శివయ్యని చూసి "వచ్చేవా?" అంటూ పలకరించేడు.
"ఆఁ" అన్నాడు శివయ్య, తండ్రి ముఖంలోకి చూస్తూ.
ఆపై సంభాషణ ఎలా సాగాలో, ఎవరు మొదలుపెట్టాలో ఇద్దరికీ తోచలేదు. 'ఊరంతా గుప్పుమంటున్న విశేషం ఇంట్లో ఉంటే తండ్రి చెప్పడా! అదంతా గాలికబురే అయివుంటుంది' అనుకొన్నాడు శివయ్య.
'ఇంటికి కోడల్ని తీసుకురాబోయి నేనే పెళ్ళిచేసుకొన్నానని ఎలా చెప్పడం ' అనుకున్నాడు రత్తయ్య.
తండ్రి నోటు ఎంతకీ మాట రాకపోవటం చూసి పైమీది బట్టతీసి దులుపుతూ, "ఒంటిమీద నీళ్ళు పోసుకొని వస్తాను" అంటూ కాలు కదిపేడు శివయ్య.
"లోపల మీ పిన్ని వుంది. నీళ్ళ కాగుకింద మంట పెట్టమను. ఇద్దరం పోసుకుందాం" అన్నాడు రత్తయ్య ధైర్యం తెచ్చుకొని.
ఆ మాట ఎంతో సహజంగా రోజూ జరుగుతున్న పనిలాగే తండ్రి తనతో చెప్పడంలో తెల్లబోయి చూసేడు శివయ్య.
"ఏంటిరా, అలా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నావు? పోయి మీ పిన్నమ్మని పలకరించరా" అన్నాడు రత్తయ్య విసుగుదలతో.
రత్తయ్య విసుగుదల శివయ్య అలా చూడడంవల్ల కాదు. తను అలా చెప్పవలసి వచ్చినందుకు. బసవయ్య ఆ తండ్రీ కొడుకుల సంభాషణ అరుగు చివర నిలబడి వింటున్నాడు.
"ఒరేయి బసవా, ఇంటిలోకి పోయి చిన్నబాబు వచ్చేడని పెద్దమ్మతో చెప్పిరా!" అన్నాడు రత్తయ్య.
బసవయ్య వెనకనే కాళ్ళీడ్చుకుంటూ ఇంటిలోకి నడిచేడు శివయ్య.
వంటి ఇంటిలో ఏదో సర్దుతున్న అన్నపూర్ణ బసవయ్య పిలుపుతో వెనుదిరిగి చూసింది. పెద్దయ్య చెప్పమన్న మాట కాస్తా అందించి పక్కకు తప్పుకొన్నాడు బసవయ్య.
అతి అమాయకంగా, అప్పుడే కడిగిన ముత్యంలా ఉన్న ఆ పిల్లని చూస్తుంటే శివయ్యకి తండ్రి మీద కోపం, అసహ్యం ముంచుకువచ్చేయి. "ఇంత చిన్నపిల్లని 'నా పెళ్ళాం' అంటూ నలుగురికీ చూపుకోలేకపోయేడా? పోనీ, ఈ వయస్సులో మనసు పుడితే తగిన ఈడుదాన్ని చూసుకోకపోయాడా?
'పిన్నిట....పిన్ని.... తనకన్న చిన్నదాన్ని నీ పిన్నమ్మ అనగానే గౌరవభావం ఎలా కలుగుతుంది?' తండ్రిచేసిన పనికి మనసులో మరోసారి తిట్టుకొన్నాడు శివయ్య. ఆ పిల్లను చూస్తుంటే 'నేను నీ కొడుకును' అంటూ నమస్కరించ బుద్ధికాలేదు శివయ్యకి. 'ఈ పిల్ల ఇంకో రీతిగా ఈ ఇంట్లో కాలు పెడితే యెంత ముచ్చటగా ఉండేది!' అనుకొన్నాడు.
రత్తయ్యకి పెరిగి పెద్దవాడయిన కొడుకు వున్నాడంటే మహ ఉంటే తన ఈడువాడు వుంటాడనుకొంది అన్నపూర్ణ. కాయకష్టంవల్ల కండలు తిరిగిన శరీరంతో బలిష్ఠంగా, ఒడ్డూ, పొడుగూతో ప్రాయంలో వున్నా ఆ కొడుకును చూసేసరికి క్షణకాలం మతిపోయినదానిలా కన్నార్పకుండా చూస్తూ వుండిపోయింది. ఆ సమయంలో ఆమె మనస్సులో ఏ భావాలు పరవళ్ళు తొక్కేయో, ఏ ఇంద్రధనుస్సులు ఆమె ఊహలకు రంగులు దిద్దేయో, అందని ఏ లోకానికి ఆమె ఆశలు ప్రయాణించేయో చెప్పడం కష్టం.
ఆ కళ్ళలో లేచిన కాంతి ఆకాశంమీద మెరుపుతీగెలా అంతలోనే మాయమయింది. నిండు కొలనుల్లా నిర్మలంగా వున్నాయి ఆ కళ్ళు.
తల్లిలేని ఆరుగురు పిల్లలకు తనే తల్లి అయి, ఇంటిపెత్తనం వహిస్తున్న అన్నపూర్ణకు ఆ సంపూర్ణ యౌవనవంతుణ్ణి "బాబూ" అని సంబోధించి పిలిచేందుకు అట్టే సమయం పట్టలేదు. వయసుని మించిన అనుభవం ఆమెని అంతలోనే తల్లిగా మార్చింది.
"నీ పేరు శివయ్య కదూ బాబూ?" అంది మృదువుగా.
ఆమె మాటతో శివయ్యకు కళ్ళముందున్న పంచరంగుల చిత్రాన్ని ఎవరో గురిచూసి రాయిపెట్టి కొట్టినట్లయింది.
"శివరామయ్య." కాస్త దురుసుగానే సమాధానం చెప్పేడు.
అన్నపూర్ణ దానిని పట్టించుకోనట్లు "పద. కాగులో వేడినీళ్ళు ఉన్నాయి. బిందెలోకి తొర్లించి ఇస్తాను" అంది.
"నా కలవాటే! నేను తొలుపుకుంటాను" అంటూ పెరటిలోకి వెళ్ళిపోయేడు శివయ్య.
* * *
అన్నపూర్ణ ఇంటిలో కాలు పెట్టేక ఆ ఇంటికి కళ వచ్చింది. తండ్రీ కొడుకుల ముఖాల్లోకూడా ఆ నిగారింపు కనిపించింది. నోటి మాటలు అవసరం లేకుండానే ఎవరి కేం కావాలో గ్రహించుకొని సమయానికి సరిగా అమర్చిపెట్టేది అన్నపూర్ణ.
"ఈ పూటకి ఏం కూర వండమంటావు?" రోజూ పొలానికి పోయే ముందు శివయ్యని విధిగా అడిగేది. ఒకనాడైనా శివయ్య సరిగా సమాధానం చెప్పేవాడు కాడు.
"శివయ్యకి కాకరకాయ వేపుడు ఇష్టం, వంకాయ మెంతికూర ఇష్టం" అంటూ తన రుచులతోపాటు కొడుకుని కూడా తనే చెప్పేవాడు రత్తయ్య.
ఈ వివాహం జరిగేక తండ్రీ కొడుకుల మధ్య మాటలు సరిగా లేవు. అంతగా అవసరపడితే ఒకటో, ఆరో మాట అంటీ ముట్టకుండా గొణిగేవాడు శివయ్య. కొడుకులో వచ్చిన ఈ మార్పు రత్తయ్యకి కష్టంగా తోచింది. తను చేసినపని మంచిదికాదని ఒకటి రెండుసార్లు తనని తనే నిందించుకొన్నాడు. అయినా అన్నపూర్ణని వేలెత్తి చూపించేందుకు లేదు. వాడి తల్లి ఉన్నా శివయ్యని ఇంతకన్నా అభిమానంగా చూసుకోదు.
శివయ్యకి పెళ్ళిచేస్తే ఈ పరిస్థితి కొంత బాగుపడవచ్చు. కాని తండ్రి ఆ మాట ఎత్తేందుకైనా అవకాశం ఇయ్యలేదు శివయ్య. గ్రామంలో ఒకరిద్దరిచేత పెళ్ళి ప్రస్తావన చేయించేడు రత్తయ్య.
