ఆలోచన వచ్చింది.
    ఈ ఆత్మవంచన పెరిగి పెరిగి అస్థిత్వాన్ని మ్రింగేస్తుంది కాబోలు!
    ఈ సంభాషణ జరిగిన మరునాడే "డాక్టర్లు ఎక్కువగా ఉన్నారు" అనే మిషతో విక్రమ్ ని "కామేశ్వరీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్" నుంచి తొలగించారు. ఆ హాస్పిటల్ పెట్టుబడిలో శశాంకది మేజర్ షేర్. ఆ కారణం చేత అతని మాటకి విలువ ఉంది. ఆ తర్వాత వారం రోజుల లోపు గానే, డాక్టర్ వసంత రావుని ఆ హాస్పిటల్ లో డాక్టర్ గా అపాయింట్ చేసుకున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ప్రధానంగా యాజమాన్యంలో ఏం జరిగినా, అడిగేదెవరు?
    విక్రమ్ తన ఆత్మవిశ్వాసమే అండగా, తన పరిశోధనలే ధ్యేయంగా, తన అన్వేషణా పథంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు.
    
                                      6
    
    అసిస్టెంట్ కావాలన్న ఒక డాక్టర్ ప్రకటన చూసి ఆయనను కలుసుకున్నాడు విక్రమ్.
    ఆయన ఇస్తానన్న పర్సంటేజికి మాట్లాడకుండా ఒప్పుకున్నాడు. ఆ డాక్టర్ పనిచేసేది ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు. మిగిలిన సమయంలో తన రీసెర్చ్ వర్కు చేసుకోవచ్చునని ఆశపడ్డాడు విక్రమ్.
    అసిస్టెంట్ గా చేరదామని వచ్చిన విక్రమ్ అప్పటికే అక్కడ పనిచేస్తున్న మరొకరిని చూసి తెల్లబోయాడు. డాక్టర్ ని అడిగాడు.
    "నువ్వు తక్కువ పర్సంటేజికి ఒప్పుకున్నంత మాత్రాన నిన్ను తీసుకోలేను. నీ కెరీర్ గురించి తెలుసుకున్నాను. అయాం సారీ! నేను ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చుకోవలసి వచ్చినా ఫరవాలేదు, రోగుల ప్రాణాలు కాపాడాలి! ముఖ్యంగా కాపాడవలసింది అదే! ప్రొఫెషనల్ రాయల్టీ! ... ఇంక మీరు వెళ్ళొచ్చు...."
    "నా కెరీర్ గురించి తెలుసుకున్నారా? ఎవరి దగ్గర..."
    "మీ ప్రొఫెసర్ దగ్గరే! డాక్టర్ మాధవయ్య గారి దగ్గర!"
    విక్రం మాట్లాడకుండా వచ్చాడు...
    తాను ఇస్తానన్న అతి తక్కువ పర్సంటేజికి విక్రం వెంటనే ఒప్పుకోగానే డాక్టర్ కు మొదట సంతోషం కలిగినా ఆ తరువాత సందేహం కలిగింది......అతడిని గూర్చి తెలుసుకుని మరీ అసిస్టెంటుగా వేసుకోవాలనిపించింది.
    వామనమూర్తికి, ఆ డాక్టర్ కి వ్యవహారాలున్నాయి. ఆ డాక్టర్ వామన మూర్తితో మాట్లాడుతూ "ఇవాళ నా దగ్గరకు అసిస్టెంటుగా చేరటానికి వచ్చాడు. చాలా తక్కువ పర్సంటేజికి ఒప్పుకున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది."
    "ఎవరతను!"
    "డాక్టర్ విక్రమ్!"
    ఉలిక్కిపడ్డాడు వామనమూర్తి. విక్రమ్ తన రీసెర్చ్ మానలేదు. ప్రైవేట్ డాక్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరాలనుకుంటున్నాడు.
    "ఎందుకలా ఉలిక్కిపడ్డారు?"
    "ఏం లేదు. అతను అంత తక్కువ పర్సంటేజికి ఒప్పుకున్నందుకు ఆశ్చర్యపడక్కర లేదు..."
    "అదేం?"
    "క్షమించండి. అతను నా దగ్గరి స్నేహితుడు. ఇంత కంటే నేనేం చెప్పలేను."
    కుతూహలం పెరగవలసినంత పెరిగింది.
    "చెప్పవలసిందే, చూడండి! స్నేహం ముఖ్యమా? విధి ముఖ్యమా? ఒక ఆదర్శం ముందు ఎలాంటి అనుబంధాలూ లక్ష్యపెట్టకూడదు......"
    "అవుననుకోండి! కానీ నేనేం చెప్పగలను! అతడు కొన్నాళ్ళు డాక్టరు మాధవయ్య గారి దగ్గర రీసెర్చ్ చేశాడు. ఆయన్నడక్కూడదూ! బాగా తెలుస్తుంది..."
    "సరే! సరే!"
    విక్రం గురించి తాను ఏమీ చెడుగా చెప్పలేదనే తృప్తితో వెళ్ళిపోయాడు వామన్.
    ఆ డాక్టర్ వెంటనే మాధవయ్య గారిని కలుసుకున్నాడు.
    "వాడా! ఒక రోగ్! తెలివి లేకపోయినా పొగరుంది. ఎవరి మాటా వినడు. తనకే అన్నీ తెలుసుననుకుంటాడు. గుడ్ ఫర్ నథింగ్! రీసెర్చ్ ఈ జన్మలో చెయ్యలేడు!"
    ఖండితంగా చెప్పారు మాధవయ్యగారు. ఆ రోజే విక్రంకు ఇస్తానన్న పర్సంటేజికి ఇంకా ఎక్కువ ఇస్తూ మరొక డాక్టర్ని వేసుకున్నాడు ఆ డాక్టర్.
    రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో ఇబ్బందులెక్కువవుతున్నాయి. ఉన్నదంతా ఊడ్చి చదివించిన తల్లి పస్తులు పడుకుంటుంది. రీసెర్చ్ కి మెటీరియల్ కొనుక్కోవటానికి డబ్బులు లేవు.
    వామనమూర్తికి ఫోన్ చేశాడు విక్రమ్.
    "నాకు ఉద్యోగం చూస్తానన్నావు. చూడు."
    "ఉద్యోగమా? రీసెర్చ్ మానేశావా?"
    "లేదు!"
    "మరి!"
    "ఉద్యోగం కావాలి..."
    "చూస్తాను కానీ మా హాస్పిటల్ లో ..."
    "వివరాలక్కర్లేదు. ఏదో ఒకటి చూడు."
    సంభాషణ తుంచేశాడు విక్రమ్. వామనమూర్తికి ఎంతో కోపం వచ్చింది విక్రమే తన సహాయం కోరుతున్నాడు. ప్రాధేయపడుతూ బ్రతిమాలుకున్నట్లు అడగకపోగా, ఏదో తనను అనుగ్రహిస్తున్నట్లు ఆజ్ఞాపిస్తున్నాడు.
    
                                      *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS